స్మార్ట్‌ఫోన్‌కు బానిసవుతున్న బాల్యం!
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:07 AM
చందమామ రావే, జాబిల్లి రావే అని చంద్రుడిని చూపిస్తూ బిడ్డకు గోరుముద్దలు తినిపించే దృశ్యాలు ఆధునిక సమాజంలో అరుదైపోయాయి. ఇప్పుడు మారాం చేసే బిడ్డల చేతికి ఫోన్ ఇచ్చి అన్నం తినిపించే డిజిటల్ బుజ్జగింపుల...
చందమామ రావే, జాబిల్లి రావే అని చంద్రుడిని చూపిస్తూ బిడ్డకు గోరుముద్దలు తినిపించే దృశ్యాలు ఆధునిక సమాజంలో అరుదైపోయాయి. ఇప్పుడు మారాం చేసే బిడ్డల చేతికి ఫోన్ ఇచ్చి అన్నం తినిపించే డిజిటల్ బుజ్జగింపుల రోజుల్లో ఉన్నాం మనం. అమ్మ పొత్తిళ్లలోనే పిల్లలకు మొబైల్ ఫోన్ అలవాటైపోతున్నది. వయసొచ్చేసరికి ఈ అలవాటు కాస్తా వ్యసనంగా మారిపోతున్నది. అప్పుడప్పుడే అల్లరి మొదలుపెడుతున్న యవ్వనాన్ని అరచేతిలోని సోషల్ మీడియా సేద తీరుస్తున్నది. దురదృష్టవశాత్తూ ఇంకోమెట్టు దాటి హింసా ప్రవృత్తికి హేతువవుతున్నది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న నానుడి కాస్తా మారి, ‘నెట్’ బాలలే రేపటి నేరస్థులు అనే నిజాన్ని సోషల్ మీడియా ఆవిష్కరిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్ వినియోగం గత పదేళ్లలో భారీగా పెరిగింది. ఒక సాధారణ వ్యక్తి రోజుకు సగటున 6 గంటల 40 నిమిషాలు స్క్రీన్ ముందు గడుపుతున్నాడు. టీనేజర్లు రోజుకు 7 గంటల 20 నిమిషాలకంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ కలిగి ఉన్నారు. 85శాతం టీనేజర్లు తమకు ఫోన్ లేదా సోషల్ మీడియా అడిక్షన్ ఉందని ఒప్పుకున్నారు. 8–12 సంవత్సరాల పిల్లలు రోజుకు సగటున 4 గంటలు స్క్రీన్ ముందు గడుపుతున్నారు. స్క్రీన్ ఎక్కువగా వాడే టీనేజర్లలో 30శాతం వరకు డిప్రెషన్ ప్రమాదం పెరుగుతోంది.
‘పిల్లలు సోషల్ మీడియాకు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు?’ అనే ప్రశ్నకు సైకాలజిస్టులు మూడు ప్రధాన కారణాలు చెబుతున్నారు– 1) డోపమిన్ ఎఫెక్ట్: సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రతి నోటిఫికేషన్ మన మెదడులో డోపమిన్ అనే ఆనందకారకమైన హార్మోన్‌ను విడుదల చేస్తుంది. లైక్‌లు, కామెంట్లు, షేర్లు వంటివి డిజిటల్ ఉత్ప్రేరకాలుగా మారి, పిల్లలను మళ్లీ మళ్లీ ఫోన్ చూసేలా చేస్తాయి. 2) ఆల్గోరిథమ్ ప్రభావం: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అపరిమిత స్క్రోలింగ్ ఉంటుంది. ఒక వీడియో ముగిసిన వెంటనే ఇంకొకటి వస్తుంది. దాంతో పిల్లలు సమయం మర్చిపోతారు. నిద్రాహారాలు మాని, గంటల తరబడి అందులోనే కాలం గడిపేస్తున్నారు. 3) సామాజిక ఒత్తిడి: ‘‘నా ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు... నేను కూడా నేర్చుకోకపోతే చులకన అయిపోతాను’’ అనే భావన పిల్లలలో పెరిగిపోతున్నది. దీన్నే ‘Fear of Missing Out’ (FOMO) అంటున్నారు.
పిల్లలలో సోషల్ మీడియా ప్రభావంపై జరిగిన వైద్య పరిశోధనలు కొన్ని ప్రమాదాలను గమనించాయి. యాంగ్జైటీ (ఆందోళన), డిప్రెషన్ (కుంగుబాటు), స్వీయ గౌరవం తక్కువగా ఉండటం, సమాజానికి దూరంగా ఉండడం వంటి మానసిక సమస్యలతోపాటు, నిద్రలేమి, కంటి సమస్యలు, మెడ నొప్పి, చురుకుదనం తగ్గడం వంటి శారీరక సమస్యలకు లోనవుతున్నారు. మరికొన్ని అధ్యయనాల్లో– సోషల్ మీడియా వాడకంతోపాటు సైబర్ బులీయింగ్ అవకాశం కూడా పెరుగుతోందని గుర్తించారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు పలు చర్యలు తీసుకుంటూ, కొన్ని నియంత్రణలు తీసుకువస్తున్నాయి. ప్రపంచంలోనే ఆస్ట్రేలియా మొదటిసారిగా 16 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం, సోషల్ మీడియా కంపెనీలు పిల్లల అకౌంట్లను బ్లాక్ చేయాలి, లేదంటే భారీ జరిమానాలు ఉంటాయి. ఫ్రాన్స్‌లో– 15 ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. నెదర్లాండ్స్ ప్రభుత్వం 15 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని సిఫార్సు చేసింది. ఇండోనేసియాలో ఈ ఏడాది నుంచి 16 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ పరిమితం చేసే నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ మనది. కొన్ని ముఖ్యమైన గణాంకాల ప్రకారం, మన దేశంలో 35 కోట్లకు పైగా సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. 9–17 సంవత్సరాల పిల్లల్లో 60శాతం మంది రోజుకు మూడు గంటలకంటే ఎక్కువ సమయం సోషల్ మీడియా లేదా గేమింగ్‌లో గడుపుతున్నారు. ఒక కొత్త ట్రెండ్ ఏమిటంటే... ఇన్‌స్టాగ్రామ్‌లో 16 సంవత్సరాల లోపు పిల్లలు 83,000 మందికి పైగా ఇన్‌ఫ్లూయెన్సర్ అకౌంట్లు నిర్వహిస్తున్నారు.
మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే ఈ అంశంపై చర్యలు తీసుకుంటున్నాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 16 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొన్ననే అసెంబ్లీలో పిల్లల సోషల్ మీడియా వినియోగ నియంత్రణ చట్టాన్ని ప్రకటించారు. పదమూడేళ్ళ వయసు పిల్లలకు ఆ చట్టాన్ని వర్తింపజేస్తామని, పదహారేళ్ల పరిమితిని పరిశీలిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ ఒక కీలక అంశాన్ని గమనించాలి: ఇప్పుడు భారతదేశాన్ని ‘యంగ్ ఇండియా’ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ మరో పాతిక ముప్పయ్యేళ్ల తరువాత దేశంలో వృద్ధుల సంఖ్యే ఎక్కువవుతుంది. అందుకే చంద్రబాబు ఎక్కువమంది పిల్లల్ని కనమని ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే రాబోయే తరం నేరప్రవృత్తిలేని, నైతిక విలువలు కలిగిన తరం కావాలంటే నేటి పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. బహుశా చంద్రబాబు ఈ కీలక అంశాన్ని దృష్టిలో ఉంచుకొనే సోషల్ మీడియా నియంత్రణ చట్టం గురించి ఆలోచించి ఉండొచ్చు.
కానీ సోషల్ మీడియాను నియంత్రించడం సాధ్యమేనా? దీనికి చాలా సాంకేతిక సమస్యలున్నాయి. ఫేక్ అకౌంట్స్, వీపీఎన్, వయస్సు తప్పుగా నమోదు చేయటం వంటి టెక్నికల్ సమస్యలు ఈ చట్టాల అమలును కష్టతరం చేయవచ్చు. ఇవేగాక, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, చిన్న వయసులోనే ఫోన్ అందుబాటులో ఉండటం, డిజిటల్ అవగాహన లోపం వంటి సమస్యలూ ఉన్నాయి. సోషల్ మీడియా సమస్యకు చట్టాలు మాత్రమే సరిపోవని నిపుణులు అంటున్నారు. డిజిటల్ అక్షరాస్యతను ఉద్యమ స్ఫూర్తిగా పెంపొందించాల్సిన అవసరం ఉంది. అలాగే పిల్లల సోషల్ మీడియా వాడకానికి తల్లిదండ్రులను బాధ్యుల్ని చేయాలి. చాలా సందర్భాల్లో పిల్లలు తమ తల్లిదండ్రుల ఫోన్ల ద్వారానే సోషల్ మీడియాను వాడుతున్నారు. స్కూళ్లల్లో కూడా కట్టడి పెంచాలి. పిల్లలు స్కూల్‌కు ఫోన్ తీసుకెళ్లకుండా ఇటు తల్లిదండ్రులు, అటు టీచర్లు, స్కూల్ యాజమాన్యాలు బాధ్యత వహించాలి.
సోషల్ మీడియా ఒక గొప్ప సాధనం. అది విద్యకు, సమాచారానికి, కమ్యూనికేషన్‌కు ఉపయోగపడుతుంది. కానీ పిల్లల విషయంలో నియంత్రణ లేని వాడకం వారి మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ‘‘డిజిటల్ యుగంలో పిల్లలను ఎలా రక్షించాలి?’’ అన్న సవాలును ఎదుర్కొంటోంది. ఈ ప్రశ్నకు సమాధానమే రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ డిజిటల్ విధానాలను నిర్ణయించవచ్చు.
వెంకటకృష్ణ పర్వతనేని
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్