Share News

ఈ నిర్లక్ష్యం గర్హనీయం

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:25 AM

ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ఘోరప్రమాదం సంభవించి ఇరవై ఒక్కమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి ఆ సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ మీద పోలీసులు...

ఈ నిర్లక్ష్యం గర్హనీయం

ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ఘోరప్రమాదం సంభవించి ఇరవై ఒక్కమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి ఆ సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ మీద పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినవారి సంఖ్య అధికంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఎఫ్‌ఐఆర్‌లో వేదాంత చైర్మన్‌తో పాటు మరో పదిమంది అధికారుల పేర్లను కూడా బాధ్యులుగా చేర్చామని, ప్లాంట్‌ యాజమాన్యం నిర్లక్ష్యం మరణాలకు కారణమవడం, యంత్రాల నిర్వహణలో అజాగ్రత్త ఇత్యాది ఆరోపణలతో, తదనుగుణమైన సెక్షన్లతో కేసు నమోదుచేశామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఒక ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటుతోపాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం కూడా ప్రకటించాయి.

పోస్టుమార్టమ్‌ నివేదికలు, ఫోరెన్సిక్‌ లాబరేటరీల విశ్లేషణల ఆధారంగా మరింత కఠినమైన సెక్షన్లను ఈ కేసులో చేర్చి కారకులెవ్వరినీ వదిలిపెట్టబోమని రాష్ట్రప్రభుత్వం గట్టిగా హామీ ఇస్తోంది. ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు, వివిధ కథనాలు బాయిలర్‌ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో తెలియచెబుతున్నాయి. కార్మికులు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీసే క్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగిందని కూడా అంటున్నారు. కచ్చితమైన సాంకేతిక కారణాలు మరిన్ని త్వరలోనే వెలుగుచూడవచ్చును కానీ, పేలుడును ఎందుకు నివారించలేకపోయామన్నది ప్రధానమైన ప్రశ్న. బాయిలర్‌ సమీపంలో భోజనం చేస్తున్న కార్మికులు ఆరువందల డిగ్రీల వేడికి బలైపోవడంతోపాటు, ఎంతో దూరంలో పెయింటింగ్‌ పనిచేస్తున్న మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడటం, మధ్యాహ్నం ప్రమాదం జరిగితే, రాత్రంతా సహాయకచర్యలను కొనసాగించినా, మర్నాడు మధ్యాహ్నం వరకూ కొందరు కార్మికులు ఆచూకీ తెలియకపోవడం వంటివి పేలుడు తీవ్రతను తెలియచెబుతున్నాయి.


ఈ ప్లాంట్‌ ఇటీవలే చేతులు మారి, తిరిగి పనిచేయడం ప్రారంభించింది. అందువల్ల, పూర్తిస్థాయిలో దానిని పరీక్షించి, లోపాలను సరిదిద్ది, అవసరమైన మార్పుచేర్పులతో దానిని ఆరంభించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా, హెచ్చరికలను బేఖాతరుచేసి, లోపభూయిష్టమైన వ్యవస్థలతోనే అధిక ఉత్పత్తి సాధించాలన్న దుర్బుద్ధి ఈ ప్రమాదానికి దారితీసింది. బాయిలర్‌ ఫర్నెస్‌ లోపల ఇంధనం అధికంగా ఉన్న కారణంగా ఒత్తిడి తీవ్రమై ఈ విస్ఫోటనం జరిగిందని అంటున్నారు. ఒత్తిడి పెరిగిన కారణంగా దానికి అనుసంధానించి ఉన్న పైపులు కూడా కదిలిపోయి, పేలుడుతో సదరు వ్యవస్థ అంతా కుప్పకూలింది. ప్రమాదానికి కొద్దిగంటల ముందు నుంచే, అంటే ఉదయం పదిన్నరగంటల నుంచి గాలి–ఇంధన సమతుల్యతను కాపాడే ప్రైమరీ ఎయిర్‌ఫ్యాన్‌ పలుమార్లు పనిచేయకుండా నిలిచిపోయింది. అది సతాయిస్తున్నట్టుగా కంట్రోల్‌రూమ్‌ లాగ్‌బుక్‌లో రికార్డయినప్పటికీ కూడా ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేసి మరీ కార్యకలాపాలు కొనసాగించారు. ఈ సమస్య ఉండగానే, మధ్యాహ్నం ఒంటిగంటన్నర తరువాత విద్యుదుత్పత్తిని గంటలోనే రెట్టింపు చేస్తూ బాయిలర్‌పై లోడ్‌ను దూకుడుగా పెంచేశారని, అప్పటికే ప్రైమరీ ఫ్యాన్‌ పనితీరు సరిగా లేనందున, లోపల తగలబడని ఇంధనం పేరుకుపోయిన స్థితిలో పీడనం అధికమై పేలుడు సంభవించిందని అంటున్నారు. ఏదో ఒక పైపు పనిచేయకపోవడం వల్ల కాక, మొత్తం వ్యవస్థ నిర్వహణలో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఘోరం ఇది. రాష్ట్రప్రభుత్వం హామీ ఇస్తున్నట్టుగా నిజంగానే రేపటి వేర్వేరు దర్యాప్తుల్లో అన్ని నిజాలూ బయటపడతాయా అన్న ప్రశ్నని అటుంచితే, కీలకవిభాగాలు పనిచేయక ఉదయం నుంచీ ప్రమాద హెచ్చరికలు కనిపిస్తున్న నేపథ్యంలో, విద్యుదుత్పత్తిని నిలిపివేయాల్సిన యాజమాన్యం అందుకు పూర్తిభిన్నంగా మరింత అధిక విద్యుత్‌కోసం, అదనపు లాభం కోసం కార్మికుల ప్రాణాలను బలిపెట్టిన ఘటన ఇది. ఎఫ్‌ఐఆర్‌లో అనిల్‌ అగర్వాల్‌ పేరు ఉన్నంతమాత్రాన ఆయనకు శిక్షపడుతుందన్న భ్రమలు ఎవరికీ లేవు. ఆర్థిక ప్రయోజనాలకోసం సాధారణ కార్మికుల ప్రాణాలను బలిపెడుతున్న ఈ తరహా ప్రమాదాలను నిలువరించడానికి ప్రభుత్వాలు గట్టిగా కృషిచేస్తే అంతే చాలు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని మృతదేహం

వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Updated Date - Apr 18 , 2026 | 03:25 AM