కొత్త రైల్వే జోన్ సరే.. అన్యాయాల మాటేమిటి?
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:38 AM
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఎట్టకేలకు విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేర కొత్త రైల్వే జోనల్ కార్యాలయం ఏర్పాటయింది. అయితే దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న కొత్త రైలు మార్గాల..
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఎట్టకేలకు విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేర కొత్త రైల్వే జోనల్ కార్యాలయం ఏర్పాటయింది. అయితే దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న కొత్త రైలు మార్గాల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొత్త జోన్ ఏర్పడే వరకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఆదాయంలో దేశం మొత్తంలో మూడో స్థానంలోనూ, దక్షిణాది రాష్ట్రాలలో ప్రథమ స్థానంలోనూ ఉన్నది. అయినా నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక రైల్వే స్టేషన్లు, రైలు మార్గాలు ఇతర రైల్వే జోన్లలో కలపడం వల్ల తీవ్ర అన్యాయం జరిగింది.
మాచర్ల–నల్లగొండల మధ్య 92 కి.మీ రైల్వే లైను నిర్మాణ పనులు 1997–98లో ప్రారంభం కాగా, కోటిపల్లి–నర్సాపూర్‌ల మధ్య 57 కి.మీ, పిఠాపురం–కాకినాడ మధ్య 22 కి.మీ నూతన రైల్వే లైన్ నిర్మాణ పనులు 2001–02లో, కడప–బెంగళూరు మధ్య 255 కి.మీ పనులు 2008–09లో, నడికుడి–శ్రీకాళహస్తి మధ్య 308 కి.మీ, గూడూరు–దుగరాజపట్నం మధ్య 45 కి.మీల పనులు 2011–12లో ప్రారంభమయ్యాయి. ఇక 2012–13లో భద్రాచలం రోడ్–కొవ్వూరు మధ్య 152 కి.మీ, కంభం– ప్రొద్దుటూరు మధ్య 110 కి.మీ, కొండపల్లి–కొత్తగూడెం మధ్య 120 కి.మీ మేరకు కొత్త రైల్వే లైన్ల పనులు ప్రారంభించారు. అంటే ఈ పనులు చేపట్టి దశాబ్దాలు దాటుతున్నా నేటికీ పూర్తి కాలేదు. కోటిపల్లి–నర్సాపూర్‌ల మధ్య రైలు మార్గం నిర్మాణం పూర్తయితే కోనసీమ ప్రజలకు రైలు ప్రయాణ సదుపాయం కలుగుతుంది. ఈ సర్వే పూర్తి చేసిన సమయానికి ఖర్చు అంచనా రూ.498 కోట్లు కాగా, నేడు అది రూ.1200 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు నూతన రైలు మార్గాలు పూర్తవుతాయా? అనే అనుమానం కలుగుతోంది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం ప్రతిపాదిత కొత్త రైల్వే మార్గాల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో కనీసం ఆరు శాతం ఆదాయం వచ్చే అవకాశం ఉంటే చాలు. కానీ తెలుగు రాష్ట్రాలలో ప్రతిపాదించిన ప్రతి కొత్త రైల్వే మార్గంలో 6 నుంచి 10శాతం ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయినా అవసరమైన నిధులు కేటాయించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 22 మార్గాలలో నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి రెండు దశాబ్దాల కిందటే సర్వేలు పూర్తయ్యాయి. మార్కాపురం–శ్రీశైలం–హైదరాబాద్‌ల మధ్య 290 కి.మీ, మాచర్ల–గద్వాల్ మధ్య 184 కి.మీ, నెల్లూరు–రాజంపేట మధ్య 120 కి.మీ, సామర్లకోట–చింతూరుల మధ్య 150 కి.మీ, కల్యాణదుర్గం–అనంతపూర్‌ల మధ్య 58 కి.మీ, భద్రాచలం–సత్తుపల్లి మధ్య 54.1 కి.మీ మేరకు నూతనంగా రైల్వే లైన్లు వేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. వీటి సర్వేలు, ప్రతిపాదనలు సిద్ధం చేసి పుష్కరకాలం దాటింది. ఇవి కార్యరూపం దాల్చుతాయో లేదో తెలియదు. కానీ కేవలం ఆరేళ్ల క్రితం తమిళనాడులో కొత్తగా ప్రారంభించిన 14 రైల్వే లైన్ల పనులు, కర్ణాటకలో ప్రారంభించిన 18 రైల్వే లైన్ల పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా నంద్యాల–ఎర్రగుంట మధ్య 126 కి.మీ, కాకినాడ–కోటిపల్లి మధ్య 45 కి.మీ, (ఇది కొత్త లైను కాదు, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దెబ్బతిన్న ఈ మార్గాన్ని పునరుద్ధరించారు) కృష్ణపట్నం– ఓబులవారిపల్లి మధ్య 113 కి.మీ మేరకు మాత్రమే రైల్వే లైన్లు వేశారు. కానీ ఇదే సమయంలో తమిళనాడులో కొత్తగా ఏడు లైన్లు, కర్ణాటకలో ఏడు లైన్లు పూర్తయ్యాయి.
ఇక ఆదాయం విషయానికి వస్తే– దేశవ్యాప్తంగా ఉన్న (కొత్తగా ఏర్పడిన విశాఖ రైల్వే జోన్ కాకుండా) 17 రైల్వే జోన్ల నుంచి 2024–25లో 2,65,002.4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇందులో నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ మొదటి స్థానంలో, ఈస్ట్‌కోస్ట్ జోన్ రెండో స్థానంలో, సౌత్ సెంట్రల్ రైల్వే మూడో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో అయితే ప్రథమ స్థానంలో ఉంది. సౌత్ సెంట్రల్ జోన్ నుంచి పెద్దమొత్తంలో ఆదాయం లభిస్తున్నా అభివృద్ధి పరంగా ఈ జోన్‌కు నామమాత్రంగా కూడా నిధులు కేటాయించడం లేదు.
కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు ముందు కొత్తవలస–అరకు రైలు మార్గాన్ని ప్రస్తుతం విశాఖ డివిజన్ నుంచి తప్పించి రాయగఢ్ డివిజన్ పరిధిలోకి చేర్చారు. ఈ కారణంగా పర్యాటక కేంద్రాలైన అరకు, బొర్రాగుహల ద్వారా లభించే ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. రాయచూర్–వాడి మధ్యలో ఉన్న 108 కి.మీ రైలు మార్గం, పగిడిపల్లి–విష్ణుపురం–జాన్‌పహాడ్ మధ్య ఉన్న 142 కి.మీల రైల్వేలైన్లను గుంతకల్ నుంచి విడదీసి సికింద్రాబాద్ డివిజన్‌లో కలిపారు. అదేవిధంగా జగ్గయ్యపేట ప్రాంతంలోని సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా అధిక ఆదాయం లభించే మోటమర్రి– జగ్గయ్యపేట మార్గాన్ని దగ్గరలో ఉన్న విజయవాడ డివిజన్‌కు బదులుగా సికింద్రాబాద్ డివిజన్‌లో ఉంచారు.
అంతేకాకుండా మన రాష్ట్ర పరిధిలోని దాదాపు 500 కి.మీల రైల్వే లైన్లు ఇతర రాష్ట్రాల రైల్వే జోన్ల పరిధిలో కొనసాగుతున్నాయి. ఉదాహరణకు తడ–గూడూరు మధ్య ఉన్న 68 కి.మీ రైల్వే లైను చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వే జోన్‌లో, ధర్మవరం–హిందూపూర్ మధ్య ఉన్న 107 కి.మీ రైల్వే లైను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లోని బెంగళూరు డివిజన్‌లో ఉన్నాయి. అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన సూళ్లూరుపేట, నగరి ప్రాంతాలు సదరన్ రైల్వేలో; హిందూపూర్–పెనుగొండ, పుట్టపర్తి–హిందూపూర్‌లు సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్లలో ఉన్నాయి. తాజాగా విశాఖపట్నానికి అత్యంత చేరువలో ఉండే శృంగవరపుకోట, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలు రాయగఢ్ డివిజన్ పరిధిలో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో ప్రతిపాదించిన కొత్త రైలు మార్గాల పరిస్థితి దయనీయంగా ఉంది. నూతన రైలు మార్గాలు పొందడానికి ఆర్థికంగా, నైసర్గికంగా తెలుగు రాష్ట్రాలకు అన్ని రకాలుగా అర్హత ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వ వివక్ష, రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల ఉదాసీనత కారణంగా తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనిని సరిదిద్దాలి.
అన్నవరపు బ్రహ్మయ్య
సీనియర్ జర్నలిస్ట్
ఇవి కూడా చదవండి
మళ్లీ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కువైట్, జోర్డాన్‌పై ఐఆర్‌జీసీ తాజా దాడులు..
గోరింటాకు అందాలు.. ఆరోగ్యానికీ మంచిదే..