Share News

‘సర్’ విశిష్ట మార్గం ఎలా అవుతుంది?

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:44 AM

ఆంధ్రజ్యోతిలో అక్టోబర్ 7న ‘పటిష్ఠ ప్రజాస్వామ్యానికి విశిష్ట మార్గం సర్’ శీర్షికతో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ఒక వ్యాసం రాశారు. త్రిసభ్య ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కమిషనర్లు...

‘సర్’ విశిష్ట మార్గం ఎలా అవుతుంది?

ఆంధ్రజ్యోతిలో అక్టోబర్ 7న ‘పటిష్ఠ ప్రజాస్వామ్యానికి విశిష్ట మార్గం సర్’ శీర్షికతో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ఒక వ్యాసం రాశారు. త్రిసభ్య ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కమిషనర్లు ఫారం–6, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, ఎన్నికల సాఫ్ట్‌వేర్ యాక్సిస్ ఇలా అనేక విషయాల్లో 14 సార్లు అభ్యంతరాలు తెలిపినా, వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రజాస్వామ్యానికి విశిష్ట మార్గం ఎలా అవుతుంది?

ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఓటర్ లిస్టులో మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ లిస్టులో ఊరూ పేరూ లేని వారు ఎవరూ ఉండరు. ఆధార్ కార్డులో కూడా ఆ సమాచారం మొత్తం ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఐదారుగురు అధికారులు వీటన్నింటినీ తనిఖీ చేసిన తర్వాతనే ఓటు వేయడానికి పంపిస్తారు. ఇకపోతే ఓటర్ల లిస్టులో తప్పులు, తడకలు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ లోపం. ఆ తప్పులు సరిచేసే బాధ్యత దానిదే. అలాగే తమిళనాడు, కేరళంలో తమకు అనుకూలంగా ఓటు వేస్తే సర్ ప్రక్రియ మంచిదని, బిహార్, బెంగాల్లో ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే అక్కడ సర్ ప్రక్రియ సరైనది కాదని కాంగ్రెస్, వామపక్షాలు ఆరోపించడం ఎంతవరకు సబబు? అంటున్నారు. వాస్తవానికి సర్ మంచిది అని ఏ వేదిక మీద కూడా ఈ రెండు పార్టీలూ ప్రకటించలేదు. పైగా సర్ ద్వారా ఓట్లు గల్లంతు చేస్తున్నారని బహిరంగంగా ఆందోళనలు చేశాయి.

విదేశీ చొరబాటుదారులు అక్రమంగా అన్ని ప్రభుత్వ సదుపాయాలు పొందుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండిపోవాలా? వారిని దేశం నుంచి బయటకు పంపించే ప్రక్రియ చేపట్టడం నేరమా? అంటే కచ్చితంగా కాదు. కానీ చొరబాటుదారుల పేరుతో దేశంలో ఉన్న పౌరుల ఓటు హక్కును తొలగించడం న్యాయమా? 2014 నుంచి సుదీర్ఘకాలం పాటు బీజేపీని గెలిపించింది ఈ ఓటర్లే కదా! వారంతా చొరబాటుదారులేనా? తొలగించిన 13 కోట్లకు పైగా ఉన్న అనర్హులైన ఓటర్లలో ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారు? ఓటర్ లిస్టులో తల్లిదండ్రుల పేర్లు లేనంతమాత్రాన వాళ్లు ఓటు వేయడానికి అనర్హులు అంటే ఎంతవరకు సబబు? జగదీప్ ధన్‌కర్, కపిల్ సిబల్, మనీష్ సిసోడియా, లాల్‌కృష్ణ అద్వానీ, ఎస్.జయశంకర్, రేఖాగుప్తా, ప్రవీణ్ సూద్, అంతెందుకు ఎన్నికల కమిషనర్ ఎస్‌ఎస్ సంధు వంటి అనేకమంది ప్రముఖులకు నోటీసులు వచ్చాయి. వీరంతా చొరబాటుదారులా? అనేక అంతరాయాలు పెట్టి ఓట్లను తొలగించి, మీరు ఓటు వేయడానికి అర్హులా కాదా అని నిరూపించుకోమంటూ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్న వీరికి ఎలక్షన్ కమిషన్ గానీ, బీజేపీ ప్రభుత్వం గానీ ఏం సమాధానం చెప్తుంది?


దేశంలో ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో భారత ఎన్నికల సంఘం పాత్ర అనిర్వచనీయం అనే మాట పచ్చి అబద్ధం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ తన స్వతంత్రతను కోల్పోయి పూర్తిగా బీజేపీ చేతిలో పావుగా మారిపోయింది. లేకపోతే గతంలో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన అధికారిక నోటీసుల్లో బీజేపీ స్టాంపులు ఎందుకు ఉన్నాయి? చట్టబద్ధంగా రూపొందించిన ఫారం–6లో చట్ట సవరణ చేయకుండా, కనీసం సుప్రీంకోర్టు అనుమతి అయినా తీసుకోకుండా ఎందుకు మార్చారు? సుప్రీంకోర్టు ప్రకటించిన ఎన్నికల కమిషనర్ల నియామకాల కమిటీ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను తొలగించి, ప్రధాని నామినేట్ చేసిన కేంద్రమంత్రిని ఎందుకు పెట్టారు? కమిటీలో ఉన్న ముగ్గురిలో ఇద్దరు అధికార పార్టీకే చెందినవారైతే ఇక ఆ కమిటీకి ఏం విలువ ఉంటుంది? వీటన్నింటినీ పరిశీలించినప్పుడు ఎస్ఐఆర్ అనేది బీజేపీ విధానాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న నేటి యువతరం ఓటింగ్‌ను తగ్గించడానికి, కొత్తగా ఓటరుగా చేరాలనుకునే యువతకు ఆటంకంగా ఫారం–6లో మార్పులు దోహదపడుతున్నాయన్నది స్పష్టమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇప్పటికైనా ఓట్ చోరీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి.

డి. రాము

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

ఈ వార్తలూ చదవండి

రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో

Updated Date - Oct 15 , 2026 | 01:44 AM