Share News

పీడిత జన పక్షంగా గంగ

ABN , Publish Date - Sep 28 , 2026 | 02:15 AM

సాహిత్యంలో ఇదివరకే ఉన్న విషయాన్నే కొత్తగా చెప్పి సామర్థ్యాన్ని రుజువు చేసుకొనే పండితులే ఎక్కువ. రాజు గురించైనా, రైతు గురించైనా చెప్పిందే చెప్పడం తప్ప...

పీడిత జన పక్షంగా గంగ

సాహిత్యంలో ఇదివరకే ఉన్న విషయాన్నే కొత్తగా చెప్పి సామర్థ్యాన్ని రుజువు చేసుకొనే పండితులే ఎక్కువ. రాజు గురించైనా, రైతు గురించైనా చెప్పిందే చెప్పడం తప్ప అంశపరంగా పెద్ద తేడా కనబడదు. సాన పట్టిన కవి ప్రతిభ మాత్రమే ఆ రచనకు కొత్త వన్నె తెస్తుంది.

పారే నీళ్లు, పరవళ్ళు తొక్కే నదుల గురించి కూడా ఇదే కోవలో చాలానే చెప్పారు. బిరా బిరా కృష్ణమ్మ, ఘనంగా గంగ హారతులంటూ ప్రవాహం వద్దకెళ్లి భక్తి పారవశ్యంలో మునకలేశారు. నదికి వీలైనంత దైవత్వం, పవిత్రత అంటగట్టి శిష్టాచారాల గిరి గీశారు. ఒడ్డున కూచొని పెట్టుబడిలేని వ్యాపారంగా పూజలు, శ్రాద్ధాలు చేస్తూ నదిని ఒక ఆదాయ చెలిమెగా చూశారు. స్తోత్రాలు వల్లిస్తూ ఆకుతో నాలుగు తుంపరలు తలపై చిలకరించారే తప్ప చేతిలో చెంబునెవరినీ తాకనీయలేదు. అంటు ముట్టు అంటూ తాము కాళ్లు కడిగే చోటనైనా దోసెడు నీళ్లను తాగనీయలేదు.

అందరు పనికట్టుకొని ప్రచారం చేసిన బొమ్మకు బొరుసేమిటో చూపేందుకు సుద్దాల అశోక్ తేజ ‘శ్రీ శూద్ర గంగ’ కావ్యం ప్రయత్నిస్తుంది. ఇందులో కవి అక్షర తాండవం చేశారు. కమండలం లోంచి నిష్టగా గొంతులో పోసుకొనే ఉదకం భువికి దిగిందే కష్టజీవుల కోసమని గొంతెత్తి గానం చేశారు. నీటి వాడకం లేని వృత్తి లేదు. శ్రమ, ఉత్పత్తి లేనిదే మనిషి మనుగడ లేదు. ఎంతటి శ్రీమంతుడికైనా మెతుకు లేనిది గడవదు. శ్రామికుడే జగద్రక్షకుడు, సకల సృష్టికి మూల పురుషుడు. శూద్ర సారథ్యం లేనిదే భూశకటం అడుగు కదలదు. ‘‘శూద్రుడి చెమట చుక్కల్లో కలిసి మానవాళికి మేలు చేయగ దివి నుండి భువి వచ్చింది గంగ, అందుకే నాకిది శూద్ర గంగ’’ అంటారు కవి అశోక్ తేజ.

కవి శూద్ర పక్షం వహించి గంగా నది పుట్టుక, ఆ నీటి వాడుక, అంటగట్టిన మడి... తదితర పాత వాసనలన్నింటిని చెరిపేసి ఆ నదిని శ్రామిక నాయికగా నిలబెట్టారు. అసలు నింగి నుంచి దిగి రమ్మని గంగను పిలిచిందే శూద్రులంటూ ఆహ్వాన వర్ణన ఇలా చేశారు: ‘‘మన మాలల ఉరుమి నృత్యమా/ మాదిగ డప్పు మహత్యమా/ ఏ తాటి మోకుల ధ్వని/ ఏ రాటు మోటల ధుని/ ఏ దూదేకుల అల్లెతాడు/ ఏ రజకుల హం హం హం/ ఏ పల్లకి హోం హోం హోం/ శూద్రుల శ్రుతి నచ్చినదా/ శ్రామిక జతి మెచ్చినదా/ దప్పిక పడే ప్రజల యెదల/ డొప్పలు నింపాలనుకొని/ చప్పున వచ్చే గంగ’’ – ఇదీ గంగావతరణం అంటారు కవి.


దివిని వదలిన గంగ గ్రహాల గురించి యోచించి భూమిని ఎంచుకున్న తీరులో నవ గ్రహాల గురించిన వివరణలో కవి వైజ్ఞానిక కోణాన్ని ఎంచుకున్నారు. తన రచన ప్రవాహానికి ఈ గ్రహాల గుణగణాల చిత్రణ కాస్తా గులక రాళ్ళలా అడ్డుపడ్డాయనిపిస్తుంది. వాటిని దాటుకుంటూ వచ్చిన గంగ ‘‘ఇల వసుధయే తనకు ఇల్లన్నది/ తన మాత భారత భూమాతయనుకున్నది’’. కానీ అప్పుడు గంగ సందిగ్ధంలో పడుతుంది. ఎక్కడ దిగాలి? తన ప్రవాహ పంజాని తట్టుకొనే చోటేది? – ‘‘ఎవడాపగలడు నిన్ను నదీగంగ/ దింపగలడెవడు నిన్ను పదిలంగ/ భళ్ళుమని దూకితే బద్దలవదా భూమి’’ అంటూ కలవరపడిన కవికి పరిష్కారం కూడా తట్టింది. ‘‘వల్లకాడే తప్ప ఇల్లు లేనివాడు/ కాలిచెప్పులు లేని కైలాస దళితుడు/ శివుడొక్కడే నిన్ను దింపగలడు’’ అంటూ గంగకు ధీమా ఇచ్చిన కవి శివార్చన మొదలెడతారు. ‘‘ఈ కావ్యకర్త అశోక శూద్ర తేజునికి అంబరీశుడు/ నీలాంబరంబేడ్కరుడు/ మహేశ్వరయతి.. మహాత్మ జ్యోతిపూలేగా యనిపించే’’ నంటూ పీడితజన వేలుపులను గుర్తు చేసుకుంటారు.

‘‘కాచుకో సర్పాంగ/ దూకుతుందీ గంగ/ ఓర్చుకో భస్మాంగ/ తాకుతది తీవ్రంగ’’ అంటూ శివుణ్ణి సిద్ధం చేసిన కవి, ‘‘ఒక్కసారిగా దూకే గంగ ఆంబోతై/ ముక్కుతాడును వేసే శివుడు ఒక రైతై/ మాదిగల డప్పల్లె ఢమరుకము మోగే/ మాలల ఉరుమనీ గంగ శివమూగే’’ అంటూ గంగ ఉధృతానికి శివుడు అడ్డేసిన తీరులో సబ్బండ వర్ణాల ఒడుపును ముడేస్తారు. శివుని చేరిన గంగ ‘‘నింగి నా పుట్టిల్లు/ నేల నా మెట్టిల్లు/ నడమ నీ సిగముడి నా ఆట పట్టిల్లు’’ అంటూ సెలవు కోరుతుంది.


ఇక నుంచి కావ్యంపై అసలుసిసలైన శూద్ర ముద్ర, గాఢత పెరుగుతుంది: ‘‘అన్నదాతకు మొదట ఆర్తి తీర్చేను/ ఆ పిదప గుడుల తీర్థమవుతాను’’ అంటూ కదలిన గంగకు పక్కన చేరిన కవి అసలు నిజాలు చెబుతారు. ‘‘భగీరథివి కావు/ సిరా మరకల పుక్కిటి పురాణికులు/ పుట్టించిన పాత్రవే మాత్రము కావు/ చితిబూడిదల ఆత్మలకు మోక్షపు దారి/ చూపించగా నీవు రాలేదు/ ఎవరో నిను మింగి చెవి నుండి పంపించెననె/ రాతలకు జవాబుదారివి కావు/ హరి పాదముల నుండి అవతరించితివి కానీ/ కాళ్లెపుడు పొత్తిల్లు కావు కదనే/ కాళ్ల నుండి పుటక ఇచ్చాడు అంతే/ కాళ్ల ఊయలపైనా ఊపినది లేదు’’ అంటూ సున్నితంగా గంగను హరికి దూరంగా జంగమయ్య, ఆయన శ్రామిక భక్తుల దగ్గరగా చేరుస్తారు. చివరగా ‘‘జిస్ దేశ్ మే శూద్ర్ రహతే హై/ ఉస్ దేశ్ మే గంగా బహతీ హై’’ అని, శూద్రులు ఉన్న చోటే గంగ ఉంటుంది అని తీర్మానిస్తారు.

ఇది ఈ కవి కోణం. పాట పుట్టుకకు చెమట బొట్టే ఆధారమన్న అశోక్ తేజ గంగను తన పదునైన వాదనతో శూద్రుల శ్రేయోనిధి అంటున్నారు. ఎవరైనా దీనిని విభేదించవచ్చు. ఖండిస్తూ మరో కావ్యం రాయవచ్చు. ఔను కదా అని ఒప్పుకోనూ వచ్చు. అయితే ఈ రచనలో కవి ప్రదర్శించిన లయబద్ధ కావ్య ధృతి, పదుగురు వాడే పదాల పరవళ్లు, పొందికైన భాషా సౌందర్యం అందరిని కట్టిపడేస్తుంది. సృష్టికర్తలు ఏ కానరాని లోకాల్లోనో లేరు మన చుట్టూ ఉన్న మట్టి మనుషులే వాళ్లు అని తమ రాతల ద్వారా మళ్ళీ మళ్లీ చెబుతున్న అశోక్ తేజ శ్రామిక కవి.

బద్రి నర్సన్

94401 28169

ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 28 , 2026 | 02:15 AM