‘‘కథల నేపథ్యాలు చాలా పర్సనల్’’
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:33 AM
స్వాతికుమారి ‘అరసున్నా’ పుస్తకంలోని కథలు మన అంతరంగంలో మూసేసిన ఎన్నో ప్రశ్నల ద్వారాలను, జవాబులను, రహస్య భావ ప్రపంచాన్ని...
స్వాతికుమారి ‘అరసున్నా’ పుస్తకంలోని కథలు మన అంతరంగంలో మూసేసిన ఎన్నో ప్రశ్నల ద్వారాలను, జవాబులను, రహస్య భావ ప్రపంచాన్ని ఒక్కసారిగా తట్టి లేపి మన ముందే నగ్నంగా నిలబెడతాయి. ఈ పుస్తకం ప్రచురణ సందర్భంగా రచయిత్రితో ఆమె కథల గురించి చిరు సంభాషణ.
మీ రచనల్లో అస్తిత్వవేదన ఎక్కువ కనబడుతుంది. దాని గురించి మీ మాటల్లో...
సంస్కృత, పాలి భాషల్లో ‘వేదన’ అనే పదానికి అనుభూతి, భావ సంచలనం అనే అర్థాలున్నాయి. బౌద్ధం ప్రకారం సుఖ, దుఃఖ, తటస్థ భావనలు మూడిటినీ వేదన అనే పిలుస్తారు. మీ ప్రశ్నలో ‘‘జీవించి ఉండటంలోని నొప్పి’’ గురించి అడిగారని అనుకుంటున్నాను. ఐతే, నా కథల్లో పైన చెప్పిన మూడు స్థితుల్లోని గాఢతని, లోతుని అందుకోవడానికి ప్రయత్నం చేశాను. దుఃఖం గురించిన ప్రస్తావన కూడా ఎక్కువే చేశాను. ఐతే ఇది సంఘటనలు, పరిస్థితుల్లో మార్పుల వల్ల కలిగేది మాత్రమే కాదు. మనుషులుగా పుట్టినందుకు, అవాంఛితంగానే కొన్ని సంస్కారాలు మనకి ఏర్పడినందుకు, వాటి మూలాలు తెలీక పైపై పరిష్కారాలు వెతుక్కుని నిరాశపొంది, పట్టు విడవకుండా తిరిగి ప్రయత్నం చెయ్యడమే జీవించడంలోని సారం అనిపిస్తుంది. అదే నా కథల్లో కనపడి ఉండచ్చు.
మీ రచన, వాక్యం పాఠకుణ్ణి బాగా చదివించేవిగా ఉంటాయి. కానీ కథా వస్తువు గురించీ కథకు ఉండాల్సిన నిర్దిష్ట శైలికి న్యాయం చేయలేకపోతున్నానని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
కథకు ఫలానా శైలి ఉండాలనే నియమం లేదు. చరిత్రలో సాహిత్య ప్రక్రియలు లెక్కలేనన్ని మార్పులకి లోన య్యాయి. ఏ కాలంలో ఐనా అప్పటి సామాజిక పరిస్థితులు, ఒంటరిగా వ్యక్తి లోనయ్యే సంఘర్షణలు, మానవ సంబంధాల్లోని మార్పులు ఇవన్నీ కలిసి రచయితల్ని సృష్టించుకుంటాయి. ఆ రచయితలకి తమదైన శైలి దానంతట అదే ఏర్పడుతుంది. తను కలిగించదల్చుకున్న భావనను, చేరవేయదలచుకున్న ఆలోచనలను తనదైన పద్ధతిలోనే చెప్పగలరు ఎవరైనా. క్లుప్తంగా చెప్పాలంటే ‘‘సారమే రూపాన్ని ఎంచుకుంటుంది’’.
మీ కథల్లో మీకు ఇష్టమైన కథ, దాని నేపథ్యం?
రచయిత ఒక్కమాట కూడా చెప్పకుండా అక్కడేం జరుగుతుందో చూపించాలని, రకరకాల నేపథ్యాల మను షుల్ని స్పష్టమైన తేడాలతో కళ్ళకి కట్టాలని చేసిన ప్రయత్నం ‘టూ ఎయిటీన్ డీ’– నాకు చాలా తృప్తినిచ్చిన రచన. కథ జరిగే ప్రదేశం, పాత్రల పరిచయం, వాళ్ల మనస్తత్వాలు, వాళ్ల ప్రవర్తనపై రచయిత మోరల్ కామెంట్స్, వాతావరణ చిత్రణ ఏవీ నేరుగా చెప్పకుండా కేవలం డైలాగ్స్ ద్వారా స్ఫురించజేయాలని ఆ కథలో ప్రయత్నించాను. ఐతే అది పాఠకులకి అంతగా నచ్చలేదనుకుంటాను. ఇంకోపక్క అప్రయత్నంగా ఒక రోజులో నా ఎమోషన్ ఎటు తీసుకెళ్తే అటు స్వేచ్ఛగా రాసిన ‘వాఙ్మూలం’ చాలామందికి ఇష్టమైన కథ. ‘జీవన సంధ్య’ కథ పూర్తవడానికి నాలుగేళ్ళు పట్టింది. ఆ ముసలాయన పాత్రతో కలిసి అన్నేళ్ళు ప్రయాణం చేశాకే మెల్లమెల్లగా స్పష్టత వచ్చింది. ఇక కథా నేపథ్యాలు చాలా పర్సనల్ అనుకుంటాను. కొన్ని కలల్లో వస్తాయి, కొన్ని సింబాలిక్‌గా చెప్తాము, మన అనుభవాన్నే యథాతథంగా రాసే సందర్భాలూ ఉంటాయి. ఒక్కోసారి ఇవన్నీ కలగలిసిపోతాయి. ఏ ఒక్కదానివైపూ వేలు చూపించి ఇదీ అని నిర్దిష్టంగా చెప్పలేము.
చుట్టూ సంఘటనలనే కథా వస్తువుగా తీసుకున్నారా, లేక ఊహించి రాసినవీ ఉన్నాయా?
రెండూ చెరిసగం. ఊహ లేకుండా అనుభవం, అనుభవం లేకుండా ఊహా ఉండవు. కావాలనుకున్నవి, వద్దనుకున్నవి, ఏదనుకున్నా చివరికి విధివశాన జరిగేవి అన్నీ కలిస్తేనే జీవితమైనా సాహిత్యమైనా. కాకపొతే సృజనలో ఒక లీలా వినోదం ఉంటుంది. వాస్తవంలో అది అన్నిసార్లూ ఉండకపోవచ్చు.
కథ రాయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి?
ఇతరుల ఆమోదం కోసం, మన్నన కోసం మీ రచనలో రాజీ పడొద్దు. రచయితకి అనుకంప చాలా ముఖ్యం. మన పాత్రలు ఎవరైతే వాళ్ళ జీవితాల్ని, మనసుల్ని నిజాయితీగా చూపించాలి. వాళ్ళు మనకి తెలీకపోతే సమయం తీసుకుని దగ్గరగా చూసి తెలుసుకోవాలి. రచయిత సొంత నమ్మకాలని, సమాజం మెచ్చుకునే విలువల్ని బలవంతాన పాత్రల నెత్తిన రుద్దనవసరం లేదు. రాత మీద చాలినంత ప్రేమ ఉంటే శైలి, శిల్పం వగైరా అవే వాటంతట అవి ఏర్పడతాయి. ప్రత్యేకంగా ప్రయత్నాలు చెయ్యక్కర్లేదు.
ఇంటర్వ్యూ యామినికృష్ణ బండ్లమూడి
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్..
ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్.