ఫలితాల బరువంతా పసి భుజాలపైనే!
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:09 AM
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాలను ఆన్‌లైన్‌లో పెట్టిన పది గంటల లోపే.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న భయంతో, ఆ బాధను తట్టుకోలేక దాదాపు పది మంది...
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాలను ఆన్‌లైన్‌లో పెట్టిన పది గంటల లోపే.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న భయంతో, ఆ బాధను తట్టుకోలేక దాదాపు పది మంది వరకూ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తరువాతి నలభై ఎనిమిది గంటల్లో మరో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 15న ఫలితాలు ప్రకటించింది. తర్వాతి 48 గంటల్లోనే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఐదుగురు ఆత్మహత్యా ప్రయత్నం చేయగా, ఇద్దరు అదృశ్యమయ్యారు. మీడియాలో రిపోర్ట్ కాని కేసులు ఇంకెన్ని ఉన్నాయో తెలీదు. ఇది ఇంటర్ పరీక్ష ఫలితాల సమయంలో ప్రతి ఏడాదీ కనిపించే ఘోర విషాదమే! ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టెన్త్ క్లాస్ ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఫలితాల తర్వాత ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుతాయోనని తల్లిదండ్రులు, సమాజం ఆందోళనలో ఉంది.
ఇప్పటివరకు పరీక్షా బోర్డులు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఫలితాలు పెట్టేసి చేతులు దులుపుకున్నాయి. ఇప్పుడు ఒక అడుగు ముందుకువేసి వాట్సాప్ ద్వారా ఫలితాలు ప్రకటించాలన్న నిర్ణయాలు తీసుకుంటున్నాయి. టెక్నాలజీ ఆధారంగా పని త్వరగా అయిపోతుందని ఆలోచిస్తున్నారే తప్ప, పిల్లల ప్రాణాల విలువ అంతా మరిచిపోయారు. ఈ పద్ధతి వల్ల పరీక్షల టెన్షన్ మొత్తాన్ని పిల్లలు ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కష్ట సమయంలో ఒకరి అండ, ఒక ఆత్మీయమైన మాట ఎంత అవసరమో ఈ వ్యవస్థ గుర్తించడం లేదు.
విద్యార్థి ఒక్కరే స్మార్ట్‌ఫోన్‌లో తాను ఫెయిల్ అయ్యానని, లేదా తనకు మార్కులు తక్కువ వచ్చాయని చూసిన వెంటనే, వాళ్ల మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది. సైకాలజీలో దీన్ని ‘కాగ్నిటివ్ టన్నెలింగ్’ అంటారు. ఈ స్థితిలో మెదడు తన చుట్టూ ఉన్న కీలకమైన సమాచారాన్ని విస్మరిస్తూ, ఒక నిర్దిష్ట సమాచారంపై లేదా ఒకే పనిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఆ టీనేజ్ వయసులో పిల్లలకు ఎమోషన్స్‌ను నియంత్రించుకోవడం ఇంకా పూర్తిగా రాదు. ఆ క్షణంలో వాళ్లకు ఆ ఓటమి తప్ప ఇంకేమీ కనిపించదు. జీవితం అక్కడితో అయిపోయినట్టు, భవిష్యత్తు లేనట్టు అనిపిస్తుంది. ఆత్మహత్య ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది.
ఇప్పుడున్న ఆన్‌లైన్ ఫలితాల వ్యవస్థలో పిల్లలు ఫెయిల్ అయితే దగ్గరుండి ఓదార్చడానికి కనీసం ఒక్క టీచర్ కూడా వారి పక్కన ఉండట్లేదు. ఫలితం చూసిన వెంటనే వాళ్లకు వచ్చే షాక్‌ను తట్టుకునే సపోర్ట్ దొరకదు. అప్పుడు వాళ్లకు అత్యవసరంగా కావాల్సిన ‘‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’’ లభ్యం కాదు. దాంతో వాళ్ళకు తీవ్రమైన ఆలోచనలు వస్తున్నాయి.
నైతికంగా చూసినా, పరిపాలనాపరంగా చూసినా, మొబైల్ ఫోన్లలో ఫలితాలు కనిపించడమే చాలా పెద్ద తప్పు. విద్యా వ్యవస్థ ప్రధాన బాధ్యత కేవలం చదువు చెప్పడం కాదు; పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడటం. కానీ మన పరీక్షా బోర్డులు ఆ బాధ్యతను పక్కన పెట్టేశాయి. పిల్లలు ఎమోషనల్‌గా బలహీనంగా ఉన్న సమయంలో, వాళ్లకు భరోసా కావాల్సిన సమయంలో, సరిగ్గా అదే క్షణంలో వాళ్లను ఒంటరిగా వదిలేస్తున్నారు. అందుకే ఫలితాల తాలూకు టెన్షన్, బాధంతా చిన్నపిల్లలే భుజాల మీద మోయాల్సి వస్తోంది. అసలు బోర్డులు ఎందుకు ఇలా ఆన్‌లైన్‌నే పట్టించుకుంటున్నాయంటే, లక్షలాదిమంది పిల్లల ఫలితాలను మాన్యువల్‌గా మేనేజ్ చేయడం కష్టం కాబట్టి, ఆ పనిని సాఫ్ట్‌వేర్ కంపెనీల చేతిలో పెట్టేసి తమ పని తేలిక చేసుకుంటున్నాయి. కానీ పని సులభం చేసే ఈ పద్ధతి వల్లనే పిల్లల ప్రాణాలు పోతున్నాయి.
పరీక్షల వల్ల ఒక్క పిల్లాడు కూడా చనిపోకుండా ఉండాలంటే, ముందుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ ఆన్‌లైన్ ఫలితాల విడుదల తగ్గించాలి. ఫలితాలు ఏవైనా సరే, పిల్లలు స్కూల్ లేదా కాలేజీకి తప్పకుండా వెళ్లి, టీచర్ల చేతుల మీదుగానే ఫలితాలకు సంబంధించిన పత్రం తీసుకునేలా కఠినమైన నిబంధన రావాలి. అలా చేస్తే, ఫలితం చూసి బాధపడే పిల్లలకు టీచర్లు వెంటనే ధైర్యం చెప్పగలరు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ చెప్పిన ‘ఉమ్మీద్’ గైడ్‌లైన్స్‌ను పక్కాగా అమలుచేయాలి. దీని ప్రకారం ప్రతి స్కూల్, కాలేజీలో స్కూల్ వెల్‌నెస్ బృందాలు ఉండాలి. పిల్లలు ఎవరైనా డల్‌గా కనిపిస్తే, ఫలితాలు చూడటానికి భయపడి కాలేజీకి రాకపోతే, ఈ బృందం పేరెంట్స్‌కు కాల్ చేసి పిల్లాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. దీనివల్ల ఏదైనా తప్పు జరిగే ముందు మనం ఆపే అవకాశం ఉంటుంది.
ఇదంతా టెక్నికల్‌గా కుదరదు అనేవాళ్లు ఉంటారు. కానీ కేరళ మోడల్ చూస్తే ఇది పూర్తిగా సాధ్యమే అని అర్థమవుతుంది. కేరళలో రిజల్ట్స్ పబ్లిక్‌కు రాకముందే, కాలేజీ ప్రిన్సిపాల్స్‌కు సెక్యూర్ వెబ్‌సైట్ ద్వారా వాళ్ల కాలేజీ పిల్లల రిజల్ట్స్ అన్నీ పీడీఎఫ్ రూపంలో ముందే ఇస్తారు. దాంతో ఏ స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు, ఎవరికి మార్కులు తక్కువ వచ్చాయి అన్నది టీచర్లకు ముందే తెలిసిపోతుంది. వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి, సప్లిమెంటరీ ఫార్మ్స్ రెడీ చేయడానికి టైమ్ దొరుకుతుంది.
చివరిగా, మనం యునైటెడ్ కింగ్‌డమ్ మోడల్‌ను కూడా ఫాలో కావాలి. అక్కడ.. ఫలితాల రోజు పిల్లలందరూ స్కూల్‌కు వెళ్లాలి. స్కూల్లో కెరీర్ అడ్వైజర్లు, సీనియర్ టీచర్లు ఉదయాన్నే రెడీగా ఉంటారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు వెంటనే ఇంకేం కోర్సుల్లో చేరవచ్చో దారి చూపిస్తారు. దీన్నే వాళ్లు ‘‘క్లియరింగ్’’ అంటారు. మన దగ్గర కూడా ఇదే పద్ధతి రావాలి. టీచర్లు పిల్లలకు కేవలం ఫెయిల్ అయ్యావు అని చెప్పడం కాదు, వెంటనే అడ్వాన్స్ సప్లిమెంటరీ అప్లికేషన్ కూడా ఇవ్వాలి. ఫెయిల్ అవ్వడం చదువులో ఒక సాధారణ విషయం అని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు ఇంటికి వెళ్లి పేరెంట్స్‌ను ఎదుర్కొనే ముందు వాళ్లకు కొంత ధైర్యం, కొంత క్లారిటీ వస్తాయి. మార్కులు చెప్పి పని ముగించేయడం కాదు; పిల్లల మీద నిజమైన జాగ్రత్త చూపించడం ముఖ్యం. అప్పుడు మాత్రమే మన పిల్లల ప్రాణాలను మనం కాపాడగలం.
వనగంటి నవీన్‌కుమార్
జర్నలిస్ట్
ఈ వార్తలు కూడా చదవండి
పెళ్లి పేరుతో రూ.కోట్ల వసూలు.. అషురెడ్డిపై ధర్మేంద్ర తీవ్ర ఆరోపణలు
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్