Share News

చట్టం ఎవరికీ చుట్టం కాకూడదు

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:32 AM

తమిళనాడు ‘లాకప్ డెత్‌’ కేసులోని పోలీసు నిందితులకు శిక్ష పడటం– అదీ మరణ శిక్ష కావటం, విభ్రాంతి కలిగించే పరిణామం. ఈ విభ్రాంతి శిక్ష పడ్డందుకు కాదు, నేరం ఏవిధంగా నిరూపించబడిందీ అన్నందుకు. సాక్షులు...

చట్టం ఎవరికీ చుట్టం కాకూడదు

తమిళనాడు ‘లాకప్ డెత్‌’ కేసులోని పోలీసు నిందితులకు శిక్ష పడటం– అదీ మరణ శిక్ష కావటం, విభ్రాంతి కలిగించే పరిణామం. ఈ విభ్రాంతి శిక్ష పడ్డందుకు కాదు, నేరం ఏవిధంగా నిరూపించబడిందీ అన్నందుకు. సాక్షులు ఆరేళ్ళ వరకూ కాపాడబడి, కోర్టులో ఖండితమైన తీర్పు వచ్చే విధంగా ప్రాసిక్యూషన్‌తో పాటు, దర్యాప్తు చేసిన పోలీసు అధికారుల నేర్పరితనం ఎవరైనా మెచ్చుకోక తప్పదు! ఈ కేసులో పై కోర్టులలో కూడా అప్పీళ్ళను అధిగమించి అదే శిక్షను ఖరారు చేస్తే, సాత్తాన్‌కుళం పోలీసుస్టేషన్ కేసుగా పేరు తెచ్చుకున్న ఈ కేసు క్రిమినల్ న్యాయశాస్త్ర పాఠాలలో ఒక ‘కేస్‌ స్టడీ’గా చరిత్రలో నిలిచిపోతుంది!

ఇలాంటి కేసుల్లో బాధితుల కుటుంబాలు, సాక్షులూ ఎన్నో కష్టనష్టాలను, ప్రలోభాలను అధిగమించి, పూర్తి సహకారాన్ని ఇచ్చారంటే వారిని అభినందించక తప్పదు! రెండో అంశం జ్యుడీషియరీ– మరణశిక్షను మరిచిపోరాని తీర్పుగా నిందితులకు ఇవ్వటం వల్ల, పోలీసుస్టేషన్లలో ‘లాకప్ డెత్‌’లు కనుమరుగయ్యే అవకాశం ఉంది. చట్టాలను తాము చేతుల్లోకి తీసుకుంటే విపరీత పరిణామాలు ఎదుర్కోక తప్పదు అన్న గుణపాఠాన్ని పోలీసులు నేర్చుకున్నవారవుతారు! ఎంతమంచి పేరు సంపాదించుకున్నా, స్టేషన్‌లో జరిగే మరణాల వల్ల ఆ పేరు మటుమాయమై, చెడ్డ పేరు మోయాల్సి వస్తుంది! దర్యాప్తు అధికారులు శ్రమించి, సాక్ష్యాల సేకరణ, వాటిని కాపాడుకోవటంలో శ్రద్ధ వహించటం వల్ల, ప్రాసిక్యూషన్ వారు సాక్ష్యాలను కోర్టులలో డిఫెన్స్ వారు తిప్పికొట్టలేని రీతిలో ప్రవేశపెట్టటంతో ఈ అరుదైన శిక్ష సాధ్యమయింది!

అమాయకుడైన వ్యాపారస్థుడు జయరాజ్‌ను, అతని కొడుకు బెనిక్స్‌ను సాత్తాన్‌కుళం పోలీసు స్టేషన్‌లో (తూత్తుకూడి, తమిళనాడు) ఆరేళ్ల క్రితం చిత్రహింసలు పెట్టారు. ఆ హింసకు వారిద్దరూ బలయ్యారు. జయరాజ్‌ను కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు కస్టడీలో పెట్టి కొడుతున్నప్పుడు, కొడుకు బెనిక్స్ తన తండ్రిని నిష్కారణంగా ఎందుకు కొట్టారని పోలీసులను ప్రశ్నించాడు. దాంతో ఇద్దరి దుస్తులు ఊడతీసి, దారుణంగా రాత్రివేళ కొట్టారు! పైగా వారి శరీరాల నుంచి వచ్చిన రక్తాన్ని వారి చేతే కడిగించారు, వారి దుస్తులతోనే శుభ్రం చేయించారు! ఆ తర్వాత ఒక ఎఫ్ఐఆర్‌ను తప్పుల తడకగా నమోదుచేసి, లేనిపోని సెక్షన్లు పెట్టి, గవర్నమెంట్ డాక్టర్ దగ్గర ప్రవేశపెట్టి, ‘ఫిట్ ఫర్ రిమాండ్‌’ అని ఆయనతో తప్పుడు రిపోర్టు సంపాదించి, మేజిస్ట్రేట్ ముందు ఉంచారు.


జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కూడా మెకానికల్‌గా జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు! చివరకు వారు చనిపోవటంతో, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మదురై పోలీసుస్టేషన్‌ను పరిశీలించి పరిస్థితుల అవకతవకలను గుర్తించారు. జస్టిస్ సి.యన్. ప్రకాశ్‌, జస్టిస్ పుహలేంది (మదురై హైకోర్టు) కేసును సుమోటోగా గుర్తించి పోలీసుస్టేషన్‌ను, సాక్ష్యాధారాలను జాగ్రత్తపర్చటానికి తమ ఆధీనంలోకి తీసుకొమ్మని రెవెన్యూ అధికారులకు ఒక అసాధారణ ఆర్డర్ ఇచ్చారు! రేవతి అనే హెడ్‌ కానిస్టేబుల్ తన సహచర పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటంతో కేసు పెద్ద మలుపు తిరిగింది! సీబీఐ కేసు దర్యాప్తులో సేకరించిన రక్తపు శాంపిల్స్, బాధితుల డీఎన్‌ఏ మ్యాచ్ అయ్యాయి! నేర సమయంలో ఇద్దరు బాధితులు, నిందితులు ఒకేచోట ఉన్నారని కాల్ డేటా రికార్డులు ధ్రువపర్చటంతో కేసులో బలం చేకూరింది!

మరణశిక్ష పడేనాటికి పదిమంది నిందితులలో ఒకరు కోవిడ్ సమయంలో చనిపోయారు. తొమ్మిది మందికి ట్రయల్ కోర్టు శిక్ష విధించింది! నిందితులందరి తప్పు సమస్థాయిలో ఉందని కోర్టు ఒక్కొక్కరి తప్పిదాన్ని వేలెత్తి చూపకుండా శిక్ష విధించటం విశేషం!

సాక్షుల వివరాలు పరిగణనలోకి తీసుకుంటే, సైంటిఫిక్ ఎవిడెన్స్– ప్రత్యక్ష సాక్షి స్టేట్‌మెంట్ (రేవతి)తో పాటు సర్కమస్టాన్షియల్ సాక్ష్యాలు అంత బలహీనంగా లేవని ఏ దర్యాప్తు అధికారి అయినా చెబుతారు. కానీ డాక్టర్ రిపోర్టు ‘ఫిట్ ఫర్ కస్టడీ’ రిమాండ్, మెజిస్ట్రేట్ మెకానికల్ రిమాండ్ సాక్ష్యాలకు కొంచెం ఇబ్బంది కలిగించేట్లుగా ఉన్నాయి. లాకప్ డెత్ కేసులో మరణశిక్షలు విధించటం చాలా తక్కువ! అందుకే ఈ కేసు అందరి దృష్టినీ ఆకర్షించింది! పై కోర్టులు వీరిలో కొందరికైనా శిక్షలు ధ్రువీకరిస్తే పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి!

‘లాకప్ డెత్‌’లు జరగకుండా ఉండాలంటే ఉన్నతాధికారులు స్టేషన్లలోని లాకప్‌లలో తరచూ ఆకస్మిక తనిఖీలు జరపాలి! ఈ అంశంపై ట్రైనింగ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాలి! అన్నిటికి మించి చట్టాన్ని అమలుపరచే పోలీసులు ఆ చట్టమే తమకు శిక్షలు విధించే పరిస్థితి తెచ్చుకోకూడదు!

రావులపాటి సీతారాంరావు

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని మృతదేహం

వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Updated Date - Apr 18 , 2026 | 03:33 AM