Share News

వాంగ్‌చుక్‌... ఆ గళాలన్నీ గప్‌చుప్‌!

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:42 AM

ఆ ఇరువురూ ధర్మ యోధులు. పాలనావ్యవస్థలో అవినీతికి, అసమర్థతకు వ్యతిరేకంగా ప్రాణత్యాగానికి సాహసించి నిరవధిక నిరాహార దీక్షలతో ప్రభుత్వాలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీరులు. వారి ధర్మ పోరాటాల...

వాంగ్‌చుక్‌... ఆ గళాలన్నీ గప్‌చుప్‌!

ఆ ఇరువురూ ధర్మ యోధులు. పాలనావ్యవస్థలో అవినీతికి, అసమర్థతకు వ్యతిరేకంగా ప్రాణత్యాగానికి సాహసించి నిరవధిక నిరాహార దీక్షలతో ప్రభుత్వాలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీరులు. వారి ధర్మ పోరాటాల మధ్య కాల విరామం పదిహేను సంవత్సరాలు మాత్రమే. వాటి కథలు భిన్నమైనవి. దేశ రాజకీయాలలో, ప్రజా దృక్పథాల్లో ఒక స్పష్టమైన మార్పును అవి సూచిస్తున్నాయి.

ఆ నైతిక యోధులలో ఒకరు అన్నా హజారే. 1990ల్లో మహారాష్ట్రలో సమాచార హక్కు చట్టం కోసం, అవినీతిపరులైన అధికారులపై చర్యలను డిమాండ్‌ చేస్తూ ఆయన అనేక ఆందోళనలు, నిరాహార దీక్షలు నిర్వహించారు. వాటికి పరాకాష్ఠ జన్‌లోక్‌పాల్‌ ఉద్యమం. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని అరికట్టేందుకు లోక్‌పాల్‌ వ్యవస్థను నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 5, 2011న ఆయన నిరాహారదీక్షకు ఉపక్రమించారు. నాలుగు రోజుల పాటు సాగిన ఆ పోరాట దీక్ష, జన్‌ లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా రూపకల్పనకు ఒక సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ముగిసింది. తిరిగి అదే ఏడాది ఆగస్టు 16న న్యూఢిల్లీలోని సుప్రసిద్ధ రామ్‌లీలా మైదానంలో అన్నా మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆయన డిమాండ్లకు అనుకూలంగా పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఆమోదించడంతో అన్నా దీక్ష పన్నెండవ రోజున (ఆగస్టు 28) ముగిసింది. లోక్‌పాల్‌ కోసం నిర్వహించిన దీక్షలతో ఆయన ఆసేతు హిమాచలం ఆబాలగోపాలానికి సుపరిచితుడు అయ్యారు.

అన్నా హజారే డిమాండ్‌ సాపేక్షంగా నిరపాయకరమైనది. అవినీతిని నిర్మూలించేందుకు గట్టిచర్యలు చేపట్టేందుకు జాతీయస్థాయిలో స్వతంత్ర లోక్‌పాల్‌ వ్యవస్థను సృష్టించాలనేది ఆయన డిమాండ్‌. అవినీతి అనేది చాలామంది పాల్పడుతున్నదే కదా అనే ఉదాసీనత దేశంలో అవినీతి పెచ్చరిల్లిపోయేందుకు దారితీస్తోంది. అందరూ చట్టోల్లంఘనకు పాల్పడుతున్నప్పుడు తాను ఒక్కణ్నే చట్టానికి కట్టుబడి ఉండడం వల్ల ప్రయోజనమేముంది అన్న ఆలోచనతో అత్యధికులు అవినీతికి కారకులవుతున్నారు. పైగా, అన్నాహజారే నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్న సందర్భంలో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం అనేక కుంభకోణాలతో అప్రతిష్ఠ పాలయివున్నది. ప్రభుత్వ ప్రమేయమున్న ప్రతి వ్యవహారంలోను అవినీతి చోటుచేసుకున్నదని ప్రజలు విశ్వసించిన కాలమది. దీంతో, అన్నా ఆందోళనకు అశేష ప్రజల మద్దతు లభించింది.


రామ్‌లీలా మైదానంలో అన్నా హజారే నిరాహార దీక్షకు మద్దతు తెలిపేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి రావడాన్ని టెలివిజన్ చానెల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. వృత్తి విధులను నైతిక నిష్ఠతో నిర్వహించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి కిరణ్‌ బేడీ లాంటి వారే కాకుండా యోగా గురువు బాబా రామ్‌దేవ్ లాంటివారు కూడా అన్నా ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చారు. అవినీతిని తాము ఎంత చిత్తశుద్ధితో వ్యతిరేకిస్తుందీ చాటుకోవడానికి అన్నా ఉద్యమానికి మద్దతునివ్వడం ఒక ప్రయోజనకరమైన మార్గమని అనేకానేకమంది విశ్వసించారు. అయితే, అన్నా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన అసలు శక్తి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌. దేశవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఈ సంస్థ తన అసంఖ్యాక కార్యకర్తలను అన్నా ఉద్యమాగ్నులు మరింతగా ప్రజ్వరిల్లేలా చేసేందుకు నియోగించింది. నర్మదాసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమించిన మేధా పాట్కర్‌; సోషలిస్టు మేధావి యోగంద్ర యాదవ్‌, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ మొదలైనవారు కూడా హజారే ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చారు. అయితే ఆ ఉద్యమ అంతిమ విజేత మట్టుకు భారతీయ జనతా పార్టీ. 2014 సార్వత్రక ఎన్నికల ఫలితాలే అందుకు తిరుగులేని నిదర్శనం.

అన్నా ఉద్యమ ఉధృతిలో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వానికీ ఒక పాత్ర ఉన్నది. ఉద్యమ జటిలతను మన్మోహన్‌ సర్కార్‌ తొలుత అర్థం చేసుకోలేదు. ఆ క్లిష్ట పరిస్థితి అర్థంకాగానే అన్నాతో ‘సంప్రదింపులు’ జరిపేందుకు కేబినెట్‌ మంత్రులు ప్రణబ్‌ ముఖర్జీ, ఏకే ఆంటోనీలతో పాటు మరో ఇద్దరు ప్రముఖుల సహాయాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకుంది. ఒకరు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్‌, మరొకరు ‘నాబార్డ్‌’ మాజీ చీఫ్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఉమేశ్‌చంద్ర సారంగి. హజారేతో చర్చలు సఫలమయేందుకు ఈ ఇరువురూ విశేషంగా తోడ్పడ్డారు. ప్చ్‌, ప్రయోజనమేముంది? అప్పటికే యూపీఏ సర్కార్‌ చేతుల్లోంచి కాలం జారిపోయింది. అరేబియా జానపద గాథలో వలే సీసా నుంచి భూతం బయటపడింది, మళ్లీ దాన్ని సీసాలో బంధించడం అసాధ్యమైపోయింది.


పర్యావరణ పరిరక్షణ యోధుడు, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహార దీక్ష అన్నాహజారే ఆందోళనకు పూర్తి భిన్నమైనది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది– వాంగ్‌చుక్‌ డిమాండ్‌ నిర్దిష్ట వాస్తవికత ఆధారంగా చేసింది. జాతీయస్థాయి ప్రవేశపరీక్షలో అవకతవకలతో కోట్లాది విద్యార్థినీ విద్యార్థులు లోనైన కష్టనష్టాలకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్నది కాక్రోచ్‌ జనతాపార్టీ డిమాండ్‌. దీనితో పోల్చితే అన్నా డిమాండ్‌ సైద్ధాంతికమైనది, సంకీర్ణమైనది. అన్నా, వాంగ్‌చుక్‌ డిమాండ్ల మధ్య వ్యత్యాసం ఆ ఇరువురి రాజకీయ చతురత మధ్య తారతమ్యతకు అద్దం పడుతుంది. హజారేకు ఉన్నత స్థాయిలో రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఆయనను ప్రభావితం చేయడమూ సులువైన విషయమే. అన్నాతో పోలిస్తే వాంగ్‌చుక్‌ దృఢ విశ్వాసాలు ఉన్న పోరాటకారుడు. ఆయన ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే మరెవ్వరూ ఆయన్ని అందుకు విరుద్ధంగా వ్యవహరించేలా ప్రభావితం చేయలేరు. తన నిర్ణయం నెగ్గేంతవరకు పట్టుదలతో ఉండే యోధుడు ఆ హిమాలయ భారతీయుడు. అన్నా డిమాండ్‌ను నెరవేర్చితే ముంచుకొచ్చే ముప్పు ఏమీలేదు. ఎందుకంటే ఆ డిమాండ్‌ అంతిమంగా నిరుపయోగకరమైనది. వాంగ్‌చుక్‌ పోరాట లక్ష్యం కంటే అన్నా ఉద్యమ ఆశయాన్ని నెరవేర్చడం సులభం.

రెండోది– వాంగ్‌చుక్‌కు ప్రతిపక్షాల మద్దతు లేకపోవడం. అన్నా ఆందోళన సందర్భంలో ఆనాటి ప్రతిపక్షం బీజేపీ ఆ ఉద్యమాన్ని తన రాజకీయ ప్రయోజనాల పురోగతికి ఒక అపూర్వ అవకాశంగా పరిగణించింది. మన్మోహన్‌ సర్కార్‌ పాలనలోని అవినీతిని ఎండగట్టేందుకు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నది. వాంగ్‌చుక్‌ పోరు సందర్భంలో ప్రస్తుత ప్రతిపక్షం ఏమి చేస్తున్నది? స్తబ్ధుగా ఉండిపోవడమే కాదూ? ఈ మందకొడితనానికి కారణమేమిటి? ప్రతిపక్షాలు వేటికవిగా ఉండిపోవడమే. ఈ అనైక్యత వల్లే మోదీ సర్కార్‌ను సవాల్‌ చేసేందుకు వాటికొక సమైక్య, సుసంగత వ్యూహం లేకుండాపోయింది. వాంగ్‌చుక్‌ ఉద్యమ మనోరథం నెరవేరితే తమకు సమకూరే ప్రత్యక్ష ప్రయోజనమేదీ లేదని విపక్షాలు భావిస్తున్నాయి. అన్నా ఉద్యమం ప్రత్యక్ష లబ్ధిదారు బీజేపీ. అందుకే అది ఆనాడు ఆ ఆందోళనను అన్ని విధాలా ఎగదోసింది, లబ్ధి పొందింది. అన్నా హజారే బీజేపీ చేతుల్లో కీలుబొమ్మ. వాంగ్‌చుక్‌ అలా కాదు, ఆయన ఒంటరి యోధుడు.


హజారే ఆందోళనలో సమస్త భారతీయులూ అవినీతికి వ్యతిరేకంగా ముక్తకంఠంతో ఘోషించారు.. అవినీతి పాలకులను అధికారం నుంచి తొలగించేందుకు సమైక్యమయ్యారు. సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లతో పాటు అంతగా ప్రాధాన్యం లేని నటీనటులు కూడా అవినీతిని గర్హించారు, నాటి పాలకులపై ధ్వజమెత్తారు. మరి వాంగ్‌చుక్‌ ఉద్యమ సందర్భంలో ఆ గళాలు ఏవీ? ఆ లోకహితులు కానరాలేదేమీ? వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామిక ప్రముఖులలో పలువురు ఆనాడు ఉదారంగా అన్నా ఉద్యమానికి బాసటగా నిలబడ్డారు. మోదీ ప్రభుత్వ నీడలో ఉన్న ఆ దిగ్గజాలు, ప్రముఖులు ఇప్పుడు ఆత్మపరిశీలనా యోగంలో నిమగ్నులై ఉన్నారు. కేవలం పదిహేను సంవత్సరాల వ్యవధిలో మన సజీవమైన, ఉద్వేగ భరితమైన, చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం ఎంత నిశ్శబ్దంగా మారిపోయిందో కదా!

మౌనం, అంతటా మౌనం. ఈ మౌనాన్ని ప్రశ్నించేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? మన ప్రజాస్వామ్యం సమస్త పౌరుల శ్రేయస్సును కోరే, దానిని సాధించే గొంతుకను మళ్లీ పొందేందుకు తోడ్పడుతుందా? ఈ ప్రశ్నలను జరూరుగా పరిష్కరించుకోవాలి. లేనిపక్షంలో ప్రస్తుత మౌనం మూగవారి నిశ్శబ్దాన్నే ప్రతిధ్వనిస్తుంది.

గిరీశ్‌ కుబేర్‌

(మరాఠీ దినపత్రిక ‘లోక్‌సత్తా’ ఎడిటర్‌.

‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యం)

ఈ వార్తలనూ చదవండి:

తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్రం క్లారిటీ..

పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచుతారా? కేంద్రం ఏమందంటే..

Updated Date - Jul 21 , 2026 | 01:42 AM