Share News

సర్వాయి పాపన్న: బహుజన రాజ్య తొలి స్వాప్నికుడు

ABN , Publish Date - Aug 18 , 2026 | 03:44 AM

అణగారిన వర్గాల మధ్య నుంచి ఎదిగి, వారినే తన పోరాట శక్తిగా మలుచుకుని తెలంగాణ నేలపై స్వీయ పాలనకు పునాది వేసిన అసాధారణ ప్రజా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సుమారు మూడున్నర శతాబ్దాల క్రితమే...

సర్వాయి పాపన్న: బహుజన రాజ్య తొలి స్వాప్నికుడు

అణగారిన వర్గాల మధ్య నుంచి ఎదిగి, వారినే తన పోరాట శక్తిగా మలుచుకుని తెలంగాణ నేలపై స్వీయ పాలనకు పునాది వేసిన అసాధారణ ప్రజా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సుమారు మూడున్నర శతాబ్దాల క్రితమే సామాజిక అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన పాపన్న ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక చారిత్రక తిరుగుబాటు. సామాన్యుడి నుంచి నాయకుడిగా, యోధుడిగా, పాలకుడిగా ఎదిగి తన కాలంలోని అధికార వ్యవస్థను సవాలు చేసిన ప్రజా వీరుడు.

నేడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనుండటం తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది కేవలం ఒక విగ్రహావిష్కరణ కాదు.. చరిత్రలో తగిన గుర్తింపు పొందాల్సిన ఒక మహాయోధుడికి ప్రజాప్రభుత్వం అందిస్తున్న గౌరవం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పాపన్న వారసత్వాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.

సర్వాయి పాపన్న జీవితం తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనం నుంచే గ్రామీణ సమాజంలోని అసమానతలను, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, దోపిడీని గమనించారు. ఆ కాలంలో సామాజిక స్థాయి, కులం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు వ్యక్తి జీవితాన్ని నిర్ణయించే పరిస్థితులు ఉండేవి. భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు వంటి స్థానిక అధికార కేంద్రాల ఆధిపత్యం సామాన్య ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపేది. ఈ పరిస్థితులను చూసిన పాపన్నలో తిరుగుబాటు భావం బలపడింది. అయితే తన అసంతృప్తిని వ్యక్తిగత పోరాటానికే పరిమితం చేయలేదు. వివిధ సామాజిక వర్గాల ప్రజలను సమీకరించి ఒక శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించాడు. చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, మీర్ సాహెబ్ వంటి వివిధ సామాజిక వర్గాలకు చెందిన సహచరులు ఆయనతో కలిసి నడిచినట్లు చారిత్రక, జానపద ప్రస్తావనలు ఉన్నాయి. సమాజంలోని వేర్వేరు వర్గాలను విడదీయకుండా.. ఒకే లక్ష్యం కోసం ఐక్యం చేయడం. ఆయన నిర్మించిన పోరాట శక్తి కేవలం సైనిక బలం కాదు.. సామాజిక ఐక్యతకు కూడా ప్రతీక.


పాపన్న పోరాటం క్రమంగా ఒక రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుంది. పరిమిత వనరులతోనే స్థానిక భౌగోళిక పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుని గెరిల్లా యుద్ధ పద్ధతులను ఉపయోగించాడు. కోటలను నిర్మించాడు. రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ ఒక స్వతంత్ర రాజకీయ వ్యవస్థను నిర్మించేందుకు ప్రయత్నించాడు. ఖిలాషాపూర్, తాటికొండ వంటి ప్రాంతాల్లోని కోటలు నేడు పాపన్న సైనిక, రాజకీయ ప్రస్థానానికి చారిత్రక ఆనవాళ్లుగా నిలిచాయి. ఆ కోటలు కేవలం రాళ్లతో నిర్మించిన కట్టడాలు కావు. సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ఒక నాయకుడు తన శక్తితో నిర్మించుకున్న రాజకీయ స్వావలంబనకు అవి ప్రతీకలు. పాపన్నకు రాజ్యాధికారం అంటే కేవలం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం కాదు. ప్రజలకు భరోసా కల్పించే వ్యవస్థను నిర్మించడం. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కులవృత్తులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పాపన్నకు సంబంధించిన చారిత్రక, జానపద కథనాలు చెబుతున్నాయి.

పాపన్న పోరాటంలో గోల్కొండ ఘట్టం అత్యంత కీలకమైనది. ఆ కాలంలో గోల్కొండ ఒక ప్రధాన రాజకీయ, సైనిక అధికార కేంద్రం. సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన ప్రజాబలంతో ఎదిగి గోల్కొండను సవాలు చేయడం పాపన్న పోరాటంలోని అసాధారణతను తెలియజేస్తుంది. పాపన్న ప్రభావం విస్తరిస్తున్న కొద్దీ అప్పటి మొఘల్ అధికార వ్యవస్థకు ఆయన ఒక సవాలుగా మారాడు. స్థానిక అధికార కేంద్రాలపై తన ప్రభావాన్ని పెంచుకుంటూ స్వతంత్ర శక్తిగా ఎదగడం మొఘల్ పాలకులకు ఆందోళన కలిగించింది. పాపన్నపై ఎన్ని సైనిక చర్యలు, కోటలపై దాడులు జరిగినా, తిరిగి శక్తిని సమీకరించుకున్న తీరు ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా తన పోరాటాన్ని కొనసాగించాడు.

పాపన్న జీవితంలో మనకు కనిపించే గొప్ప గుణం– ఓటమిని అంతిమంగా భావించకపోవడం. ఒక పోరాటం విఫలమైనా లక్ష్యాన్ని వదులుకోకుండా మళ్లీ ప్రజలను సమీకరించడం. సర్వాయి పాపన్న చివరి దశకు సంబంధించిన వివరాల్లో చారిత్రక, జానపద కథనాల మధ్య భిన్నతలు కనిపిస్తాయి. ఆయన మరణానికి సంబంధించిన అంశాల్లోనూ వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందువల్ల పాపన్న చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు లభ్యమయ్యే చారిత్రక పత్రాలు, పురావస్తు ఆధారాలు, స్థానిక జానపద సంప్రదాయాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. తన కాలంలోని సామాజిక, రాజకీయ ఆధిపత్యాన్ని సవాలు చేసిన ఒక శక్తివంతమైన ప్రజా నాయకుడిగా పాపన్న తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.


తెలంగాణ గ్రామీణ సమాజ నిర్మాణంలో బీసీ, బహుజన వర్గాల పాత్ర అపారమైనది. వ్యవసాయం, చేతివృత్తులు, ఉత్పత్తి రంగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శతాబ్దాలుగా ముందుకు నడిపించిన ఈ వర్గాలకు రాజకీయ, సామాజిక గుర్తింపు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సర్వాయి పాపన్న ఒక ముఖ్యమైన చారిత్రక ప్రతీక. అణగారిన వర్గాలు కేవలం పాలనను అనుసరించే ప్రజలు మాత్రమే కాదని.. అవసరమైతే తమ హక్కుల కోసం పోరాడగలరని, తమ నాయకత్వాన్ని తాము నిర్మించుకోగలరని పాపన్న తన జీవితంతో నిరూపించాడు.

సర్వాయి పాపన్న చరిత్రను మరింత లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. ఖిలాషాపూర్, తాటికొండ వంటి చారిత్రక ప్రదేశాలను పరిరక్షించాలి. పాపన్నకు సంబంధించిన చారిత్రక పత్రాలు, పురావస్తు ఆధారాలు, జానపద కథనాలను శాస్త్రీయంగా సేకరించాలి. యువతకు ఆయన చరిత్రను పరిచయం చేయాలి. చరిత్రను సంరక్షించడం అంటే కేవలం పాత కోటలను కాపాడటం కాదు. ఆ చరిత్రలో అణగారిన వర్గాల పాత్రను, వారి ఆత్మగౌరవాన్ని, వారి పోరాట స్ఫూర్తిని కూడా భావితరాలకు అందించడం.

పొన్నం ప్రభాకర్

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 03:44 AM