బస్తీల్లో బలపడుతున్న ఆత్మగౌరవ ఆకాంక్ష!
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:00 AM
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ధనవంతులూ, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులూ ఉండేది ఒకటి రెండు కాలనీల్లోనే. తక్కిన నియోజకవర్గమంతా బస్తీలే...
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ధనవంతులూ, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులూ ఉండేది ఒకటి రెండు కాలనీల్లోనే. తక్కిన నియోజకవర్గమంతా బస్తీలే. నగరంలో తెల్లవారేసరికి రోడ్లు తళతళలాడుతూ కనిపిస్తున్నా, ఇన్ని వాహనాలు రయ్ రయ్ మని పరుగులు తీస్తున్నా, ఆకాశాన్ని తాకుతున్న భవనాలు రికార్డులు సృష్టిస్తున్నా దాని వెనక ఉన్నది ఈ బస్తీలవాసులే. పని మనుషులుగా, పారిశుధ్య కార్మికులుగా, డ్రైవర్లుగా వీరు ఏదో రూపంలో నగర జీవనంలో భాగస్వాములవుతున్నారు. పల్లెటూళ్లలో పోషణ జరగక నగరానికి కడుపు పట్టుకొని వలస వచ్చిన సన్న చిన్నకారు రైతులు, కులవృత్తులవారు ఎందరో వీరిలో ఉన్నారు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు, గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు మూడు వేల బస్తీలు ఉన్నాయి!
21వ శతాబ్దంలో పావు వంతు కాలం పూర్తయినా బస్తీల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. అసంఘటిత రంగానికి చెందిన ఇక్కడి ప్రజలు ఏ మాత్రం సంఘటితం కాలేదు. ప్రభుత్వ పథకాల కారణంగా జీవన ప్రమాణాలు పెరిగిందీ తక్కువే. మనుషుల్ని మనుషులుగా చూసే పద్ధతి ఉండాలన్నది బస్తీవాసుల మనోభావన. సమాజం నుంచి ఆత్మీయ పలకరింపుతోపాటు, ప్రభుత్వం తరఫునుంచి ‘‘మీ సమస్యలు ఏమిటి?’’ అని అడిగి తెలుసుకుని పరిష్కరించే వ్యవస్థ ఉండాలన్నది వారి కోరిక. ఈ ఏర్పాట్లు ఉంటే ఆత్మగౌరవం లభించినట్టే.
పేదలకు మొదట కావాల్సింది కాసింత ఆవాసం. కానీ ఇది లేనివారు ఎందరో! భోజగుట్ట ప్రాంతంలో ఇరుకిరుకు గల్లీల్లో 15–20 గజాల స్థలంలో ప్రజలు తలదాచుకుంటున్నారు. అవేవీ నివాసానికి అనువైనవి కావు. కానీ తప్పని పరిస్థితి. నగరానికి ఖాళీ కడుపులు, చేతులతో వచ్చినవారు ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడో చిన్న గుడిసె వేసుకుంటారు. ప్రభుత్వం జాగాలో గుడిసె వేసుకున్నారంటూ అధికారులు వాటిని తొలగిస్తే వారు ఎక్కడికి వెళ్లాలి? ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని వెంటనే తొలగించే బదులు ఎక్కడయినా కాస్త ఆవాసం కల్పించవచ్చు కదా అన్నది బస్తీ ప్రజల కోరిక. ఇందిరమ్మ ఇళ్ల కింద పేదల కోసం పెద్ద పెద్ద అపార్టుమెంట్లు నిర్మించవచ్చు కదా అన్నది వారి వినతి. తమ సమస్యలు, పరిష్కార మార్గాలు చెప్పుకోవడానికి సరైన వ్యవస్థ లేకపోవడం బస్తీ యువతను వేధిస్తోంది. బస్తీల్లో నాయకులు ఉన్నా మాట సాయం చేయగలరేమో తప్ప సమస్యలను పూర్తిగా పరిష్కరించలేరు.
ప్రభుత్వం పట్టించుకోని మరో అంశం బస్తీవాసుల వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు. ఇక్కడి యువత కష్టపడుతున్నారు, రోజూ సంపాదిస్తున్నారు. కొంత తల్లిదండ్రులకు, కుటుంబానికి ఇచ్చి బాధ్యతలు నెరవేరుస్తున్నారు. మిగిలిన సొమ్మును వారు ఏ మాత్రం పొదుపు చేయడం లేదు. మద్యానికి, కొన్నిసార్లు మాదకద్రవ్యాలకు వినియోగించి చివరకు ఏమీలేనివారిగానే ఉండిపోతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలేవీ తమకు అందడం లేదని భావిస్తున్నారు. ఇది వ్యక్తిగత సమస్యగా కనిపిస్తున్నా, సామాజిక రుగ్మతగా పరిగణిస్తేనే పరిష్కార మార్గాలు లభిస్తాయి.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించి నగరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (‘సర్’) సర్వే చేపట్టనున్నారు. ఇందులో తాతలు, తండ్రుల పుట్టిన తేదీలు, పత్రాలు కూడా అడుగుతున్నారు. కొంపాగోడు లేనివారు ఇలాంటి వివరాలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బస్తీ వాసులంతా ఓటు హక్కు వినియోగాన్ని పవిత్రమైన కార్యంగా భావించేవారే. ఇలాంటి సందర్భాల్లోనే రాజకీయ నాయకులు వారికి అండగా ఉండి తగిన సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాదే ఇళ్ల వివరాలు సేకరిస్తారు. వచ్చే ఏడాది కులాల ఆధారంగా జనాభా లెక్కలు రాస్తారు. దీనిపై అవగాహన కలిగించేవారు ఎవరు? ఇళ్లు లేని వారి పరిస్థితి ఏమిటి? ఇంటి నెంబరు నమోదు చేసిన తరువాత ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లిపోతే ఏమి చేయాలి? కులం పేరు ఎలా చెప్పాలో తెలియనివారూ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈ విషయంలో కుల సంఘాలు చొరవ తీసుకుంటాయా? బస్తీల్లో ఇవన్నీ కేవలం బాతాఖానీ మాటలు కాదు, సీరియస్‌గా జరుగుతున్న చర్చలే. అన్ని ప్రభుత్వాలు ఇప్పుడు గిగ్ వర్కర్ల గురించి మాట్లాడుతున్నాయి. బడ్జెట్, లేబర్ కోడ్‌లలో వీరి ప్రస్తావన ఉంటుంది. వీరంతా బస్తీ కుర్రాళ్లే కావడంతో ఎలాంటి మేలు జరుగుతుందా అని ఆశగా చూస్తున్నారు. బస్తీవాసుల ఆకాంక్షలకు బస్తీ నాయకులతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా చేయూత అందిస్తున్నాయి. ఈ బస్తీలు జాయింట్ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేసుకొని తమ ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం, అభివృద్ధి కోసం పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
గోసుల శ్రీనివాస్ యాదవ్
చైర్మన్, తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్–జేఏసీ
ఇవి కూడా చదవండి..
వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. జనగణమన కంటే ముందే వందేమాతరం ఆలాపన
ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి