Share News

బహుజన విద్యపై సర్జికల్‌ స్ట్రయిక్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:53 AM

భారతదేశంలో ప్రజాస్వామ్యం అనే మాట ఇప్పుడు ఒక రాజకీయ ముసుగు మాత్రమే. దళిత–బహుజన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు, అదే వర్గాల పిల్లల భవిష్యత్తును పద్ధతిగా...

బహుజన విద్యపై సర్జికల్‌ స్ట్రయిక్‌

భారతదేశంలో ప్రజాస్వామ్యం అనే మాట ఇప్పుడు ఒక రాజకీయ ముసుగు మాత్రమే. దళిత–బహుజన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు, అదే వర్గాల పిల్లల భవిష్యత్తును పద్ధతిగా నాశనం చేస్తున్నారు! రాజ్యాంగం ‘అందరికీ విద్య’ అని చెప్పినా, ఈ రాజ్యం అమలు చేస్తున్నది మాత్రం– ‘అక్షరం అగ్రవర్ణాలకు, కార్పొరేట్ శక్తులకు మాత్రమే’ అనే అప్రకటిత విధానం. దేశమంతటా ప్రభుత్వ పాఠశాలల మూసివేత–విలీనం, టీచర్ ఖాళీలు, ప్రైవేటీకరణ– ఇవన్నీ యాదృచ్ఛిక పాలనా తప్పిదాలు కావు, బహుజన సమాజంపై నడుస్తున్న ఒక సర్జికల్ స్ట్రయిక్.

కర్ణాటకలో ‘కర్ణాటక పబ్లిక్‌ స్కూల్స్‌’ అనే ఆకర్షణీయమైన పేరుతో 40,000 ప్రభుత్వ పాఠశాలలను 6,000 కేంద్రాల్లోకి విలీనం చేస్తున్నారు. మొదటి దశలోనే 900 మాగ్నెట్ స్కూళ్లు. దీని అర్థం– గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది చిన్న స్కూళ్లను మూసి, పిల్లలను 1 నుంచి 5 కిలోమీటర్లు నడిచేలా చేయడం. దళిత, ఆదివాసీ, గిరిజన, పేద పిల్లలకు ఇది చదువు కాదు, ఒక అడ్డంకి. మధ్యప్రదేశ్‌లో బీసీ నాయకత్వం ఉన్నా, 2019 నుంచి 2025 వరకు 7,000కి పైగా ప్రభుత్వ స్కూళ్లు మూసేశారు లేదా విలీనమయ్యాయి. వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ‘సీఎం రైజ్‌ స్కూల్‌’ అనే పేరుతో స్కూళ్లను విలీనం చేసి, ఆర్‌టీఈ చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారు. పాలకుడి కులం మారినా, విధానం మారడం లేదు. తెలంగాణలో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. 2024–25లోనే 2,081 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉంది, ఇది దేశంలోనే అత్యధికం. 1,441 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు. మరో 640 స్కూళ్లు కూడా మూసివేత దిశలో ఉన్నాయి. పిల్లలు లేరని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎందుకు లేరు? టీచర్లు, వసతులు, భవిష్యత్తుపై విశ్వాసం లేదు కనుక. ఈ మొత్తం విధ్వంసానికి జాతీయ ఫ్రేమ్‌వర్క్ ఎన్‌ఈపీ–2020. ‘స్కూల్ రేషనలైజేషన్‌’, ‘ఒకేషనల్ ఎడ్యుకేషన్‌’ వంటి మధుర పదాల వెనుక, ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర ఉంది. 2019–24 మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 15,000 ప్రభుత్వ స్కూళ్లు మూతబడ్డాయి. దీని ప్రభావం ఎక్కువగా దళితులు, ఆదివాసీలు, గ్రామీణ పేదలు, బాలికలపై పడుతోంది. స్కూల్ దూరం పెరిగితే డ్రాప్–అవుట్ పెరుగుతుంది; డ్రాప్–అవుట్ పెరిగితే చౌక శ్రామికులు తయారవుతారు. ఇదే పాలకుల అసలు లక్ష్యం– ఆలోచించే పౌరులు కాదు, ఆజ్ఞలు పాటించే కూలీలు. ఇది పరిపాలనా సంస్కరణ కాదు; బహుజన సమాజంపై నడుస్తున్న ఒక క్లాస్ వార్.


భారతదేశంలో చిన్న వయసులో పిల్లలు స్కూల్‌లోకి వస్తున్నారు కానీ 9వ తరగతి దగ్గరే పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థ నుంచి బయటకు వెళ్తున్నారు. ఈ సంక్షోభం దేశవ్యాప్తంగా సమానంగా లేదు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత అనేది కేవలం ఒక భవనం తాళం వేయడం కాదు, అది ఒక తరం భవిష్యత్తును సమాధి చేయడం. బహుజన సమాజాన్ని శాశ్వతంగా బానిసలుగా ఉంచే రాజకీయ వ్యూహం ఇది. ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే. ఈ విద్యా విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రతి ప్రజాస్వామ్యవాది రోడ్డెక్కాలి.

– పాపని నాగరాజు, సత్యశోధక మహాసభ‍

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 03:53 AM