Share News

తెలుగు గుండెల్లో వెలుగురేఖ పాపన్న

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:08 AM

‘ఊరు కొడితేనేమి ఫలం... పల్లె కొడితేనేమి ఫలం.. కొడితే బందర్ బస్తీలు కొట్టాలే.. మైసూరు కొట్టాలే, నెల్లూరు నేలాలే, గోల్కొండ కోట కొట్టాలే...’ ఇదీ సర్వాయి పాపన్న దృక్పథం. కల్లుగీత కత్తిని రాజ్యాధికార స్థాపన రణానికి...

తెలుగు గుండెల్లో వెలుగురేఖ పాపన్న

‘ఊరు కొడితేనేమి ఫలం... పల్లె కొడితేనేమి ఫలం.. కొడితే బందర్ బస్తీలు కొట్టాలే.. మైసూరు కొట్టాలే, నెల్లూరు నేలాలే, గోల్కొండ కోట కొట్టాలే...’ ఇదీ సర్వాయి పాపన్న దృక్పథం. కల్లుగీత కత్తిని రాజ్యాధికార స్థాపన రణానికి చూపుడు కత్తిగా ముందుకు సాగిన సాహసికుడు పాపన్న, అతి సామాన్య గౌడ్ కల్లుగీత వృత్తిదారుడు.

వరంగల్ ‌జిల్లా జనగామకు దగ్గర్లో ఉన్న ఓ ఊరు నుంచి గోల్కొండ కోటను జయించిన వీరుడు పాపన్న. 1687 నుంచి 1724 వరకూ 37 ఏళ్ల పాటూ మొఘల్‌ సర్కారును, సేనలను గడగడలాడించిన ఆ వీరుడు తాటికొండ, ఖిలాషాపూర్‌ కేంద్రాలుగా యుద్ధం కొనసాగించాడు. సాధారణంగా కోటల్ని కట్టేది రాజులు, మహారాజులు, సమ్రాట్టులు, చక్రవర్తులు. కానీ కల్లు గీసేవాడు కట్టిన కోటలు ఇవి.

పుట్టింది 1650లో కల్లుగీత కుటుంబంలో. మొఘల్‌ల అరాచకాలను, విద్వేష దాడులను చూసి పాపన్న లావాలా మరిగిపోయేవాడు. బడుగుల సేనకు ప్రాణం పోశాడు. పన్నెండు మంది బహుజన మిత్రులతో మొదలైన పాపన్న సేన పన్నెండు వేలకు పెరిగింది. రెడ్లు, బ్రాహ్మణులు, వెలమలు అన్న తేడా లేకుండా కులమతాలకతీతంగా అందరూ పాపన్న సేనలో చేరారు. ‘‘అదిగో పాపన్న వస్తావుంటే కుందేళ్లు కూర్చుండబడెను, లేడిపిల్లలూ లేవలేవు, పసిబిడ్డలు పాలు తాగరు, నక్కలు– సింహాలు తొక్కబడును’’ అదీ పాపన్న శౌర్యం.


మొఘలుల పన్ను వసూలును, దౌర్జన్యాన్ని పాపన్న సవాలు చేశాడు. నవాబులు, జమీందార్లపై దాడులు చేసి, కోటల్ని కొల్లగొట్టాడు. ఆ డబ్బును గ్రామాల్లో పంచేవాడు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ గుడులు, గోపురాలు కట్టాడు. ఆ రోజుల్లోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. మొఘల్ నిరంకుశత్వ పాదాల కింద నలుగుతున్న ప్రజాధర్మాన్ని పునరుద్ధరించాడు. నల్లగొండలో భువనగిరి, వరంగల్లులో తాటికొండ, కొలనుపాక, చేర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్‌లలో కోటలు కట్టించాడు. 1675లో సర్వాయిపేట గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక కోటను కట్టించాడు. అయితే అలాంటి వీరుడి రాజధాని ఖిలాషాపూర్. ఇక్కడి కోటలు అన్నీ కూడా శత్రు దుర్భేద్యమైనవి. చుట్టూ ఉన్న కొండలు కోటకు తొలి రక్షణ కవచంలా నిలిచాయి. కోటలలో నాలుగు పెద్ద బురుజులు, పలు ద్వారాలున్నాయి. ఆ ద్వారాలన్నీ కూడా ఏనుగుల వంటి పెద్ద జంతువులు రావడానికి వీల్లేకుండా చిన్న చిన్నగా ఉన్నాయి. శత్రువుపై తుపాకులు గురిపెట్టేందుకు ఏర్పాట్లున్నాయి. దొంగ దెబ్బ తీసేందుకు మలుపులు, ఇరుకు సందులు ఉన్నాయి. అవసరమైతే పారిపోయేందుకు మూడు సొరంగాలున్నాయి. ఒకటి తాటికొండ కోటకు, మరొకటి నాంచారి బావికి ఉన్నాయి. మూడో సొరంగం ఎక్కడికి వెళ్తుందన్నది ఎవరికీ తెలియదు. ఈ కోట గోడలు, బురుజులు, ద్వారాలూ, లోపలి నిర్మాణాలు పాపన్న గౌడ్‌ వ్యూహ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. ఈ కట్టడం అతని యుద్ధతంత్రం ఎలాంటిదో తెలియజేస్తోంది.

కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డిరాజుల స్వాతంత్ర్య పతాకాలు మురికిపట్టి, చిరిగిపోయి, తెలుగు గుండెపై మొఘల్ జెండా నాటుకుపోయిన చీకటి రోజుల్లో.. వెలుగు రేఖ సర్వాయి పాపన్న. ఓరుగల్లు, నల్లగొండలు కలిసే చోట రైతుల పొలాలు ఎండిపోకుండా చెరువులు తవ్వించాడు. చెక్‌డ్యామ్‌లు కట్టించాడు. గ్రామీణుడికి బువ్వ దక్కాలన్న తాపత్రయం పాపన్న జీవితమంతా కనిపిస్తుంది. పాపన్న ఓరుగల్లు నేలలో పుట్టిన వీరుడే కావచ్చు. కానీ తెలుగు, కన్నడ నేలలను విముక్తం చేయాలన్న కల ఆయన కళ్లలో సదా మెదలాడేది. ధూల్మిట్ట గ్రామంలో ఉన్న వీరశిల మీద పాపన్న గురించిన శాసనంలో ఇలా రాసి ఉంది– ‘‘బండి పోతగౌడ/ షాపుర్ ఖిలా పులిగౌడ/ యేబదిరొడ్డి షర్పారాయుడ/ సౌదరు పాపడు..’’ అని. ఆ శాసనంపై, శత్రువును వలపన్ని బంధించే పాపడి వ్యూహానికి ప్రతీకగా సాలెపురుగు, పరాక్రమానికి ప్రతీకగా సింహం, రాజ్యమేలిన కారణంగా రాజలాంఛనంగా ఛత్రం ఉంటాయి.


మొఘల్‌ సుల్తాన్‌ బహదూర్‌ షా మాయోపాయంతో తాటికొండ, ఖిలాషాపూర్‌ కోటలపై దాడి చేశాడు. పాపన్న దాన్ని తిప్పికొట్టడమేగాక అటు ఓరుగల్లు, ఇటు గోల్కొండ కోటలపై దాడి చేసి వాటిని జయించాడు, మొఘలుల్ని మట్టి కరిపించాడు. పలు రోజులు యుద్ధం సాగింది. అందరినీ దునుమాడాడు, చివరికి పోరాడుతూనే యుద్ధభూమిలో పాపన్న ప్రాణం వదిలాడు. తాటికొండ, ఖిలాషాపూర్ కోటలను చూడండి. అక్కడ పాపన్న విగ్రహాలు ఉంటాయి. కోట అంతా కలయతిరిగాక ఒక్క నిమిషం ఆ విగ్రహం ముందు నిలబడండి. మన నేలను తిరిగిన మన పాపన్నను మదినిండా తలచుకోండి.

అంబాల నారాయణగౌడ్

(బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్)

(ఏప్రిల్ 2: సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి)

ఇవి కూడా చదవండి..

యూసీసీ అమలు, లవ్ జిహాద్‌కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో

దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ

Updated Date - Apr 01 , 2026 | 02:08 AM