Share News

పెట్టుబడి మోసానికి ‘సుప్రీం’ చెక్‌!

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:04 AM

ఐదు దేశాలు, ఎనిమిది సంస్థలు, సుమారుగా పదిహేనువేల కోట్ల రూపాయలు, ఒక బహుళజాతి ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ, ఒక ప్రముఖ భారతీయ స్టార్టప్, ప్రపంచంలోనే అతిపెద్ద రీటైలర్ సంస్థ...

పెట్టుబడి మోసానికి ‘సుప్రీం’ చెక్‌!

ఐదు దేశాలు, ఎనిమిది సంస్థలు, సుమారుగా పదిహేనువేల కోట్ల రూపాయలు, ఒక బహుళజాతి ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ, ఒక ప్రముఖ భారతీయ స్టార్టప్, ప్రపంచంలోనే అతిపెద్ద రీటైలర్ సంస్థ– ఇంతమంది పాత్రధారులుగా ఉన్న ‘ది అథారిటీ ఫర్ అడ్వాన్స్‌డ్‌ రూలింగ్ వర్సెస్ టైగర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ II’ కేసులో ఈ ఏడాది జనవరి 15 నాడు ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆదాయపన్నుకు సంబంధించినది మాత్రమే కాదు, ఈ తీర్పులో దేశ సార్వభౌమత్వం, రాజ్యాంగ సర్వోత్కృష్టత, ద్వైపాక్షిక ఒప్పందాలు, పన్నుఎగవేత, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే ఆదేశిక సూత్రాలకు సంబంధించిన విషయాలు అనేకం మిళితమై ఉన్నాయి.

అమెరికాకి చెందిన టైగర్ గ్లోబల్ అనే బహుళజాతి ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ భారతదేశంలో వ్యాపారం చేసే సింగపూర్‌కి చెందిన ఫ్లిప్‌కార్ట్‌ అనే ఒక స్టార్టప్‌లో 2010 నుండి పెట్టుబడి పెడుతూ వస్తున్నది. అయితే ప్రత్యక్షంగా గాక మారిషస్, కేమెన్ ఐలాండ్స్ లాంటి దేశాలలో రిజిస్టర్ అయివున్న తన అనుబంధ సంస్థల ద్వారా ఆ పని చేస్తూ వచ్చింది. ఇది 2018 వరకు కొనసాగింది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలో తనకి ఉన్న వాటాలో మెజారిటీ భాగాన్ని అమెరికాకి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద రీటైలర్ వాల్‌మార్ట్‌కి అమ్మేసింది. మిగిలిన వాటాని కూడా 2023లో అదే వాల్‌మార్ట్‌కి అమ్మేసింది. టైగర్ గ్లోబల్ మొత్తం ఎంత పెట్టుబడి పెట్టిందీ, ఎంత మొత్తానికి వాల్‌మార్ట్‌కి తన వాటాని అమ్మిందీ ఈ లెక్కలు మనకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. కానీ, సుప్రీంకోర్టులో జరిగిన కేసు 2018 వరకు జరిగిన లావాదేవీల గురించి మాత్రమే కాబట్టి, ఆ తీర్పులో ఉన్న సమాచారం ప్రకారం– టైగర్ గ్లోబల్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లోని తన మెజారిటీ వాటాను వాల్‌మార్ట్‌కి 2018 నాటికి దాదాపు రూ.15,000కోట్లకు అమ్మింది.


పన్నులలో కాపిటల్ గెయిన్స్ టాక్స్ అని ఒకటి ఉంటుంది. పెట్టుబడుల విలువ పెరిగినప్పుడు, తద్వారా పొందిన లాభంలో కొంత శాతాన్ని కాపిటల్ గెయిన్స్ టాక్స్‌గా ప్రభుత్వానికి కట్టాలి. టైగర్ గ్లోబల్ కూడా ఆ పన్ను కట్టాలని మన ఆదాయపు పన్ను శాఖ ఆ సంస్థకు తెలియజేసింది. అయితే తాము రూపాయి కూడా భారత ప్రభుత్వానికి కట్టవలసిన అవసరం లేదని టైగర్ గ్లోబల్ వాదించింది. ఈ కేసు అంచెలంచెలుగా–ఆదాయ పన్నుశాఖ, అథారిటీ ఫర్ అడ్వాన్స్‌డ్‌ రూలింగ్, ఢిల్లీ హైకోర్టు–దాటి చివరికి సుప్రీంకోర్టుకు చేరింది.

భారతదేశానికి, మారిషస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒక ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా తాను ఆ పన్ను కట్టనవసరం లేదని టైగర్ గ్లోబల్ వాదన. ఈ రెండు దేశాలలో వ్యాపారం చేసే సంస్థలు రెండు దేశాలలోనూ పన్ను కట్టనవసరం లేకుండా సంస్థ ఎక్కడైతే రిజిస్టర్ అయిందో అక్కడ మాత్రమే కట్టే సౌలభ్యం ఈ ఒప్పందంలో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడి పెట్టిన టైగర్ గ్లోబల్ అనుబంధ సంస్థలు మారిషస్‌లో రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఒప్పందం ప్రకారం అక్కడ పన్ను కడితే చాలు. అయితే మారిషస్‌లో పన్నులు శూన్యం. అంటే టైగర్ గ్లోబల్ భారతదేశంలో వ్యాపారం ద్వారా తమ విలువ పెంచుకుని, ఇక్కడ, మారిషస్‌లోనూ పన్ను కట్టకుండా మొత్తం లాభం తిరిగి అమెరికాకి ఉచితంగా తరలించేసుకోవచ్చు. సుప్రీంకోర్టు కూడా ఇది అన్యాయమూ, చట్టవిరుద్ధమూ అని తేల్చి చెప్పింది.

నిజానికి ఎనిమిదేళ్ళ క్రితం వరకు ఇది చట్టవిరుద్ధమేమీ కాదు. గతంలో అనేకానేక ఇన్వెస్ట్‌మెంట్‌, వెంచర్ కాపిటల్, ఆల్టర్‌నేట్ అసెట్ మేనేజ్‌మెంట్‌ తదితర సంస్థలు మారిషస్ లాంటి దేశాలలో షెల్/ లెటర్ బాక్స్/ సూట్‌కేస్ సంస్థలను రిజిస్టర్ చేసి, అక్కడ నుండి పెట్టుబడులు భారతదేశానికి తరలించి, ఇక్కడ విలువ పెరిగాక వాటాలను అమ్మేసుకుని ఆ లాభాలను తిరిగి మారిషస్ తరలించి, పైన పేర్కొన్న ద్వైపాక్షిక ఒప్పందం పేరు మీద రూపాయి కూడా పన్ను కట్టకుండా డబ్బు పోగేసుకున్నాయి. నిజానికి ఇది పన్ను ఎగవేత. దాంతో 2017లో ఆదాయ పన్ను చట్టానికి ఒక కీలక సవరణ చేశారు. మారిషస్ లాంటి దేశాలలో రిజిస్టర్ అయిన సంస్థలు కేవలం షెల్ లేదా లెటర్ బాక్స్ సంస్థలు అయితే ఈ ఒప్పందం వాటికి వర్తించదని, సదరు సంస్థలకు అక్కడ కూడా వ్యాపార లావాదేవీలు ఉండాలని, అవి కేవలం పన్ను ఎగవేత కోసమే అక్కడ రిజిస్టర్ అయ్యాయా? అన్న సంగతిని ఐటీశాఖ విచారించాలని, అలా తేలిన పక్షంలో, వారిని ఇక్కడ పన్ను కట్టమని డిమాండ్ చేసే అధికారం మనకు ఉంటుందని ఆ సవరణ సారాంశం. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆ సవరణను ప్రామాణికంగా చేసుకుని ఇచ్చిందే.


ఫ్లిప్‌కార్ట్‌ అనేది సింగపూర్‌లో రిజిస్టర్ అయ్యి భారతదేశంలో వ్యాపారం చేస్తున్న సంస్థ. ఆ సంస్థకు లాభాలు లేకపోయినా వ్యాపారం మాత్రం వేల కోట్లలోనే ఉన్నది. ప్రస్తుతం నడుస్తున్న పెట్టుబడివ్యవస్థ లాజిక్ ప్రకారం సంస్థకి లాభాలు లేకపోయినా ఫరవాలేదు కానీ ఆ సంస్థ మార్కెట్ విలువ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి. దీనిని కొంతమంది షేర్ హోల్డర్ కాపిటలిజం అని పిలుస్తున్నారు. ఒక్క ఫ్లిప్ కార్టే కాదు, ప్రముఖ ‘స్టార్టప్’లుగా పేరుపొందిన స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా, రాపిడో, అర్బన్ కంపెనీ, లెన్స్‌కార్ట్ లాంటి అనేక సంస్థల ఫైనాన్షియల్ ప్లే బుక్ ఇదే. వాస్తవానికి ఇవి ‘టెక్నో–ఫ్యూడల్’ సంస్థలు. ఇటువంటి సంస్థలకు లాభాల కన్నా మార్కెట్ విలువ ముఖ్యం. ఆ విషయంలోనే పై విధమైన ద్వైపాక్షిక ఒప్పందాలు బహుళజాతి ఇన్వెస్ట్‌మెంట్‌/వెంచర్ కాపిటల్ సంస్థలకు ఉపయోగపడతాయి. ఇటువంటి సంస్థల విలువ పెంచేది ‘ఉద్యోగం’ అని లేకుండా ‘గిగ్‌వర్క్‌’ పేరు మీద నలిగిపోతున్న లక్షలాది మంది వర్కర్లు, భారతదేశ వినియోగదారులు. లాభాలు మూటకట్టుకునేది మాత్రం ఈ బహుళజాతి సంస్థలు. సుప్రీంకోర్టు కూడా తన తీర్పులో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. వ్యాపారం జరిగింది ఇక్కడ కాబట్టి, పన్ను ఇక్కడ కట్టడమే న్యాయం అనే ప్రాథమిక సూత్రాన్ని నొక్కి వక్కాణించింది.

ఒక దేశంలో నివసించే వ్యక్తి మీద, వ్యాపారం చేసే సంస్థ మీద పన్ను విధించడం అనేది ఆ దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన ఒక ముఖ్య అంశం. ప్రగతిశీల పన్ను విధానం అనేది వనరుల పునఃపంపిణీకి ఉద్దేశించిన ప్రక్రియ కూడా. వనరుల పునఃపంపిణీ భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో ప్రధానమైనది. కానీ, పైన పేర్కొన్న రీతిలో పన్నులు ఎగవేయటం దేశ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టే గాక, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేయడమే. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ విలువలను ఎత్తిపట్టే విధంగా తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయం. ‘ఇతర దేశాలతో మనం చేసుకునే ఒప్పందాలు మన రాజ్యాంగానికి లోబడి ఉండాలి’ అని తీర్పు చెప్పిన ఇద్దరిలో ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించడం హర్షించదగ్గ విషయం. ఈ దృష్టితో చూసినప్పుడు– ప్రస్తుతం ప్రభుత్వాలు వివిధ సంస్థలతో, దేశం వివిధ దేశాలతో చేసుకుంటున్న ఒప్పందాలలో ఎన్ని రాజ్యాంగ గీటురాయికి నిలబడతాయి అనే ప్రశ్న మనం వేసుకోవటం అవసరం.

గుత్తా రోహిత్

మానవ హక్కుల వేదిక

ఇవి కూడా చదవండి..

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

Updated Date - Feb 10 , 2026 | 01:11 AM