Share News

కులమూ.. మనం లెక్కించలేని అశక్తతా!

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:36 AM

‘లెక్కించగలిగినది ప్రతిదీ విలువైంది కాదు. విలువైన ప్రతిదాన్నీ లెక్కించనూ లేం’ ఐన్‌స్టైన్‌ స్వయంగా అన్నట్లుగా ఈ మాటలు ఎప్పటినుంచో చలామణిలో ఉన్నాయి. వీటినే స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ...

కులమూ.. మనం లెక్కించలేని అశక్తతా!

‘లెక్కించగలిగినది ప్రతిదీ విలువైంది కాదు. విలువైన ప్రతిదాన్నీ లెక్కించనూ లేం’ ఐన్‌స్టైన్‌ స్వయంగా అన్నట్లుగా ఈ మాటలు ఎప్పటినుంచో చలామణిలో ఉన్నాయి. వీటినే స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కులగణనను (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే) అర్థంచేసుకుంటే దాని పరిమితీ, పరమార్థతా తెలుస్తాయి. ఇలా అర్థంచేసుకోవాలన్న అభ్యర్థన సర్వే సారాంశాన్ని వివరించే పేజీల్లోనే ఉంది. విలువైన ప్రతి విషయాన్ని లెక్కించాలన్న కుతూహలం ఈనాటిది కాదు. అసలు ఈ కుతూహలంతోనే మనుషుల ప్రగతి ప్రయాణం మొదలైంది. అంకెలను కనిపెట్టటం అందులో భాగమే. అంకెల శాస్త్రం ఇప్పుడున్న స్థాయిలో ఉండటానికి భారతీయులుగా మన కృషి చాలా ఉంది. సున్నాను కనిపెట్టి, దశాంశపద్ధతిని అమల్లోకి తెచ్చి గణాంక విప్లవానికి మనం దోహదం చేశాం. కానీ అంకెలను కీలకరంగాలకు అన్వయించి సమాచారాన్ని నమోదు చేయటంలో మనం ఒకప్పుడు చాలా వెనుకబడి ఉన్నాం. గ్రామాలు మనకు వేల ఏళ్ల నుంచీ ఉన్నాయి. వాటికి సంబంధించిన జనాభా లెక్కలు ఇటీవల కాలం వరకూ అసలు లేవనే చెప్పుకోవచ్చు. అదే చైనాలో అయితే వందలేళ్ల నాటి గ్రామాలకు చెందిన జనాభా లెక్కలు చాలా వరకూ పక్కాగా ఉన్నాయి. తరతరాల నుంచి గ్రామాల జనాభాలో వచ్చిన మార్పులనూ, పంట భూముల వివరాలనూ అర్థంచేసుకోవటం చైనాలో చరిత్రకారులకు చాలా సులువు. మనకు చాలా కష్టం. పాతకాలం విషయాలకు మాత్రమే ఈ ఇబ్బందులు ఉన్నాయని సరిపెట్టుకోలేం. ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలన పేరిట జరుగుతున్న తతంగాన్ని చూస్తే ఇదే అర్థం అవుతుంది. పదిశాతానికి పైగా ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. అనర్హులను ఎప్పటికప్పుడు గుర్తించే పద్ధతి పకడ్బందీగా లేదు. వివిధ విభాగాల మధ్య సమన్వయమూ కనపడదు. ఓటర్ల జాబితాలోని కోట్ల తప్పిదాలు మన లెక్కల నిర్వహణకు నిలువుటద్దంగానే పరిగణించొచ్చు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన విలువైన ప్రతిదాన్నీ నిజంగా లెక్కించగలిగిందా? అన్న ప్రశ్నవేసుకుని పరిశీలన జరిపితే నూటికినూరుపాళ్లూ జవాబు సంతృప్తికరంగా రాదు. సర్వే చాలా వరకూ ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారంపైనే ఆధారపడటం వల్ల పరిమితులు చాలా ఉన్నాయి. ఈ పరిమితుల్లోనే అదిచ్చే విలువైన సమాచారమూ ఉంది. కానీ కొన్ని పరిమితులను తేలికగా తీసుకోలేం. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సమాచారాన్ని మొత్తం తీసుకోవాలని సర్వే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లాలన్న ఆ లక్ష్యాన్ని పూర్తిగా సాధించారని చెప్పలేం. అట్లా వెళ్లి ఉంటే జనాభా సంఖ్యలో చాలా మార్పు కనపడేది.


2011 నాటి జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలో 3.50 కోట్ల మంది ఉన్నారు. 14ఏళ్ల తర్వాత జరిగిన కులగణన సర్వేలో దీని పెరుగుదల చాలా నామమాత్రంగా నమోదైంది. 4 లక్షల మంది మాత్రమే ఈ 14 ఏళ్లలో అదనంగా తోడయ్యారు. 2001–2011 మధ్య తెలంగాణ జనాభా (30,987,271– 35,003,674) 40 లక్షల దాకా పెరిగింది. ఏడాదేడాదికి సంతాన సాఫల్యతా రేటు తగ్గటం, రాష్ట్ర విభజనతో ఆంధ్రాకు కొందరు ప్రజలు తరలివెళ్లటం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నా 14 ఏళ్ల కాలంలో జనాభా పెరుగుదల 4 లక్షలే ఉండటం ఏ మాత్రం సహేతుకంగా కనిపించదు. కనీసం 30 నుంచి 35 లక్షలైనా అదనంగా జనాభా పెరిగి ఉండాలి. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్ర జనాభా 3.68 కోట్లుగా నమోదైంది. దానికి పదేళ్ల తర్వాత నిర్వహించిన కులగణనలో అంతకూడా నమోదు కాకపోవటం విచిత్రంగానే ఉంటుంది. విలువైన దాన్ని లెక్కపెట్టలేని అశక్తతగానే దీన్ని చెప్పుకోవచ్చు.

సర్వేలో పేర్కొన్న కులాల లెక్కల గురించి సర్వాంగీకారం ఎప్పటికీ రాదు. ఎంత పక్కాగా సర్వే చేసినప్పటికీ తమ సంఖ్యను తక్కువగా చూపించారనే స్వరాలు ఎప్పుడూ వినపడుతూనే ఉంటాయి. కుల జనాభా సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో, రాజకీయ పదవుల్లో ప్రాతినిధ్యం ఉండాలనే డిమాండ్లు ఉన్న చోట ఇవి తప్పవు. ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలంటే ఎక్కువ జనాభా ఉండాలి. అందుకే వివిధ కారణాల వల్ల జనాభా తగ్గినా దాన్ని ఒప్పుకొనే పరిస్థితిలో కులసంఘాలు ఉండవు. తెలంగాణలో రెడ్డి, వెలమ కులాలకు కొన్ని నియోజకవర్గాల్లో గణనీయంగా సంఖ్యరీత్యా కూడా పట్టు ఉందని ఇప్పటివరకూ చాలా అంచనాలు ఉన్నాయి. ఈ రెండు కులాలు రాజకీయంగా నిర్వహించిన పాత్రనూ ప్రదర్శించిన ప్రాబల్యాన్నీ దృష్టిలో ఉంచుకుని కొన్ని భావాలు బలంగా ఏర్పడ్డాయి. ఎప్పుడో ఏర్పడ్డ ఆ భావాలు ఇంకా బలంగానే ఉన్నాయి. కానీ కులగణనలో జిల్లాల వారీగా వెల్లడైన సమాచారాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రెండు కులాలు సంఖ్యరీత్యా స్వంత బలంమీద ఆధారపడి గణనీయంగా ఓట్లు తెచ్చుకునే పరిస్థితి ఉన్న నియోజకవర్గాలను వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇతర కులాల సహకారం, మద్దతు లేకుండా పదోవంతు ఓట్లను తెచ్చుకునే పరిస్థితి లేదు. ఒక కులానికి కనీసం 30శాతం వరకూ ఓట్లుండే నియోజకవర్గం ఉంటే దాన్ని ఆ కులానికి బాగా పట్టున్న ప్రాంతంగా భావించొచ్చు. నియోజకవర్గాలవారీ కులాల సమాచారం ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. కులగణనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నాలుగు సంపుటాల్లో జిల్లాలవారీ సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ (23,719), కరీంనగర్‌ (11,373) మినహా ఎక్కడా వెలమల సంఖ్య 10 వేలకు దాటలేదు. అయిదువేల నుంచి పదివేల లోపు వెలమ జనాభా ఉన్న జిల్లాలు తొమ్మిది ఉన్నాయి.


మిగతా చోట్ల మరీ తక్కువ. జనాభాలో ఓటర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే వారి సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. జనాభాలో గరిష్ఠంగా 80శాతం వరకు మాత్రమే ఓటర్లు ఉంటారు. కరీంనగర్‌లో ప్రస్తుతం నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడా కూడా వెలమలకు సంఖ్యాపరంగా కనీసస్థాయిలో ప్రభావం కలగచేసే పరిస్థితి లేదు.

రెడ్ల పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నప్పటికీ ఎన్ని నియోజకవర్గాల్లో వారు 30శాతం దాకా ఉంటారనేది కులగణన లెక్కల ప్రకారం ప్రశ్నార్థకమే. నల్గొండ జిల్లాలో రెడ్ల సంఖ్య 1,16,989 ఉంది. ఈ జిల్లాలో ఆరు శాసనసభా స్థానాలు ఉన్నాయి. వీటిల్లో నల్గొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, మునుగోడు జనరల్‌ నియోజకవర్గాలు. ఇక్కడే ఎక్కువగా రెడ్లు ఉంటారనుకుందాం. వాళ్లల్లో 85 వేలకు కొంచెం అటుఇటుగా ఓటర్లుగా నమోదవుతారు. ఈ 85 వేల ఓటర్లు నాలుగు నియోజకవర్గాల్లో ఏ ఒక్కదాంట్లోనూ 30 శాతానికి చేరటం అసాధ్యం. ఒక్క నల్గొండ అసెంబ్లీ స్థానంలోనే 2,21,836 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 30 శాతం అంటే 66,550 మంది అక్కడే ఓటర్లుగా ఉండి ఉండాలి. కులగణనలో వెల్లడైన అంకెల ప్రకారం అది వీలయ్యే పనికాదు. రంగారెడ్డి జిల్లాలో రెడ్లు (1,51,345) ఉన్నారు. కానీ అక్కడ ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నీ జనరల్‌ స్థానాలే. మొత్తం ఓటర్లు 24.8 లక్షలు. ఎక్కువలో ఎక్కువగా ఏ అసెంబ్లీ స్థానంలోనైనా రెడ్ల సంఖ్య 40 వేలు ఉంటే ఘనం అనుకోవాలి. వారు ఎక్కడా 15శాతానికి మించి ఉండే అవకాశం లేదు. నల్గొండ, రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ (2,27,914) మినహా ఎక్కడా రెడ్ల జనాభా లక్షకు దాటలేదు. మరో తొమ్మిది జిల్లాల్లో 50 వేలకు మించి ఉంది. మిగతా చోట్ల అంతకంటే తక్కువే నమోదైంది. కులగణనలో అంకెలు వందశాతం నిజమైతే మనం ఇన్నాళ్లూ అనుకున్న చోట్ల కూడా అగ్రకులాల వారి సంఖ్య చాలా తక్కువగా ఉందనే అర్థమవుతోంది.

బహుళపార్టీ ప్రజాస్వామ్యంలో ఓట్ల సమీకరణ అన్నిటికంటే కీలకమైంది. ఎన్నికల్లో గెలుపుకోసం ధనబలం, సామాజిక ఆధిపత్యం కలిగిన కులాలు కూడా గణనీయంగా ఇతర కులాలపై ఆధారపడకతప్పదు. సొంత సామాజికవర్గం సంఖ్యాబలం క్షీణిస్తున్న కొద్దీ ఈ ఆధారపడటం ఇంకా పెరుగుతుంది. మరోవైపు గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో సంఖ్యాబలం ఉన్న కులాలు కొత్త డిమాండ్లతో అధికారంలో వాటాను పెంచుకోటానికి ప్రయత్నిస్తాయి. కులాల మధ్య జరిగే ఈ పెనుగులాటలూ, ఇచ్చిపుచ్చుకోవటాల వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం సజావుగా ఉందని చెప్పే పాశ్చాత్య సామాజిక శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు. ఒకటి మాత్రం నిజం. ఓట్ల సమీకరణ అవసరం లేకపోతే మన దేశంలో సామాజిక మార్పు ఇంత వేగంగా జరిగేది కాదు. ఆధిపత్యాలనూ అసమానతలనూ ఇంతగా ప్రశ్నించటం ఉండేది కాదు.


ఆస్తులు, సంపాదన గురించి కులగణనలో ప్రజలు చెప్పిన దాన్నే విశ్వసిస్తే పరిస్థితి దారుణంగానే ఉందని అనుకోవాలి. తెలంగాణ తలసరి ఆదాయం ఇటీవల బడ్జెట్‌ పుస్తకాల్లో వెల్లడించిన ప్రకారం రూ.4,18,931 ఉంది. దేశ సగటుతో (రూ. 2,19,576) పోల్చితే చాలా ఎక్కువ. కానీ కులగణన సమాచారం ప్రకారం రూ.లక్ష లోపు ఆదాయం ఉన్నవారు జనాభాలో 78 శాతం మంది ఉన్నారు. ప్రభుత్వాలు ఘనంగా ప్రకటించుకునే సగటు తలసరి ఆదాయాలు వాస్తవ పరిస్థితిని ప్రతిఫలించవని చాలా సర్వేల్లో వెల్లడైంది. సమాజంలో సంపద, ఆదాయాలు బాగా పెరగటం అవసరమే. ఆ పెరుగుదలలో ఏ వర్గానికి ఎంత అందుతుందనేది అంతకంటే ముఖ్యం. కింది, మధ్యస్థాయి వర్గాలకు అది తగినంతగా చేరకపోవటమే అశాంతిని, అభద్రతను తెచ్చిపెడుతుంది. నిజంగా 78శాతం ప్రజలకు లక్షలోపు ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చెప్పుకోవటం సమంజసంగా ఉండదు.

కులగణన పేరుతో నిర్వహించిన సర్వేకు పెద్ద సంక్లిష్టమైన లక్ష్యమేమీ లేదు. తెలంగాణ సమాజంలో ఎవరు వెనుకబడి ఉన్నారు? వెనుకబాటుతనం కులాల ఆధారంగా ఉందా? ఉంటే దాన్ని అధిగమించటానికి ప్రభుత్వం ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవటమే సర్వే లక్ష్యం. కుల జనాభా ఆధారంగానే పదవులూ, ఉద్యోగాల్లో వాటాలూ, విద్యారంగంలో సీట్లూ నిర్ణయమవ్వాలనే రాజకీయ నినాదాలకు ప్రభావితమై మాత్రమే.. సర్వే ఫలితాలను జస్టిస్‌ సుదర్శనరెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ విశ్లేషించినట్లు కనపడదు. వెనుకబాటుతనాన్ని విశ్లేషించటానికి 42 అంశాలను ప్రాతిపదిక చేసుకుని ఏ కులం ఎంత వెనుకబడిందో తేల్చటానికి ప్రయత్నించింది. విద్య, ప్రభుత్వ–ప్రైవేటు ఉద్యోగాలు, వార్షికాదాయాలు, భూవసతులు, వాటికి నీటిపారుదల సౌకర్యం, పక్కా ఇళ్లు, వాహనాలు, కులాంతర వివాహాలు, గుళ్లుగోపురాలకు నిరాటంక ప్రవేశాలు, బాల్యవివాహాలు, రుణభారాలు, స్త్రీపురుష అసమానతలు, మంచినీళ్ల కుళాయిలు, బాల కార్మికులు, మరుగుదొడ్లు.. ఇట్లా జీవితాలను ప్రభావితం చేసే అంశాలను తీసుకుని ఏ కులం ఎక్కడుందో విశ్లేషించింది. మొత్తంమీద తెలంగాణలోని 242 కులాల్లో 135 కులాలు (బీసీ 69, ఎస్సీ 41, ఎస్టీ 25) ఎక్కువగా వెనుకబడి ఉన్నాయి. మరి మిగతా 107 కులాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. అవి తక్కువ వెనుకబాటుతనంతో ఉన్నాయని మాత్రమే నిపుణుల కమిటీ పేర్కొంది.


వీటిల్లో 18 ఓసీ కులాలతో పాటు 64 బీసీ, 18 ఎస్సీ, 7 ఎస్టీ కులాలు ఉన్నాయి. సర్వే లక్ష్యం నెరవేరాలంటే ఓసీలను మినహాయించి కనీసం మిగతా కులాల విషయంలోనైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోగలగాలి. ప్రభుత్వం ఇచ్చే సహాయాలు, ప్రోత్సాహకాలు వాటికి భిన్నంగా ఉండాలి. అందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అటువంటి రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శిస్తుందా? ఇప్పటికైతే ఇవి జవాబుల్లేని ప్రశ్నలే! వీటి సంగతెలా ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ జాబితాల్లోని కులాలన్నీ ఒకే స్థాయిలో లేవని సర్వే ఫలితాలను విశ్లేషించి విడమర్చి చెప్పటం మంచి ముందడుగుగానే భావించాలి. అలా ఉన్నట్లుగా తరచూ చేసే రాజకీయ డిమాండ్లలో సహేతుకతను ప్రశ్నించేలా సర్వే తోడ్పడుతుంది.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఈ వార్తలు కూడా చదవండి...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్

33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 21 , 2026 | 03:36 AM