ఆ ఆంక్షలు.. భావప్రకటనకు సవాలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:54 AM
ప్రజాస్వామ్యంలో విమర్శకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, అధికారుల నిర్ణయాలను విశ్లేషించడం, ప్రజాప్రతినిధుల...
ప్రజాస్వామ్యంలో విమర్శకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, అధికారుల నిర్ణయాలను విశ్లేషించడం, ప్రజాప్రతినిధుల పనితీరును ఎండగట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజమైన ప్రక్రియ. ఈ బాధ్యతను పత్రికలు, రచయితలు, కార్టూనిస్టులు తమదైన శైలిలో నిర్వహిస్తుంటారు. అయితే, రాజకీయ కార్టూన్లపై ఆంక్షలు విధించడం ప్రారంభమైతే భావప్రకటన స్వేచ్ఛ పరిధి ఎంత అనే ప్రశ్న తలెత్తుతుంది. తాజాగా భారతీయ రాజకీయ కార్టూనిస్టు సతీశ్ ఆచార్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మన దేశంలో నిలిపివేయడంతో ఈ చర్చకు మరోసారి తెరలేచింది.
ఎన్నికల సంఘం పనితీరును విమర్శిస్తూ సతీశ్ ఆచార్య గీసిన కార్టూన్ల నేపథ్యంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను భారత్‌లో తాత్కాలికంగా నిలిపివేశారు. భారతీయ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది. అయితే, ఖాతా నిలిపివేతకు సంబంధించిన నిర్దిష్ట కారణాలు, అభ్యంతరకరంగా భావించిన కార్టూన్ల వివరాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామంపై కేరళ కార్టూన్ అకాడమీ ఆందోళన వ్యక్తం చేసింది. కార్టూన్ అనేది విమర్శకు ఒక కళారూపమని, విమర్శను అణచివేసే ధోరణి పెరగడం ప్రజాస్వామ్య విలువలకు ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. ఎన్నికల సంఘంపై మరో కార్టూనిస్టు మంజుల్ గీసిన విమర్శనాత్మక కార్టూన్ కూడా భారత్‌లో అందుబాటులో లేకుండా చేశారు.
ఇక్కడ ప్రధానంగా పరిశీలించాల్సిన అంశం ఏమిటంటే.. ఒక కార్టూన్‌పై అభ్యంతరం వ్యక్తం చేయడం వేరు, కార్టూనిస్టు మొత్తం ఖాతాను నిలిపివేయడం వేరు. ఒక నిర్దిష్ట చిత్రంపై చట్టపరమైన అభ్యంతరం ఉంటే, దానిపై చర్య తీసుకోవడానికి ఉన్న కారణాలను పారదర్శకంగా వెల్లడించాలి. అయితే, మొత్తం ఖాతాను నిలిపివేయడం వల్ల ఆ కార్టూనిస్టు ఇతర రచనలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండవు.
కార్టూన్ అనేది కేవలం నవ్వించడానికి గీసే బొమ్మ కాదు. సమాజంలోని వైరుధ్యాలను, అధికార వ్యవస్థలోని లోపాలను, రాజకీయ నాయకుల నిర్ణయాలను వ్యంగ్యంగా చూపించే శక్తిమంతమైన మాధ్యమం. ఒక్కోసారి వందల పదాలతో చెప్పలేని విషయాన్ని ఒక కార్టూన్ స్పష్టంగా చెప్పగలదు. ఒక రాజకీయ నాయకుడిని లేదా ప్రభుత్వ సంస్థను విమర్శించడం మాత్రమే అభ్యంతరకరమైన చర్యగా పరిగణించకూడదు. వ్యంగ్యం కొంతమందికి అసౌకర్యాన్ని కలిగించినంత మాత్రాన దానిని నిషేధించాల్సిన అవసరం లేదు. విమర్శకు సమాధానం విమర్శతోనో, వివరణతోనో ఇవ్వవచ్చు. చట్టపరమైన చర్య చివరి మార్గంగా, అదీ తగిన కారణాలతోనే ఉండాలి.
గత ఏడాదిలోనూ సామాజిక మాధ్యమాల్లోని రాజకీయ విమర్శలు, కార్టూన్ల తొలగింపుపై వివాదాలు చోటుచేసుకున్నాయి. భారత ప్రభుత్వం జారీ చేసిన కంటెంట్ తొలగింపు ఆదేశాలను సవాలు చేస్తూ ‘ఎక్స్’ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఆదేశాల పరిధి, వాటి పారదర్శకత, విమర్శనాత్మక కంటెంట్‌పై వాటి ప్రభావం ఈ వివాదంలో ప్రధాన అంశాలు అయ్యాయి. అంటే సోషల్ మీడియా సంస్థలు చట్టబద్ధమైన ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి. అదే సమయంలో, ప్రతి ఆదేశం చట్టబద్ధమైనదా, అవసరమైనదా, సముచితమైనదా అనే ప్రశ్నలు కూడా ముఖ్యమే. ఆంక్షలు విధించేటప్పుడు వాటికి స్పష్టమైన కారణాలు ఉండాలి. బాధితులకు తమ వాదన వినిపించుకునే అవకాశం, న్యాయస్థానాన్ని ఆశ్రయించే మార్గం అందుబాటులో ఉండాలి.
సతీశ్ ఆచార్య ఉదంతంలోనూ నిర్దిష్ట కార్టూన్లపై అభ్యంతరాలేమిటి? ఖాతాను నిలిపివేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? తక్కువ తీవ్రత కలిగిన ప్రత్యామ్నాయ చర్యలు సాధ్యమయ్యేవా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. రాజకీయ కార్టూనిస్టులు కూడా తమ బాధ్యతను గుర్తించాలి. వాస్తవాల ఆధారంగా విమర్శించాలి. వ్యక్తిగత ద్వేషం, అసత్య ప్రచారం, మత విద్వేషాలకు కార్టూన్లను వేదికగా మార్చకూడదు. వ్యంగ్యం పదునుగా ఉండవచ్చు. కానీ అది సమాజంలో విద్వేషాన్ని పెంచే సాధనంగా మారకూడదు.
ప్రజాస్వామ్యంలో సంస్థలపై ప్రశ్నలు రావడం వాటి బలహీనతకు సంకేతం కాదు. ప్రజలకు వాటి పనితీరును పరిశీలించే హక్కు ఉందనే విషయానికి అది నిదర్శనం. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి శంకర్స్ వీక్లీలో శంకర్ అనేక విమర్శనాత్మకమైన కార్టూన్‌లు వేసేవారు. నెహ్రూ వాటిని అర్థవంతమైన విమర్శగా తీసుకున్నారే తప్ప, ఏనాడూ శంకర్ మీద చర్యలు తీసుకోలేదు. పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి అప్పటి నాయకులు ఇచ్చిన విలువ అది.
సతీశ్ ఆచార్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేతపై చట్టపరమైన తుది నిర్ణయం ఏదైనా కావచ్చు. కానీ ఈ ఘటన లేవనెత్తిన ప్రశ్న మాత్రం విస్తృతమైనది. రాజకీయ కార్టూన్లకు హద్దులు నిర్ణయించేది ఎవరు? విమర్శను అణచివేయకుండా చట్టాన్ని ఎలా అమలు చేయాలి?
శ్యాంమోహన్ (కార్టూనిస్టు)
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..