Share News

‘సర్‌’పై ఎందుకా వ్యతిరేకత?

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:48 AM

1990ల్్లో ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టి.ఎన్.శేషన్‌పై రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోశాయి. ఓటరు గుర్తింపు కార్డుపై ఫొటో తప్పనిసరిగా ఉండాలనే నిబంధన రాజకీయ పార్టీలకు...

‘సర్‌’పై ఎందుకా వ్యతిరేకత?

1990ల్్లో ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టి.ఎన్.శేషన్‌పై రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోశాయి. ఓటరు గుర్తింపు కార్డుపై ఫొటో తప్పనిసరిగా ఉండాలనే నిబంధన రాజకీయ పార్టీలకు ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా బిహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతను బాహాటంగానే వెలిబుచ్చారు. బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, దొంగ ఓట్లపై ఆధారపడిన పార్టీలకు, నేతలకు శేషన్ ప్రవేశపెట్టిన ఎన్నికల సంస్కరణలు మింగుడుపడలేదు.

ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ‘సర్’ పేరిట ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవసరమని భావించింది. మరణించిన, దేశం వదిలి వెళ్లిపోయిన ఓటర్లను, రాష్ట్రాలు మారిన, ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లను తొలగించడంతో పాటు రీ–మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది. సరిహద్దుల్లోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల జనాభా అతివేగంగా పెరుగుతోంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భారతదేశంలో నివసిస్తున్నారు. ఇది క్రమంగా జనాభా నిష్పత్తిలో మార్పుగా పరిణమిస్తోంది. దీంతో ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాను సవరించాలని నిర్ణయించింది. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో ‘సర్’ ప్రక్రియ పూర్తయింది. మిగతా రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతోంది.

కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియను చేపట్టడం ఇది తొలిసారి కాదు. 1952 నుంచి 2004 వరకు 13 సార్లు సమగ్ర ప్రత్యేక సర్వేలు జరిగాయి. చివరగా మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004–05లో దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ జరిగింది. అయితే ప్రాంతీయ పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి వాటి మాట వినాల్సి వచ్చింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా జరిగింది. ప్రస్తుతం, ‘సర్’ ప్రక్రియ శాస్త్రీయ సవరణ కాదని, రాజకీయ సమీకరణ అంటూ వస్తున్న విమర్శలను పరిశీలిస్తే... దెబ్బతింటున్న ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు అర్థమవుతాయి. ఎన్నికల సంఘం సర్ ప్రక్రియలో ఈసారి కేవలం భౌతిక తనిఖీలపైనే ఆధారపడకుండా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓటర్ల జాబితాను స్కాన్ చేస్తోంది. దీనికోసం కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన DSEs– Demographically Similar Entries, PSEs– Photo Similar Entries, DDS– De–Duplication Softwareలను ఎన్నికల కమిషన్ వినియోగిస్తోంది. అంటే ఒకే పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఒకే వయస్సు ఉన్న ఓటర్లను ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో వేర్వేరు బూత్‌లలో ఉన్న ఒకే వ్యక్తి ఫొటోలను ఐడెంటిఫై చేస్తుంది. రేషన్ కార్డు లేదా సివిల్ సప్లైస్ డేటాబేస్‌లతో క్రాస్–వెరిఫి కేషన్ చేయడం వల్ల పారదర్శకత ఉంటుంది.


తమిళనాడులో ‘ఘోస్ట్ ఓటర్ల’ను భారీగా తొలగించారు. సవరణకు ముందు ఓటర్ల సంఖ్య 6.41 కోట్లు. సవరణ తర్వాత 5.67 కోట్లు. వలసల కారణంగా పాత నియోజకవర్గాల్లో ఓట్లు అలాగే ఉండిపోతే పీఎస్‌ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా దాదాపు 74 లక్షల ఓట్లను తొలగించారు. తొలగించిన తర్వాత అర్హులైన ఓటర్లు సరైన పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును పునరుద్ధరించుకున్నారు. ప్రసార మాధ్యమాల్లో కేవలం తొలగింపునకు సంబంధించిన గణాంకాలు మాత్రమే రావడంతో అనవసరమైన ఆందోళన, గందరగోళం నెలకొన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ‘సర్’ వల్ల పౌరసత్వమే ప్రమాదంలో పడుతోందనే భయాలను ప్రచారం చేస్తున్నాయి. సర్‌లో నమోదు కాకపోయినా తర్వాత దరఖాస్తు చేసుకుని ఓటర్ల జాబితాలో పేరు చేర్పించుకోవచ్చు. బీఎల్‌వోలు, ఎన్నికల అధికారులు దరఖాస్తు పత్రాలను పరిశీలించి అర్హతను నిర్ధారించిన తర్వాత దరఖాస్తుదారుడి పేరును ఓటర్ల జాబితాలో చేరుస్తారు. దేశవ్యాప్తంగా 4,123 శాసనసభ నియోజకవర్గాలుంటే అందులో దాదాపు 870 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని కోట్ల నకిలీ ఓట్లు, అక్రమ ఓట్లు, వలసదారుల ఓట్లు ఉన్నట్టు అంచనా. మృతిచెందిన వారిని మినహాయిస్తేనే ఈ స్థాయిలో నకిలీ, అక్రమ ఓట్లు ఉన్నాయంటే... ఎన్నికల జయాపజయాలను ఆ ఓటర్లే నిర్ణయిస్తున్నారని అర్థమవుతోంది.

‘సర్’ ప్రక్రియలో ముస్లిం ఓటర్లే లక్ష్యమంటూ కొన్ని పార్టీలు మరో అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ‘సర్’ ప్రక్రియలో 63శాతం హిందువుల ఓట్లు తొలగిస్తే, కేవలం 34శాతం ముస్లిం ఓట్లను తొలగించారు. అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ‘సర్’ ప్రక్రియ లక్ష్యం హిందువు–ముస్లిం–క్రిస్టియన్ కాదు. దేశంలో నికరంగా ఎన్ని అసలైన ఓట్లున్నాయో తేల్చడం. తెలంగాణలో ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్నందున, హైదరాబాద్ పాతబస్తీలో కొన్ని లక్షల ఓట్లు డిలీట్ అవుతాయనే ప్రచారం చేస్తున్నారు. ఇది సహేతుకం కాదు. సరైన పత్రాలు ఎవరు చూపితే వారు ఓటర్లుగా ఉంటారు. ఏ మతంవారు సరైన పత్రాలు చూపకపోయినా సహజంగానే వారి ఓట్లు జాబితా నుంచి డిలీట్ అవుతాయి. ఇందులో మళ్లీ మెజారిటీ ఓటర్లు తిరిగి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు. అందుకే రాజకీయ పార్టీల అబద్ధపు ప్రచారాలను పట్టించుకోకుండా ప్రజలు తాము స్వతహాగా ‘సర్’పై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి.

వీరప్ప వనకల్ల

ఈ వార్తలనూ చదవండి:

చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

Updated Date - Jul 10 , 2026 | 12:48 AM