Share News

చర్చలు.. దాడులు!

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:41 AM

మళ్ళీ దాడులు జరిగాయి. కాల్పుల విరమణతో మిగతా ప్రపంచానికి దక్కిన ఆ కాస్తంత ఉపశమనం లేకుండాపోతోంది. ఇరాన్‌లోని వందలాది లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్‌ పాలకులను...

చర్చలు.. దాడులు!

మళ్ళీ దాడులు జరిగాయి. కాల్పుల విరమణతో మిగతా ప్రపంచానికి దక్కిన ఆ కాస్తంత ఉపశమనం లేకుండాపోతోంది. ఇరాన్‌లోని వందలాది లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఇరాన్‌ పాలకులను దుష్టులనీ, దుర్మార్గులనీ విమర్శిస్తూ, అణుస్థావరాల సమీపంలో కూడా బాంబులు వేసి డోనాల్డ్‌ట్రంప్‌ తన ఆగ్రహాన్ని చాటుకున్నారు. ఒకపక్క చర్చలకు తలుపులు పూర్తిగా మూసేయకుండా, అమెరికా–ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహనకు మాత్రం ఇక కాలం చెల్లినట్టేనని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. చమురు ఎగుమతులకు ఇచ్చిన ఆ తాత్కాలిక మినహాయింపులను రద్దుచేస్తూ, మరిన్ని ఆంక్షలతో, బోలెడన్ని దాడులతో ఇరాన్‌ను దారికి తేవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఇందుకు ప్రతిగా అమెరికా ఆప్తమిత్ర గల్ఫ్‌దేశాల మీద దాడులు జరిపి ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఒకపక్క ఇరాన్‌ మతపెద్ద ఖమేనీ అంతిమయాత్ర సాగుతున్న తరుణంలో అమెరికా మళ్ళీ కయ్యానికి కాలుదువ్వింది. ఇరాన్‌ నాయకులంతా ఒకచోట చేరిన ఈ సందర్భంలో తాను తలుచుకుంటే ఒక్కదెబ్బతో అందరినీ చంపేయగలననీ, కోట్లాదిమంది ఇరానియన్ల వలబోత దొంగ ఏడుపనీ ఇటీవలే ఆడిపోసుకున్న ట్రంప్‌, ఇరాన్‌ ధిక్కారాన్ని చూసి సహించలేకపోతున్నట్టు ఉంది.

సుదీర్ఘకాలం ఈ దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు అనక పోయినా, కుదిరిన ఆ బలహీనమైన ఒప్పందాన్ని ఇరుపక్షాలూ ఉల్లంఘించిన నేపథ్యంలో వాతావరణం మళ్ళీ ఉద్రిక్తంగా మారింది. హార్ముజ్‌ జలసంధిలో మంగళవారం మూడు చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ జరిపిన దాడులు ట్రంప్‌ ఆగ్రహానికి కారణం కావచ్చును కానీ, ఒప్పందం కోసం ఇరాన్‌ తనను వేడుకుంటోందని అంతగట్టిగా చెబుతున్న ఇరాన్‌ను మళ్ళీ రెచ్చగొట్టి దూరంచేసే చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కాదు. ఖమేనీ పార్థివదేహాన్ని ఆయన స్వస్థలమైన మషద్‌లో ఖననం చేయబోతున్న తరుణంలో ఆ పట్టణానికి చేరుకోవడానికి ఉపయోగించే రెండు మార్గాలూ అమెరికా దాడుల్లో ధ్వంసమైనాయి. ఫిబ్రవరి 28న ఖమేనీపై అమెరికా జరిపిన దాడిలో దారుణంగా ధ్వంసమైన భవనం దృశ్యాలను ఇరాన్‌ ఈ సందర్భంలో విడుదల చేస్తూ, ఇప్పుడు అంత్యక్రియలకు ఆటంకం కలిగించేందుకే అమెరికా మళ్ళీ దాడులు జరుపుతోందని ఆరోపించింది. అమెరికా ఇజ్రాయెల్‌ ఏకకాలంలో ముప్పైఐదు క్షిపణులు ప్రయోగించి ఈ కాంపౌండ్‌ను నేలమట్టం చేశాయి. ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులతో సహా నలభైమంది ఈ దాడిలో మరణించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతప్రచారంలో ఉన్న ముప్పైఐదు సెకన్ల ఈ వీడియోపై అనేక వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రాణానికి ముప్పు ఉన్నదని తెలిసి కూడా బంకర్‌లో దూరని ధైర్యశాలి ఖమేనీ అని కొందరు శ్లాఘిస్తూ, ట్రంప్‌ చర్యనొకదానికి దీనితో పోల్చారు.


దాదాపు మూడున్నరవేలకోట్ల రూపాయలు విలువచేసే అత్యాధునిక బోయింగ్‌ జెట్‌ను ఖతార్‌ ట్రంప్‌కు బహూకరిస్తే, దానిని అత్యాధునిక భద్రతావ్యవస్థలతో మరింత కట్టుదిట్టం చేసి అధ్యక్షుడికోసం ఇటీవల ఉపయోగించడం ఆరంభించారు. ఈ కొత్త ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో టర్కీ చేరుకున్న ట్రంప్‌ తిరిగివస్తున్నప్పుడు మాత్రం లండన్‌ వరకూ పాతవిమానాన్నే వాడటం వెనుక ఇరాన్‌ భయం పనిచేసిందని ఓ ప్రచారం సాగుతోంది. ఇరాన్‌ హిట్‌లిస్టులో నేనే నంబర్‌ వన్‌ అని చెప్పుకున్న ట్రంప్‌, తనను ఎవరూ బెదిరించలేరని, తాను భయపడే రకం కాదని కూడా అన్నారు.

ఒకపక్క ఇరాన్‌మీద మళ్ళీ దాడులకు దిగిన ఆయన, తనవల్లే ఎనిమిది యుద్ధాలు ఆగిపోయాయన్న పాతపాట కూడా అందుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా కూలిన విమానం లెక్కలను నోటికొచ్చినట్టుగా చెప్పే ట్రంప్‌ ఈమారు వాటిని పదకొండుగా లెక్కగట్టారు. ఇది రెండువైపులా జరిగిన నష్టమా, ఏదో ఒక దేశానిదా అన్న స్పష్టత ఎప్పటిలాగానే కరువైంది కానీ, నోబెల్‌శాంతి దక్కని బాధమాత్రం ఆయనను ఇంకా వీడినట్టు లేదు. ఖమేనీ అంత్యక్రియలు ముగియగానే, శాంతిచర్చలు తిరిగి కొనసాగి, హోర్ముజ్‌, యురేనియం నిల్వలు ఇత్యాది కీలకమైన అంశాలపై ఇరుపక్షాలు అవగాహనకు రావాల్సి ఉంది. పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంతో జూన్‌ 16న కుదిరిన ఎంవోయూ యుద్ధానికి కాస్తంత విరామం ఇచ్చి, అరవైరోజుల పాటు చర్చలు జరగడానికి రంగం సిద్ధంచేసింది. కానీ, ఒకపక్క చర్చలు జరుపుతూనే ఇప్పటికి మూడుసార్లు ఇరాన్‌మీద అమెరికా దాడులు చేసింది. యుద్ధంతో ఇరాన్‌ను లొంగదీయలేమని తేలిపోయినా కూడా దానిని అడపాదడపా రెచ్చగొడుతూ ట్రంప్‌ విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

Updated Date - Jul 10 , 2026 | 12:41 AM