Share News

‘ఎమర్జెన్సీ’ని ముందే చెప్పిన ‘కాలజ్ఞాని’

ABN , Publish Date - Jul 28 , 2026 | 01:01 AM

భారత విప్లవోద్యమ సారథుల్లో అగ్రగణ్యుడైన తరిమెల నాగిరెడ్డి మరణించి నేటికి అర్ధశతాబ్ది. అజ్ఞాతం అనంతరం ‘మాదిరెడ్డి వెంకట్రామయ్య’ అనే మారుపేరుతో 1976 జూలై 28న ఉస్మానియా ఆసుపత్రిలో చేరి...

‘ఎమర్జెన్సీ’ని ముందే చెప్పిన ‘కాలజ్ఞాని’

భారత విప్లవోద్యమ సారథుల్లో అగ్రగణ్యుడైన తరిమెల నాగిరెడ్డి మరణించి నేటికి అర్ధశతాబ్ది. అజ్ఞాతం అనంతరం ‘మాదిరెడ్డి వెంకట్రామయ్య’ అనే మారుపేరుతో 1976 జూలై 28న ఉస్మానియా ఆసుపత్రిలో చేరి, పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ యాభై ఏళ్ల కాలంలో ఆయన వ్యక్తిత్వాన్ని, విప్లవోద్యమంలో ఆయన పాత్రను శ్లాఘిస్తూ వందలాది వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి.

నాగిరెడ్డి ఇంటిపేరు ‘తరిమెల’ కాదు, ‘కంచిరెడ్డి’. వారి స్వంత గ్రామం తరిమెల కనుక నాగిరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి కాలం నుంచి ‘తరిమెల’గా పిలిచేవారు. ఆ తర్వాత కాలం నుంచీ వారి కుటుంబంలోనూ, వారి కజిన్స్ కుటుంబాల వారిని కూడా ‘తరిమెల’ ఇంటిపేరుతో పిలవటంతో అదే స్థిరపడింది. ఆసక్తి కల్గించే మరో విషయం నీలం సంజీవరెడ్డితో నాగిరెడ్డి బంధుత్వం. నాగిరెడ్డి పెద్ద చెల్లెలు నాగరత్నమ్మతో సంజీవరెడ్డి పెళ్లి జరగ్గా, సంజీవరెడ్డి చెల్లెలు లక్ష్మీకాంతమ్మను నాగిరెడ్డి వివాహమాడారు. వీరిద్దరినీ ‘కృష్ణార్జునులు’గా చిత్రిస్తూ రాసిన ఒక పద్య నాటకం 1955 మధ్యంతర ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతా ప్రదర్శించారు. దాని రూపకర్త ఎవరో తెలియదు కానీ, ఆ మధ్య కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి వెళ్లినప్పుడు గొర్రెపాటి పార్థసారథి రెండు అసంపూర్ణ పద్యాలు చెప్పగా రాసుకున్నాను.

వీరిద్దరి సంబంధం కంటే పూర్వమే సుబ్బారెడ్డి సోదరి చిన సుబ్బమ్మను నీలం చిన్నపరెడ్డికి ఇచ్చారు. వీరి పెద్ద కుమారుడే నీలం సంజీవరెడ్డి. ఆ తరంలో సుబ్బారెడ్డి, చిన్నపరెడ్డిలను ‘కృష్ణార్జునులు’గానే పిలిచేవారు. వీరిద్దరూ కలిసి స్వాతంత్ర్య ఉద్యమకారులుగా ఉంటూ మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని ఆ ప్రాంతంలో గొప్పగా నిర్వహించారు. చిన్నపరెడ్డి అకాల మరణం వల్ల వారి కుటుంబ వ్యవహారాలు కూడా సుబ్బారెడ్డే చూశారు. ఇక, నాగిరెడ్డి–సంజీవ రెడ్డిల మధ్య ఎన్నికల పోరులో సంజీవరెడ్డి సోదరులు నీలం రాజశేఖరరెడ్డి, నీలం ప్రభాకరరెడ్డి... నాగిరెడ్డి పక్షమే వహించారు. 1952 ప్రథమ ఎన్నికల్లో జైల్లో ఉండి సంజీవరెడ్డిపై నాగిరెడ్డి పోటీపడగా, వారి భార్యలు వారి భర్తలకు అనుకూలంగా, సోదరులకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. చివరకు నాగిరెడ్డే విజయం సాధించారు.


తరిమెలలోని వీధిబడిలో, గండీ థియోసాఫికల్ హైస్కూల్‌లో, ఋషివ్యాలీ స్కూల్లో, మద్రాసు లయోలా కాలేజీలో చదువు ముగిసిన తర్వాత నాగిరెడ్డికి కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో చదవాలని కోరిక కలిగింది. సుబ్బారెడ్డికి ఇష్టం లేకపోయినా రాయలసీమ ప్రముఖ కాంగ్రెసు నాయకులు కల్లూరి సుబ్బారావుతో కలిపి నాగిరెడ్డిని, నీలం రాజశేఖరరెడ్డిని బనారస్ (కాశీ) పంపించారు. అప్పటికే గాంధీ ప్రభావంతో ఉన్న నాగిరెడ్డి కోర్కెపై వీరు ముగ్గురూ వార్ధా ఆశ్రమానికి వెళ్లి గాంధీని దర్శించుకున్నారు. వీరిని భోజనం చేయమని గాంధీ ఆహ్వానించగా నాగిరెడ్డి, రాజశేఖరరెడ్డి ఉత్సాహపడ్డారు. కానీ కల్లూరి సుబ్బారావు ‘బయట తింటాం’ అని చెప్పి వీరిని తీసుకెళ్లాడు. ఇక్కడ ఉప్పూ కారం లేని చప్పిడి భోజనం పెడతారు, మనం తినలేం అని చెప్పారట. నాగిరెడ్డికి గాంధీజీ ఒక చరఖా బహూకరించారు. ఆ చరఖాతో సహా బెనారస్ విశ్వవిద్యాలయానికి చేరిన నాగిరెడ్డి కొద్దికాలంలోనే గాంధీయిజంపై భ్రమలు కోల్పోయి కమ్యూనిస్టు ప్రభావంలోకి వెళ్లారు. సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే శక్తి కమ్యూనిజానికే ఉందనే నమ్మకంతో 1939లో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. నాగిరెడ్డిని ప్రభావితం చేయటంలో ఆనాటి కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు భరద్వాజ కృషి చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ అధ్యక్షునిగా కూడా నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు ఆయన. అప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్.

నాగిరెడ్డి జీవిత చరిత్ర రాయాలనే ఉద్దేశంతో 1981లో ఒకసారి తరిమెల వెళ్లి కృష్ణారెడ్డి ఇంటి అటకపై ఉన్న పాత ఉత్తరాల్ని దించాం. ఉద్యమానికి ఆటంకాలు కలుగజేస్తూ, అజ్ఞాతంలో ఉన్న తనను పట్టించటానికి కాపలా మనుషుల్ని నియమించి, పార్టీ కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు బనాయించినందుకుగానూ– ‘నిన్ను చంపేస్తాం’ అంటూ తండ్రి సుబ్బారెడ్డిని బెదిరిస్తూ కుమారుడు నాగిరెడ్డి రాసిన ఉత్తరం వాటిలో ఒకటి. ‘చాలా రోజులు పట్టించుకోలేదు, ఇక ఈ నిర్ణయం అనివార్యమనీ, తల్లికి నచ్చజెప్పమనీ తమ్ముడు కృష్ణారెడ్డికి రాసిన ఉత్తరం, పెళ్లికాక ముందు సంజీవరెడ్డి జైలు నుంచి నాగరత్నమ్మకి రాసిన ప్రేమలేఖ తదితరాలు దొరికాయి.

నాగిరెడ్డి లేఖ రాసిన తర్వాత సుబ్బారెడ్డి బండి ప్రయాణం మాని జీపు తెచ్చుకున్నారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి కుమార స్వామిరాజా, మద్య నిషేధ శాఖా మంత్రి సంజీవరెడ్డి తరిమెలకు వచ్చి సభపెట్టి, తన మామకు ఏమైనా జరిగితే తరిమెలలో కమ్యూనిస్టుల్ని కాల్చి చంపి, వారి ఇళ్లన్నీ నేలమట్టం చేస్తామని హెచ్చరించి, గ్రామంలో పోలీసు క్యాంపు ఏర్పాటు చేశారు. సుబ్బారెడ్డి కొన్ని మంచి పనులు (సారా వ్యతిరేకత, హరిజనుల గుడి ప్రవేశం తదితరాలు) చేశాడు. అతణ్ని చంపితే ప్రజలందరూ హర్షించరని, పార్టీలోనే కొందరు అభిప్రాయపడటంతో మొత్తంమీద నాగిరెడ్డి నిర్ణయం అమలు కాలేదు. అయినా తండ్రి దుర్మార్గాలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంతో ప్రజల్లో నాగిరెడ్డి గొప్ప నాయకునిగా స్థిరపడ్డారు.


నాకు విచిత్రమనిపించిన విషయం ఒకటుంది. 1975 జూన్ 23న తాడిపత్రిలోనూ, జూన్ 25 సాయంత్రం అనంతపురం ఓల్డ్‌టౌన్‌లోనూ నిర్వహించిన బహిరంగ సభల్లో ‘త్వరలో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించబోతున్నార’ని నాగిరెడ్డి హెచ్చరించారు. (జిల్లాలోని రైతు నాయకులంతా కలిసి నాగిరెడ్డిని, సంజీవరెడ్డిని 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై ప్రసంగించేట్లు అంగీకరింపజేసి తాడిపత్రి సభ పెట్టారు) ఆయన చెప్పినట్లే జూన్ 25న రాత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. నాగిరెడ్డి కాలజ్ఞాని అనుకోవటం తప్ప, ఇదెలా సంభవమో తెలియదు. రాజకీయ పరిస్థితిని ఇంత కచ్చితత్త్వంతో అంచనా వేయగల నాయకుణ్ని 59 సంవత్సరాల వయస్సులో కోల్పోవటం కమ్యూనిస్టు ఉద్యమానికి ఎనలేని లోటు.

చెరుకూరి సత్యనారాయణ

(నేడు తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి)

Also Read:

చికెన్‌ 65 అనే పేరు ఎలా వచ్చింది?

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

Updated Date - Jul 28 , 2026 | 01:01 AM