Share News

నవ్వు ఒక మెజీషియన్

ABN , Publish Date - Jun 01 , 2026 | 02:00 AM

జీవితమొక హాస్య నాటకం పాత్రే దుఃఖబావిలో నిండు బిందెలా మునిగిపోతుంటుంది కాలం కాకర తీగకి పూస్తున్న జీవన్మరణాల పూలు రాలడానికి...

నవ్వు ఒక మెజీషియన్

జీవితమొక హాస్య నాటకం

పాత్రే దుఃఖబావిలో

నిండు బిందెలా మునిగిపోతుంటుంది

కాలం కాకర తీగకి పూస్తున్న

జీవన్మరణాల పూలు రాలడానికి

యే నిర్దేశాలు వుండవు

వాటి కిటుకు ఎక్కడో ఊహాతీతం

ఊరికే అలా

జారుడుబండ మీద గోలికాయలా

దొర్లిపడ్డవాళ్ళం

ఏటిపై విసిరిన రాయి

రెండో మూడో ఈతలు దాటి

మునిగిపోయినంత తేలిగ్గా నిష్క్రమించేవాళ్ళం

పట్టుకోవడమే బాధని తెలిసినా

బతుకువేరుని వదల్లేక

ఏడాదికోసారొచ్చే తిరుణాల్ల కోసం

ఎదురుచూసే పిల్లోడిలా

ఆనందంకోసం జీవితాన్ని మోకరిల్లి అడుక్కుంటాం

జీవితమేమో

ముట్టుకుంటే చిరిగిపోయేంత

పలచని ప్రేమవస్త్రాన్ని,

అల్లెం గుండంత బరువైన పుండుపిట్టని

భుజంమీద పైపంచలా కప్పుతుంది

అప్పుడు

దుఃఖపు కోటగోడకి తలబాదుకుంటాం

వేపచెట్టుకి తేనెతుట్టె కాసినంత మాత్రాన

కొమ్మలో చేదు తగ్గుతుందా

పుల్లని మజ్జిగలో ఎన్ని ఉప్పుకల్లులు వేస్తే

మాత్రం కమ్మదనం వస్తుందా

జీవితం మనిషి గాయాల నీడ

ఆ నీడలో రంగురంగుల జీవనదృశ్యాలని

గీయలేనప్పుడు

రంగుబోయిన పాత కల శ్రుతి చేస్తున్న

వెలితి వీణపై స్థితప్రజ్ఞతని రవళించుకోవాలి

చెట్టుకి కాయ బరువైనా నవ్వాలి

కాయ వేర్లతో సహా

చెట్టుని తినేస్తున్నా నవ్వాలి

క్షతగాత్రుడి చిట్టచివరి ఆయుధం నవ్వే

దోక్కబోయిన దెబ్బపై రాళ్లు విసిరినప్పుడల్లా

చీకటి వెలుగుల గుట్టు తెలిసినవాడిలా

తీరికైన నవ్వొకటి జేగంటలా నవ్వాలి

బెత్తానికి భయపడే ఆకతాయిలా

పారిపోతుంది

నవ్వంటే జీవితానికి మహాభయం

నవ్వు ఒక మెజీషియన్

దాని టోపీలో పావురాళ్లే కాదు

పచ్చిగాయాలు కూడా మాయమౌతాయి!

ఉదయగిరి దస్తగిరి

సౌదీ & 6305112187 (వాట్సాప్)

ఇవి కూడా చదవండి..

టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ

పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్

Updated Date - Jun 01 , 2026 | 02:00 AM