Share News

స్వరాష్ట్రంలో బాగుపడ్డదెవరు? అన్యాయమైందెవరు?

ABN , Publish Date - Jun 02 , 2026 | 02:31 AM

నేడు తెలంగాణ రాష్ట్రం 12 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. 62 ఏళ్ల సుదీర్ఘ పోరాటం... మలిదశ ఉద్యమంలో 1200 మందికి పైగా విద్యార్థుల బలిదానాల ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’...

స్వరాష్ట్రంలో బాగుపడ్డదెవరు? అన్యాయమైందెవరు?

నేడు తెలంగాణ రాష్ట్రం 12 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. 62 ఏళ్ల సుదీర్ఘ పోరాటం... మలిదశ ఉద్యమంలో 1200 మందికి పైగా విద్యార్థుల బలిదానాల ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ లక్ష్యాలను ఎంతవరకు చేరింది? స్వరాష్ట్రంలో బాగుపడ్డది ఎవరు? అన్యాయానికి గురైంది ఎవరు? ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిది.

తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థి ఉద్యమం. 1969లో మొదలై 2014 వరకు విద్యార్థులే ఉద్యమానికి ప్రాణం పోశారు. యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలయ్యాయి. మిలియన్ మార్చ్, సాగరహారం, వంటావార్పు, రైల్‌రోకో అన్నీ విద్యార్థుల నేతృత్వంలోనే. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చాలా ప్రధానం. 4.5 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు 42 రోజులు జీతాలు వదులుకుని సమ్మె చేశారు. ప్రభుత్వం స్తంభించిపోయింది. అలాగే మహిళల, సింగరేణి కార్మికుల, న్యాయవాదుల, వివిధ కులసంఘాల పాత్ర చరిత్రాత్మకం.

బలిదానాలు చేసిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. ఉద్యమంలో పాల్గొని కేసులు, జైళ్లు అనుభవించిన లక్షలాది విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. బతికున్న లక్షలాది విద్యార్థి, ఉద్యోగ, కళాకారులు, ఉద్యమకారులకు గౌరవం లేదు, పాలనలో భాగస్వామ్యం లేదు. 42 రోజులు జీతం లేకుండా సమ్మె చేసిన ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలు, సీపీఎస్‌ రద్దు హామీ నెరవేరలేదు. 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ కాలేదు. రైతు ఆత్మహత్యలు ఆగలేదు. 4,446 ప్రభుత్వ బడులు మూత, 12,000 టీచర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

స్వరాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు 10 రెట్లు పెరిగాయి. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల కాంట్రాక్టులు కొందరికే దక్కాయి. అధికారంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు పదవులు దక్కాయి. కాగ్‌ నివేదిక ప్రకారం 2014లో రూ.69,121 కోట్లుగా ఉన్న అప్పు... మార్చి 2024 నాటికి రూ. 6,71,757 కోట్లకు చేరింది.


తెలంగాణ పట్ల కేంద్రం ఉదారంగా ఉంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రూ.521 కోట్లు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తి. ములుగులో గిరిజన యూనివర్సిటీకి రూ.889 కోట్లు. బీబీనగర్ ఎయిమ్స్‌కు రూ.1,028 కోట్లు. 2014–2024 మధ్య కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.2,03,871 కోట్లు. కేంద్ర ప్రాయోజిత పథకాలు రూ.1,18,436 కోట్లు. పీఎం కిసాన్‌ పథకం కింద 40.2 లక్షల రైతులకు రూ.12,840 కోట్లు. జాతీయ రహదారులు 2,690 కి.మీ నుంచి 5,146 కి.మీకు పెంపునకు రూ.62,847 కోట్ల పెట్టుబడి. రైల్వే ప్రాజెక్టులు రూ.31,221 కోట్లు. స్మార్ట్ సిటీలు వరంగల్, కరీంనగర్‌లకు రూ.1,986 కోట్లు. మొత్తంగా 2014–2024 మధ్య కేంద్రం నుంచి తెలంగాణకు సుమారు రూ.4.2 లక్షల కోట్లు అందాయి. అలా కేంద్రం సాయం చేసింది– సద్వినియోగం కాలేదు. రాష్ట్రం వచ్చింది– సమగ్ర అభివృద్ధి జరగలేదు.

బతికున్న లక్షలాది ఉద్యమకారులను, ముఖ్యంగా ఉద్యమానికి ప్రాణం పోసిన విద్యార్థులను, వెన్నెముకగా నిలిచిన ఉద్యోగులను, సింగరేణి కార్మికులను పాలనలో భాగస్వామ్యం చేయాలి. వారిని ఆర్థికంగా ఆదుకోవాలి. జూన్ 2న బలిదానాలు చేసిన వాళ్లకు నివాళులు అర్పిస్తూ, త్యాగాలు చేసిన ఉద్యమకారులను, విద్యార్థులను, ఉద్యోగులను, సింగరేణి కార్మికులను కలుపుకొని పోవాలి. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలి.

సిహెచ్‌. విఠల్

బీజేపీ నేత, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు

ఈ వార్తలనూ చదవండి:

పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు..

Updated Date - Jun 02 , 2026 | 02:31 AM