వాళ్లు మన తోబుట్టువులు కాదా?
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:15 AM
‘సారీ, నాకు గిల్టీగా ఉంది. మీరు అంత దూరం నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చారు. మీతో సరిగా తెలుగులో మాట్లాడలేకపోతున్నాం’. శ్రీలంక రాజధాని కొలంబోలో ఓ పాతికేళ్ల యువతి ఇలా ఇంగ్లీష్‌లో చెబుతుంటే...
‘సారీ, నాకు గిల్టీగా ఉంది. మీరు అంత దూరం నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చారు. మీతో సరిగా తెలుగులో మాట్లాడలేకపోతున్నాం’. శ్రీలంక రాజధాని కొలంబోలో ఓ పాతికేళ్ల యువతి ఇలా ఇంగ్లీష్‌లో చెబుతుంటే మొదట నాకు అర్థం కాలేదు. మళ్లీ అదే మాట చెప్పింది. తన కళ్లలోని బాధను చూసి నా మనసు ఆందోళన చెందింది. రెండు నిమిషాల తర్వాత ఓ మధ్య వయసు స్త్రీ ఆప్యాయతతో దగ్గరికి వచ్చింది కానీ, అన్ని తమిళ మాటలే. నాకు అర్థం అయ్యి, అవ్వక ఆ సంభాషణ మధ్యలో ఆగింది.
కొలంబోలోని ‘ఆల్ సిలోన్ తెలుగు కాంగ్రెస్’ సంస్థ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వెల్దండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, దీర్ఘాసి విజయ భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ చామర్తి మురళీధర్ బృందంతో కలిసి నేను శ్రీలంకలో అయిదు రోజుల పాటు పర్యటించాను.
ఆ సందర్భంగా కొలంబోలోని శ్రీ నారాయణగురు కళా కేంద్రంలో ఓ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు తెలుగు సంతతి వాళ్లు వంద మంది దాకా హాజరయ్యారు. వీళ్లంతా బ్రిటిష్ పరిపాలన కాలంలో అక్కడి తేయాకు తోటల్లో పనులు చేయడానికి వెళ్లిన మన ప్రాంతంవారు. మగవారు పంచె, ప్యాంటు–షర్ట్‌లు, ఆడవారు చీర, చుడిదార్, మాక్సీల ఆహార్యంతో ఉన్నారు. ఈ కాలం పిల్లలు జీన్స్ ప్యాంట్‌లతో మోడరన్ డ్రెస్సుల్లో ఉన్నారు. అంతమంది తెలుగు వాళ్లను ఒకచోట, అదీ కొలంబోలో చూడడం చాలా సంతోషంగా అనిపించింది. మేమందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. స్టేజీ మీద ఓ యువకుడు మైకులో సినిమా పాటలు పాడుతూ సభికుల్ని ఉత్సాహపరుస్తున్నాడు. అతడు పాడుతోంది ఓ తమిళ సినిమా పాట!
సభ మొదలైంది. మా పేర్లు పలకడం కష్టంగా ఉందని నాకు మైక్ ఇచ్చి అందరినీ ఆహ్వానించమని తెలుగు కాంగ్రెస్ అధ్యక్షులు అంబులగన్ కోరారు. ఆయన 77 ఏళ్ల వృద్ధులు. పైగా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందట, అయినా మమ్మల్ని ఆహ్వానించడానికి విమానాశ్రయానికి వచ్చారు. అందరూ స్టేజీని అలంకరించాక... ‘‘మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మీ అందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉంద’’ని చెబుతూ ఓసారి ఎదురుగా చూశాను. అందరూ తెల్లబోయి నన్ను చూస్తున్నారు. ‘వాళ్లకు నా మాటలు అర్థం కావడం లేదని తెలిసి, నాకు వచ్చిన కాస్త తమిళంలో... ‘‘వణక్కం, రొంబ సందోషం అయిచు, తెలుంగు తెరియమా’ అని అడిగాను. అందరూ తలలు అడ్డంగా ఊపారు. ‘తెలుగు నేర్చుకుంటారా’ అని అడిగా, ఇద్దరు మాత్రమే చేతులు పైకి ఎత్తారు. ఒక్కసారిగా నాలో నిరాశ. ఇకపై ఏమి మాట్లాడాలో అర్థం కాక సెలవు తీసుకుంటూ కూర్చుండిపోయాను. అయితే స్టేజీ మీద ఉన్న పెద్దలు మాత్రం అందరినీ కలుపుకుంటూ ఉత్సాహంగా మాట్లాడారు. వేదిక మీదున్న అతిథులకు సత్కారాలతో సభ ముగిసింది. కిందకు రాగానే, మాతో సెల్ఫీలు దిగడానికి అందరూ పోటీలు పడ్డారు. ఎంతో గౌరవించారు. మమ్మల్ని ఎంతో ఆప్యాయతతో చూస్తున్నారు. కానీ మాట్లాడుకోవడం మాత్రం కష్టమే. వాళ్లకు మన భాష రాదు, మనకూ వాళ్ల భాష తెలియదు. అప్పుడే ఓ యువతి వచ్చి, గిల్టీగా ఉందని చెప్పి నాలో ఆలోచనల సుడిగుండాల్ని రేకెత్తించింది.
ఇక్కడ ఎవరిది తప్పు? వాళ్లదా? మనదా? లేక మొత్తం తెలుగు సమాజానిదా? అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 6 లక్షల తెలుగు సంతతి వాళ్లు నేడు శ్రీలంకలో తెలుగుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఉన్న అయిదవ తరం వాళ్లకు తెలుగు అస్సలు రాదు. నాలుగో తరం వాళ్లు రెండు మూడు తెలుగు పదాలే మాట్లాడగలరు. ఆ దేశానికి వాళ్లు వెళ్లి దాదాపు రెండు వందల ఏళ్లు గడిచాయి. మనం వాళ్లను పూర్తిగా మర్చిపోయాం. నేడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్లే తెలుగు వాళ్లా? శ్రీలంక, మయన్మార్, మలేసియా, మారిషస్, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలకు బ్రిటిష్ కాలంలో వలస వెళ్లిన తెలుగువాళ్లను మనం ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్లు మన తెలుగు తోబుట్టువులు కాదా? నేడు వాళ్ల మాతృభాష వేరే కావొచ్చు కానీ పూర్వీకుల భాష, సంస్కృతి సంప్రదాయాలు తెలుగు కదా? నేటికీ ఆ ఆచారాలను ఇంకా కొనసాగిస్తున్నారు కదా? అంటే వాళ్లు మనల్ని మర్చిపోలేదు, మనమే వాళ్లను పూర్తిగా విస్మరిస్తున్నాం.
అందుకే, శ్రీలంక తెలుగు తోబుట్టువులకు... ‘మిమ్మల్ని ఇంతకాలం మర్చిపోయినందుకు మాకు చాలా గిల్టీగా ఉంది, క్షమించండి’ అని చెప్పి వచ్చా.
డి.పి. అనురాధ
ఈ వార్తలనూ చదవండి:
ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు