Americas Geopolitical Power Play: లక్ష్యం చైనా.. అస్త్రం వెనెజువెలా!
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:50 AM
కొత్త సంవత్సరం కొత్త ఆశలను మోసుకొస్తుందని అందరమూ అమాయకంగా నమ్ముతాం. కొత్త ఆశల సంగతేమో గానీ పాత ఆశలను తుంచేసే రీతిలో దాని గమనం మొదలైంది. పాలకులు నియంతలైనా...
కొత్త సంవత్సరం కొత్త ఆశలను మోసుకొస్తుందని అందరమూ అమాయకంగా నమ్ముతాం. కొత్త ఆశల సంగతేమో గానీ పాత ఆశలను తుంచేసే రీతిలో దాని గమనం మొదలైంది. పాలకులు నియంతలైనా, అప్రజాస్వామికులైనా వారిని మార్చివేసే హక్కును ఆ దేశాల ప్రజలకే వదిలివేయాలన్నది ఆధునిక రాజకీయాల్లో మౌలికసూత్రం. దీనికి గండికొడుతూ వెనెజువెలాపై అమెరికా దాడిచేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యనూ అరెస్టుచేసి అమెరికాకు తరలించింది. మాదకద్రవ్యాల రవాణాలో మదురోకు కీలకపాత్ర ఉందని ఆరోపించి, ఆ మేరకు ఎప్పుడో కోర్టు ఉత్తర్వులు పొంది అంతా సజావుగా, చట్టబద్ధంగా చేశామని అమెరికా సమర్థించుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. తన భద్రతకు ప్రమాదంగా పరిణమించాయని ఆరోపిస్తూ ఇష్టంలేని ప్రభుత్వాలను కూలదోయటం అమెరికాకు ఇది తుదీ కాదు.. మొదలూ కాదు.
భారీ జనవిధ్వంసక ఆయుధాలను దాస్తోందన్న ఆరోపణలతో ఇరాక్‌పై దాడిచేసి సద్దాంహుసేన్ ప్రభుత్వాన్ని అమెరికా కూల్చివేసింది. దీంతో మధ్యప్రాచ్యం అగ్నిగుండమైంది. జనవిధ్వంసక ఆయుధాలు ఇరాక్‌లో లేనేలేవని అంతర్జాతీయ అణుఇంధన సంస్థ నిపుణులు తేల్చిచెప్పినా తాననుకున్న విధంగా సైన్యాలను నడిపించి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. నిజానికి అమెరికా రెండో దాడి నాటికే (2003) ఇరాక్ అన్నివిధాలుగా బలహీనమైపోయింది. అమెరికా, యూరోపు దేశాలు విధించిన ఆంక్షలతో, యుద్ధనష్టాలతో అప్పటికే సంక్షోభంలో కూరుకుపోయింది. సాధారణ మందులు సైతం అందక లక్షలాది పసిపిల్లలు ప్రాణాలను కోల్పోయారు. అమెరికా నేతృత్వంలో ఆరంభమైన మొదటి గల్ఫ్ యుద్ధంతోనే (1990–91) ఇరాక్ నవనాడులూ కుంగిపోయాయి. ఏమీ చేయలేని దుస్థితిలో ఇరాక్ ఉందని తెలిసినా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆమోదం లభించకపోయినా అనుకున్నది చేసేశారు. అంతే.. అక్కడ కనీవినీ ఎరగని విధ్వంసం జరిగింది. అందులోంచి నుంచి ఐఎస్‌ఐఎస్ లాంటి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చి దేశదేశాల్లో సమస్యలను సృష్టించాయి. అఫ్గానిస్థాన్‌లోకి ప్రవేశించిన (1979) సోవియట్ సైన్యాలను ఎదిరించటానికి.. ఇస్లాం ప్రమాదంలో పడిందంటూ ముజాహిదీ బృందాలను తయారుచేసి వెన్నుదన్నులు అందించటంతో మతతత్వ తీవ్రవాద భావజాలం 1980ల చివరినాటికే విపరీతంగా శక్తిని పుంజుకుంది. ఆ విపరిణామంలో అమెరికా నిర్వహించిన పాత్ర గురించి ఇప్పుడెవరికీ సందేహాల్లేవు. దానిపై వందలవేల విశ్లేషణలూ వచ్చాయి.
2003 నాటి ఇరాక్‌లాగే ఇప్పటి వెనెజువెలా పరిస్థితి ఉంది. ఆర్థికంగా దిగజారిపోయింది. భద్రతాపరంగా ఎవరికీ ముప్పుకలిగించే పరిస్థితిలోనూ లేదు. మాదకద్రవ్యాల రవాణాకు ఉపయోగపడే మార్గాలకు వెనెజువెలా ఉపయోగపడుతున్నా వాటి ఉత్పత్తికి ఇప్పటికీ అది కేంద్రం కాదు. కొలంబియా నుంచి ఇతరచోట్లకు మాదకద్రవ్యాలను చేరవేయటానికి వెనెజువెలా పనికివస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ప్రభుత్వాధినేత పాత్ర ఎంతో ఇదమిత్థంగా చెప్పలేం. కొందరు అధికారుల పాత్ర కచ్చితంగానే ఉండొచ్చు. కానీ నచ్చని ప్రభుత్వాలను మార్చటానికి దేశాధినేతలను దోషులుగా ముద్రవేయటం అమెరికా వ్యూహాల్లో ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. ఆర్థికవ్యవస్థలు అధోగతికి వెళుతున్నప్పుడు కొన్నిచోట్ల నిషేధిత మత్తుపదార్థాల వ్యాపారాలు విజృంభిస్తాయి. అఫ్గానిస్థాన్‌లో అదే జరిగింది. 1979 నుంచి ఇప్పటివరకూ అక్కడ ఏదో విధంగా రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదుడుకుల్లోనే నడుస్తోంది. ముజాహిద్ బృందాలకు నిధులను సమకూర్చటానికి మత్తుపదార్థాల వ్యాపార–రవాణాకు సీఐఏ అండదండలను అందించిందని అమెరికా జర్నలిస్టులే పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. ఒకనాటితో పోల్చితే ఆర్థికాభివృద్ధిపరంగా వెనుకపట్టుపట్టిన పంజాబులోనూ మత్తుపదార్థాల సమస్య తీవ్రంగానే ఉంది. దిగజారిన వెనెజువెలా ఆర్థిక పరిస్థితికి కారణమెవరని ప్రశ్నించుకుంటే వేలును ఒక్కవైపుగానే చూపించలేం.
చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న దేశం ఆర్థికంగా పతనం అంచున ఉండటం విచిత్రంగానే అనిపించినా వెనెజువెలా విషయంలో అది కఠోర వాస్తవం. 1999లో హ్యూగో రాఫెల్ చావెజ్ అధికారంలోకి రావటం వెనెజువెలాలోనే కాదు దక్షిణ అమెరికా దేశాల చరిత్రలోనే మేలుమలుపుగా పరిగణించే వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. 1990ల్లో ఊపందుకున్న సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించే వారందరికీ చావెజ్ ఆశాకిరణంలా కనపడ్డారు. వెనెజువెలాతో పాటు బ్రెజిల్, అర్జెంటీనా, బొలివియా, చిలీల్లో (2002– 2006) సరళీకృత విధానాలను వ్యతిరేకించే, సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ నిధులను ఖర్చుపెట్టాలని కోరుకునే నాయకులు అధికారంలోకి వచ్చారు. వాగ్దానాల ప్రకారం కొన్ని సంక్షేమ పథకాలను అమలుచేసినా కావాల్సిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయాలను పెంచుకోలేకపోయారు. తీవ్రంగా నిధులకొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. వెనెజువెలా పరిస్థితి ఘోరంగా దిగజారింది. చమురు అమ్మకాలపైనే ప్రధానంగా ఆధారపడుతూ ఇతర రంగాలను నిర్లక్ష్యం చేయటంతో వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. చమురుధరలు తగ్గిపోయినప్పుడు ఏమీచేయలేని దుస్థితిలో పడిపోయింది. దీనికి తోడు అమెరికాతో పాటు ఇతరదేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలతో కనీవినీ ఎరగని సంక్షోభంలో కూరుకుపోయింది. 2014లో 482–500 బిలియన్ డాలర్ల విలువ ఉన్న జీడీపీ 2025 వచ్చేసరికి 100–115 బిలియన్ డాలర్లకు పడిపోయింది. రుణాలు–జీడీపీ నిష్పత్తి 160 శాతానికి పెరిగింది. అంటే ఆదాయం వంద రూపాయలు ఉంటే రుణం 160 రూపాయలకు చేరింది. చమురు ఆదాయం బాగున్న కాలంలో (2000–2014) మొత్తం ప్రభుత్వ ఖర్చులో 45 శాతం నుంచి 65 శాతం వరకూ సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించారు. పెద్ద మొత్తం ఇలా ఖర్చుపెట్టటం వల్ల ఉత్పత్తి రంగాలకు నిధులను సమకూర్చలేకపోయారు. చమురుశుద్ధి కర్మాగారాల ఆధునికీకరణకూ, చమురు అన్వేషణలో, వెలికితీతలో కొత్త పద్ధతులనూ అనుసరించలేని అశక్త స్థితికీ చేరుకున్నారు. మరోవైపు విదేశీపెట్టుబడులకు ఎప్పటి నుంచో ద్వారాలు మూసివేశారు. 2014 నుంచి క్రమేపీ చమురుధరలు తగ్గిపోవటంతో కరెన్సీని ఇబ్బడిముబ్బడిగా ముద్రించటం మొదలుపెట్టారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది.
ఆదాయం పడిపోవటంతో తలకుమించిన భారంగా అప్పులు చేయకతప్పలేదు. చెల్లింపుల సామర్థ్యం లేకపోవటంతో అవీ అనుకున్నంతగా దొరకలేదు. ప్రభుత్వ ఆదాయంలో పన్నుల ద్వారా వచ్చేది 15 నుంచి 20 శాతానికి మాత్రమే పరిమితమైంది. బ్రెజిల్ (85–90శాతం), అర్జెంటీనా (80–85శాతం), చిలీ (75–80శాతం), మెక్సికో (65–70శాతం)ల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆర్థిక ఆంక్షలు పరిస్థితిని విషమం చేసినా అసలు కారణాలు వెనెజువెలా అవలంబించిన విధానాల్లోనే ఉన్నాయి. చావెజ్ ఆరంభించిన విధానాలను.. మదురో ఏదోవిధంగా కొనసాగించటానికి ప్రయత్నించటమే మనకు కనపడుతుంది. అందుకే సంక్షోభం నుంచి గట్టెక్కలేకపోయారు. ఆదాయాన్ని పెంచే మార్గాలకంటే సంక్షేమ పథకాల పేరుతో పంచిపెట్టటమే ప్రధానమైన చోట జనాకర్షణ రాజకీయాలే కీలకంగా ఉంటాయి. అవి ఉన్నచోట వ్యక్తిపూజ కేంద్రంగా విపరీత ప్రవర్తనతో వ్యవహరించే నాయకులే ఉంటారు. దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడే విధానాలకు దూరంగా జరుగుతూనే ఉంటారు. చావెజ్, మదురోలు దీనికి మినహాయింపు కాదు. చావెజ్ హయాంలో సంక్షేమ పథకాలకు ఎక్కువ ఖర్చుపెట్టటం వల్ల ఆదాయ అసమానతలు కొంత తగ్గాయి. కానీ మొత్తంగా ఆర్థిక వ్యవస్థ అన్నిరంగాల్లో ఆరోగ్యకరరంగా అడుగులు వేయలేకపోవటం వల్ల అవి తాత్కాలికమే అయ్యాయి. ప్రస్తుతం అక్కడ 82 శాతం మంది దారిద్య్రంలో జీవించటమే ఇందుకు నిదర్శనం.
మాదకద్రవ్యాల సరఫరాలో వెనెజువెలా అధ్యక్షుడి పాత్ర ఉందంటూ ఆక్రమణను సమర్థించుకోటానికి పైకి అమెరికా ఏదైనా చెప్పొచ్చు. దాడికి అసలు కారణాలు మాత్రం లోతైనవి. ప్రపంచవ్యాప్తంగా పలచనవుతున్న అమెరికా ఆధిపత్యంలోనే కీలకమంతా ఉంది. మారుతున్న ప్రపంచ ఆర్థికవ్యవస్థలో, రాజకీయాల్లో అమెరికా పాత్ర తగ్గటమే గాని పెరిగే పరిస్థితి కనిపించటంలేదు. చైనా ధాటికి తట్టుకుని నిలబడటానికే అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే యూరపు భద్రతను ప్రధానంగా అక్కడి దేశాలే చూసుకోవాలని చెప్తోంది. మరోవైపు ఎన్ని ఆర్థిక ఆంక్షలను విధించినా రష్యా లొంగిరావటం లేదు. చేసేదిలేక ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించటానికి రష్యా డిమాండ్లన్నిటినీ అంగీకరించేలా యూరపు దేశాలపై ఒత్తిడి తెస్తోంది. ఆసియా, ఆఫ్రికాలో చైనా ప్రభావాన్ని తగ్గించటానికి చేసిన ఏ ప్రయత్నమూ ఫలించటంలేదు. భారత్‌తోనూ సంబంధాలు దిగజారాయి. దిగుమతులపై 50 శాతం సుంకాల భారం మోపటంతో కొన్నిరంగాల్లో మనకు గట్టి సమస్యలే వచ్చిపడుతున్నాయి. మరోవైపు లాటిన్ అమెరికా దేశాలూ చైనాతో సంబంధాలను పెంచుకుంటున్నాయి. అంతెందుకు వెనెజువెలా చమురును చైనానే కొనుగోలు చేయకపోతే పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. 80 శాతం వెనెజువెలా చమురు ఎగుమతులు అక్కడికే వెళుతున్నాయి. లాటిన్ అమెరికా దేశాలకు చేసే ఎగుమతులను కూడా చైనా క్రమేపీ పెంచుకుంటోంది. 2023 నాటికే చైనా ఎగుమతులు 273 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా ఎగుమతులతో (423 బిలియన్ డాలర్లు) పోల్చితే ఇవి తక్కువగా ఉన్నా ఏడాదేడాదికి పెరుగుదల రేటు బాగా నమోదవుతోంది. లాటిన్ అమెరికా దేశాలకు చైనా ఇచ్చే రుణాలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. దాదాపుగా 136 బిలియన్ డాలర్లను వివిధ రూపాల్లో రుణాలుగా ఇచ్చింది. ప్రత్యక్ష పెట్టుబడులు కూడా 160 బిలియన్ డాలర్లకు చేరాయి. వెనెజువెలాలోని అమెరికా ప్రత్యక్ష పెట్టుబడులతో (38శాతం) పోల్చితే చైనావి (5.7శాతం) తక్కువే అయినా అవన్నీ చమురు, గనులు, ప్రాథమిక సౌకర్యాలు, ఇంధనం వంటి కీలకరంగాల్లో ఉన్నాయి. అమెరికా కన్నెర్ర చేయడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం.
ప్రపంచం మొత్తంలో వెనెజువెలాకున్న అపార చమురు నిల్వలపై (17–18శాతం) పట్టుని సంపాదించి లాభాలను పిండుకోవటమూ, చైనాతో ఆ దేశానికి బలపడుతున్న బహు ముఖ బంధాలను నియంత్రించటమూ లక్ష్యంగా అమెరికా ప్రత్యక్ష దాడికి దిగింది. దీనికితోడు మొత్తంగా లాటిన్ అమెరికా దేశాలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవటాన్ని అమెరికా ప్రాణావసరంగా భావిస్తోంది. అందుకే జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించిన తాజా పత్రంలో అమెరికా ఖండంపై ఇతర దేశాల జోక్యం వద్దని ప్రబోధించిన.. 200 ఏళ్ల నాటి మన్రో సిద్ధాంతాన్ని కొత్త వ్యాఖ్యానాలతో తెరపైకి తెచ్చింది. 1820ల్లో స్వాతంత్ర్యం పొందిన లాటిన్ అమెరికా దేశాలు తిరిగి యూరప్ ప్రభావంలోకి వెళ్లకుండా నియంత్రించటమే మన్రో సిద్ధాంతానికి ఆనాడు లక్ష్యమైంది. తర్వాతి కాలంలో లాటిన్ అమెరికాలో తన ఆధిపత్యాన్ని పెంచుకోటానికే అమెరికా దాన్ని ఉపయోగించుకుంది. ఇప్పుడదే సిద్ధాంతాన్ని వెలికితీసి పరోక్షంగా చైనాను ఎదుర్కోటానికి తయారైంది. ఆ దేశంతో ఆర్థికంగా సన్నిహితమైన వెనెజువెలా లాంటి దేశాలను లొంగదీసుకోటానికి అదే అస్త్రంగా మారింది. ఆర్థికంగా అగ్రగామిగా మారుతున్న ఆసియాపై ఆర్థిక ఆధిపత్యం సాధ్యంకాని నేపథ్యంలో వైట్‌హౌస్ విధానకర్తలకు లాటిన్ అమెరికాపై పట్టుబిగించి అడ్డంకులను తొలగించుకోవటమే అత్యవసరం అవుతోంది. అందుకు లాటిన్ అమెరికా–కరేబియాలోని 33 దేశాల్లో ఎన్ని వరుసగా సమిధలవుతాయో ఇప్పుడే చెప్పలేం! సార్వభౌమత్వాల స్థానంలో సామ్రాజ్యవాదం అంటే ఇదేనేమో!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!