విహారంలో విషాదం
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:08 AM
వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. దక్షిణ భారతం నుంచి ఆ దేశానికి విహారయాత్రకు వెళ్ళి స్పీడ్‌బోటు తిరగబడిన ఈ దుర్ఘటనలో ముగ్గురు తెలుగువారు సహా...
వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. దక్షిణ భారతం నుంచి ఆ దేశానికి విహారయాత్రకు వెళ్ళి స్పీడ్‌బోటు తిరగబడిన ఈ దుర్ఘటనలో ముగ్గురు తెలుగువారు సహా పదిహేనుమంది మృత్యువాత పడటం అత్యంత విషాదకరం. సంక్రాంతి సీజన్‌లో అమ్మకాలు బాగా జరిపిన డీలర్లు, వారి కుటుంబ సభ్యులకు ఒక మొబైల్ కంపెనీ ఈ టూర్ ఏర్పాటు చేసిందట. మూడు పడవల్లో 108 మంది పెరల్ ఐలాండ్ వెళ్ళి, తిరిగి ఒడ్డుకు ప్రయాణం కట్టినప్పుడు, ముప్పైరెండు మంది భారతీయులు, ముగ్గురు స్థానిక సిబ్బందితో ఉన్న తొలి స్పీడ్‌బోటు బయలుదేరిన రెండు నిముషాల్లో, అరకిలోమీటరు కూడా వెళ్ళకుండానే తిరగబడింది. దూకేసిన ఇరవైమంది ప్రాణాలు కాపాడుకోగలిగితే, బోటుకింద ఇరుక్కున్నవారు ఆ ఉప్పునీళ్ళలో మునకలు వేస్తూ ఊపిరాడక కన్నుమూశారు. మృతుల కుటుంబాల్లో ఇది తీరని విషాదం నింపితే, అప్పటివరకూ తమతో కలసి సరదాగా గడిపిన కొందరు కళ్ళెదుటే ఆర్తనాదాలు చేస్తూ చనిపోవడం మిగతావారిని దిగ్ర్భాంతిలో ముంచింది. వియత్నాం ప్రభుత్వం అత్యున్నత విచారణకు ఆదేశించినప్పటికీ, ఇటీవలి కాలంలో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్న ఆ దేశానికి ఈ ఘటన ఓ మాయనిమచ్చ.
ఈ ఘోరానికి కారణం ప్రకృతి వైపరీత్యమా, మానవ నిర్లక్ష్యమా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ప్రమాదంలో బయటపడినవారు ఆప్తులను కోల్పోయిన బాధను పంచుకుంటూనే, ఆ ఘోరం జరిగిన తీరు తెన్నులను వివరిస్తున్నారు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, విపరీతమైన గాలి తోడై ఈ బోటు నియంత్రణకు వీలుగానంతగా ఊగిపోయిందని చెబుతున్నారు. కఠినమైన వాతావరణంలో ఈ స్పీడ్‌బోట్ హఠాత్తుగా మలుపు తిరగడంతో ఎడమవైపు ఒరిగిందని, ఆందోళనలో ఉన్న పర్యాటకుల్లో అధికులు అటుగా పడిపోయారని అంటారు. మొత్తంగా, స్వల్పకాలంలో అత్యధిక బరువు ఒకవైపున పెరిగిపోవడంతో పడవ పూర్తిగా అదుపుతప్పి 80శాతానికి పైగా ఒరిగిపోయింది. కెప్టెన్, గైడ్ తమ ముందున్న మార్గం గుండా తప్పించుకున్నారు, లోపలున్నవారిలో కొందరు ధైర్యం చేసి బయటకు దూకేశారు. కానీ, పడవ దిగువున చిక్కుబడినవారిలో అనేకులు బలికావలసి వచ్చింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నిబంధనల ఉల్లంఘనలు, సహాయక చర్యల్లో జాప్యం ఇత్యాది విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. సహాయం తక్షణమే అందలేదన్న విమర్శలను అక్కడి ప్రభుత్వం ఖండిస్తోంది కానీ, ప్రాథమిక చికిత్స వెంటనే దక్కివుంటే అనేకమంది బతికేవారని తోటివారు అంటున్నారు. బాధితులను ఒడ్డుకు చేర్చిన తరువాత కూడా స్థానికులే ఎంతోకొంత సాయం చేశారని, అయితే, అక్కడి ఆస్పత్రిలో సిబ్బంది కొరతవల్ల ఆక్సిజన్ వంటివి దక్కలేదనీ, ముఖ్యంగా గాయపడినవారికి గంటలపాటు ఏ చికిత్సా అందలేదన్నది విమర్శ.
పర్యాటకుల భద్రత విషయంలో రాజీపడిన పక్షంలో విహారయాత్రలు విషాదాంతాలవుతాయనడానికి పూ క్వాక్ ద్వీపంలో జరిగిన ఈ ఘోరప్రమాదం నిదర్శనం. స్పీడ్‌బోటును ఎక్కువమందితో నింపేశారన్న విమర్శలూ లేకపోలేదు. దీనికితోడు, పర్యాటకులందరికీ సరిపడా లైఫ్‌జాకెట్లు బోట్లో ఉన్నప్పటికీ, ప్రయాణం ఆరంభానికి ముందు వాటిని అందరూ ధరించేట్టుగా చేయడంలో స్థానిక సిబ్బంది చొరవతీసుకోలేదని అంటారు. అతివేగంగా ప్రయాణించే స్పీడ్‌బోట్ మీద లోపలున్నవారి బరువులో వచ్చే చిన్నపాటి మార్పుచేర్పులు కూడా తీవ్రప్రభావం చూపుతాయి కనుక, బోట్ ఎంత ఊగినా ఎవరూ తమ సీట్లనుంచి కదలకుండా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకొనివుంటే బాగుండేది. యాత్రని స్పాన్సర్ చేసిన కంపెనీ, టూర్ ఆపరేటర్, స్థానిక సిబ్బంది, పర్యాటకులు కలసికట్టుగా వ్యవహరించి, ఏ దశలోనూ నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా, భద్రతా ప్రమాణాలకు కట్టుబడినప్పుడే ఇటువంటి విషాదాలు జరగకుండా ఉంటాయి. పర్యాటకులు కూడా తమ రక్షణ బాధ్యతను పూర్తిగా ఎదుటివారిపైన వదిలేయకుండా, తాము క్షేమంగా ఇంటికి చేరడం కోసం ప్రతీ నిర్లక్ష్యాన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఆకర్షణీయమైన పర్యాటక క్షేత్రంగా వేగంగా ఎదుగుతూ, భారతీయులను విశేషంగా ఆకర్షిస్తున్న వియత్నాం ఈ ఘటనమీద నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపించి, బాధ్యులను శిక్షించి, పర్యాటకుల ప్రాణరక్షణ విధానాలమీద మరింత శ్రద్ధపెట్టాలి.
Also Read:
ఇథనాల్‌పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
మత్స్యకారుల కన్నీళ్లపై జగన్ రాజకీయాలు మానుకోవాలి: పల్లా