భారతీయ అస్తిత్వం.. ‘బయటి మనిషి’
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:36 AM
బహుశా, సమకాలీన భారత రాజకీయాలలో సోనియాగాంధీ వలే అవమానాలకు గురైన వ్యక్తి మరొకరు లేరేమో?! 1998లో ప్రజా జీవితంలోకి ప్రవేశించింది మొదలు, ఆమె నిరంతరం...
బహుశా, సమకాలీన భారత రాజకీయాలలో సోనియాగాంధీ వలే అవమానాలకు గురైన వ్యక్తి మరొకరు లేరేమో?! 1998లో ప్రజా జీవితంలోకి ప్రవేశించింది మొదలు, ఆమె నిరంతరం తీవ్ర విమర్శలకు గురయ్యారు. సోనియా రాజకీయాలపై కాకుండా, తన మూలాలకు వ్యతిరేకంగా ఆ విమర్శలు వెల్లువెత్తాయి. సోనియా జన్మతః ఇటలీ జాతీయురాలు. విమర్శకులు ఈ యాదృచ్ఛిక విషయాన్నే ఆమెకు పదేపదే గుర్తు చేశారు. ఒక విదేశీయురాలు భారతీయ అస్తిత్వానికి అనర్హురాలు అయినట్టుగా ఆమెను కించపరిచారు.
ఈ కారణంగానే సోనియా తన ఆత్మకథాత్మక జ్ఞాపకాల సంపుటికి ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అని పేరుపెట్టారు. అదొక అసాధారణ జీవితగాథ. ఇటలీలోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన ఒక యువతి అంతిమంగా భారత జాతీయ కాంగ్రెస్‌కు అధినేత్రి కావడం అద్భుతం కాదూ? కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె ఒక దశాబ్దకాలం పాటు నిస్సందేహంగా అత్యంత ప్రభావశీల రాజకీయ నాయకురాలిగా వెలుగొందారు. ఇటలీ జాతీయురాలు నుంచి భారతీయ పౌరురాలిగా సోనియా ప్రస్థానం ఊహకు అందని ఒక వింత జీవనయాత్ర.
సోనియా ‘బిలాంగింగ్’లోని కొన్ని కథలు ఇంతకుముందు విన్నవే. కేంబ్రిడ్జ్‌లోని ఒక గ్రీక్ రెస్టారెంట్లో రాజీవ్‌గాంధీ ఆమెకు పరిచయమయ్యారు. తొలిచూపులోనే ఇరువురి మధ్య ప్రేమ అంకురించింది. ఒక హిందీ సినిమా ప్రేమకథకు కావల్సిన అంశాలు అన్నీ ఆ ప్రేమోదయంలో ఉన్నాయి. ఈ కలయిక తమను ఎక్కడికి తీసుకువెళుతుందో ఆ యువ భారతీయ విద్యార్థిగానీ, ఇటాలియన్ అమ్మాయిగానీ ఊహించలేదు.
ఇటలీలోని అర్బాసానో అనే చిన్న పట్టణం నుంచి అధికార ప్రభావాలకు నెలవైన లూట్యెన్స్ ఢిల్లీకి జరిగిన ప్రస్థానానికి సంబంధించిన సోనియా జ్ఞాపకాలు పాఠకులను సమ్ముగ్ధం చేస్తాయి. భారతీయ ఆహారం, దాని మసాలాలు, చీర కట్టుకోవడం, గృహ పనులలో పాల్గొనడం, భారతీయ పండుగల ఆచారాలు, ఆనందాలలో నిమగ్నమవడం మొదలైనవాటిని నేర్చుకోవడం ద్వారా సోనియా క్రమంగా భారత్‌ను తన సొంత దేశంగా చేసుకున్నారు. ఆమె తరచూ ఒంటరితనానికి గురయ్యేవారు. ఆత్మ సందేహాలు తలెత్తేవి. అయితే రాజీవ్తోను, ఆయన కుటుంబంతోను, వారి ద్వారా భారత్‌తో పెరిగిన ప్రగాఢ అనుబంధమూ ఆమె జీవితంలో వెలుగులను, ఎనలేని ఆనందానుభూతులను నింపింది.
1984లో అత్తగారు ఇందిర, 1991లో భర్త రాజీవ్ హత్యలు సోనియా జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. రాజీవ్ హత్య అనంతరం ఇటలీకి తిరిగివచ్చేయమని సోనియాను ఆమె తోబుట్టువు కోరింది. లేనిపక్షంలో ఆ కుటుంబంలో తరువాత హత్యకు గురయ్యేది సోనియానే అని ఆమె సోదరి భయపడింది. ఇది నిర్హేతుకమైన భయం కాదు. అయినప్పటికీ భారత్‌లోనే ఉండిపోయేందుకు సోనియా నిర్ణయించుకున్నారు. ఆమె భావోద్వేగ అనుబంధాలు ఇంకెంత మాత్రం పుట్టిన దేశంతో కాకుండా తనకు, తన పిల్లలకు నివాసమయిన భారత భూమితో పెనవేసుకుపోయాయి. బహుశా సోనియా ఆత్మకథలో అంతర్లీనంగా సాగే ప్రధాన సారాంశం ఇదే కావచ్చు: ఒక ప్రాంతంతో ఉండే అనుబంధం కేవలం వారసత్వంగా మాత్రమే రావాల్సిన అవసరం లేదు. అది ప్రేమ, వియోగం, విధేయత, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా కూడా ఏర్పడుతుంది.
వ్యక్తిగత ఆకాంక్షల వల్ల సోనియా రాజకీయాల్లోకి రాలేదు. నిజానికి రాజకీయవేత్తల పట్ల ఆమెకు సదభిప్రాయం కూడా లేదు. వారు కపటులు, డబ్బుకు అమ్ముడుపోయేవాళ్లని ఆమె అభిప్రాయపడేవారు. తమ తల్లి రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంక కూడా వ్యతిరేకించారు. ఒక విధ్యుక్తధర్మ భావనే ఆమెను రాజకీయాల్లో ప్రవేశించేందుకు పురిగొల్పింది. ప్రజా జీవితంలోకి ప్రవేశించేముందు ఆమె భగవద్గీతను చదివారు. రాజకీయాలు ఆమె గమ్యం కానేకావు. వాటిని ఒక బాధ్యతగా ఆమె భావించారు. ఈ దేశం పట్ల తనకొక కర్తవ్యం ఉన్నదని ఆమె విశ్వసించారు. ఆ కర్తవ్య పాలనకు ఆమె పూనుకున్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, ఆ కర్తవ్య నిర్వహణకు ఆమె అంకితమయ్యారు. ఆ కారణంగానే ఆమె అంతిమంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు.
సోనియా విమర్శకులు ఆమె కథనంతో ఏకీభవించకపోవచ్చు. వంశపారంపర్య రాజకీయాలు వ్యవస్థీకృతమయ్యేందుకు ఆమె దోహదం చేశారని వారు తప్పక వాదిస్తారు. ఆమె రాజకీయరంగ ప్రవేశం నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీతో విడదీయలేనిదిగా చేసిందని, నిజానికి ఇదే ఆమె లక్ష్యమని కూడా విమర్శకులు అంటున్నారు. సోనియాను సమర్థించేవారు ఈ వాదనను సహజంగానే వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత ఆకాంక్షతో కాకుండా తన కుటుంబం, కాంగ్రెస్ పార్టీ విషయంలో ఒక సమున్నత బాధ్యతను నిర్వర్తించేందుకే ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారని సోనియా మద్దతుదారులు వివరిస్తున్నారు. విమర్శకుల, మద్దతుదారుల అభిప్రాయాలు రెండూ నిశిత పరిశీలనకు అర్హమైనవే. ఒక ఆత్మకథ అనేది చరిత్ర తనను ఏ విధంగా గుర్తుంచుకోవాలో రచయిత స్వయంగా మలుచుకునే ఒక ప్రయత్నం కూడా అన్న విషయాన్ని మనం విస్మరించకూడదు.
అయితే సోనియాగాంధీ కథకు మరో కోణం ఉంది. అది అలక్ష్యం చేయలేనిది. కాంగ్రెస్ అధినేత్రిగా అనేక సంవత్సరాలు ఉన్నా, దేశ రాజకీయ వ్యవస్థలోని వివిధ శ్రేణులు ఆమెను పూర్తిగా అంగీకరించలేదు. సోనియా విదేశీ మూలాలు ఒక రాజకీయ ఆయుధమయ్యాయి. ఆమె నాయకత్వాన్ని ఎగతాళి చేశారు. ఈ దాడుల నుంచి ఆమె పిల్లలనూ మినహాయించలేదు. కాంగ్రెస్‌కు ఆమె నాయకత్వం వహించడాన్ని పదేపదే ప్రశ్నించారు. ఆమె ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు తేలికైనవి కావు. పితృస్వామ్య ధోరణుల రాజకీయ ప్రపంచంలో ఉన్న మహిళా నేత ఆమె, అందునా పుట్టుక రీత్యా విదేశీయురాలు. ప్రజా జీవితంలో ఆమె ఒంటరితనం బహిరంగంగా తరచూ కనిపిస్తుంది.
సోనియా రాజకీయ బలం ఏమిటి? ఆమె తన పరిమితులను అర్థం చేసుకున్నారు. ఇదే సోనియా రాజకీయ శక్తి అని నేను తరచూ భావిస్తుంటాను. ఆమె ఒక మంచి శ్రోత. ఎవరితో సంభాషించినా ఎదుటి వ్యక్తి చెప్పేది ఆమె శ్రద్ధగా వింటారు. తాను మితంగా మాట్లాడతారు. ఆ మాటామంతీలో తన ప్రాబల్యాన్ని ప్రదర్శించేందుకు ఆమె ఎంతమాత్రం ప్రయత్నించరు. ఇతరుల మాటలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆమె స్వతస్సిద్ధంగా గుర్తిస్తారు, అర్థం చేసుకుంటారు. విభిన్నమైన పార్టీలతో ఒక రాజకీయ కూటమి ఉనికిలోకి వచ్చేందుకు ఆమె తోడ్పడ్డారు. ఆ రాజకీయ సంకీర్ణం 2004 నుంచి పది సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించింది. రాజకీయ ఆచరణవాదాన్ని సూత్రబద్ధ నిబద్ధతతో సమన్వయ పరచవచ్చని ఆమె నిరూపించారు. మతతత్వ రాజకీయాలను ఆమె దృఢ నిశ్చయంతో వ్యతిరేకించారు. బీజేపీ–ఆరెస్సెస్ భారత్ భావన అనేది గాంధీ–నెహ్రూల సమ్మిళిత సమాజ దార్శనికతకు విరుద్ధమైనదని ఆమె విశ్వసించారు. హక్కుల ఆధారిత పరిపాలనా నమూనాను సోనియా సమర్థించారు. 2004లో ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు వచ్చిన అవకాశాన్ని తిరస్కరించడం ఆమె రాజకీయ జీవితంలో ఒక ప్రధాన చరిత్రాత్మక నిర్ణయం. ప్రభావశీల పర్యవసానాలకు దోహదం చేసిన నిర్ణయమది. ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టకూడదనేది ‘అంతర్వాణి’ ప్రేరణతో అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, అప్పటికి చాలా నెలల క్రితమే తాను ఆ నిర్ణయానికి వచ్చానని సోనియా వెల్లడించారు. తాను ప్రధానమంత్రి అయితే తన విదేశీ మూలాల గురించిన చర్చ మళ్లీ మరింత తీవ్ర భావోద్వేగాలతో ప్రారంభమవుతుందనే ఆలోచన కూడా ఆమె చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉంటుందనేది ఒక కొట్టివేయలేని వాస్తవం.
దేశ రాజకీయాల్లో సోనియా నిర్వహించిన పాత్ర విమర్శలకు అతీతమైనదేమీ కాదు. తనకు వ్యతిరేకంగా దాఖలైన చార్జిషీట్ గురించి ఆమె తన ఆత్మకథలో చాలా జాగ్రత్తగా ప్రస్తావించారు. ఏవైనా వివాదాలను రెచ్చగొట్టాలని ఆరాటపడేవారికి సోనియా ఆత్మకథ రాజకీయ సున్నితత్వంలో చిక్కుకున్నట్లు అనిపించవచ్చు. సోనియాను గాంధీ–నెహ్రూల కుటుంబానికి పరిమితం చేయడం లేదా ఇటాలియన్ మూలాల పరంగా ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించడం, 1970ల నుంచీ కాంగ్రెస్ వేసిన తప్పటడుగులు, చేసిన పొరపాట్ల పరంగా ఆమెను అంచనా వేయడం... ఒక విస్తృత చరిత్రను అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. ఒక మహిళ తన జీవితకాలం అంతా ఆమోదం కోసం చేసిన అన్వేషణ గురించి సోనియా ఆత్మకథ ‘బిలాంగింగ్’ చెబుతుంది. ఇటలీలో పుట్టిన బయటి వ్యక్తిగా కాకుండా భారతదేశాన్ని తన సొంత ఇల్లుగా మార్చుకున్న భారతీయ కోడలిగా గుర్తింపు పొందాలని ఆమె కోరుకున్నారు. గుర్తింపు, జాతీయతకు సంబంధించిన ప్రశ్నలు రాజకీయంగా ఎంతో సున్నితంగా మారిన ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తి ఎక్కడ జన్మించారనే దానిపైనే ఆత్మీయానుబంధం ఆధారపడి ఉండదని సోనియా జీవితకథ గుర్తుచేస్తుంది. మనం ఎక్కడ జీవించాలనుకుంటున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, దేని కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ మనకు సొంత ఇల్లు అనే భావన కలుగుతుందనే విషయాలపై కూడా ఆ ఆత్మీయానుబంధం ఆధారపడి ఉంటుంది.
సోనియాగాంధీ ఇప్పటికీ ఎందుకు విశేష ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు? ఆమె ఒకప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధినేత్రిగా భారత రాజకీయాల్లో అత్యున్నత స్థానాన్ని అధిరోహించారనో లేదా నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యురాలిగా కొనసాగుతున్నారనో మాత్రమే కాదు. నేటి భారతదేశానికి గుర్తింపు, ఆమోదం, రాజకీయ వారసత్వం గురించిన ప్రశ్నలను ఆమె జీవితం లేవనెత్తుతుంది. కనుకనే సోనియా ఇప్పటికీ ప్రాముఖ్యతను కలిగివున్నారు. చరిత్ర అంతిమంగా ఆమెపై దయతో తీర్పునిస్తుందా? లేదా? అనేది భవిష్యత్ కాలానికి సంబంధించిన ప్రశ్న. అయితే దశాబ్దాలపాటు ఇతరులు తన గురించి మాట్లాడిన తరువాత సోనియా ఎట్టకేలకు తన గురించి తానే మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒక్క కారణమే ఆమె ఆత్మకథ ‘బిలాంగింగ్’ను అవశ్య పఠనయోగ్యంగా చేస్తుంది.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..