మూర్తీభవించిన జాతీయ సమైక్యత
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:25 AM
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు వినగానే దేశభక్తి, సిద్ధాంత నిబద్ధత, జాతీయ సమైక్యత మనకు గుర్తుకొస్తాయి. 1943లో బెంగాల్‌లో సంభవించిన భయంకర కరవులో లక్షలాది ప్రజలు ఆకలి, పోషకాహార లోపంతో...
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు వినగానే దేశభక్తి, సిద్ధాంత నిబద్ధత, జాతీయ సమైక్యత మనకు గుర్తుకొస్తాయి. 1943లో బెంగాల్‌లో సంభవించిన భయంకర కరవులో లక్షలాది ప్రజలు ఆకలి, పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోయినప్పుడు, బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ప్రశ్నించిన నాయకుడు ఆయన. ఆ సమయంలో బెంగాల్ ఆర్థికమంత్రిగా ఉన్న ముఖర్జీ, బాధితులకు తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. స్పందన లేకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి స్వయంగా రిలీఫ్ కార్యక్రమాలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిధులు సేకరించి కరవు బాధితులకు అండగా నిలిచారు.
ఆయన మరణానంతరం అప్పటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నివాళులర్పిస్తూ, ‘‘మౌనంలోనే అత్యంత క్రూరమైన అసత్యాలు వ్యాపిస్తాయి, అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా ఒక నేరమే, ప్రజా జీవితంలో ఆయన తన అంతరంగ విశ్వాసాలను వ్యక్తపరచడానికి ఎప్పుడూ వెనుకాడలేదు’’ అని పేర్కొనడం ముఖర్జీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
1901 జూలై 6న కలకత్తాలో జన్మించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిన్న వయస్సు నుంచే అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఇంగ్లీషులో బీఏ ఆనర్స్, బెంగాలీలో ఎంఏ, లండన్‌లో న్యాయశాస్త్రం అభ్యసించి బారిస్టర్‌గా నమోదు అయ్యారు. కేవలం 33 ఏళ్లకే కలకత్తా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టడం ఆయన మేధస్సుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం, సామ్యవాదం ప్రభావం పెరుగుతున్న కాలంలో దేశ సమైక్యతకు, జాతీయ ప్రయోజనాలకు జాతీయవాదమే సరైన మార్గమని ఆయన విశ్వసించారు. కలకత్తాలోని ప్రముఖ న్యాయవాది నిర్మల్ చంద్ర ఛటర్జీ, వీర్ సావర్కర్ పర్యటన సందర్భంగా నగరంలోని మేధావుల కోసం ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖర్జీని ఆహ్వానించారు. వీర్ సావర్కర్ ఆలోచనల ప్రభావంతో ముఖర్జీ జాతీయవాద ఉద్యమంలో చురుకుగా పాల్గొని, అఖిల భారత హిందూ మహాసభతో కలిసి పనిచేశారు. 1929లో శాసనమండలికి ఎన్నికైన ముఖర్జీ, తరువాత బెంగాల్ ఆర్థికమంత్రిగా సేవలందించారు. 1946లో మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్థాన్ కోసం ప్రకటించిన ‘డైరెక్ట్ యాక్షన్ డే’ అనంతరం కలకత్తా, నౌఖాళీ, తిప్పర్ ప్రాంతాల్లో చెలరేగిన మతహింస దేశాన్ని కుదిపేసింది. ముస్లిం మతోన్మాదం వల్ల దాదాపు 20వేల మందికి పైగా హిందువులు ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలో దీనిని ‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’గా పేర్కొంటారు. ఆ సమయంలో బాధితుల్లో విశ్వాసం నింపేందుకు, సామాజిక శాంతి నెలకొల్పేందుకు ఆయన కృషి చేశారు.
1947లో రాజ్యాంగ సభ సభ్యునిగా భారత రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం మహాత్మాగాంధీ సూచనతో జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమలు, సరఫరాలశాఖ మంత్రిగా చేరారు. స్వతంత్ర భారతదేశ తొలి పారిశ్రామిక విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. భారీ పరిశ్రమలతో పాటు చిన్న, కుటీర, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. హ్యాండ్లూమ్, హస్తకళలు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తీసుకున్న చర్యలు దేశ ఆర్థిక నిర్మాణానికి బలమైన పునాది వేశాయి. అయితే తూర్పు పాకిస్థాన్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆయనను తీవ్రంగా కలచివేశాయి. శరణార్థుల సమస్య, మైనారిటీల భద్రత విషయంలో భారత ప్రభుత్వం మరింత దృఢంగా వ్యవహరించాలని ఆయన కోరారు. నెహ్రూ–లియాకత్ ఒప్పందంపై తీవ్ర అభిప్రాయ భేదాలు ఏర్పడటంతో 1950లో కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు.
దేశ రాజకీయాలకు ఒక ప్రత్యామ్నాయ జాతీయవాద దిశను అందించాలనే సంకల్పంతో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్‌సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ (గురూజీ)తో కలకత్తాలో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ చర్చల ఫలితంగా 1951లో ఢిల్లీలో జన్‌సంఘ్‌ను స్థాపించారు. జన్‌సంఘ్ నిర్మాణానికి అంకితభావం కలిగిన సంఘ్ ప్రచారక్‌లను ముఖర్జీకి గురూజీ అందించారు. వారిలో దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయి, నానాజీ దేశముఖ్, సుందర్‌సింగ్ భండారి, జగన్నాథరావు జోషి, కుశాభావ్ ఠాక్రే వంటి ప్రముఖులు ఉన్నారు. వీరందరూ జనసంఘ్‌ను దేశవ్యాప్త రాజకీయశక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. 1952 తొలి సాధారణ ఎన్నికల్లో జనసంఘ్ పరిమిత వనరులతో పోటీ చేసి, మూడు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. సభ్యుల సంఖ్య తక్కువైనా, ముఖర్జీ ప్రతిపక్ష స్వరాన్ని బలంగా వినిపించారు. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు వాస్తవాలు, తర్కం, హాస్యచతురతతో నిండి ఉండేవి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు హిరెన్ ముఖర్జీ వంటి నాయకులు ముఖర్జీ వాదనల పట్ల శ్రద్ధాసక్తులు కనబరిచేవారు. రాజకీయ భేదాలు ఉన్నా, ప్రత్యర్థులు కూడా ఆయన మేధస్సును గౌరవించేవారు. దేశ విభజన అనంతరం జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, భారత పౌరులు అక్కడికి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి అవసరమవడం ముఖర్జీని తీవ్రంగా కలచివేసింది. ‘‘ఒకే దేశంలో రెండు విధానాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండవు’’ అనే ఆయన నినాదం దేశవ్యాప్తంగా మారుమోగింది. కశ్మీర్ సంపూర్ణ విలీన ఉద్యమంలో భాగంగా 1953లో కశ్మీర్‌కు బయలుదేరిన ఆయనను అరెస్టు చేసి శ్రీనగర్‌లో నిర్బంధించారు. 40 రోజుల నిర్బంధం అనంతరం 1953 జూన్ 23న అనారోగ్యంతో ముఖర్జీ మరణించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 52 ఏళ్లు మాత్రమే. పిన్న వయసులోనే ప్రతిభ చూపిన ఒక గొప్ప జాతీయవాద నాయకుడిని దేశం కోల్పోయింది.
డాక్టర్ ముఖర్జీ నాటిన చిన్న విత్తనమే భారతీయ జనతా పార్టీ అనే మహావృక్షంగా ఎదిగి, ఆయన భావజాలాన్ని వ్యాపింపజేసింది. 2019లో ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయంతో ఆర్టికల్ 370 రద్దు కావడం ఒక చరిత్రాత్మక ఘట్టం. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని అది మరొకసారి ప్రపంచానికి స్పష్టం చేసి పాకిస్థాన్‌కు కనువిప్పు కలిగించింది. ఆర్టికల్ 370 రద్దుతో ముఖర్జీ కన్న ఒక కల నెరవేరినట్లయింది.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నది– ‘పదవుల కోసం కాదు, సిద్ధాంతాల కోసం జీవించిన నాయకులు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు’ అని. ఆయన త్యాగం ఒక వ్యక్తి గాథ కాదు– భారత జాతీయ సమైక్యత కోసం సాగిన ఒక మహాయజ్ఞం. భారతమాతకు అంకితమైన ఆ మహనీయునికి నా వినమ్ర నివాళులు.
బండారు దత్తాత్రేయ
మాజీ గవర్నర్
(నేడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి)
ఇవి కూడా చదవండి..
‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News