Share News

పక్షపాత రాజకీయాల్లో విద్యార్థులు భాగం కారాదు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:40 AM

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త ‘అభిజీత్ దీప్కే’... ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో మే 16న ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే నెలలో మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు...

పక్షపాత రాజకీయాల్లో విద్యార్థులు భాగం కారాదు

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త ‘అభిజీత్ దీప్కే’... ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో మే 16న ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే నెలలో మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరగడం, ఎన్టీఏ ఆ పరీక్షలను రద్దు చేసి, తిరిగి జూన్ 21న నిర్వహించి, జూలై 16న పరీక్షా ఫలితాలు ప్రకటించింది. రీ-ఎగ్జామ్ నిర్వహించడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన కొంతమంది విద్యార్థులు ఆందోళనతో బలవన్మరణాలకు పాల్పడడంతో ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా ఒక భారీ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజులు దీక్షను చేసి కేంద్ర ప్రభుత్వ పెద్దల హామీతో దీక్షను విరమించారు. కాక్రోచ్ పార్టీ ఛలో పార్లమెంటు పిలుపుతో జూలై 20న వేలాది మంది జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగి, పలువురు ఆందోళనకారులు, పోలీసులు గాయాల పాలయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించడం, చర్చలపై కాక్రోచ్ పార్టీ నేతలు షరతులు విధించడం... ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల నేపథ్యం ఇది.

అయితే కాక్రోచ్ పార్టీ వారు చేస్తున్న ఉద్యమానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దేశంలో అనేకమంది గళం విప్పుతున్నారు. పరీక్షల లీకేజీలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే పరిష్కారమని ఉద్యమ అనుకూలురు వాదిస్తున్నారు. అలాగే లీకేజీకి పాల్పడిన వారిని ప్రభుత్వం శిక్షించి, మళ్ళీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిందని, ర్యాంకులు వచ్చినవారు కౌన్సిలింగ్‌లోను, రానివారు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లోను బిజీగా ఉంటే, కొంతమంది పనిగట్టుకుని ఎన్డీయే ప్రభుత్వంపై బురద జల్లాలనే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని నడుపుతున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు. కాక్రోచ్ వారి ఆందోళన సభల్లో పాల్గొన్న శ్రీనగర్ ఎంపీ–జేకేఎన్సీ నాయకుడు అగా సయ్యద్ రుహుల్లా మెహదీ, కశ్మీర్ భారతదేశంలో భాగం కాదని నమ్మే అరుంధతీ రాయ్, ఉగ్రవాది అజ్మల్ కసబ్ కోసం మెర్సీ పిటీషన్ దాఖలు చేసిన కోలిన్ గొంజాల్వెస్, ఉగ్రవాది యాకుబ్ మెమన్ ఉరిని ఆపడానికి అర్ధరాతి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రశాంత్ భూషణ్, పాకిస్తానీ కవి ఫైజ్ అహ్మద్ రాసిన ‘బస్ నామ్ రహేగా అల్లాహ్ కా’ అనే కవితను వేదికపై పాడిన నందితా నారాయణ్, ‘యే లోగ్ సీతాకే పతికా నామ్ లేకర్, నీతా కే పతి కా కామ్ కార్ రహే హై’ అని వ్యాఖ్యానించిన కునాల్ కమ్రా, ‘వారు జై శ్రీరామ్ అని నినదిస్తారు, కానీ నేను జై సంవిధానం అని సంభోదిస్తాను’ అన్న ప్రకాష్‌రాజ్ లాంటి వారు చేసిన ప్రసంగాలు, వారు చేస్తున్న నినాదాలు చూసిన వారికి ఈ ఆరోపణల్లో నిజం లేకపోలేదనే భావన తప్పక కలుగుతుంది.


నీట్ పరీక్షల నిర్వహణలో లోపాల గురించి ఒక్కరూ మాట్లాడిన దాఖలాలు లేకపోగా... జీహాద్ నినాదాలు, భారత మాత అయితే పిత ఎవరు అంటూ వ్యాఖ్యలు, ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ డిమాండ్లు, బంగ్లాదేశ్, పాలస్తీనా జెండాలు ఎగరవేయడాలు, భారత్‌ను బంగ్లాదేశ్, నేపాల్ మాదిరి మారుస్తామని హెచ్చరికలు, పార్లమెంటు ముట్టడించాలని పిలుపులు, ఇవన్నీ అక్కడ కనిపించాయి. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాతె–ఇ–ఇస్లామి కాక్రోచ్ ఉద్యమానికి మద్దతునిస్తున్నామంటూ విడుదల చేసిన లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆందోళనలను కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపవద్దని కోరారు. అంతేకాక రూ.10 కోట్ల (1 మిలియన్ డాలర్లు) ఆఫర్ కూడా ఆయన ఇచ్చినట్లు ఒక వీడియో వైరల్ కావడం... ఇవన్నీ ఉద్యమం పక్కదోవ పడుతుంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

నిజానికి లక్షల మందికి పైగా విద్యార్థులను అవస్థల పాల్జేసిన వ్యవస్థాగత లోపాలపై ప్రశ్నించడం, అధికార వర్గాల నుంచి జవాబుదారీతనాన్ని ఆశించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నట్లుగా- యువత భవితతో ఆడుకునే వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ప్రశ్నించే ప్రక్రియలో, పోరాటం చేసే విధానంలో దేశ సమగ్రతకు, దేశ భద్రతకు భంగం కలగకుండా చూసుకోవాలి. విధానపరంగా మన మధ్య ఎన్ని విబేధాలైనా ఉండొచ్చు... కానీ, దేశ సమగ్రతకు భంగం కలిగించే విషయాల్లో మాత్రం అందరూ ఏకతాటిపై నిలవాలి. విద్యార్థులు చేసే పోరాటాలు అసలైన లక్ష్యానికి దూరం కాకూడదు. విభజనవాద శక్తుల వలలో పడకూడదు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, అందరికీ నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వనరుల విస్తరణ అందించాలని, జాతీయ స్థాయిలో పారదర్శకమైన, నమ్మకమైన, సమయపాలనతో కూడిన ప్రవేశ పరీక్షల వ్యవస్థ కావాలని, పరీక్షా పత్రాల లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసే కఠిన చట్టాలు తీసుకురావాలని విద్యార్థులు కోరడం సమంజసం. వ్యవస్థలో కొంత మంచి ఉంది... కొంత చెడు ఉన్నది. జరుగుతున్న మంచిని ఆపకుండా, దానిని కొనసాగిస్తూ చెడుని ఎట్లా ఆపాలి... దాన్ని ఎలా మార్చాలి అన్న దానిపై విద్యార్థులు దృష్టి పెట్టాలి. అంతేకానీ, వీడిని దింపెయ్యాలి, వాడిని దింపెయ్యాలి అంటే విద్యార్థులు కేవలం పక్షపాత రాజకీయాల్లో భాగస్వామ్యులు అయిపోతారు తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ విషయంలో విద్యార్థులు మరింత జాగ్రత్త వహించాలి. మైండ్‌తో ఆలోచించకుండా బ్లైండ్‌గా ఫాలో అయితే భవిష్యత్తు బ్యాడ్‌గా మారుతుందని గ్రహించాలి.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

ఇవి కూడా చదవండి

మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న

ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్

Updated Date - Jul 25 , 2026 | 12:40 AM