Share News

హిందూ మతం వీడితే కుల దౌర్జన్యాలు భరించాలా?

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:05 AM

చింతాడ ఆనంద్‌పాల్ కేసులో మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు షెడ్యూల్ కులాలకున్న రాజ్యాంగ రక్షణపై సందేహం కలిగించేలా ఉంది. తనపై ఆధిపత్య కులస్థులు...

హిందూ మతం వీడితే కుల దౌర్జన్యాలు భరించాలా?

చింతాడ ఆనంద్‌పాల్ కేసులో మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు షెడ్యూల్ కులాలకున్న రాజ్యాంగ రక్షణపై సందేహం కలిగించేలా ఉంది. తనపై ఆధిపత్య కులస్థులు కులం పేరుతో దాడి చేశారని చింతాడ ఆనంద్ అనే పాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాపట్ల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లగా, షెడ్యూల్ కులాల ఆర్డర్ 1950 ప్రకారం.. క్రైస్తవంలోకి మారినప్పుడే షెడ్యూల్ కులం గుర్తింపును ఆనంద్‌ పూర్తిగా కోల్పోయాడని, అందువల్ల ఆయన ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేయడం కుదరదని చెప్పారు. అంటే క్రైస్తవంలోకి మారిన దళితులకు ఎస్సీ, ఎస్టీ చట్టం ఇచ్చే రక్షణలు వర్తించవు అని అర్థం.

నిజమే, రాష్ట్రపతి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు–1950 ప్రకారం, హిందూ మతంలో ఉన్నవారినే షెడ్యూల్ కులాలుగా పరిగణిస్తారు. దానికి 1936లో బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన ఎస్సీల జాబితా ప్రాతిపదిక. హిందూ మతంలో మాత్రమే కుల వివక్ష ఉందని, మతం మారితే వివక్ష ఉండదని పరోక్షంగా చెప్పడం నాటి వలస ప్రభుత్వానికి ఒక రాజకీయ అవసరం. ఈ వ్యూహం క్రైస్తవ మిషనరీల పనికి ఒక పరోక్ష సమర్థన. ఇస్లాంలో కులాలు, వివక్షలు లేవు అని నమ్మడం, ముస్లిం లీగ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల రీత్యా నాటి ప్రభుత్వానికి అవసరం.

బాబా సాహెబ్ అంబేడ్కర్ ‘దేశంలో షెడ్యూల్డ్ కులాల వారినందరినీ ఒకే సమూహంగా పరిగణించాలి’ అనే ప్రతిపాదన చేశారు. 1936లో రూపొందించిన జాబితాను దేశాధ్యక్షుడి చేత 1950లో చట్టబద్ధం చేయించాలని, దానికి మార్పులు, చేర్పులు చేసే అధికారం మాత్రమే పార్లమెంట్‌కు ఉండాలని ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగ అధికరణలు 341, 342లను రూపొందించారు. ఆ జాబితాను తయారు చేసే అధికారం పార్లమెంట్‌కు ఇస్తే దానికి సుదీర్ఘ కాలం పడుతుందని భావించి, బ్రిటిష్ ప్రభుత్వం పాటించిన పద్ధతినే కొనసాగిస్తూ 1950 నాటి షెడ్యూల్ కులాల జాబితాను రూపొందించారు.


కానీ 1956లో సిక్కు మతంలో ఉన్న దళితులను షెడ్యూలు కులాల జాబితాలో చేర్చారు. 1990లో బౌద్ధం స్వీకరించిన వారిలోనూ కులాలు, వివక్ష ఉందని గుర్తించి పార్లమెంట్ సవరణ ద్వారా షెడ్యూలు కులాల జాబితాలో చేర్చారు. ఈ రెండు సవరణలు ఏమి చెబుతున్నాయి? మానవ గౌరవానికి చాలా మెరుగైన స్థానం ఇచ్చిన సిక్కు మతం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన బౌద్ధం కూడా కుల వ్యవస్థ నుంచి తప్పించుకోలేకపోయాయి. వాటిలో ఉన్నవారిని కూడా షెడ్యూల్ కులాలుగా గుర్తించడం ద్వారా, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఇచ్చే ప్రత్యేక రక్షణలు వారికీ అందించే ప్రయత్నం జరిగింది. అంటే మతం మారితే కులం పోదు అనే సత్యాన్ని ప్రభుత్వాలు ఇప్పటికే అంగీకరించాయి. కానీ హిందూ మతం నుంచి మారి క్రైస్తవ, ఇస్లాం మతాలు స్వీకరించిన వారి కులాల గుర్తింపు మాత్రం అంతరించిపోతుందని నమ్మమంటోంది న్యాయస్థానం!

కానీ వాస్తవం వేరు. క్రైస్తవం స్వీకరించిన వారిని వారి కులాలు వెంటాడుతూనే ఉన్నాయి. క్రైస్తవంలోకి మారిన అగ్రకులస్థులు అక్కడా పెత్తనం, వివక్షను ప్రదర్శిస్తున్నారు. చర్చి లోపల కుడివైపు, ఎడమవైపు కూర్చునే వారి మధ్య ఉన్న కుల తేడాలు బహిరంగ రహస్యమే. క్రైస్తవ మతంలోనే కులాధారిత వివక్ష ఉంటే, ఆ మతంలోకి మారిన వారిపట్ల హిందూ ఆధిపత్య కులాలు చూపే వివక్ష గురించి చెప్పనే అక్కరలేదు. అందువల్ల దళితులే కాదు, ఇతర కులాల వాళ్ళు కూడా వివక్షకు, వేధింపులకు గురౌతారన్న విషయం చాలా స్పష్టం. కాబట్టి ఈనాడు హిందూ మతంలో ఉన్న షెడ్యూల్‌ కులాలకు మాత్రమే రాజ్యాంగ రక్షణ అవసరం అనే భావన సరైంది కాదు. ఈ సామాజిక వాస్తవానికి దూరంగా ఉన్న న్యాయమూర్తులు హిందూ మతంలో ఉన్నంతవరకే షెడ్యూల్ కులాలకు గుర్తింపు, రాజ్యాంగ పరమైన రక్షణలు ఉంటాయని తీర్పులిస్తున్నారు.

మతానికి, జెండర్‌కు, పుట్టుకకు, కులానికి అతీతంగా వివక్షకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు అధికరణ 15(1)లో ఉన్న తర్వాత, చట్టం ముందు సమానత్వం అనే భావన 14 అధికరణలో ఉన్న తర్వాత, క్రైస్తవంలోకి మారిన వారికి కులం లేదు కాబట్టి– ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ద్వారా రక్షణకు అర్హులు కారు అనడం, రాజ్యాంగానికి తప్పుడు వ్యాఖ్యానం చేయడమే. ప్రాథమిక హక్కులలోని 14వ, 15వ అధికరణలను తోసిరాజని 341వ అధికరణకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని రాజ్యాంగంలోని 13(1)వ అధికరణ ఆమోదించదు.


ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న ఏ చట్టమైనా చెల్లుబాటు కాదని అధికరణ 13(1) అంటుంది. 1950 జాబితాలో ఉన్న షెడ్యూల్‌ కులాల గుర్తింపు ద్వారా అతికొద్దిమందికి రాజకీయ ప్రాతినిధ్యం వహించే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన హక్కులు రావచ్చు. కానీ మతం మారినవారు కులం పేరుతో జరిగే అవమానాల నుంచి, కుల దౌర్జన్యాలు, వివక్ష నుంచి సమాన రక్షణ కోరడం వారి ప్రాథమిక హక్కు. హిందూ మతంలో ఉంటేనే షెడ్యూల్‌ కులాలకు గుర్తింపు, తద్వారా వివక్షకు వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ ఉంటుందనే వాదన రాజ్యాంగ నైతికతను ప్రతిబింబించడం లేదు.

చింతాడ ఆనంద్‌పాల్ కేసులో వివక్ష చూపారని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు క్రైస్తవులు కారు, హిందువులు. హిందువులలో మాత్రమే కులం ఉందని ఒప్పుకున్నా, ఈ కేసులో నిందితుల కులం మీద కదా చర్చ జరగాలి? బాధితుడి కులం మీద చర్చ న్యాయస్థానం ఎందుకు చేసినట్లు? ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కుల వివక్షకు వ్యతిరేకంగా వచ్చిన చట్టం కాబట్టి. అయితే దళితులు మతం మారినంత మాత్రాన, హిందువులు వారిని కులాతీతంగా చూస్తారని సుప్రీంకోర్టు అంటున్నదా?

గౌరవాన్ని, స్వేచ్ఛను, మనశ్శాంతిని కోరుకున్న ఎవరైనా మరో మతంలోకి మారవచ్చు లేదా నాస్తికులు కావచ్చునని రాజ్యాంగం అంటున్నది. నాస్తికురాలైన ఒక ఎస్సీ మహిళకు హిందూ, క్రైస్తవ మత జీవన విధానాలపై పట్టింపు లేదు అనుకుందాం. ఆధిపత్య కులానికి చెందినవారు ఆమెను కులం పేరుతో దూషణలకు, లైంగిక వేధింపులకు గురిచేస్తే, ఆమె హిందూ మతాన్ని నిరాకరించింది కాబట్టి, ఆమెకు ఎస్సీ పరిరక్షణ చట్టం కింద కుల గుర్తింపు లేదు, రక్షణ ఇవ్వలేం అని రేపు సుప్రీంకోర్టు అంటుందా? హిందూ మతాన్ని ఆచరిస్తూ కుల వివక్షకు గురైతే మాత్రమే రాజ్యాంగం వర్తిస్తుందని సుప్రీంకోర్టు అంటుందా?

సమాజం పాటిస్తున్న వివక్షలలో కులవివక్ష ఒక ప్రధాన రూపం. షెడ్యూల్ కులం గుర్తింపు ద్వారా, వ్యవస్థీకృతమైన వివక్ష పోవాలి. వారికి ప్రత్యేక రక్షణ ఉండాలి. అది హిందూ మతంలో ఉన్నందుకు తాయిలం లాగా భావించడం రాజ్యాంగ న్యాయం అనిపించుకోదు. క్రైస్తవంలో కులం లేదు కాబట్టి, వివక్ష లేదనడం అన్యాయం. ఇది సామాజిక పునాదుల్లో లోతుగా వేళ్లూనుకుని, విస్తరించి ఉన్న సాంఘిక వివక్షా రూపాలను చూడనట్టు నటించడమే. వర్తమాన రాజకీయాలలో ముస్లింలకు, క్రైస్తవులకు ఉన్న స్థానం రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఈ తీర్పు ప్రస్తుత సామాజిక–రాజకీయ శైలికి అనుగుణంగా ఉంది. బాధితులకు అండగా నిలవగలిగే రాజ్యాంగ నైతికతకు అనుగుణంగా మాత్రం లేదు.

మురళి కర్ణం

ఇవి కూడా చదవండి..

యూసీసీ అమలు, లవ్ జిహాద్‌కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో

దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ కృపాకర్ మాదిగ

Updated Date - Apr 01 , 2026 | 02:06 AM