రెక్కలు తొడుగుతున్న తెలంగాణ!
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:32 AM
‘ఒక మైలు రహదారి మనల్ని కేవలం ఒక మైలు మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఒక మైలు రన్‌వే ప్రపంచాన్నే మనకు చేరువ చేస్తుంది. అవకాశాల సరిహద్దులను చెరిపేస్తుంది’– ఈ మాటలు ఏవియేషన్ రంగం ప్రాముఖ్యం...
‘ఒక మైలు రహదారి మనల్ని కేవలం ఒక మైలు మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఒక మైలు రన్‌వే ప్రపంచాన్నే మనకు చేరువ చేస్తుంది. అవకాశాల సరిహద్దులను చెరిపేస్తుంది’– ఈ మాటలు ఏవియేషన్ రంగం ప్రాముఖ్యం ఏమిటో చెప్తాయి. 1930వ దశకంలోనే నిజాం ప్రభుత్వం నాటి హైదరాబాద్ సంస్థానంలో బేగంపేట్, మామునూరు ఎయిర్ పోర్టులు; హకీంపేట్, దుండిగల్ ఎయిర్‌ఫీల్డ్‌లు; ఆదిలాబాద్ ఎయిర్‌స్ట్రిప్ వంటి విమాన సదుపాయాలను ఏర్పాటు చేసింది. 1945లోనే నిజాం ప్రభుత్వం, టాటా సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన ‘డెక్కన్ ఎయిర్‌వేస్’ స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించిన ప్రముఖ వాణిజ్య విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలిచి, దేశంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత పరిస్థితులు మారాయి. బేగంపేట మాత్రమే విమానాశ్రయంగా కొనసాగగా వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్, ఇతర ఏవియేషన్ కేంద్రాలు క్రమంగా ఉనికిని కోల్పోయాయి.
కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమైన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) అనంతర కాలంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశంలోని ప్రముఖ స్వతంత్ర ఆర్థిక పరిశోధనా సంస్థ NCAER (National Council of Applied Economic Research) 2026లో విడుదల చేసిన అధ్యయనం ప్రకారం, శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్పించిన అవకాశాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.68వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరడమే గాక, దీని ద్వారా దాదాపు 3.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. విమానాశ్రయానికి అనుబంధంగా అభివృద్ధి చెందుతున్న జీఎంఆర్ ఏరో సిటీని కలుపుకుంటే ఈ ఆర్థిక ప్రయోజనాలు రూ.75వేల కోట్లకు పెరుగుతాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో 5శాతానికి పైగా వాటా కలిగి ఉండటం విశేషం. 2037–38 నాటికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం–ఏరో సిటీ వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 2.13 లక్షల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరడంతో పాటు దాదాపు 9.8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని NCAER అంచనా వేసింది. Airports Council International (ACI Asia –Pacific & Middle East) కూడా NCAER అధ్యయనాన్ని ఉటంకిస్తూ, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణకు గ్రోత్ ఇంజిన్‌గా మారిందని పేర్కొంది.
విమానాశ్రయం అంటే కేవలం విమానాల రాకపోకలకు కేంద్రం మాత్రమే కాదు. అది పెట్టుబడులను ఆకర్షించడానికి, పరిశ్రమల విస్తరణకు, ఉపాధి అవకాశాల పెంపునకు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తి. అందుకు ఈ గణాంకాలు సాక్ష్యం. అయితే, శంషాబాద్ విమానాశ్రయం తర్వాత రాష్ట్రంలో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో ప్రయత్నాలు సాగాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వైమానికరంగ వైభవాన్ని తిరిగి పునరుద్ధరించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించే లక్ష్యంతో సమగ్ర కార్యాచరణ చేపట్టింది. వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ఈ విషయంలో ముందుండటం వరంగల్ బిడ్డగా, జిల్లా మంత్రిగా నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించే విషయం.
చారిత్రక వారసత్వానికి, సాంస్కృతిక వైభవానికి చిరునామాగా నిలిచిన వరంగల్‌కు విమానాశ్రయం రావాలనేది నా ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి కల. ఆ చిరకాల ఆకాంక్ష సాకారమయ్యే దిశగా అడుగులు పడుతుండటం ప్రతి వరంగల్ వాసికి గర్వకారణం. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేట్‌వేగా మొత్తం 950 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా తీర్చిదిద్దుతామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు అనుగుణంగా వరంగల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానున్నది. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్, కొత్తగూడెం, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఆదిలాబాద్‌లోని పాత ఎయిర్ స్ట్రిప్‌ను విస్తరించి రక్షణ– పౌర విమానయాన సేవల సంయుక్త వినియోగ (Defence–Civil) విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ, రక్షణశాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)తో కలిసి చర్యలు చేపడుతున్నది. రక్షణశాఖ ప్రాథమిక ఎయిర్‌ఫీల్డ్ మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసిన తర్వాత, పౌర విమానయానశాఖ సివిల్ టెర్మినల్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికుల సేవలను ప్రారంభించే దిశగా కార్యాచరణ కొనసాగుతున్నది. వరంగల్ మూమునూరు ఎయిర్‌పోర్టు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 2 జూన్ 2028న ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఈ మధ్యే ప్రకటించడం రాష్ట్రాభివృద్ధిపై ఆయనకున్న దృఢ సంకల్పం, నిబద్ధతను చాటుతున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలుత ప్రతిపాదించిన పాల్వంచ ప్రాంతం విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా లేదని అధ్యయనాల్లో తేలినప్పటికీ, ఈ మధ్యే కొత్తగూడెం సమీపంలో సీతంపేట, సుజాతనగర్‌లలో నిర్వహించిన పరీక్షల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఆశాజనకమైన పరిస్థితులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పెద్దపల్లి జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నది. గతంలో రామగుండం–బసంత్‌నగర్ ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఆ స్థలం విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా లేదని తేలింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.
మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాశ మార్గాలతో అనుసంధానించి, అవకాశాలకు ద్వారాలు తెరవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కార్యాచరణను అమలుచేస్తున్నది. విమాన అనుసంధానాన్ని విస్తరించి పెట్టుబడుల ఆకర్షణ; పర్యాటకరంగ అభివృద్ధి; స్థానిక యువతకు ఉపాధి అవకాశాల పెంపు; పరిశ్రమల విస్తరణ; హోటళ్లు, లాజిస్టిక్స్ కేంద్రాలు, గిడ్డంగుల ఏర్పాటు; స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తేవడం; గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానాన్ని మరింత సులభతరం చేయడం వంటి ప్రత్యేక లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది. తెలంగాణ రాష్ట్రం రెక్కలు తొడిగి ప్రపంచంతో అనుసంధానమయ్యేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది.
కొండా సురేఖ
అటవీ, పర్యావరణ,
దేవాదాయ శాఖామాత్యులు
ఈ వార్తలనూ చదవండి:
తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్రం క్లారిటీ..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచుతారా? కేంద్రం ఏమందంటే..