Share News

సూపర్ ఎల్‌నినో.. సంసిద్ధత ఏదీ?!

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:40 AM

రెండేళ్ల పాటు దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు ఆహార భద్రత అందించింది వ్యవసాయ రంగమే. ఆ సమయంలో దాదాపుగా అన్ని రంగాలు పడకేశాయి...

సూపర్ ఎల్‌నినో.. సంసిద్ధత ఏదీ?!

రెండేళ్ల పాటు దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు ఆహార భద్రత అందించింది వ్యవసాయ రంగమే. ఆ సమయంలో దాదాపుగా అన్ని రంగాలు పడకేశాయి. కానీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు దేశాన్ని ఆదుకున్నాయి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ కూడా రైతాంగం ఏ ఒక్క ఏడాదీ వ్యవసాయాన్ని వదలకపోవడం వల్లనే అది సాధ్యపడింది. ప్రపంచంలోని అనేక దేశాలు.. చివరకు అగ్ర దేశాలు సైతం కరోనా సమయంలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నాయి. కానీ, భారత్‌కు ఆ దుస్థితి ఎదురుకానందుకు రైతాంగానికి దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు.

నేడు రైతాంగం కరోనాను మించిన కష్ట కాలాన్ని సూపర్ ఎల్‌నినో రూపంలో ఎదుర్కొంటున్నది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా... దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దాదాపు 20కి పైగా ప్రాంతాల్లో సగటు సాగు 50శాతానికి మించలేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిలకడలేని వాతావరణ పరిస్థితులు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో అసాధారణంగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో బలమైన వడగాలులు వీస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే దేశ వాతావరణం ఎంత అస్థిరంగా ఉందో అర్థం అవుతోంది.

కరోనాలో కొంత ఆలస్యంగానైనా శాస్త్రజ్ఞుల కృషి వల్ల ప్రజల ప్రాణాలు నిలబెట్టగలిగిన వ్యాక్సినేషన్లు వచ్చాయి. ఆ సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా ఉమ్మడి కార్యాచరణతో పనిచేయడం వల్ల ప్రజల్లో భరోసా ఏర్పడింది. నష్ట తీవ్రత తగ్గింది. కానీ ఇప్పుడు ఈ ఎల్‌నినో విపత్తును ఎదుర్కోవడానికి కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయడం లేదు. ఎల్‌నినో ప్రభావం మరింత ఎక్కువగా 2027 సంవత్సరం చివరి వరకూ కొనసాగుతుందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. కానీ ఆశ్చర్యకరంగా ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయ రంగంలో ఏర్పడిన ఈ అసాధారణ పరిస్థితులను కలిసికట్టుగా ఎదుర్కోవడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం చేసుకోవడం లేదు. కరోనా విపత్తు సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తరచుగా జూమ్ సమావేశాలు నిర్వహించి అందరి సలహాలు, సూచనలు స్వీకరించి వారికి దిశానిర్దేశం చేశారు. ఆ చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.


కరోనాలో అదృష్టవశాత్తూ దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తాత్కాలికంగానైనా రాజకీయాలను పక్కన పెట్టాయి. ఐక్యంగా ప్రజలను ఆదుకోవడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు కూడా అటువంటి సుహృద్భావ వాతావరణం అత్యంత అవసరం. రైతాంగం కష్టాల్లో ఉన్నదంటే అర్థం దేశ ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నట్టే. కానీ ఎల్‌నినో నేపథ్యంలో రాజకీయాలకే అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. సాగునీటి కొరత ముంచుకొచ్చిన తరుణంలో వరి, చెరకు వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలు వేసుకోవద్దని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రైతాంగానికి సలహా ఇచ్చాయి. దానిని తప్పుపడుతూ అక్కడి ప్రతిపక్ష పార్టీలు పాలక పక్షాలను విమర్శిస్తున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతాంగాన్ని రెచ్చగొడుతున్నాయి. సాగునీరు అందుబాటులో లేనప్పుడు పుష్కలంగా నీరు అవసరమయ్యే పంటలు వేయడం వల్ల చివరకు రైతులే నష్టపోతారు. అందుబాటులో లేని నీటిని ఇవ్వడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. అదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా రైతాంగానికి నీళ్లు ఇవ్వగలుగుతోంది. అలాగే, వెలిగొండ మొదటి దశను పూర్తిచేసి కింది ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలిగింది. ఇటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాలలో లేదు. ఆయా రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నవారిని విమర్శించడం వల్ల సమస్య పక్కదారి పడుతుందే తప్ప, రైతాంగానికి ఊరట లభించదు.

నిజానికి దేశంలోని అత్యధిక శాతం రైతాంగం ప్రతికూల పరిస్థితులలో కూడా సంప్రదాయ పంటలే వేస్తున్నారు. ప్రభుత్వాలు హెచ్చరించినా పంట మార్పిడికి అనుకూలంగా లేరు. ఇందులో ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది. సాగునీరు తక్కువగా అవసరమయ్యే పంటలు వేసుకోవడానికి రైతాంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. వరి, చెరుకు, గోధుమ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా పంటలు వేసుకోవడానికి తగిన ప్రోత్సాహకాలు అందించాలి. అయితే పరిశ్రమల స్థాపన పేరుతో కార్పొరేట్లకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించే ప్రభుత్వాలు రైతాంగం దగ్గరకు వచ్చేసరికి తగిన రాయితీలు కల్పించడానికి మొగ్గుచూపడం లేదు. ప్రతిపక్షంలో ఉండగా రైతాంగం పట్ల ఆవేదన వ్యక్తం చేసే పార్టీలు ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం ఎక్కాక రైతుల్ని పట్టించుకోకపోవడం ఓ చేదు వాస్తవం. పైగా, ఇటీవలి కాలంలో అటు పార్లమెంటు ఉభయ సభలలో కానీ, రాష్ట్రాల చట్టసభలలో కానీ వ్యవసాయంపై సమగ్రంగా చర్చ జరగడం లేదు.


సాధారణంగా చట్టసభల వర్షాకాల సమావేశాలలో తప్పనిసరిగా వ్యవసాయంపై ప్రభుత్వాలు తమంతట తామే చర్చకు అనుమతించే సంప్రదాయం చాలా కాలం కొనసాగింది. అలాగే కరువు పరిస్థితి ఏర్పడినప్పుడు ఉభయసభలలో ఆ రోజు జరగాల్సిన బిజినెస్ మొత్తాన్ని వాయిదావేసి రోజంతా కరువు పరిస్థితులపై చర్చించి సభ్యుల సలహాలు, సూచనలను స్వీకరించి చివరిగా ప్రభుత్వం ఓ విధాన ప్రకటన విడుదల చేసే సంప్రదాయం కూడా చాలా కాలం ఉండింది. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉండగా.. వ్యవసాయంపై విలువైన సూచనలు అందించే ప్రొఫెసర్ ఎన్.జి.రంగా లోక్‌సభకు ఎన్నిక కావాలనే ఉద్దేశంతో ఆయనపై పోటీ చేసిన అభ్యర్థిని బ్రతిమలాడి పోటీ నుంచి విరమింపజేసిన సంఘటన వ్యవసాయం పట్ల నెహ్రూకు ఉన్న చిత్తశుద్ధిని ఎత్తి చూపుతుంది. కానీ ఇప్పుడు కేంద్రానికి వ్యవసాయం ప్రాధాన్యతాంశంగా కనపడటం లేదు. వ్యవసాయంపై సాధికారికంగా మాట్లాడగలిగే రైతు నాయకులు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే చట్టసభలలో కనిపిస్తున్నారు.

నిజానికి కరువులు, తుపాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రతి ఏటా ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తున్నా, దేశం మొత్తంగా చూస్తే ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే కాక మిగులు ధాన్యాలను సమకూర్చుకునే స్థితికి దేశం చేరుకొని చాలా ఏళ్లయింది. కానీ ఇప్పుడు సూపర్ ఎల్‌నినో కారణంగా దేశంలోని అన్ని వాతావరణ జోన్లలో పరిస్థితులు తారుమారయ్యాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ ఉత్పత్తుల్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఉదాహరణకు వరి పంటను తీసుకుంటే వరి వెన్ను పుష్పించే సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటితే ఆ వెన్ను పనికిరాకుండా పోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆహార దిగుబడులు గణనీయంగా తగ్గాయని యూనివర్సల్ ఎకొలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. నిజానికి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో హెక్టారుకు సగటు ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. దీనికి తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు మరింత తగ్గుతాయి. వెరసి, రైతు పెట్టే పెట్టుబడికి అతనికి వచ్చే రాబడికి పొంతన ఉండదు కనుక సాగువల్ల నష్టపోయే దుస్థితి ప్రతి ఏటా రైతాంగానికి ఎదురవుతూనే ఉంది.


ఎల్‌నినో ప్రభావిత రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు కొంతమేర నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం కనిపిస్తోంది. అయితే అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పాలకుల దృష్టి పారిశ్రామిక అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, కార్పొరేట్ రుణాల మాఫీ, విదేశీ వాణిజ్య ఒప్పందాలు మొదలైన అంశాలపై ఉంది. వీటన్నింటి మధ్య ఎల్‌నినోపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు. రెండేళ్ల పాటు ఎల్‌నినో చూపే దుష్ఫలితాల కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతింటే పర్యవసానంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. అప్పుడు రైతాంగం పరిస్థితి ఎలా ఉంటుంది? సామాన్యుల కొనుగోలు శక్తి ఏ మేరకు క్షీణిస్తుంది? వాటి వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈ అంశాలను చర్చించేదెవరు?

సి. రామచంద్రయ్య

శాసనమండలి సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 12 , 2026 | 05:40 AM