Sankranti and Telugu Culture: తెలుగు సంస్కృతి సంక్రాంతి
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:16 AM
ప్రాంగణమ్మున పూచు బంతిపూవుల సౌరు గుమ్మాన పూదండ కులుకుచుండ ముంగిట తీర్చిన రంగవల్లికలందు...
ప్రాంగణమ్మున పూచు బంతిపూవుల సౌరు
గుమ్మాన పూదండ కులుకుచుండ
ముంగిట తీర్చిన రంగవల్లికలందు
చెలువుగ గొబ్బిళ్ళు కొలువుచేయ
క్రొత్త యల్లునికిని కొంటె మరదళ్లకు
జరిగెడు చతుర ప్రసంగములును
అత్తవారింటిలో క్రొత్త కోడలు పంచు
పొంగలి రుచిలోన పొదలు మమత
బోసినవ్వుల పాపకు బోగిపళ్ళు
పెలుచు బొమ్మల కొలువులు పేరంటాండ్రు
తెలుగు లోగిళ్ళ కొంగ్రొత్త వెలుగులెగయ
పర్వమున సంప్రదాయము పల్లవించె
రేయి మూడవ జాము రెక్కలు జాడించి
కొక్కొరొకో యను కోడి పుంజు
ఇంటింటికిని పోయి ఎల్లర నిద్దుర
లేపి దీవించు గంటాపకీరు
హరిలొరంగ యటంచు హరికీర్తనము చేసి
భక్తిని మేల్కొల్పు భట్టుదాసు
అయ్య గారికి మ్రొక్కి ఆటపాటలతోడ
హంగులు చేసెడి గంగిరెడ్లు
బుడబుక్కల మ్రోగించి పొలుచువారు
కాటిపాపలు తోల్బమ్మలాటగాండ్రు
పగటి వేషాలు వేదాలు పలుకు బుధులు
పోతురాజులు పులియాట పోటుగాండ్రు
వీరలొకనాడు సంస్కృతి పెంపు చేసి
వెలుగులిచ్చిరి సంక్రాంతి విభవమునకు
ఇట్టి దృశ్యములీనాడు వట్టిపోయే
ఆదరణ లేక కళలెల్ల యావురనియె
పూర్వ వైభవ మేరీతి పొందగలవొ
సుంత యోచింపుడో బుద్ధిమంతులారా!
వేదాంతం శరచ్చంద్రబాబు
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..