బెంగాల్.. కొత్త లెక్కలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:37 AM
పశ్చిమబెంగాల్‌లో బుధవారం రెండోవిడత పోలింగ్ పూర్తికావడంతో ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఏ రాష్ట్రంలో ఎవరికెన్ని స్థానాలు అంటూ టెలివిజన్ చానెళ్ళు...
పశ్చిమబెంగాల్‌లో బుధవారం రెండోవిడత పోలింగ్ పూర్తికావడంతో ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఏ రాష్ట్రంలో ఎవరికెన్ని స్థానాలు అంటూ టెలివిజన్ చానెళ్ళు ఎగ్జిట్‌పోల్స్‌తో హడావుడి చేస్తున్నాయి. అసోంలో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని, తమిళనాడులో స్టాలిన్ మళ్ళీ వస్తారని, పదేళ్ళ తరువాత కాంగ్రెస్ చేతిలోకి కేరళ పోబోతున్నదని ఈ సర్వేలు చెబుతున్నాయి. దేశ విదేశీ మీడియా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న పశ్చిమబెంగాల్‌లో ఈ సర్వేలు కాస్తంత అటూ ఇటూ ఊగుతూనే పైచేయి బీజేపీదే కావచ్చునని అంటున్నాయి. ఈ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ, అసలు ఫలితాలు వెల్లడయ్యే మే 4వరకూ ఉత్కంఠ తప్పదు.
‘చునావ్ కా పర్వ్.. పశ్చిమ్‌బెంగాల్ కా గర్వ్’ అంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఉత్సాహంగా ట్వీట్ చేశారు. బెంగాల్‌లో రెండు విడతల్లోనూ అత్యధిక పోలింగ్ జరగడం స్వతంత్ర భారతంలో ఇదే తొలిసారి అని సంతోషంగా వ్యాఖ్యానించారు. తొలిదశ పోలింగ్ సందర్భంలో కూడా బెంగాలీలు ఇంత పెద్దఎత్తున ఓట్లేసింది ఇప్పుడేనంటూ సామాజిక మాధ్యమాల్లో తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ‘సర్’తో ఓటర్ జాబితాలను సమూలంగా ప్రక్షాళించి, అసలు సిసలు ఓటర్లనే మిగల్చినందున పోలింగ్ శాతం ఈ స్థాయిలో ఉన్నదని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. రాష్ట్రంలో ‘సర్’ అద్భుత విజయం సాధించిందని ఆయనతోపాటు బీజేపీ నేతలంతా సంతోషిస్తున్నారు. మమత ఎన్ని వీధిపోరాటాలు చేసినా, సుప్రీంకోర్టు మెట్లెక్కి సొంతంగా వాదనలు వినిపించినా, అంతిమంగా కోర్టు కూడా ఈసీకే అండగా నిలబడింది. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అనుమానించే, నిర్థారించే హక్కు మీకు ఎక్కడిదని మాటమాత్రమైనా అడగకుండా, ‘సర్’ ను ఆపకుండా, తార్కిక వ్యత్యాసాల పేరిట లక్షలమందిని ఓటరు జాబితానుంచి తొలగించినా ఈసీని కోర్టు వదిలేసింది. దశాబ్దాలుగా ఓటేస్తున్నవారంతా ఒక్కసారిగా అనర్హులుగా మారిపోయి, అధికారుల చుట్టూ అదేపనిగా తిరిగి, ఆఖరు నిముషం వరకూ ట్రిబ్యునళ్ళలో పోరాడి ఓటు దక్కకపోతే కూడా, ‘ఓహో, ఈ ఎన్నికల్లో మాత్రం ఇన్ని లక్షలమందికీ ఓటేసే అవకాశం లేదన్నమాట’ అని ఓ న్యాయమూర్తి అతితేలికగా వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ట్రిబ్యునళ్ళ ఏర్పాటులో ఉద్దేశపూర్వక జాప్యంతో పాటు, పోలింగ్‌కు కాస్తంత ముందు కొద్దివందలమంది అప్పీళ్ళను మాత్రమే పరిష్కరించి లక్షలమందిని వదిలేసిన వైనాన్నీ చూశాం. అప్పీలు చేయడం తెలియక, కఠినమైన ఆ ప్రక్రియను భరించలేక చేతులెత్తేసిన వారే అత్యధికం. మంగళవారం రాష్ట్ర ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడుతూ, పరిష్కరించిన కేసుల సంఖ్య తనకు తెలియదని, అది ఓ పేపర్ వర్క్ మాత్రమేనని తేలికగా తీసిపారేశారు. తక్కువ సమయంలో, అత్యంత హడావుడిగా, అధిక గందరగోళంతో నిర్వహించిన సర్ అద్భుత లక్ష్యాలు సాధించిందని ఎన్నికల చెప్పుకోవచ్చు. కానీ, ప్రజల రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కులను రక్షించాల్సిన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం చేయీచేయీ కలిపి లక్షలమందికి ఓటు లేకుండా చేశాయి. మమత మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాకున్నా జ్ఞానేశ్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది.
బిహార్‌ను సొంతం చేసుకున్న బీజేపీకి, శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మభూమి బెంగాల్‌ను సైతం గెలుచుకోవడం ఎంతో ముఖ్యం. అది ఆ పార్టీకి సైద్ధాంతిక విజయం అవుతుంది. బెంగాలీ అస్తిత్వంతో, ఆత్మగౌరవంతో ముడివడిన ఈ రాజకీయ యుద్ధంలో తనదే పైచేయి కావాలని బీజేపీ ఎంతో శ్రమించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిడికెడు ఝల్‌మురీ నోట్లో వేసుకొని ప్రధాని నరేంద్రమోదీ పెద్ద ప్రభావాన్నే చూపించారని అంటారు. ఉల్లి తింటాను కానీ, బుర్రలు తినను (ప్యాజ్ ఖాతాహు, దిమాగ్ నహీ) అంటూ వేసిన జోక్ కూడా బాగానే పేలింది. బీజేపీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీ పాలిత మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగాలీలు తినే తిండిమీద పలు ఆంక్షలు విధిస్తుందనీ, ఉల్లినీ, చేపనీ, మాంసాన్నీ ముట్టనివ్వదనీ తృణమూల్ చేసిన ప్రచారాన్ని వమ్ముచేయడానికి బీజేపీ పెద్దలంతా శ్రమించవలసి వచ్చింది. స్థానిక నేతలు చేపలు చేతిలో పట్టుకొని మరీ ఎన్నికల ప్రచారం చేసుకుంటే, ఉత్తరాది నేతలంతా మీడియా కంట్లో పడేట్టుగా రోడ్డుపక్కన కూచొని మత్స్యమాంసాదులను సుష్ఠుగా భుజించి మరీ ఆ వాదనను తిప్పికొట్టారు. బెంగాల్‌లోని కుంటలు, చెరువులతో సహా సమస్త నీటివనరులనూ నాలుగురెట్ల చేపలతో నింపేస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. చేపలు తినడమే కాదు, కొనడం కూడా బెంగాలీలకు ప్రీతిపాత్రమైన ప్రక్రియ. మచ్చర్ బజార్ నుంచి మంచి చేపను ఏరి తేగలిగినవాడే అసలైన బెంగాలీ అట. తమను ఉద్ధరించేది ఎవరో, గాలం విసురుతున్నదెవరో బెంగాలీలు పసిగట్టిందీ లేనిదీ మరో ఐదురోజుల్లో తేలిపోతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ
Read Latest AP News And Telugu News