Share News

మారిషస్‌లో ఒక శకాంతం!

ABN , Publish Date - May 07 , 2026 | 02:28 AM

తెలుగు భాషను సంజీవని పర్వతంలా చివరి శ్వాస వరకు భుజం మీద మోస్తూ, అలుపెరుగని తెలుగు యోధుడిలా దేశ విదేశాలు తిరిగిన సంజీవ నరసింహ అప్పడు ఇక లేరు. ఈ వార్త వినగానే ఎన్నెన్నో జ్ఞాపకాల అలలు...

మారిషస్‌లో ఒక శకాంతం!

తెలుగు భాషను సంజీవని పర్వతంలా చివరి శ్వాస వరకు భుజం మీద మోస్తూ, అలుపెరుగని తెలుగు యోధుడిలా దేశ విదేశాలు తిరిగిన సంజీవ నరసింహ అప్పడు ఇక లేరు. ఈ వార్త వినగానే ఎన్నెన్నో జ్ఞాపకాల అలలు గుండె చెలియలికట్టను తాకుతూ నన్ను కకావికలు చేశాయి. మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం మాది. మారిషస్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన నిర్మాణ కమిటీ చైర్మన్ శ్రీ నరసింహులు రామయ్యగారి విన్నపంతో ఆనాటి ఆప్కో ఫ్యాబ్రిక్స్ ఉన్నతాధికారి స్వర్గీయ శ్రీ ఆకురాతి వేంకటేశ్వరరావుగారికి వచ్చిన ఆలోచనతో నేను 1989లో మారిషస్ చేరాను. మౌలికమైన ఉద్దేశం అక్కడి తెలుగువారికి, ఆసక్తిగలవారికి తెలుగు బోధించడం. మా గురువు శోభారాజుగారి ఆశీస్సులతో అరకొరగా అబ్బిన అన్నమయ్య సంకీర్తనల పరిచయమే నాకు పాస్‌పోర్టు మాత్రమే కాక, వీసాగా కూడా ఎంతగానో అచ్చొచ్చింది. అలా మారిషస్‌లో నాకు పరిచయమై, మారిషస్‌లోని తెలుగువారందరికీ అన్నమయ్య సంకీర్తనలను దగ్గర చేసి, వాడ వాడలా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేసినవాడు, ఆత్మీయ మిత్రుడు స్వర్గీయ సంజీవ నరసింహ అప్పడు.

నేను అక్కడ ఉన్నది 18 నెలలే అయినా, అన్నమయ్యను భుజాన వేసుకుని, సంజీవ సహకారంతో, మారిషస్ ద్వీపమంతా పర్యటన చేయగలిగాను. తెలుగువారి ఇళ్ళలో వివాహమైనా, పండగైనా నన్ను పిలిచేవాళ్ళు. రామభజన, శ్రీరామనవమి, ఉగాది– ఏ పండగైనా నేనక్కడ ఉండాల్సిందే. ఏ సందర్భానికైనా పాడుకోగలిగిన విధంగా అన్నమయ్య రచించిన సంకీర్తనలెన్నో ఉన్నాయి. ఆయా సందర్భాలకు, దేవుడికి సంబంధించిన కీర్తన పాడి, అందరికీ అర్థం వివరించి చెబితే ఎంత సంతోషించేవాడో! 1990 డిసెంబరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శోభారాజుగారి మారిషస్ సందర్శన కూడా అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి ఎంతగానో దోహదం చేసి, ఊపునిచ్చింది. నాలుగైదేళ్ళ క్రితం యాభై అన్నమయ్య సంకీర్తనలను సంకలనం చేసి, అర్థ, తాత్పర్యాలతో ఇంగ్లీషులో ప్రచురించి, మారిషస్‌లో ఆసక్తి ఉన్న తెలుగువారందరికీ పంచిపెట్టాడు సంజీవ. మారిషస్‌లో తెలుగువారి అస్తిత్వ చిహ్నంగా ఒక పతాకాన్నే సృష్టించాడాయన.


ఎంతో శ్రద్ధగా కలిగ్రఫీలో అందరి పేర్లు రాసేవాడు. దానికోసం ప్రత్యేకంగా నాలుగైదు రంగుల బాల్ పెన్నుల రీఫిల్స్ కలిపి వినూత్నమైన పెన్ను తయారు చేశాడు. ఒకేసారి నాలుగైదు రంగుల్లో రాసేవాడు. సంజీవ చేతిరాత ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తన పేరు మీద ఒక ఫాంట్ తయారు చేయాలని ప్రయత్నించాడు, చివరికి సాధించాడు కూడా. ‘మారిషస్ సంజీవ తెలుగు ఫాంట్’ను సృష్టించి, ప్రపంచమంతా ఉన్న తెలుగువారిలో చిరస్మరణీయుడయ్యాడు. అద్భుతంగా ముగ్గులు వేసేవాడు. ప్రపంచ మహాసభల సందర్భంగా రవీంద్ర భారతి ముంగిలిని ముగ్గులతో తీర్చిదిద్దాడు. తెలుగు ప్రముఖులంతా అతని శ్రద్ధకు ఆశ్చర్యపోయేవారు. రావి ఆకులను ఎండబెట్టి, వాటి మీద ఎందరో ప్రముఖుల బొమ్మలు గీసి, ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. తన ప్రదర్శనకు స్థలం కేటాయించకపోతే గేటు దగ్గరే వాటిని ప్రదర్శించేవాడు.

కుల మతాల ధోరణి లేకుండా అందరితో కలసిపోయేవాడు. నేను విజయవాడలో కలవడానికి వెళ్ళినపుడు ఒక క్రిస్టియన్ మిత్రుల ఇంట్లో ఉన్నాడు. వారు సంజీవ భక్తిని గమనించి కారులో భద్రాచలం తీసుకుని వెళ్ళారు. తెలుగు మాట్లాడితే చాలు; ఎందరో ప్రముఖుల్ని, అప్రముఖుల్ని టోరీ రేడియోలో ఇంటర్వ్యూ చేసేవాడు. జీవితాంతం టోరీ రేడియోతో అనుబంధం కొనసాగించాడు. ప్రతి వారమూ నాకు ఆ కార్యక్రమాల లింకు పంపించేవాడు. తెనాలిలో మునిసిపల్ స్కూలు పిల్లల దగ్గర నుంచి, అబిడ్స్‌లో స్లేట్ స్కూల్ పిల్లల దాకా అందరికీ సంజీవ పరిచయమే. అతను ప్రజల్లోకి దూసుకుపోయిన తీరును చూసి ఆశ్చర్యపోతాం. ఏదైనా స్కూలుకెళ్ళాలంటే రెండో ఆలోచన లేకుండా పరుగెత్తేవాడు. దక్షిణాఫ్రికా, మలేషియా, లండన్, భారతదేశం– ఎక్కడికెళ్ళినా నా గురించి అక్కడి తెలుగువారికి చెప్పేవాడు. తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చినపుడు అన్ని దేశాల తెలుగువారికి నన్ను పరిచయం చేశాడు.

దేశ విదేశాల్లో తెలుగు భాషా ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసిన అంతటి నిబద్ధత కలిగిన స్ఫూర్తిమూర్తిని చూడలేము. మారిషస్‌లో తెలుగు పతాకం అవనతం కాకుండా జీవితాంతం ఎగురవేసినవాడు. నిస్వార్థంగా, ఏ గౌరవాలు ఆశించకుండా జీవితాన్ని తెలుగు భాషా ప్రచారం కోసం అంకితం చేసిన ధన్యజీవి. రాజకీయ ప్రాపకం కోసం తెలుగు భాషా ప్రచారాన్ని వినియోగించుకునే తెలుగువారికి సంజీవ జీవితం, కార్యాచరణ ఒక పాఠం, గుణపాఠం. సంజీవ కృషిని గుర్తించిన మారిషస్ ప్రభుత్వం మన దేశపు ‘పద్మ విభూషణ్’తో సమానమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ (Order of the Star and Key of the Indian Ocean) పురస్కారంతో 2022లో సత్కరించింది.


మారిషస్‌లోని తెలుగువారికి మన తెలుగు ప్రభుత్వాలు ఇప్పుడు ఏ సహకారం అందిస్తున్నాయో నాకు తెలీదు. సంజీవ మరణంతో మారిషస్‌లో తెలుగు భాషా ప్రచారానికి నిబద్ధతతో పూనుకునేవారి తరం ముగిసింది. దేశ విదేశాల్లో వివిధ సమావేశాల్లో, ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇక ముందు విశిష్టమైన సంజీవ సందడి కనిపించదు. ఫోన్లోనైనా, వ్యక్తిగతంగా కలిసినపుడైనా ‘జై తెలుగు తల్లి’ అని ఒకసారి అంటే ఒప్పుకునేవాడు కాదు, ‘జై జై జై తెలుగు తల్లీ’ అని మూడుసార్లు బిగ్గరగా అనాల్సిందే. సంభాషణలో ఒక్క ఆంగ్ల పదం వచ్చినా ఒప్పుకునేవాడు కాదు. తనకు తెలియని తెలుగు పదాన్నే ఇంగ్లీషులో చెప్పమని అడిగేవాడు. మారిషస్‌లో తెలుగు మాట్లాడే చివరి ఉపాధ్యాయుడు, మారిషస్‌లో తెలుగు మాట్లాడే తెలుగు ప్రముఖుల్లో చివరివాడు సంజీవ నరసింహ అప్పడు. మారిషస్ తెలుగువారితో సైతం తెలుగులో మాట్లాడేవారి శకం ముగిసింది. తెలుగువారంతా ఇప్పుడు ధైర్యంగా ఇంక క్రియోల్లోనే మాట్లాడుకుంటారు!

చల్లా రామఫణి (జర్నలిస్ట్‌)

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 02:28 AM