‘సుప్రీం’ తీర్పునూ లెక్కచేయరా!?
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:30 AM
భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో రెండు అంశాలలో మూడు తీర్పులు ఇచ్చింది. మొదటిది, ఎస్సీ రిజర్వేషన్ల ‘వర్గీకరణ’కు సంబంధించి ‘చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో...
భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో రెండు అంశాలలో మూడు తీర్పులు ఇచ్చింది. మొదటిది, ఎస్సీ రిజర్వేషన్ల ‘వర్గీకరణ’కు సంబంధించి ‘చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో రెండు తీర్పులు ఇచ్చింది. రెండవది, క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తింపు గురించినది. ఈ అంశంలో ‘చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో మూడవ తీర్పు ఇచ్చింది. కానీ ఈ మూడు తీర్పులనూ తెలుగు రాష్ట్రాలు పాక్షికంగానే అమలు చేస్తున్నాయి.
మొదటి తీర్పును అనుసరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లను 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 86 ద్వారా వర్గీకరించింది. దానిపై కొందరు హైకోర్టులో సవాలు చేయగా వర్గీకరణకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. మరలా దానిపై చెన్నయ్య సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. 2004లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం– రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయడం ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రాలకు ఈ అధికారం లేదని తీర్పునిచ్చింది. ఎస్సీ కులాలలో ఏవైనా కులాలు అభివృద్ధికి నోచుకోకపోతే ఆ కులాలను గుర్తించి వారి ప్రగతికి ప్రత్యేక పథకాల రూపకల్పన చేసి అమలు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పులో సూచించింది. రాష్ట్రప్రభుత్వం కోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణను రద్దు చేసింది గానీ, ఎస్సీ కులాల అభివృద్ధి విషయంలో కోర్టు ఇచ్చిన సూచనలను మాత్రం గాలికొదిలేసింది. అప్పటి తీర్పుపై ప్రభుత్వం కానీ, వర్గీకరణవాదులు కానీ ఇరవై ఏళ్లుగా రివ్యూ పిటిషన్ కూడా వేయని విషయాన్ని ఇక్కడ గమనించాలి.
2004లో వచ్చిన తీర్పులో సూచించినట్లు ప్రభుత్వ పథకాలు, విద్య ఉద్యోగ అవకాశాలు ఇప్పటివరకు అందకుండా వెనుకబడిన వారిని గుర్తించి, వారికోసం ప్రత్యేక పథకాల రూపకల్పన చేసి ఎందుకు అమలుపరచలేదు? అలా చేసి ఉంటే ఈనాటి తీర్పు అవసరం ఉండేది కాదు! కానీ రాజకీయ అవసరాల దృష్ట్యా 20 ఏళ్ల తర్వాత తిరిగి అదే అంశంపై రెండవసారి ఏడుగురు న్యాయమూర్తులు మరో తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి వర్గీకరణ అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి అని తీర్పు చెబుతూనే కోర్టు కొన్ని సూచనలు కూడా చేసింది. వాటిలో ఎస్సీ రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్ పాటించాలన్నది ఒక సూచన. ఎస్టీలలో కూడా వర్గీకరణ చేయాలన్నది మరో సూచన. రెండవసారి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణను మాత్రమే అమలుపరిచాయి. క్రీమీలేయర్ పాటించాలన్న సూచనను, ఎస్టీ వర్గీకరణను గాలికొదిలేశాయి.
రెండవ అంశంలో మూడవ తీర్పు– ‘చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో ఇచ్చినది. ఎస్సీలు మతం మారినప్పుడు వారికి ఎస్సీ రిజర్వేషన్ ‘వర్తింపు’ విషయమై ఈ తీర్పు వచ్చింది. తీర్పు ఆనంద్ విషయంలో ఇచ్చినప్పటికీ మతం మారిన ప్రతి ఎస్సీ వ్యక్తికీ రిజర్వేషన్ వర్తింపు అంశంపై పరిశీలన జరగాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఆనంద్‌కు మాత్రమే ఎస్సీ హోదా తొలగించి చేతులు దులుపుకుంది. ఈ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు మతం మారిన ప్రతి ఎస్సీ వ్యక్తికీ వర్తింపజేయాల్సి ఉండగా, అందుకు తగిన మార్గదర్శకాలను ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం మాత్రం మౌనం పాటించింది. సుప్రీం తీర్పుల అమలులో కూడా ఈ నిర్లక్ష్యం విచారకరం.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలోని దళితులందరూ ఒకదారిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో దళితులు మాత్రం మరోదారిలో ఉన్నారు. దేశంలో ‘మాదిగ’ సమీప కులాలైన చమర్ తదితర కులాలు అన్నీ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు మాత్రమే దీన్ని సమర్థిస్తున్నారు. మాల సామాజిక వర్గం వ్యతిరేకించడంతో ఇక్కడ వర్గీకరణ జరిగిన తీరుపై రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.
ప్రపంచంలో మతాలు వాస్తవం, హిందూ మతంలో కులాలు వాస్తవం. హిందూమతం పునాదే కులం. ఒకటి లేకుండా మరోదానికి పరిపూర్ణత లేదు. ఎస్సీ కులాలు దేశంలో దాదాపు పన్నెండు వందలున్నాయి. ఆయా కులాల మధ్యలో వ్యత్యాసాలు విభేదాలు ఉన్నప్పటికీ అంటరానితనం ప్రాతిపదికగా అన్నింటినీ సమాజమూ, ప్రభుత్వం ఒకటిగానే చూస్తాయి.
ఇప్పుడు క్రైస్తవంలో కులవివక్ష ఉన్నదా? ఉంటే దానికి ప్రాతిపదిక ఏమిటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హిందూ మతంలో ఉన్నట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు లేనప్పుడు కులం ఎలా ఉంటుంది అనేది అసలు ప్రశ్న. మతం మారినవారు ఇప్పటికీ హిందూ మతంలో తమకు లేని గౌరవాన్నీ సమానత్వాన్నీ పొందటానికి క్రైస్తవంలోకి మారినట్లు చెప్పుకుంటున్నారు. కానీ బైబిల్ ప్రకారం మానవుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. ఇదే విషయం సుప్రీంకోర్టు తీర్పులో బైబిల్ వాక్యం గలతీయులకు 3:28 వచనాన్ని పేర్కొనడం విశేషం. దాని ప్రకారం ‘యూదుడైనా, అన్యజనుడైనా, బానిసైనా, స్వతంత్రుడైనా, పురుషుడైనా, స్త్రీ ఐనా తేడా లేదు, ఎందుకంటే మీరందరూ క్రీస్తు యేసులో ఒక్కటే’. షెడ్యూల్డ్ కులాల వారు క్రైస్తవంలోకి మారితే 1950 ఆర్టికల్ 341 క్లాజు 3 ప్రకారం ఎస్సీ హోదా తక్షణం పూర్తిగా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుతో హిందూ ఎస్సీలకు భారీగా ప్రయోజనం కలుగుతుంది. పలువురు ఎమ్మెల్యే, ఎంపీల పదవులకు ఎసరు తప్పదు.
రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పులోని ఒక అంశాన్ని మాత్రమే అమలుపరచి మిగతా అంశాలను పక్కనపడేయటం సుప్రీంకోర్టు తీర్పులపట్ల వివక్షను పాటించడమే! ఈ అంశాలపై ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారాలు చూపాలి, లేదంటే తీర్పులపై తీర్పుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది.
మామిడి నారాయణ
సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!