అనుభవం కూడా అర్హతే!
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:01 AM
2010కు ముందు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాయి. డీఈడీ, బీఈడీ, పండిత...
2010కు ముందు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాయి. డీఈడీ, బీఈడీ, పండిత శిక్షణ వంటి అర్హతలు, ప్రభుత్వ నియామక పరీక్షలు, మెరిట్ జాబితాల ఆధారంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగాల్లోకి వచ్చారు. ఆ సమయంలో టెట్ అనే వ్యవస్థ లేదు.
సాధారణంగా కొత్త చట్టాలు, కొత్త అర్హత ప్రమాణాలు భవిష్యత్తులో జరిగే చర్యలకు వర్తిస్తాయి. ఇప్పటికే చట్టబద్ధంగా పూర్తయిన ప్రక్రియలను తిరిగి కొత్త ప్రమాణాలతో అంచనా వేసే విషయంలో న్యాయస్థానాలు ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి. గతంలో సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో ‘లెజిటిమేట్ ఎక్స్‌పెక్టేషన్’, ‘నేచురల్ జస్టిస్’ సూత్రాలను ప్రస్తావించింది. అంటే అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగంలో చేరి, దీర్ఘకాలం సేవలందించిన వ్యక్తి హక్కులు, బాధ్యతలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు న్యాయబద్ధ పరిపాలనా సమతుల్యత అవసరం.
ఇటీవలి కాలంలో టెట్ అర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విస్తృత చర్చకు దారితీసింది. ఆర్‌టీఈ–2009 చట్టం అమలుకు ముందు నియమితులై, ఇంకా సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత సాధించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తిగతంగా ఉపాధ్యాయులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. అయితే సేవలో ఉన్న ఉపాధ్యాయుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టెట్ అర్హత సాధించేందుకు 2028, ఆగస్టు 31 వరకు గడువు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల మనసుల్లో ఒక ప్రశ్న మెదులుతోంది. ఉపాధ్యాయ విద్యా కోర్సులను పూర్తి చేసి, ప్రభుత్వాలు నిర్దేశించిన నియామక ప్రక్రియల్లో అర్హత సాధించి, దశాబ్దాల పాటు సేవలందించిన ఉపాధ్యాయులకు టెట్ ఒక్కటే అర్హతను నిర్ణయించే అంతిమ ప్రమాణంగా ఎలా పరిగణిస్తారు? ఉపాధ్యాయుడి పనితీరును కేవలం పరీక్షా మార్కులతో మాత్రమే అంచనా వేయడం సాధ్యమా?
జాతీయ విద్యా విధానం–2020 కూడా ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి ఉపాధ్యాయుడు ఏటా నిర్దిష్ట సంఖ్యలో శిక్షణా గంటల్లో పాల్గొనాలని సూచించింది. దీంతో విద్యా నాణ్యతను పెంచే ప్రక్రియ ఒకే పరీక్షతో ముగిసిపోదు; అది నిరంతర అభ్యాసం, శిక్షణ, మూల్యాంకనం, అనుభవం కలయిక. భవిష్యత్తులో విద్యా వ్యవస్థ మరింత సాంకేతికత ఆధారితంగా మారవచ్చు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ బోధన, వ్యక్తిగతీకరించిన అభ్యసన పద్ధతులు మరింత ప్రాధాన్యం పొందవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించే విధానాలు అవసరమే. అదే సమయంలో దశాబ్దాల అనుభవాన్ని కూడా విద్యా వ్యవస్థ గుర్తించాలి. టెట్ వంటి ప్రమాణాలు భవిష్యత్తు నియామకాలకు మార్గదర్శకం కావచ్చు. కానీ విద్యా వ్యవస్థను దశాబ్దాలుగా నిలబెట్టిన అనుభవాన్ని కూడా ఒక విలువైన అర్హతగా చూడాలి.
రఘుపాత్రుని శ్రీనివాసరావు,
శ్రీకాకుళం
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్