శిల్పంతోనే కవిత అజరామరం
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:06 AM
తెలుగు సాహిత్య చరిత్రలో వచన కవితా ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం. ఛందస్సుల సంకెళ్ళను తెంచుకుని, సామాన్యుడి భాషలో, ఆధునిక భావాలను ప్రకటించే సాధనంగా ఇది రూపుదిద్దుకుంది. అయితే...
తెలుగు సాహిత్య చరిత్రలో వచన కవితా ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం. ఛందస్సుల సంకెళ్ళను తెంచుకుని, సామాన్యుడి భాషలో, ఆధునిక భావాలను ప్రకటించే సాధనంగా ఇది రూపుదిద్దుకుంది. అయితే ఛందస్సు లేనంత మాత్రాన వచన కవితకు నియమాలు లేవని భావించలేం. పద్యానికి గణాలు ఎలాగో, వచన కవితకు ‘శిల్పం’ అలా ప్రాణాధారం. వస్తువు ఎంత గొప్పదైనప్పటికీ, సరైన శిల్పం తోడు కాకపోతే కేవలం వార్తగానో, నినాదంగానో మిగిలిపోతుంది. కవిత్వానికి కళాత్మకతను, గాఢతను, సార్వకాలికతను చేకూర్చేది శిల్పమే.
కవిత్వంలో శిల్పం అంటే ‘అభివ్యక్తి నైపుణ్యం’. ఒక వస్తువును కవిత్వంగా మలిచే క్రమంలో కవి అనుసరించే పద్ధతి, పదాల ఎంపిక, భావాల అమరిక - వీటన్నింటి కలయికే శిల్పం. ఆంగ్లంలో దీన్ని ‘క్రాఫ్ట్’ లేదా ‘టెక్నిక్’ అని పిలుస్తారు. పాశ్చాత్య విమర్శకుడు ఎజ్రా పౌండ్ ‘‘కవిత్వం అనేది ఒక శక్తివంతమైన భాషా ప్రయోగం’’ అంటాడు (Poetry is language charged with meaning to the utmost degree). ఆ శక్తిని ప్రసాదించేది శిల్పమే.
వచన కవితా శిల్పంలో అత్యంత ప్రధానమైన లక్షణం క్లుప్తత. గద్యంలో వివరణకు తావుంటుంది, కానీ కవిత్వంలో సూచన మాత్రమే ఉండాలి. ఒక పెద్ద వృక్షాన్ని విత్తనంలో దాచినట్లుగా, ఒక భారీ అనుభూతిని ఒక చిన్న వాక్యంలో ఇమడ్చడమే క్లుప్తతలోని పరమార్థం. అనవసరమైన విశేషణాలను, వ్యర్థ పదాలను తొలగించినప్పుడే కవితకు పదును వస్తుంది. ఈ పదునే పాఠకుడి హృదయం లోకి చొచ్చుకుపోతుంది. క్లుప్తతతో పాటు కవితకు ఉండాల్సిన మరో లక్షణం గుప్తత. ప్రతి విషయాన్ని అరటిపండు వలిచి పెట్టినట్లు చెప్పేస్తే అది వ్యాసమవుతుంది. కవిత్వం ఎప్పుడూ కొంత రహస్యాన్ని తనలో దాచుకోవాలి. ‘‘కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ’’ అంటారు సినారె.
కవిత్వానికి ఆప్తత అనేది ఒక ఆత్మ వంటిది. కవి చెప్పే మాట పాఠకుడికి పరాయిదిగా అనిపించకూడదు. తన ఇంట్లో జరిగిన సంఘటనలాగో, తన గుండెల్లో మెదిలిన ఆవేదనలాగో అది అనిపించాలి. ఈ ఆప్తత సాధించాలంటే కవి వాడే భాష పాఠకుడికి సన్నిహితంగా ఉండాలి. సామాన్యుడి గొంతుకను పట్టుకోవాలి. అదే సమయంలో, కవిత్వంలో ‘వక్రత’ కూడా అవసరమే. లోకంలో అందరూ చూసే వస్తువునే కవి చూస్తాడు, కానీ అందరూ చూసే విధంగా కాకుండా ఒక భిన్నమైన కోణంలో దాన్ని ప్రదర్శిస్తాడు. సూటిగా చెప్పే మాట కంటే, వంకరగా లేదా వ్యంగ్యంగా చెప్పే మాట కవిత్వంలో ఎక్కువ గాఢతను కలిగి ఉంటుంది. కుంతకుడు చెప్పినట్లు ‘‘వక్రోక్తిః కావ్య జీవితం’’.
వచన కవితా శిల్ప నిర్వహణలో కవికి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము అనే మూడు శక్తులు ఆయుధాలుగా పనిచేస్తాయి. ప్రాచీన ఆలంకారికులు వీటిని కావ్య హేతువులుగా పేర్కొన్నారు. ప్రతిభ అనేది కవికి సహజంగా ఉండే సృజనాత్మక దృష్టి. వ్యుత్పత్తి అంటే లోకజ్ఞానం, అధ్యయనం ద్వారా లభించే పాండిత్యం. అభ్యాసం అంటే నిరంతర సాధన. ఒక అద్భుతమైన కవిత ఒక్క రోజులో పుట్టదు. అనేకమార్లు రాసి, సరిదిద్దుకుని, అనవసరమైన భాగాలను తొలగించి మెరుగులు దిద్దడం ద్వారానే శిల్పం రాణిస్తుంది.
భాష అనేది కవిత్వానికి ప్రాథమిక పనిముట్టు. పదజాలం మీద పట్టు లేని కవి శిల్పాన్ని నిర్మించలేడు. శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ ‘‘కవిత్వం అంటే ఉత్తమ పదాలను ఉత్తమ క్రమంలో అమర్చడం’’ అని నిర్వచించారు (Poetry: the best words in the best order). తెలుగు భాషలో నుడికారాలు, జాతీయాలు, పలుకుబడులు వచన కవితకు ఒక గొప్ప బలాన్నిస్తాయి. మట్టి వాసన కలిగిన పదాలను, సామాన్యుల వాడుకలో ఉన్న విలక్షణమైన ప్రయోగాలను కవిత్వంలోకి ఆహ్వానించాలి. పదాల మధ్య ఉండే ఖాళీలు కూడా కవితా శిల్పంలో భాగమే. ఆ ఖాళీలే పాఠకుడికి ఆలోచించే సమయాన్ని ఇస్తాయి. అందుకే వచన కవితలో నిశ్శబ్ద శిల్పం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అలంకారాలు, ప్రతీకలు, పదచిత్రాలు వచన కవితా సౌధానికి సౌందర్య హేతువులు. ప్రాచీన కాలంలో ఉపమాలంకారం ప్రధానంగా ఉండేది, కానీ ఆధునిక కవిత్వంలో ప్రతీకల (Symbols) వాడకం పెరిగింది. ఇలియట్ వంటి కవులు ప్రతీకవాదానికి పెద్దపీట వేశారు. ఒక మూర్తమైన వస్తువు ద్వారా అమూర్తమైన భావనను వ్యక్తీకరించడమే ప్రతీక. ఇది కవితకు లోతును పెంచుతుంది. అలాగే పదచిత్రాలు (Imagery) కవిత్వానికి దృశ్యరూపాన్ని ఇస్తాయి. కేవలం రంగులు, రుచుల వర్ణనలే కాకుండా, మానసిక స్థితిగతులను ప్రతిబింబించే పదచిత్రాలను సృష్టిం చడం గొప్ప శిల్పం.
నాటకీయత అనేది వచన కవితకు ప్రాణం పోస్తుంది. తిక్కన ‘‘ఉభయ కావ్య ప్రౌఢి’’ గురించి చెప్తూ నాటకీయత ప్రాధాన్యతను నాడే గుర్తించారు. ఆధునిక కవిత్వంలో సంభాషణా శైలిని ఉపయోగించడం, ఒక సమస్యను ఉద్రిక్తతతో కూడిన ముగింపు వైపు తీసుకెళ్లడం వంటివి నాటకీయ శిల్పంలో భాగాలు. ఇది పాఠకుడిని కవితలో లీనం చేయడమే గాక, కవితా వస్తువు పట్ల అతనికి ఒక స్పష్టమైన అవగాహనను కలిగిస్తుంది.
తెలుగు వచన కవితా ప్రయాణంలో శిల్పం అనేక మార్పులకు లోనైంది. అభ్యుదయ కవిత్వంలో శ్రీశ్రీ శబ్ద వైవిధ్యం, నాద సౌందర్యంతో కూడిన శిల్పాన్ని ప్రవేశపెట్టారు. ‘‘మరో ప్రపంచం మరో ప్రపంచం’’ అన్న పిలుపులో ఒక ఉత్సాహం, ఒక లయ ఉంది. దిగంబర కవిత్వంలో భాష పచ్చిగా, ఆవేశపూరితంగా ఉండి ఒక కొత్త శిల్పాన్ని ఆవిష్కరించింది. విప్లవ కవిత్వం ప్రజల భాషను, జానపద లయలను స్వీకరించి శిల్పాన్ని విస్తృతం చేసింది. స్త్రీవాద, దళిత కవిత్వాల్లో అనుభవం నుండి పుట్టిన సత్యం ఒక శక్తివంతమైన శిల్పంగా రూపాంతరం చెందింది. వీరి కవిత్వంలో భాష కేవలం వ్యక్తీకరణ సాధనం కాదు, అది ఒక పోరాట పటిమను సంతరించుకుంది.
జానపదుల పాటల్లో ఉండే లయ, ఎత్తుగడలు, ముగింపులు ఆధునిక కవులకు గొప్ప పాఠాలు నేర్పాయి. ‘‘ఉల్లాయాచీ-చొల్లాయాచీ/ పొద్దూ పొద్దూ ఒక చాయ/ పొద్దెక్కీ ఒక చాయ/ పొద్దూపోయె చెల్లెమ్మా/పొన్న పూచాయ’’ వంటి వర్ణనల్లో ఉండే దృశ్యరూపక శిల్పం అమోఘం. మౌఖిక సాహిత్యంలో గాఢతను, సూటిదనాన్ని వచన కవితా శిల్పంలోకి అన్వయించుకోవడం వల్ల కవిత్వం మరింత జనరంజకమైంది. ప్రకృతిలోని వస్తువులను అత్యంత సున్నితంగా వర్ణించే జానపద శైలి, ఆధునిక కవుల పదచిత్రాలకు ప్రేరణనిచ్చింది. ఈ మట్టి వాసన కలిగిన శిల్పమే తెలుగు వచన కవితకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
కవి నిరంతరం శిల్పాన్ని మెరుగుపరుచుకోవాలి. టెక్నాలజీ, గ్లోబలైజేషన్ వంటి అంశాలు మన జీవితాలను ప్రభావితం చేస్తున్న వేళ, ఆ మార్పులను పట్టుకోవడానికి భాషను కూడా అంతే ఆధునికంగా మార్చుకోవాలి. శిల్పం నిర్జీవ చట్రం కాదు, అది నిరంతర జీవనది. కవి ఆ ప్రవాహంలో భాగమైనప్పుడే అతని కవిత్వం జీవం పోసుకుంటుంది.
కేవలం మెదడుతో రాసే కవిత్వం శిల్పపరంగా బాగుండవచ్చు, కానీ అది హృదయాలను తాకదు. గుండె లోతుల్లోంచి పుట్టిన అనుభూతికి, మెదడుతో సానబెట్టిన శిల్పం తోడైనప్పుడే అది ఒక గొప్ప కవితగా అవతరిస్తుంది. భావానికీ, భాషకూ మధ్య ఉన్న సన్నని వంతెనను పటిష్టంగా నిర్మించడమే కవిత్వ శిల్పంలోని అంతిమ రహస్యం. ఈ రహస్యాన్ని పట్టుకున్న కవి పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు.
పోతగాని సత్యనారాయణ
91825 31202
ఇవి కూడా చదవండి:
ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం..
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు