Share News

T L Kantar Rao: సంప్రదాయానికీ అభ్యుదయానికీ విమర్శనా వారధి

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:26 AM

అతనొక మంచి అధ్యయనశీలి. అభ్యుదయ సాహిత్య విమర్శకుల్లో గణింపదగ్గ వ్యక్తి. సాహిత్యం ఎరిగిన వారే మ‍రచిపోయిన సాహితీవేత్త. పేరు చెప్పగానే సినిమానటుడు గుర్తుకువచ్చే ప్రమాదం ఉన్న రచయిత..

T L Kantar Rao: సంప్రదాయానికీ అభ్యుదయానికీ  విమర్శనా వారధి

అతనొక మంచి అధ్యయనశీలి. అభ్యుదయ సాహిత్య విమర్శకుల్లో గణింపదగ్గ వ్యక్తి. సాహిత్యం ఎరిగిన వారే మ‍రచిపోయిన సాహితీవేత్త. పేరు చెప్పగానే సినిమానటుడు గుర్తుకువచ్చే ప్రమాదం ఉన్న రచయిత. ఆయన టి.ఎల్. కాంతారావు.

‘‘మంచి చెడులను సమదృష్టితో వీక్షించలేని బలహీనత విమర్శలో ప్రవేశించి అది క్రమంగా ప్రక్రియను కూడా బలహీనం చేసేటంత దుస్థితికి దిగజారుతుంది.’’

‘‘ఏ మహాకవికైనా ఉండవలసిన లక్షణాలు రెండే రెండు. ఒకటి– తనకు పూర్వమున్న సమాజంలో ఉద్భవించిన సాహిత్య ప్రక్రియల సంపూర్ణ అవగాహన. రెండు– తన కాలంనాటి సాంఘిక పరిస్థితుల ప్రాబల్యం, భవిష్యత్కాలంలో వికసించవలసిన సంఘ స్వరూపం – ఈ రెంటి సమ్మేళనం వలన ఆ కవి యొక్క సిద్ధాంతభావన అనితరసాధ్యంగా కవిత్వంలో రూపుకట్టడం.’’

– ఇటువంటి గుర్తుంచుకోదగ్గ వ్యాఖ్యలు, నిర్వచనాలు అనేకం చేసిన కాంతారావు గారి గురించి ఈ కొన్ని మాటలు.

తెలుగుసాహిత్యం కొందరు కవులను, రచయితలను విస్మరించినట్టే విమర్శకులనూ మర్చిపోయింది. అందులోనూ సహృదయంతో, సమన్వయంతో, సమతూకంతో విమర్శించేవారిని మరిచిపోవడం సులువు కూడ. అలాంటి సమన్వయశీలి అయిన విమర్శకులు టి.ఎల్. కాంతారావు.

కాంతారావు ఎక్కువ చదివారు. తక్కువ రాశారు. 1943లో జన్మించి, 1990లో మరణించిన ఆయన విమర్శనే తన సాహిత్యప్రక్రియగా ఎంచుకున్నారు. ఆయన రచించిన ఐదు విమర్శ గ్రంథాల్లోనూ సాహిత్య పాఠకులు, కవులు, రచయితలకు మాత్రమేకాక, విద్యార్థులకు కూడా తెలుసు కోవలసిన అంశాలుంటాయి. ఈ పుస్తకాల్లో ఒక్క ‘సాహిత్యంలో సంప్రదాయం–ప్రగతి’ని చూసినా ఇది అర్థమవుతుంది. దీని తొలి ప్రచురణ 2009లో జరిగింది. 27 వ్యాసాల ఈ సంకలనంలో సగానికి పైగా శ్రీశ్రీ పైనే. ఈ చిన్న వ్యాసం ఈ పుస్తకానికే పరిమితం.


కాంతారావుగారి విమర్శలో ప్రధాన గుణాలు స్పష్టత, సరళత. ఎంచుకున్న విషయంలోకి సూటిగా వెళ్లడం, తన అభిప్రాయాలను సోదాహరణంగా చెప్పడం, వాటి సమర్థనకు అవసరమైన ఆధారాలు చూపడం. తన వ్యాఖ్యలకు పాఠ్యంలో నుంచే అంతర్గత సాక్ష్యాలను విరివిగా ఇవ్వడం. ఇక విమర్శలో ఆయన బలమూ, బలహీనతా శ్రీశ్రీయే.

‘‘భూతభవిష్యత్ వర్తమానాల సమ్యగ్దృష్టిలోంచి అతి లోకోత్తరమైన సవ్యసృష్టిని చేయగలిగినవాడు మాత్రమే యుగకర్త కాగలడు.’’ –శ్రీశ్రీని యుగకర్తగా ప్రతిపాదిస్తూ ఆయన చెప్పిన మాటలివి. బహుశా శ్రీశ్రీ లాగే వీరు కూడా ‘‘సంప్రదాయం నిలిచే వుంటుంది హమేషా’’ అని నమ్మారు. అందుకే– ‘‘సత్సంప్రదాయం ఎప్పుడూ మార్పును అంగీకరిస్తుంది. సంప్రదాయ శబ్దం విపులార్థంతో కూడుకుని ఉంది. మనకిష్టంలేనివారిని దూషించడానికి, ఇష్టంలేని ప్రక్రియల్ని తిరస్కరించడానికి ఆ శబ్దాన్ని అడ్డం పెట్టుకోడం ఆత్మవంచనకన్న మహాఘోరం’’ అన్నారు. సంప్రదాయం గురించి ఇలా చెప్పిన అభ్యుదయ విమర్శకులు అరుదే.

‘‘సంప్రదాయం సజీవమైనదో, నిర్జీవమైనదో నిర్ణయించేటప్పుడు ప్రామాణికంగా గ్రహించవలసిన అంశం ఆ కాలంలో ఆనాటి వ్యవస్థలో నివసిస్తున్న శతాధిక ప్రజాహృదయాల స్పందన’’ అనడంలో సంప్రదాయనిరసన మొదట ప్రజల్లోంచే వస్తుందనీ, కేవలం కొందరు సంస్కర్తల వల్ల కాదనీ, ప్రజల చైతన్యమే సంస్కర్తలకు ప్రేరణ కలిగిస్తుందనీ స్పష్టంగా చెప్పారు. సంప్రదాయమంతా చెడ్డది కాదని చెబుతూ, మూర్ఖసంప్రదాయం అనే ఒక విభజన చేసి, అది ఎలాగూ సహజంగానే చచ్చిపోతుందని ఆయన నిర్ద్వంద్వంగా చెప్తారు. సంప్రదాయంపై ఆయన ప్రకటించిన అభిప్రాయాల వెనక టి.ఎస్. ఎలియట్ ప్రభావం వాచ్యంగానూ, వ్యంగ్యంగానూ మనకు కనిపిస్తుంది.

అలాగే ఎక్కువమంది అభ్యుదయవిమర్శకులు భావించినట్టు ప్రాచీన కవులకు ఏ దృక్పథమూ లేదని కాంతారావు ఒప్పుకోరు: ‘‘ప్రాచీన కవులు, ఇప్పటి కవులు విశ్వశ్రేయస్సునే కాంక్షించారుగానీ, మార్గాల్లో మాత్రమే భేదం. ఆనాడు వారు విశ్వసించిన సమాజం వేరు. ఈనాడు వీరు అభిలషించిన సమాజం వేరు,’’ అని ఒకచోట, మరో సందర్భంలో, ‘‘ప్రాచీనాంధ్ర కవులంతా మతం, రాజకీయం, భక్తి మొదలైన సిద్ధాంత దృక్పథాలతో కవిత్వం రాసినవారే. వారి కవిత్వంలో సిద్ధాంత దృక్పథరాహిత్యమే ఉన్నట్లయితే, వారు కూడా కవిత్వం, కవిత్వం కోసమేనని రాసి ఉన్నట్లయితే మనం ఈనాడు వారి పేర్లు చెప్పుకొనవలసిన అవసరం కూడా ఉండేది కాదు,’’ అని అంటారు.


శ్రీశ్రీ పై ఈగవాలనివ్వని ప్రేమ కాంతారావుగారిది. కానీ తనకు శ్రీశ్రీలో నచ్చని విషయాన్ని చెప్పకుండా ఉండలేని నిజాయితీ కూడా. గూటాల కృష్ణమూర్తిగారి ‘మహా ప్రస్థానం’ ప్రచురణలో చలం యోగ్యతాపత్రం లేకపోవడాన్ని శ్రీశ్రీ ఖండించకపోగా, అది లేకపోవడం లోపం కాదని అనడాన్ని కాంతారావు క్షమించలేకపోయారు. అది ఖచ్చితంగా లోపమే అని తీర్మానించారు.

శ్రీశ్రీ తర్వాత బహుశా ఆయన మెచ్చిన కవి తిలక్. ఆయన తిలక్‌ని వచనకవిత సామర్థ్యాన్ని సమగ్రంగా ఆవిష్కరించిన కవిగా గుర్తించారు. కానీ అతనిలో సిద్ధాంత దృక్పథం లేదని తీర్మానించారు: ‘‘వచన కవిత్వంలో అనేక భావాలు చెప్పవచ్చు అని రుజువు చేసినవాడు తిలక్. తదాదిగా వచన కవిత్వం సమాజంపట్ల ప్రాచీన భావాలు కలిగిన కవులకు, ఆధునిక భావాలు కలిగిన కవులకు, అసలు ఒక స్పష్టమైన భావమే లేని కవులకు కూడా కవితా వాహికగా మారింది,’’ అని ప్రశంసిస్తూ తిలక్ లోని నిరాశావాదాన్ని ఖండిస్తారు. అది సిద్ధాంతరాహిత్యం వల్లే వచ్చిందని తీర్పు కూడ చెప్తారు. ‘‘అభ్యుదయ కవులకు భవిష్యదాశావాదం ప్రాణప్రదమైన లక్షణం కాగా తిలక్ భవిష్యన్నిరాశావాదం పరాకాష్టస్థితి నందుకున్నది,’’ అంటారు.

కాంతారావుగారికి ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయోగవాది అని సరిపెట్టుకుందామనుకున్నా, ఎంత అభ్యుదయ కవిగా (ముఖ్యంగా రూపంలో) ఒప్పుకున్నా, పఠాభినీ, ఆయన ‘ఫిడేలు రాగాల డజన్‌’నీ మెచ్చుకోవడం మాత్రం వల్ల కాలేదు. అలా ఆయన క్షమించలేకపోయిన మరో వ్యక్తి మిరియాల రామకృష్ణ. ఆయన మెచ్చిన ఇతర కవులు పురిపండా, చెరబండరాజులు.

శషభిషలు లేకుండా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పే సహజగుణంతో మినీకవితను ఆయన విశ్లేషించిన తీరు ఒప్పిస్తుంది. మినీకవిత రూపం వెనక ఎటువంటి సైద్ధాంతికతా లేవని ఆయన తేల్చేశారు. ‘‘మినీ కవిత ఆవిర్భావానికి చారిత్రక దృష్టి కాని, సామాజిక అవసరం కాని లేవు. పత్రికల స్థలాభావం వలన వలస మినీ కవిత పుట్టింది’’. అది వచనకవితకు మరో రూపం మాత్రమే అన్నారు.

మార్క్సిస్టు విమర్శకులపై నిత్యం వినిపించే ఆరోపణ వారికి వస్తుదృష్టేకానీ, రూపం పట్ల అవగాహన లేదన్నది. ఈ అభిప్రాయాన్ని కాంతారావు ఖండించారు. మార్క్సిస్ట్‌ విమర్శలో వస్తురూపాలు రెండూ ముఖ్యమేనంటూ, ‘‘మార్క్సిస్టు విమర్శలో రూపాన్ని గురించి ఆలోచన అత్యంత విలువైనది. నినాదప్రాయమైన అభ్యుదయకర వస్తువుని తీసుకున్న రచన, మార్క్సిస్టు విమర్శకుని దృష్టిలో ఉత్తమ రచన కాదు... మార్క్సిస్టు విమర్శకుడు కళాత్మకమైన విలువల్ని విస్మరిస్తాడనే వాదం ప్రగతి నిరోధకుల వాదమే కాని ప్రగతివాదుల సిద్ధాంతం కాదు,’’ అని స్పష్టం చేశారు. ఆయన తన విమర్శలో రెండిటినీ పట్టించుకున్న మాట కూడ నిజమే. కానీ అందరూ ఆయనలా రాశారా అన్నది కూడా సందేహాస్పదమే.


కాంతారావుగారి శైలిలో సూత్రప్రాయవాక్యాల రచన ప్రత్యేకం: ‘‘మహాప్రస్థానంలోని గేయాలు విమానవేగంతో సమానమైనవైతే మరోప్రస్థానంలోని గేయాలు కాలినడకతో సమానమైనవి’’; ‘‘అటు సమాజంలోను, ఇటు సాహిత్యంలోను సమూల మైన మార్పును కోరేవారు మాత్రమే ఆధునికులు’’; ‘‘ప్రజా కవిత్వమంటే ప్రజలకొరకు రాసే కవిత్వం! వారికి అర్థమయ్యే రీతిలో ఉండే కవిత్వం. పీడిత ప్రజలు అనేక స్థాయిలలో ఉన్నారు కనుక అనేక స్థాయిలలో ఉండే కవిత్వం అంతా ప్రజాకవిత్వమే అవుతుంది’’ – ఇలా, పాఠకుల మెదడుకు పదును పెట్టే విశ్లేషణలు కాంతారావు గారివి.

మృణాళిని

(జనవరి 10న రవీంద్రభారతిలో టి.ఎల్‌‌. కాంతారావు

సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ సందర్భంగా)

ఇవీ చదవండి:

క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Updated Date - Jan 05 , 2026 | 06:30 AM