Faiz Ahmed Faiz In Telugu Translation : పోరు వీరుల సమైక్య గానం
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:00 AM
ఫైజ్ అహ్మద్ ఫైజ్ అంటే మెదిలే మొట్టమొదటి క్వాలిటీ – ప్రేమ, విప్లవం. ప్రేమ అన్నది జీవితంలో అంతకంటే పెద్ద బాదరబందీ లేని వాడికి జీవితాన్ని రొమాంటిసైజ్ చేసుకోడానికి మాత్రం...
ఫైజ్ అహ్మద్ ఫైజ్ అంటే మెదిలే మొట్టమొదటి క్వాలిటీ – ప్రేమ, విప్లవం. ప్రేమ అన్నది జీవితంలో అంతకంటే పెద్ద బాదరబందీ లేని వాడికి జీవితాన్ని రొమాంటిసైజ్ చేసుకోడానికి మాత్రం పనికి వచ్చే విషయం (మగ ఆడ మధ్య ఉండే ఎమోషన్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతుంది). లేదా ఇంకొంత ఉపయోగకరంగా జీవితంలో ఒక తోడు వెతుక్కోడానికి అడుగులు వేసేవాళ్ళకు అవసరమైన ఎమోషన్. కాని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఈ ప్రైవేట్ ఎమోషన్‌పై పుట్టినంత కవిత్వం, సినిమాలు, కథలు మరే ఇతర ఎమోషన్ మీదా పుట్టలేదు. అయితే ఫైజ్ గొప్పతనం ఏంటంటే – ఒక నిర్బంధ రాజ్యంలో ఉన్నప్పుడూ, ఒక తిరుగుబాటు ప్రేరేపించే అవసరమున్న సందర్భంలో ఉన్నప్పుడూ ఈ ప్రేమ ఎలా వ్యక్తీకరించబడుతుంది అన్నది ఆయన ఇతివృత్తం. ‘ఇష్క్’, ‘ఇంక్విలాబ్’ కలగలిపి కొత్త ఎమోషన్‌ను కనుగొన్న కవి ఫైజ్ అహ్మద్.
పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించిన ఫైజ్ అహ్మద్ పాకిస్థాన్ కమ్యూనిస్ట్ పార్టీకి దగ్గరగా పని చేసే ‘ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్’లో నాయకత్వ స్థానంలో పని చేసాడు. అందుకు బహుమానంగా పాకిస్థాన్ ప్రభుత్వం అతనిపై రావల్పిండి కుట్ర కేసు మోపి నాలుగేళ్ళపాటు అక్రమంగా జైలులో ఉంచింది. ఆ జైలు నుండి ఎన్నో అద్భుతమైన కవితలు వెలువడ్డాయి. వాటినే మన దేశ ఆదివాసీ బడుగు వర్గాల సంక్షేమకాంక్షి ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తాను జైలులో ఉన్నప్పుడు తెలుగు చేశాడు. అదే ఈ పుస్తకం.
జీఎన్ సాయిబాబా స్వయానా కవి. ఈ అనువాదం అతనికీ, ఫైజ్‌కూ మధ్య ఒక మమేకం వల్ల పుట్టింది. ‘‘అర్ధరాత్రి, జాబిలి, అచేతన స్థితి—/ అస్తిత్వమంతా ఒంటరితనం సంతరించుకుంది/ దట్టమైన వృక్షాల తలల మీద/ అలసిన వెన్నెల స్వరం నిద్రపోతోంది...’’ ఇలా అచేతన స్థితిలో, ‘‘సమ్మో హన రాగాలలో మత్తుగొలిపించే స్వరాలు పలుకుతున్నాయి — ఆశ, స్వప్నం, నీ సుందర వదనం’’ అంటూ నిస్సహాయంగా ప్రేమను పలికిస్తాడు ఫైజ్. ‘‘ప్రేయసిని కలిసే ఆనందమే కాకుండా/ ప్రపంచంలో ఇంకా ఎన్నో విషాదాలూ సౌఖ్యాలూ ఉన్నాయి/ మునపటిలానే నిన్ను ప్రేమించమని నన్ను అడగకు ప్రియా’’ అని వ్యక్తుల మధ్య ప్రేమను ఒక విశాలమైన విజన్ ముందు సరండర్ చేస్తాడు. హృదయానికి ‘‘మళ్లీ ఒకసారి సంభాళించుకునే సిద్ధాంతాన్ని ప్రభోధించు/ మరోసారి సగాన్నీ పరిచయానికి పెట్టే నిర్దయాన్నీ వదిలిపెట్టు/ రండి, ఎందుకంటే ఈ రోజూ ప్రేమ కథ మొదలైంది/ ప్రేమ కథల అంతం మీద ఇప్పుడు కథనాలు వినిపిద్దాం రండి’’. – ప్రేమ మీద కాదు, ప్రేమ కథల అంతం గురించి కథనాలు వినిపించడం అంటే – ప్రేమ కోసం అర్రులు జాచే మనస్సులు నిర్బంధంలో ఎలా మూగవోతాయో హృదయాన్ని తాకే ఒక హింసను వ్యక్తీకరిస్తాడు. ఈ కవిత్వ పుస్తకంలో ఎంతో విషాదం ఉంది, ఎంతో విరహం ఉంది, ఎంతో నిరసన ఉంది, ఎంతో తిరుగుబాటు ఉంది.
ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వంలో ఉన్న metaphorical resistance ను పట్టడంలో అనువాదకర్త చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. సాధారణంగా అనువాదాల్లో కవిత్వం గాఢతను కోల్పోతుంది. అది తప్పనిసరి. ఇక్కడ అనువాదకర్త ఆ సారం పోకుండా తెలుగులో ప్రతిబింబించేందుకు ప్రయత్నించాడు. ఇందులో ‘‘కొట్టు’’ ‘‘చంపు’’ ‘‘తుపాకీ పేల్చు’’ ‘‘గునపం దింపు’’ లాంటి అట్టహాస ప్రతిఘటన భాష ఉండదు. స్మూత్‌గా రోల్ అవుతున్న భాషతో ఈ స్థితిగతులను వదిలించుకోవాలి అనే ఒక తృష్ణను ప్రేరేపించే విధానం మనసుకు తెలిసిపోతుంది.
సాయిబాబాకు లేని అనారోగ్యం లేదు. లివర్, పేంక్రియాస్, గుండె, ఊపిరితిత్తులు – ప్రతి అవయవం కూడా జైలు పరిస్థితులకు తల ఒగ్గి అనారోగ్యం పాలయ్యాయి. కాని మనస్సు మాత్రం పటిష్టమైన ఆరోగ్యం తోనే ఉండింది. జైలు జీవితంలో సరైన బాత్‌రూమ్ కూడా లేని పరిస్థితుల్లో, తొమ్మిదేళ్ళు ప్రతిక్షణం తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న వసంత గారిని, తనఒకే పాప మంజీరాను మిస్ అవుతూనే ఉన్నారు సాయిబాబా. అనుక్షణం ఆ కఠిన పరిస్థితుల మధ్య– జైలు గోడల మధ్య – ఈ సమాజం కోసం తన మెదడుకు పని పెడుతూనే ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఎంగుగీ కవిత్వాన్ని కూడా అనువాదం చేసాడు. అలాగే ‘‘నేను చావును నిరాకరిస్తున్నా’’ అని తన స్వంత కవితా సంకలనం కూడా రాసాడు.
ఈ పుస్తకానికి సాయిబాబా కూతురు మంజీర ముందుమాట రాసింది. ఈ కవిత్వం అంతా ఒక అనుభవం అయితే ఈ ముందుమాటలో గుండెకోత ఒక ఎత్తు. ఈ ఎమోషన్ గురించి ఇక్కడ విడదీసి రాసి దానిని పల్చబరచకూడదు. అది పుస్తకం కొని, నిశ్శబ్దమైన గదిలో ఒంటరిగా కూర్చుని – చదివి అనుభూతి పొందాల్సిందే! ఈ పుస్తకం ఒక నిరసన, ఒక ప్రేమ కావ్యం, ఒక ప్రతిఘటన సమాహారం ఒకటే కాదు రెండు సంస్కృతుల, రెండు విభిన్న కాల సమయాల, ఇద్దరి పోరు వీరుల సమైక్యగానం!
పి. విక్టర్ విజయ్ కుమార్
ఇవి కూడా చదవండి:
జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?