సర్వేలో కానరాని ఈడబ్ల్యూఎస్!
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:03 AM
తెలంగాణ ప్రభుత్వం 2024 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కుల సర్వేలో అనేక ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 97శాతం మంది వివరాలను సేకరించి, వారిలో...
తెలంగాణ ప్రభుత్వం 2024 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కుల సర్వేలో అనేక ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 97శాతం మంది వివరాలను సేకరించి, వారిలో 3.55 కోట్ల మంది ప్రజలు వెనుకబడి ఉన్నారని ఈ సర్వే (SEEEPC–2024) తేల్చింది. సర్వే ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 242 కులాలు ఉన్నాయి. అందులో 59 ఎస్సీ, 32 ఎస్టీ, 134 బీసీ, 18 ఓసీ కులాలు ఉన్నాయి. ఈ సర్వే షెడ్యూల్‌లో మొత్తం 57 ప్రశ్నలు, 75 ఉప అంశాలు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా కులాల్లోని వివక్ష, వెనుకబాటుతనం వంటి అనేక అంశాలను ఈ సర్వే పరిగణనలోకి తీసుకుంది. ఈ విస్తృత సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి నివేదిక సమర్పించడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ (IEWG)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో నేనూ ఓ సభ్యుడినే.
ఈ డేటా ప్రకారం, గుర్తించబడిన 32 షెడ్యూల్ తెగలలో.. 25 తెగలకు చెందిన 99శాతం మంది రాష్ట్ర సగటుతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నారు. అదే విధంగా, 59 ఎస్సీ వర్గాలలో 41 కులాలకు చెందిన 97శాతం మంది కూడా సగటు స్థాయి కంటే దిగువన ఉన్నారు. బీసీలలో 69 కులాలకు చెందిన 71శాతం మంది కూడా చాలా వెనుకబడి ఉన్నారు. కానీ, ఓసీ కులాలకు చెందిన 18 వర్గాల వారందరూ మాత్రం రాష్ట్ర సగటుతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారు!
ఈ డేటాను పరిశీలిస్తే.. రాష్ట్రంలోని అగ్ర కులాలలో ఆర్థిక వెనుకబాటుతనం కనిపించడం లేదు. ఈ పరిస్థితే దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటుందని భావించవచ్చు. సూటిగా చెప్పాలంటే, రాష్ట్రంలోని ఓసీల్లో ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) కనిపించడం లేదు. ఈ లెక్కలు ఒక ముఖ్యమైన ప్రశ్నను తెరపైకి తెస్తున్నాయి– తెలంగాణలో, ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఓసీ కులాల శాతం ఎంత? దీని ప్రకారం.. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఓసీ కులాలకు ఇచ్చే 10శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలును ఎలా అర్థం చేసుకోవాలి? ఈడబ్ల్యుఎస్ కోటాను సమర్థించేవారు.. మనదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణం ఆర్థిక అసమానతలేనని చెబుతూ, కులంను పక్కన పెట్టారు. అయితే, అది నిజం కాదని, ప్రజలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉండడంలో కులం ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఈ తెలంగాణ కుల సర్వే చెబుతున్నది. జనాభా ప్రాతిపదికన చూసినా, ఎస్టీలలో 99శాతం, ఎస్సీలలో 97శాతం, బీసీలలో 71శాతం మంది రాష్ట్ర సగటుతో పోలిస్తే ఎక్కువగా వెనుకబడి ఉన్నారు! దీనికి విరుద్ధంగా, ఓసీ కులాలకు చెందిన వారందరూ రాష్ట్ర సగటుతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నారు.
తెలంగాణలోని మొత్తం 242 కులాలలో కేవలం నాలుగు కులాల వారు (మాదిగ, లంబాడీ, ముదిరాజ్, యాదవులు) తీవ్రమైన పేదరికం (ఏడాదికి రూ.లక్ష కంటే తక్కువ ఆదాయం కలిగిన స్థితి)లో జీవిస్తున్నారు. రాష్ట్రంలోని 1.1 కోట్ల మందిలో దాదాపు 40శాతం ఈ పేద వర్గాలు ఉన్నాయి. ఈ నాలుగు కులాలు రాష్ట్ర జనాభాలో 33శాతమే ఉన్నప్పటికీ, అత్యంత పేదలలో వీరి వాటా ఎక్కువగా ఉంది. దీన్నిబట్టి చూస్తే.. కుల వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉన్నాయని ఈ తీవ్రమైన అసమానతలు స్పష్టం చేస్తున్నాయి.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, రాష్ట్రంలో ఓసీ (ఓసీ ముస్లింలు సహా)ల జనాభా కేవలం 11.9శాతం మాత్రమే. అయినప్పటికీ, వారికి ఈడబ్ల్యుఎస్ కోటా కింద 10శాతం రిజర్వేషన్ లభిస్తోంది. ఇది వారి జనాభా వాటాతో పోలిస్తే దాదాపు సమానం! దీనికి విరుద్ధంగా, బీసీ/ఓబీసీ వర్గాలు రాష్ట్ర మొత్తం జనాభాలో 56.4శాతం ఉన్నా, వారికిచ్చే రిజర్వేషన్ కేవలం 27శాతం మాత్రమే. కాబట్టి.. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉన్న సామాజిక న్యాయం భావనకు వ్యతిరేకం కాకపోయినా, రిజర్వేషన్ వ్యవస్థ అసలు ఉద్దేశాన్ని కొంతవరకు బలహీనపరుస్తోందని భావించాలి.
ఈ సర్వేలో కనిపించిన ఆశ్చర్యకర అంశాలలో ఒకటి ‘నో క్యాస్ట్’ అనే వర్గం. ఇది రాష్ట్ర మొత్తం జనాభాలో 3.4శాతం (దాదాపు 12 లక్షలు)గా ఉంది. ‘Other’ వర్గంతో కలిపితే ఇది 3.9శాతానికి చేరుతుంది. ఈ సర్వేలో No-Caste, No-Category, No-Religion అనే విభాగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే– ఈ ‘నో క్యాస్ట్’ వ్యక్తులు ఎవరు? అంటే.. వీరు ప్రధానంగా పట్టణ ప్రాంతాలకు చెందిన చదువుకున్న ఉద్యోగులు, నిపుణులు. వీరిలో అధికశాతం జీహెచ్‌ఎంసీ పరిసర ప్రాంతాల నుంచే నమోదయ్యారు. ఇక ‘Other’ వర్గం అనేది రాష్ట్ర అధికారిక జాబితాలో లేని చిన్న చిన్న కులాలను సూచిస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ‘నో క్యాస్ట్’ అని గుర్తింపు పొందిన వారిలో 43శాతం మంది వద్ద కుల ధ్రువీకరణ పత్రం ఉంది! వీరిలో 13.5శాతం మంది రిజర్వేషన్ ప్రయోజనాలు పొందారు. అంటే, వారిలో దాదాపు సగం మంది వాస్తవానికి రిజర్వేషన్ వర్గాలకు చెందినవారే! ‘నో క్యాస్ట్’ వర్గానికి చెందినవారు ప్రభుత్వ ఉద్యోగాలలో 7.7శాతం, ప్రైవేట్ ఉద్యోగాలలో 13.3శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇది రాష్ట్ర సగటు (ప్రభుత్వంలో 2.8శాతం, ప్రైవేట్‌లో 7.4శాతం)తో పోలిస్తే ఎక్కువ. వీరిలో వెనుకబాటుతనం కూడా తక్కువగా ఉంది. కాబట్టి వీరు రాష్ట్రంలోని అత్యంత ధనిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని భావించాలి.
ఇప్పటి అస్తిత్వ రాజకీయాల (identity politics) కాలంలో కులంను పట్టించుకోకుండా ఉండే ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ధోరణి విద్యా, ఆర్థిక పురోగతితో పాటు, వ్యక్తులు తమ కుల గుర్తింపు నుంచి బయటపడాలనే ఆకాంక్ష వల్ల ఏర్పడుతోంది. సర్వే నివేదికలో పేర్కొన్నట్లుగా, ఈ వర్గానికి చెందినవారు అగ్రకుల ప్రయోజనాలతో ఎదిగిన ఉన్నత విద్యావంతుల కుటుంబాల నుంచి వచ్చి ఉండవచ్చు. లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పైకి ఎదిగిన కొత్త తరాల వారైనా కావచ్చు. ‘నో క్యాస్ట్, అదర్స్’ అంటూ కుల తటస్థతను స్వీకరించడం అనేది; ఒకవైపు కుల ఆధారిత ప్రతికూలతల నుంచి దూరంగా ఉండాలనే కోరికను, మరోవైపు ఉన్నత స్థాయి ప్రభుత్వ సంస్థలు ప్రోత్సహించే ప్రతిభ ఆధారిత వ్యవస్థను అంగీకరించే వ్యూహాత్మక నిర్ణయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ధోరణి, రిజర్వేషన్లు కులం ఆధారంగా కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఇవ్వాలని భావించే మెరిటోక్రసీ సిద్ధాంతంతో సరిపోతుంది. ఇదే.. ఈడబ్ల్యుఎస్ కోటాను భారతీయులు ఎందుకు విస్తృతంగా అంగీకరించారో (రిజర్వేషన్ పొందే వర్గాలవారు కూడా పెద్దగా వ్యతిరేకించకుండా) వివరిస్తుంది. అయితే, ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది– ‘అగ్ర కుల ధనికవర్గాలు తమ జనాభా వాటాకు సమానంగా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుండగా, జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీ వర్గాలు ఎందుకు కేవలం 27శాతం రిజర్వేషన్‌కే పరిమితమవుతున్నాయి?’
ప్రొఫెసర్ భంగ్యా భూక్యా
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
ఇవి కూడా చదవండి
ఆర్టీసీ సమ్మెలో ఆందోళనకర పరిణామాలు..
చిన్న నౌకలనూ కాల్చేయండి.. అమెరికా నేవీకి ట్రంప్ కీలక సూచనలు