Share News

మళ్లీ ట్రెండ్‌లోకి ఫ్రాయిడ్‌!

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:30 AM

ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తుంటే, ఇన్‌ఫ్లూయెన్సర్ల మధ్య ఒక ఆశ్చర్యకరమైన ముఖం కనిపించవచ్చు. దట్టమైన గడ్డం, చేతిలో సిగార్‌తో గంభీరంగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ముఖం అది...

మళ్లీ ట్రెండ్‌లోకి ఫ్రాయిడ్‌!

ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తుంటే, ఇన్‌ఫ్లూయెన్సర్ల మధ్య ఒక ఆశ్చర్యకరమైన ముఖం కనిపించవచ్చు. దట్టమైన గడ్డం, చేతిలో సిగార్‌తో గంభీరంగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ముఖం అది. ఆయన సిగ్మండ్ ఫ్రాయిడ్. పందొమ్మిదో శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాపరులను ప్రభావితం చేసిన, మానవ మనస్తత్వం గుట్టువిప్పిన మనస్తత్వవేత్త ఆయన. ఇప్పుడు అనూహ్యంగా ఆయన మళ్ళీ వార్తల్లోకి వస్తున్నారు.

దశాబ్దాలుగా ఫ్రాయిడ్ కాలం చెల్లిన వ్యక్తిగా పరిగణించబడ్డారు. ‘‘కాకికేమి తెలుసు సైకో ఎనాలసిస్సు?’’ అని శ్రీశ్రీ అన్నట్టు విమర్శకులు అనేకులు కాకుల్లా ఫ్రాయిడ్ ఆలోచనలపైన దాడి చేశారు. ఫ్రాయిడ్ చెప్పిన మనోవిశ్లేషణ విధానం (సైకో ఎనాలసిస్) అశాస్త్రీయమని తోసిపుచ్చారు. మరికొందరు ఆయన ఆలోచనలు లింగవివక్షతో కూడుకున్నవని, ఆధునిక జీవితానికి సంబంధం లేనివని కొట్టిపారేశారు.

కానీ ఇప్పుడు, ఆందోళన, రాజకీయ ఉద్రిక్తతలు, మానసిక అలసటతో నిండిన ప్రపంచంలో, ప్రజలు ఫ్రాయిడ్‌ను మళ్లీ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ పునరుజ్జీవనానికి కొంతవరకు పాపులర్ కల్చర్ కారణం. ‘కపుల్స్ థెరపీ’ అనే టెలివిజన్ సిరీస్‌తో ఇది మొదలైంది. ఈ కార్యక్రమం మానసిక ఆరోగ్య సమస్యల చికిత్సకు సంబంధించి లోతైన థెరపీ సెషన్ల ప్రభావశీలతను ప్రపంచవ్యాప్తంగా టీవీ ప్రేక్షకులకు పరిచయం చేసింది. మరోవిధంగా చెప్పాలంటే సిగ్మండ్ ఫ్రాయిడ్‌ను వారి ఇళ్లకు చేరవేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో, ‘‘ఫ్రాయిడ్–గ్రామ్’’ ప్రొఫైల్స్‌ అంతఃచేతన (unconscious mind) గురించి, అందులో దాగిన కోరికల గురించి కోట్లాదిమంది ఫాలోవర్లతో పంచుకుంటున్నాయి. సైకో ఎనాలసిస్‌లో భాగంగా, సోఫాపై పడుకుని బాల్య జ్ఞాపకాల గురించి మాట్లాడటాన్ని ఒకప్పుడు జోక్‌గా భావించారు. అదే ఇప్పుడు మళ్లీ సీరియస్‌ విషయంగా మారింది.


కానీ ఇది కేవలం ఇంటర్నెట్ ట్రెండ్ మాత్రమే కాదు. ఇది ఒక లోతైన మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ మార్పునకు బలమైన కారణాలే ఉన్నాయి. 20వ శతాబ్దపు చివరలో, ముఖ్యంగా ఇంగ్లిష్ మాట్లాడే దేశాలలో, సైకోథెరపీ దిశ మారింది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) ప్రాధాన్యం సంతరించుకుంది. దానిలో ‘సరైనవి కాని’ ఆలోచనా విధానాలను సరిదిద్దడంపైనే దృష్టి సారించారు. అదే సమయంలో, మానసిక ఆరోగ్య చికిత్సలో మందులు ప్రధానమయ్యాయి. నిరాశ, ఆందోళనలను మెదడులోని రసాయన అసమతుల్యతగా అభివర్ణించారు. ఒక టాబ్లెట్ వేసుకోవడం అనే పరిష్కారం సులువుగా అనిపించింది. భావోద్వేగాలను నియంత్రించే మూడ్ డిజైనర్ మందు ప్రొజాక్ (మనదేశంలో ఫ్లుడాక్) రోజువారీ వాడే ఉత్పత్తుల్లో ఒకటిగా మారింది. మనస్సు కుంగుబాటుకు చికిత్సగా యాంటీ–డిప్రెసెంట్ మందుల వాడకం విపరీతంగా పెరిగింది. మన దేశంలో దాదాపు 5శాతం వయోజనులు ఈ మందులపై ఆధారపడుతున్నారు. అయినప్పటికీ– ఆందోళన, ఒంటరితనం, నిరాశ పెరుగుతూనే ఉన్నాయి. చాలా మందికి లక్షణాల నుంచి ఉపశమనం లభించినా, శాశ్వతమైన మానసిక ప్రశాంతత మాత్రం దక్కటం లేదు.

ఈ పరిస్థితే ఫ్రాయిడ్ ప్రధాన ఆలోచనను మళ్లీ తెరపైకి తెచ్చింది: మన మానసిక జీవితంలో చాలా భాగం మనకు తెలియకుండానే అంతఃచేతన (Unconscious)లో జరుగుతుంది. ఫ్రాయిడ్ ప్రకారం, దానిలో దాగి ఉన్న సంఘర్షణలు, భయాలు, కోరికలు మన ప్రవర్తనను మలుస్తాయి. మనం వాటిని విస్మరిస్తే, అవి మాయమైపోవు. పైగా అవి ఆందోళన, కోపం లేదా పదేపదే మనల్ని మనం దెబ్బతీసుకునే ప్రవర్తనల రూపంలో బయటకు వస్తాయి.

దక్షిణాఫ్రికాకు చెందిన న్యూరో సైకాలజిస్ట్ మార్క్ సోమ్స్ ఇటీవల ఫ్రాయిడ్‌పై పెరుగుతున్న ఆసక్తికి బలమైన శాస్త్రీయ గొంతుకగా నిలిచారు. ఆయన పుస్తకం ‘ది హిడెన్ స్ప్రింగ్స్– ఎ జర్నీ టు ద సోర్స్ ఆఫ్ కాన్షియస్’లో ఆధునిక మెదడు పరిశోధనను సైకో ఎనలిటికల్ ఆలోచనలతో ముడిపెట్టారు. కలలు, భావోద్వేగాలపై సోమ్స్ చేసిన అధ్యయనాలు, మానసిక జీవితంలో అంతఃచేతన స్థాయి ప్రక్రియలు కీలక పాత్ర పోషిస్తాయని సూచిస్తున్నాయి. మందులు లక్షణాలను తగ్గించగలవని, కానీ వాటి వెనుక ఉన్న భావోద్వేగ చోదకశక్తులను పూర్తిగా పరిష్కరించలేవని ఆయన వాదిస్తున్నారు. నిజమైన మానసిక స్వస్థత పొందడానికి అంతఃచేతనలో దాగిన భావాలను స్పృహ (చేతన)లోకి తీసుకురావాలని సోమ్స్ అంటారు.


నిజానికి ఇంగ్లిష్ మాట్లాడే దేశాల వెలుపల ఫ్రాయిడ్ ఎప్పుడూ పూర్తిగా మరుగునపడలేదు. కొన్ని దేశాలలో మనోవైద్యం ఇప్పటికీ సైకో ఎనాలసిస్‌కు కట్టుబడి ఉన్నది. దీనికి స్పష్టమైన ఉదాహరణ బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా). ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి లక్ష మందికి 222 మంది మనస్తత్వవేత్తలు ఇక్కడ ఉన్నారు. అక్కడ థెరపీ అనేది దాచుకోవాల్సిన విషయమో లేదా అవమానకరమో కాదు; అది చాలా సాధారణం. ఆ దేశం కఠినమైన కాలంలో కొనసాగిన సమయంలో ఈ సంప్రదాయం బలపడింది. 1976–1983 మధ్య అర్జెంటీనా మిలిటరీ నియంతృత్వంలో ఉన్నప్పుడు సుమారు ముప్పైవేల మంది ‘అదృశ్యం’ అయ్యారు. కుటుంబాలు భయంలో నిశ్శబ్దంలో ఉండిపోయాయి. అటువంటి వాతావరణంలో సైకో ఎనాలసిస్ ప్రజలకు ఒక అరుదైన అవకాశాన్ని ఇచ్చింది, బహిరంగంగా మాట్లాడటానికి ఒక వ్యక్తిగత స్థలాన్ని ఇచ్చింది. బాధ గురించి మాట్లాడటం ఒక ప్రతిఘటన ప్రకటనగా, అవకాశంగా మారింది. సమాజం అణచివేయాలని చూసినా సత్యాన్ని వ్యక్తీకరించాలనే ఆలోచన థెరపీకి ఒక రాజకీయ కోణాన్ని ఇచ్చింది.

మరోవైపు ఆధునిక సమస్యలకు మనోవిశ్లేషణ ప్రభావశీలమైన పాత పరిష్కారంగా ముందుకు వస్తోంది. ఇప్పుడు ఆలోచనాపరులు ఆధునిక సమస్యలను పరిశీలించడానికి సైకో ఎనాలసిస్‌ను ఉపయోగిస్తున్నారు. ఫ్రాయిడ్ ఇప్పుడు ఎందుకు సందర్భోచితంగా అనిపిస్తున్నారని చూస్తే రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

మొదటిది వేగం vs సహనం. మనం వేగాన్ని ఆరాధించే యుగంలో ఉన్నాం. కానీ సైకో ఎనాలసిస్ దీనికి విరుద్ధం. ఇది నెమ్మదిగా సాగుతుంది, ఏళ్ల తరబడి టైమ్‌ పట్టవచ్చు. ఇది బాల్యం, కోరిక, అపరాధ భావం, భయం గురించి అసౌకర్యంగా అనిపించే ప్రశ్నలను అడుగుతుంది. శాశ్వత మార్పునకు ఓపిక, నిజాయితీ అవసరమని ఇది నమ్ముతుంది.

రెండోది అణచివేత. ఫ్రాయిడ్ చెప్పిన ‘అణచివేత’ (Repression) అనే అంశం వ్యక్తులకే కాదు, సమాజాలకు కూడా వర్తిస్తుంది. విస్మరించబడిన గాయాలు, నిరాకరించబడిన చరిత్ర, అణచివేసిన సంఘర్షణలు ప్రమాదకరమైన రీతిలో మళ్లీ బయటపడతాయి.

సిగ్మండ్‌ ఫ్రాయిడ్ పరిపూర్ణంగా ఆమోదం పొందినవాడు ఏమీ కాదు. ఆయన ఆలోచనలు చాలా వరకు వివాదాస్పదంగానే ఉన్నాయి. అయినప్పటికీ, ‘మన మనస్సు గురించి మనకే పూర్తిగా తెలియదు’ అనే ఆయన ప్రధాన వాదన నేటికీ నిజమనిపిస్తోంది. ఇవాళ సోఫాలో కూర్చుని సైకో థెరపీ తీసుకోవటం అనేది ధనవంతుల విలాసం కాదు. గందరగోళంగా ఉన్న ఈ కాలంలో సాంత్వన పొంది జీవించడానికి అది ఒక సాధనంగా మారుతోంది. విధ్వంసం విస్తరిస్తున్న నేటి ప్రపంచంలో లోతైన ఆత్మపరిశీలన, భావోద్వేగపరమైన వాస్తవం చాలా అవసరమని ఎక్కువమంది గుర్తిస్తున్నారు. మనసును తొలిచివేస్తున్న భావాలను, వేదనలను ఎటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా వినగలవారు అందుబాటులో ఉన్నారన్న విశ్వాసాన్ని మించి ఉపశమనం ఇవ్వగల అంశం ఈ శతాబ్దంలో ఇంకేదీ లేదు.

రామ్మోహన్ ఆర్. అప్పరసు

సీనియర్‌ జర్నలిస్ట్‌

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 12:30 AM