Share News

సాంఘికశాస్త్రం తెలుగులో బోధిస్తే..?

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:07 AM

వ్యక్తిగత వికాసానికి, సాంస్కృతిక పరిజ్ఞానానికి, పౌర బాధ్యతలకు చెందిన విద్య సాంఘికశాస్త్రం. భూగోళం, చరిత్ర, పౌర విజ్ఞానం, ఆర్థికశాస్త్రం దీని ప్రధాన విభాగాలు. పదో తరగతి తర్వాత ఎక్కువ మంది...

సాంఘికశాస్త్రం తెలుగులో బోధిస్తే..?

వ్యక్తిగత వికాసానికి, సాంస్కృతిక పరిజ్ఞానానికి, పౌర బాధ్యతలకు చెందిన విద్య సాంఘికశాస్త్రం. భూగోళం, చరిత్ర, పౌర విజ్ఞానం, ఆర్థికశాస్త్రం దీని ప్రధాన విభాగాలు. పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు సాంఘికశాస్త్రానికి దూరమవుతారు. అందుకే విద్యకు పునాది పడే పాఠశాల స్థాయిలోనే పిల్లలకు తమ జాతి, దేశం, నాగరికత, విలువలు తప్పక తెలియాలి. దీని బోధనకు మాతృభాషను వినియోగిస్తేనే చదువుకు సమాజానికి ఉన్న అనుబంధం విద్యార్థులకు చక్కగా బోధపడుతుంది.

తెలుగు వాచకంలో ఉన్నట్లుగానే సాహిత్యం, కళలు, సంస్కృతి, సామాజిక జీవనంపై విస్తృత సమాచారమే సాంఘికశాస్త్రంలోనూ ఉంటుంది. స్థానిక పండుగలు, సంప్రదాయాలు, జానపద కవులు, పాటలు ఇలా ఎన్నో విషయాలను బోధించడానికి ఒక్క తెలుగు వాచకం సరిపోదు. తెలుగు సబ్జెక్టులో పద్యాలు, కథలు, సాహితీవేత్తల పరిచయాలు ఉన్నట్లే వాటి కొనసాగింపుగా సాంఘికశాస్త్రంలో నదులు, అడవులు, జంతువులు, గ్రామాలు, పంటలు, రైతులు, చేతి వృత్తులు, స్థానిక రాజులు, యుద్ధాలు, పాలకులు, పాలనా విధానాల సమాచారం సవివరంగా ఉంటుంది. తెలుగులో అయితే వీటి గురించి విద్యార్థులు తమలో తాము సులభంగా చర్చించుకోగలరు. సాంఘికశాస్త్రం జవాబులు రాయడానికి విద్యార్థులు సంక్లిష్ట ఇంగ్లీషు భాష, వ్యాకరణాన్ని ఆశ్రయించే అవసరం ఉండకూడదు. ఆంగ్ల బోధన అర్థం కాని పిల్లలు ఈ క్లాసులను ఎగ్గొట్టే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు కూడా మాతృభాషలో అయితే మరింత ఆసక్తిగా తెలిసిన, సంబంధిత విషయాలను జోడించి చెప్పగలరు.

ఉదాహరణకు 8వ తరగతి సాంఘికశాస్త్రంలో అడవులు–సంరక్షణ, ఖనిజాలు–గనుల తవ్వకం, నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదార్లు, పేదరికం–అవగాహన, హక్కులు–అభివృద్ధి, సాంఘిక, మత సంస్కరణోద్యమాలు, హైదరాబాద్‌లో స్వాతంత్య్ర ఉద్యమం, భారత రాజ్యాంగం, పార్లమెంట్–కేంద్ర ప్రభుత్వం, లౌకికత్వం–అవగాహన లాంటి పాఠాలు ఉన్నాయి. సొంత నేలకు చెందిన ఈ పాఠాలను ఇంగ్లీషులో బోధించడమే ఓ వింత. తమ గురించి మరో భాషలో చదువుకొనే దౌర్భాగ్యం విద్యార్థులకు పట్టకూడదు. ఈ పాఠాలు కేవలం పరీక్షల కోసం కాదు, విద్యార్థిని దేశ పౌరుడిగా తీర్చిదిద్దడానికి అవసరమైనవి. అర్థం కాని భాషలో ఆవశ్యక విషయాలు చెబితే యాంత్రికంగా, ప్రభావహీనంగా ఉంటుందని సుప్రీంకోర్టు ఓ కేసులో పేర్కొంది.


పదో తరగతి వరకు ఒక సబ్జెక్టుగా మిణుకు మిణుకుమంటున్న మాతృభాషకు తోడుగా సాంఘికశాస్త్రాన్ని జోడిస్తే భాష కూడా బలపడుతుంది. రెండు సబ్జెక్టులు మాతృభాషలో చదవడం వల్ల విద్యార్థులకు భాషపై విస్తృతజ్ఞానం లభించే అవకాశం ఉంటుంది. ఇలా మాతృభాషను రక్షించుకునేందుకు మరో మంచి అవకాశం దొరుకుతుంది. కనీసం అయిదవ తరగతి వరకు, వీలైతే ఎనిమిది దాకా చదువు మాతృభాషలోనే సాగాలని సభ్యదేశాలకు యునెస్కో సూచించింది. ఆ సిఫారసుల మేరకు మన జాతీయ విద్యావిధానం–2020లో కూడా ప్రాంతీయ భాష విస్తృతి పెరగాలని ఉంది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు 22 భారతీయ భాషల్లో ముద్రించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ దృష్టితో సాంఘికశాస్త్రాన్ని కూడా మాతృభాషలోనే బోధిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

బద్రి నర్సన్

ఈ వార్తలు కూడా చదవండి

రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..

Updated Date - Sep 11 , 2026 | 01:07 AM