తప్పిపోవాల్సిన అడవిదారులు
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:44 AM
మే రీ ఆలివర్ అన్న అమెరికన్ కవయిత్రి నా ప్రపంచంలోకి వచ్చింది బహుశా ఈ ప్రశ్నతోనే. జీవించామనడానికి ఈమె లెక్కలేమై ఉంటాయన్న కుతూహలమొకటి నన్నామె కవిత్వంలోకి లాక్కుపోయి ‘Devotions’ దగ్గర వదిలేసింది....
‘‘Listen, are you breathing just a little
and calling it a life ?’’ – Mary Oliver
మే రీ ఆలివర్ అన్న అమెరికన్ కవయిత్రి నా ప్రపంచంలోకి వచ్చింది బహుశా ఈ ప్రశ్నతోనే. జీవించామనడానికి ఈమె లెక్కలేమై ఉంటాయన్న కుతూహలమొకటి నన్నామె కవిత్వంలోకి లాక్కుపోయి ‘Devotions’ దగ్గర వదిలేసింది.
‘డివోషన్స్’ 450 పేజీల కవిత్వం. పెంగ్విన్స్ ప్రచురణ. ఐదు దశాబ్దాలకు పైగా రాసుకున్న తన కవిత్వంలో నుండి, ఆలివర్ తానే స్వయంగా ఎంపిక చేసుకున్న కవితల సంకలనం.
ముద్దగా పూసిన పూవులమధ్యలో మత్తుగా వినపడే ఊపిరి రాగం, పిట్టల పాటల్లో నుండి ఉదయాలకందే ఉత్సాహం, ఆకాశపు మెత్తనికాంతిలో నుండి మనసు పొందగలిగే శాంతి ఎలా ఉంటాయో తెలిసి కూడా, మనిషి ఇలాగే నాలుగు గోడల మధ్యా బందీగా మనగలిగేవాడా అన్న ప్రశ్న ఒకటి పదే పదే పాఠకుడి లోపల కదలాడేలా చేసే కవిత్వం మేరీ ఒలివర్‌ది.
ఈ ‘డివోషన్స్’లో ఉన్నదంతా ఆ నాలుగ్గోడల బయటి ప్రపంచం. ‘Thousand Mornings’ చూసిన కన్నులు పిండుకున్న వెలుగుల సారం. నియమం తప్పకుండా పాటించిన స్పిరిచువల్ ప్రాక్టీస్‌లో అనివార్యంగా దొర్లిన బ్రతుకు రహస్యం. ఈ కవిత్వంలో మళ్ళీ మళ్ళీ ఎదురుపడే అడవిదారులతో మమేకమయ్యే కొద్దీ అర్థమయ్యేదిదే: ఇది ప్రకృతికి పూటకింతగా రాసుకున్న ప్రేమలేఖ. పిట్టలతో కలిసి పాడుకున్న ప్రార్థనాగీతం. వికటించే ప్రమాదం లేని పసరు వైద్యం.
రోమియో జూలియట్ ఓ వెన్నెల రాత్రిలో కలుసుకోవాలని అనుకున్నారనుకుందాం. అందులో ఒకరు ఆలస్యమయ్యో భయపడో ఇంకెక్కడో వేరే పనిలో మునిగిపోయో అనుకున్నవేళకి రాలేదే అనుకుందాం. అప్పుడు వాళ్ళ మధ్య రొమాన్స్ మొదలయ్యే వీలుందా? – తన poetry handbookలో aspiring poetsని ఆలివర్ అడిగిన మొదటి ప్రశ్న ఇది. కవిత్వం కూడా ఒక లవ్ అఫైర్ లాంటిదేనని, కవి అన్నవాడు ముందుగా కాపాడుకోవాల్సింది కవిత్వం తనను సమీపించగల ఏకాంతసమయాన్ననీ చెప్తుంది ఆలివర్. ఆమె స్వయంగా యాభై యేళ్ళకు పైగా కవిత్వం రాసింది. అన్నేళ్ళూ ఆ కవితాధార కొనసాగడానికి ఆమెకు సాయపడింది– ఉదయపు నడక. ప్రతిరోజూ ఒకే వేళకి నడకకు వెళ్ళేదట. చూసిన వింతలు, తోచిన ఊహలు, అన్నీ తను వెంటతీసుకెళ్ళే నోట్‌బుక్‌లో రాసుకుని, ఇంటికొచ్చాక దిద్దుకునేదట. ‘‘నాలుగ్గోడల మధ్య నాకు ఉక్కపోత’’ అని చెప్పుకుంటుంది ఇంటర్వ్యూలలో. బహుశా అందుకే ఎన్ని వందల కవితలు రాసినా, ఎప్పుడూ ఎక్కడా ఇన్‌డోర్ వాతావరణం చూపించే ప్రయత్నం చెయ్యలేదు.
కాస్త ఆగమని, ఆగి చూడమని, మళ్ళీ మళ్ళీ చూడమని, ఇంకాస్త శ్రద్ధగా చూడమని, వినమని చెప్పడం ఆలివర్ కవితల్లో చాలా చోట్ల కనపడే సంగతే. ఆమె కవిత్వమంతా, జీవితపర్యంతం, చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల శ్రద్ధను అలవరచుకోవడం కోసం చేసిన సాధనలానే ఉంటుంది. బహుశా అందుకే, వినడమొక ప్రార్థన అని కూడా రాయగలిగింది. ఇసుకను చీల్చి వినండి, అక్కడొక నది పాట వినపడుతుందని రాసిందొక చోట. ఒళ్ళంతా పాట చేసుకున్నట్టు రాత్రంతా సంగీతం వినిపించే చిమ్మెట్లపైన ఆమెకొక ఆరాధన. మామిడిపిట్టలంటారు, పసుపు నలుపు రంగుల్లో ఉండే చిన్నపిట్టలవి– అవి జట్లుగా అటూ ఇటూ చేరి కచేరీ పెడుతుంటే, ఆగి వినమని ప్రాథేయపడుతుంది. గెలవడం కోసం కాదు, sheer delight, gratitude లతో పాడుకుంటాయి కదా – వాటిని అనుభవించడం కోసం ఆ సంగీతంలో మునిగితేలమంటుంది. ‘‘just to be alive in this fresh morning/ in this broken world’’ (కేవలం బ్రతుకు స్పృహను అందుకోవడం కోసం, ఈ కొత్త ఉదయంలో, ఈ పగిలిన ప్రపంచంలో....). ఇంకాస్త సహనం సాధించాలన్నదే, ఇంకాస్త శ్రద్ధగా లోకాన్ని గమనించాలన్నదే తన కోరికని చెప్పు కునే ఈ కవయిత్రి, ప్రతి దృశ్యాన్ని నిశితంగానే గమనిస్తుంది. కానీ ఆమె పట్టుకున్నది నిశితమైన చూపుకి దొరికే ‘‘థ్రిల్’’ లాంటిది మాత్రమే కాదు, ఆమె ఆసక్తి మామూలు కళ్ళు పట్టుకోలేకపోయే సూక్ష్మసౌందర్యాల గురించి మాత్రమే కాదు, ఎక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటూ దాక్కుంటుందో, ఎక్కడ చచ్చుబడిన ప్రాణం కూడా ప్రాణవాయువందినట్లు ఉలికిపడుతుందో, ఎక్కడ నరాల్లోకి బలమేదో పాకినట్టు తీవెలు పచ్చగా ఉబికి అల్లుకుంటాయో వాటిని చూడటం తెలుసు ఆలివర్‌కి. ఆ జీవశక్తి, ఆమె పదాల్లోని బలం. ‘‘Poetry is a life cherishing force’’ అన్న ఆమె రాతల వెనుక, జీవితం వెనుక, ఊనికగా ఉన్నది ప్రకృతే.
విశ్వసనీయత కోసం కవిత్వంలో వివరాలు గుప్పించడం వల్ల అన్నిసార్లూ ప్రయోజనముండదు. కవులైనా పాఠకులైనా తోచినన్ని వివరాలు దండుకున్నాక వాటన్నిటినీ కలుపుకునే కొలాజ్‌లో లీలగా కదలాడే ఉద్వేగమే ఆఖరి ముద్రగా మనసులో మిగిలిపోతుంది. ఆలివర్ కవితల్లో కనపడే ఆ ఉద్వేగం, ఆ ఆఖరి ముద్ర, చాలా సాత్వికమైనది. ఆమె తన వివరాలతో భయం కలిగించదు. వెరపు పుట్టించదు, కోరిక రేకెత్తించదు. ఆమె చూపులో అవ్యాజమైన కరుణ, వ్యక్తీకరణలో డివైన్ లవ్ వెల్లడవుతూ ఉంటాయి. పిట్టల్నైనా పువ్వుల్నైనా దేన్నైనా సరే, కేవలం వాటినలా చూసినందుకు సంతోషం. అవట్లా ఉన్నందుకు తృప్తి. ఈ సత్వగుణం ఆమె కవిత్వపు ప్రధానమైన లక్షణం. ఇది మామూలుగా సాహిత్యలోకంలో ఎదురుపడే ‘‘కవిచూపు’’ కాదు. జీవితేచ్ఛ పొంగు లెత్తేవేళ సృష్టిలో ఎక్కడ మనిషికి కొంత ఉత్సాహమూ ఆశా సంతోషమూ దొరుకుతాయో, ఎక్కడ భగవంతుడి ఉనికికి నిరూపణ అక్కర్లేదో ఆ తావులను పట్టుకున్న స్పిరిచువల్ చూపామెది.
చూపులోనే కాదు, కవిత చెక్కడంలో కూడా ఆమెకు టిపికల్ కవులకుండే పట్టింపు ఉన్నట్టు నాకెక్కడా కనపడలేదు. poetry handbook రాసినా కూడా. టెక్నిక్ గురించి మాట్లాడటం తప్పని కాదు, ఎంత చెప్పినా ఆమె కవిత్వంలో అంత తీక్షణమైన ఆలోచన, చిత్రిక పట్టిన గురుతు నాకు దొరక్క. విసుగు తెప్పించేంత దీర్ఘమైన కవితలు రాసింది ఆలివర్. ‘థౌసండ్ మార్నింగ్స్’, ‘పన్నెండు చంద్రులు’ – ఆశ్చర్యం కలిగించేటన్ని సార్లు ఒకే వస్తువు మీద పదే పదే కవితలు రాస్తూనే ఉంది. ఆమెకు వస్తువు రిపీట్ అవుతోందన్న భయం లేదు. అదే పూవు మీద ఎన్ని కవితలు రాయగలనన్న శంక లేదు. ఆమె పాఠకులకు ఆఫర్ చేసింది కొత్తదనం కాదు. అటెన్షన్. శ్రద్ధ. ఆమె కవిత్వమే రాయాలనుకుని ఉంటే, ఒక్కో వస్తువు మీదా అన్ని కవితలు రాయకుండానే ఉండగలిగేదేమో. ఆమెది ఉపాసన. ఆమె ధ్యానించుకుంది. ఒక్క లిల్లీపూవుని. ఒక్క తుమ్మెద రెక్కని. మిణుగుర్ల వెలుగుని. పిట్ట నోటి ఎరుపుని.
జీవితాన్ని ముందుకు తోయగల సంతోషపు ఉధృతి ఒకటి ఆమె కవిత్వంలో తరచుగా కనపడుతుంది. ‘‘spinning with joy’’ లాంటి మాటల్లోనో, ‘‘imagine! you have a life’’ అనో, ‘‘చూడు! మళ్ళీ ఇంకో కొత్త ఉదయం చూసేస్తున్నాం’’ అనో దానిని పదాల్లోకి తెచ్చుకుంటుంది. ఊరికే పలకరించే జీవనమాధుర్యాన్ని, ఇదిగో, ఇలా కృతజ్ఞతాపూర్వకంగా ఉత్సవం చేసుకుంటుంది. మనుషులు దమ్మిడీ విలువలేదనుకునే వాటిని ముందుకు నెట్టి సంబరపడిపోయే ఆ గొంతుని నిర్లిప్తంగా దాటుకుపోవడం కష్టమైన పని.
Are the morning kisses
the sweetest
or the evenings
or the inbetweens
All I know
is that ‘‘thank you’’ should appear
somewhere.
(ఉదయాల ముద్దులు/ తీయగా ఉంటాయా/ సాయంకాలాలవా? లేదూ/ ఆ మధ్యలోవా? ఏమో!/ నాకు తెలిసిందల్లా/ ఈ మధ్యలోనే ఎక్కడో/ ‘‘థాంక్యూ’’ కూడా వినపడాలన్నదే.)

ఆలివర్ ఇట్లా చెట్లమ్మటా పుట్లమ్మటా తిరుగుతూ కులాసా కవిత్వం రాసుకుంటోందని, ఆమెకు రాయడానికి ఎవరైనా డబ్బులిస్తున్నారేమో అని కనుక్కునేవారట. చిన్నప్పుడే ఇల్లొదిలి వచ్చేశానని, బ్రతుకు తెరువు కోసం చిన్న ఉద్యోగమొకటి చెయ్యడం ఏనాడూ తప్పలేదనీ నవ్వుకుంటుందామె. కానీ బాగా ఆసక్తి గానో, ఆకర్షణ నిండి ఉన్న ఉద్యోగాన్నో మాత్రం ఎప్పుడూ ఎంచుకోవాలనిపించేది కాదట – ఆ ఆకర్షణలో పడితే కవిత్వం మీద ధ్యాస నిలవదని. ఆశావహ కవిత్వమన్న ముద్ర కూడా ఉంది కనుక, ఆమె కవిత్వమంతా అబద్ధాలపుట్టలనో, చూడాల్సిన వైపు చూడలేక మొహం తిప్పుకుంటే మిగిలే తాత్కాలిక శాంతి అనో అనుకునేవాళ్ళూ ఉన్నారు. ఆలివర్ అట్లా నిజాలకు పెడమొహం చూపించిన మనిషిలా అనిపించదు. ఆమె బాల్యంలో తండ్రి చేతిలో సెక్సువల్ అబ్యూజ్‌కి గురైంది. లంగ్ కేన్సర్ ఆమెకు కొన్నాళ్ళు పరీక్షలు పెట్టింది. ఆమె తన కవిత్వంలో వాటి గురించి కూడా మాట్లాడింది. ఉదాహరణకి, ‘Rage’ అన్న కవిత: ‘‘In your dreams you have sullied and murdered, / and your dreams do not lie.’’ ఒక ఇంటర్వ్యూలో ఈ కవిత గురించి మాట్లాడుతూ, జీవితాంతం వెన్నాడే చిన్ననాటి అనుభవాల నుండి తనను కాచుకుని, గాయాలను మాన్పిన భద్రలోకం ప్రకృతేనని, అక్కడే తనకు కోలుకునే వెసులుబాటు దక్కిందని చెప్పిందామె. ‘The fourth zodiac sign’ అన్న మరో కవితలో – కేన్సర్ గురించీ రాసుకొచ్చింది.
ఈ రెండూ ‘డివోషన్స్’ పుస్తకంలో లేవు. లేకపోవడమే సరి. డెలిబరేట్‌గా మాట్లాడినట్టు కనిపించకపోయినా, మానసికమైన అవస్థల పట్ల ఆలివర్ చూపు అపారమైన సహానుభూతితో ముడిపడే ఉంది. ఈమాట తల్చుకోగానే నాకు గుర్తొచ్చే ఆమె వాక్యం: ‘‘You only have to let the soft animal of your body, love what it loves’’. నీకు నచ్చింది నువ్వు చేసుకోపొమ్మనే ఎగదోత మాట కాదు ఆమె రాసింది. మనిషి అన్నింటికంటే ముందు తనను తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలన్న అతి చిన్న సత్యం. మనిషి తన లోతుల్లోతుల్లో ఏ శక్తితో, యే అశక్తితో గింజుకులాడుతూ ఉంటాడో, ఏ పోరాటంలో నలిగిపోతూ ఉంటాడో, ఏ పోరాటాన్ని నిలిపితే తప్ప నెమ్మదిమనిషి కాలేడో, దానిని నిర్లక్ష్యం చేసుకోవద్దని చెప్పింది ఆలివర్. ఆ సాంత్వనాస్వరమే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆలివర్ కవిత్వాన్ని దగ్గర చేసింది.
‘‘The poem is a confession of faith’’ అన్న ఎమర్సన్ వాక్యం ఆలివర్ తన రైటింగ్ డెస్క్ దగ్గరే ఉంచుకుంటుందట. ఇక్కడ ఆ ‘ఫెయిత్’ అన్నది కవి సెన్సిబిలిటీస్ నుండి వ్యక్తమయ్యే దృక్కోణం. కవి ఎట్లాంటి నమ్మకాన్ని కవిత్వంలో ప్రవేశపెడుతున్నాడు అన్నదాన్ని బట్టే కవిత్వ ధోరణి మారుతుంది. ఆలివర్ నమ్మకం ప్రకృతిలో ఉంది. ప్రార్థనలో ఉంది. గ్రాటిట్యూడ్‌లో ఉంది. హీలింగ్‌లో ఉంది.
కవిత్వం ఎలా ఉండాలి అంటే ప్రార్థనలా ఉండాలంటుంది ఒక ముఖాముఖిలో మేరీ ఆలివర్. ప్రార్థనలా ఎందుకూ అంటే, అది ఎవరికి వారు సొంతం చేసుకుంటారు కనుక. చెప్పుకుంటారు కనుక, పదే పదే తమ ఊహల్లో నిలుపుకుంటారు కనుక.
చుక్కలను కలుపుకుని బొమ్మని ఊహించుకునే ప్రయత్నం చేసినట్టు, ఆమె మాటలని, కవిత్వంలో ఆమె సిద్ధాంతాలని, ఆమె కవిత్వాన్ని కలిపి చూసే ప్రయత్నం చేస్తే నాకొక అందమైన బొమ్మ దొరికింది. ఏమంటే, ఆమెకి attention is the first step to devotion (భక్తికి శ్రద్ధ మొదటి మెట్టు). catbirds తో కబుర్లాడుకోవడమో, old black oak ట్రీని హత్తుకుని ఉండిపోవడమో ఆమెకు ప్రార్థన. ప్రార్థన అంటే సంతోషంగా ఉంచేదనుకుంది. ప్రార్థనలో గ్రాటిట్యూడ్ పలకాలనుకుంది. అందులో నుండి నమ్మకం సాధించుకుంది. ఆ నమ్మకం నుండే హీలింగ్ మొదలవుతుంది. చాలా చిన్న సర్కిల్. కానీ ఆలివర్ జీవితకాలపు సాధన ఇది. ఆ సాధనలో నుండి థెరపీలా పనిచేసే ఇలాంటి మాటలను అలవోకగా రాయగలిగింది:
Don't worry about what is reality,
or what is plain, or what is mysterious.
If you were there, it was all those things.
If you can imagine it, it is all those things.
Eat, drink, be happy.
Accept the miracle.
(ఏది సత్యం ఏది కాదని/ బెంగపడకు. ఏది మర్మం/ ఏది కాదనీ కూడా./ నువ్వెక్కడ ఉంటే/ అక్కడే అవన్నీ./ ఊహించుకో చాలు/ ఉంటాయవన్నీ./ తిను తాగు సంతోషంగా ఉండు/ నమ్ము, ఒప్పుకో – ఇదంతా అద్భుతమని.)
సెల్‌ఫోన్ ప్రపంచపు దురుసు దాడి బారిన పడి, అన్ని రకాల శబ్దాలను, దృశ్యాలను, అనుభవాలను, ఒకే తీరున ప్రోసెస్ చేసుకుంటూ భయపెట్టే మనసుకి– చికిత్స కావాలి. స్వస్థత కావాలి. స్ట్రాబెరీ చందమామ రంగును చూడమనీ, ఉదయపు నీరెండలో గోల్డ్‌ఫించ్ పిట్టల సంగీతం వినమనీ చెప్పే ఆలివర్ కవిత్వం, ఆ మాయాప్రపంచపు కరుకుదనానికి విరుగుడు మందు. ‘‘Tell me, what is it you plan to do, with your one wild and precious life?’’ (ఏ కట్టుబాటులో ఒదగని అపురూపమైన జీవితం కదా ఇది, నువ్వు చెప్పు, దానితో ఏం చేద్దామనుకుంటున్నావు?) – అని వెలుగు దారుల సౌందర్యాన్ని కుప్పపోసి మరీ ప్రశ్నిస్తుంది ఆలివర్. అడవిదారులా పూలతోటలా, ఆకాశాలా సముద్రాలా? ‘‘అచ్చపు చీకటింబడి’’ మగ్గిపోకుండా ఉండేందుకు, మనిషి దేని ఆసరా కోరుకుంటాడన్నదే మిగిలే ప్రశ్న.
మానస చామర్తి
79754 68091
ఈ వార్తలనూ చదవండి:
ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..
ప్రాణాల్ని పణంగా పెట్టి.. గర్భిణిని ఆసుపత్రికి తరలింపు