Share News

కొత్త బాదుడు!

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:07 AM

యూపీఐ లావాదేవీలపై విధించిన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)ను ఉపసంహరించుకోవాలని అదేపనిగా డిమాండ్‌ చేస్తున్నంతమాత్రాన, కేంద్రప్రభుత్వం...

కొత్త బాదుడు!

యూపీఐ లావాదేవీలపై విధించిన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)ను ఉపసంహరించుకోవాలని అదేపనిగా డిమాండ్‌ చేస్తున్నంతమాత్రాన, కేంద్రప్రభుత్వం వెనక్కుతగ్గదని విపక్షాలకు తెలియకపోదు. అడుగు వెనక్కువేయనని ప్రభుత్వం కూడా తేల్చేసింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ దీనిని ‘యూపీఐ పన్ను’గా అభివర్ణిస్తూ, ఈ నిర్ణయం అమెరికా ప్రయోజనాల కోసం తీసుకున్నదని ఆరోపిస్తున్నారు. విపక్షాల విమర్శలకు కేంద్రం దీటుగా సమాధానాలు చెబుతోంది. వినియోగదారుడిమీద ఆర్థికభారం పడనివ్వబోమని, దానిని పన్ను అనడం సరికాదంటోంది. కేవలం వాణిజ్యలావాదేవీలపై ఏదో నామమాత్రపు ఎండీఆర్‌ వసూలు చేస్తూంటే దానిని ప్రజల మీద భారంగా విపక్షాలు అభివర్ణించడాన్ని ఆర్థికమంత్రి తప్పుబడుతున్నారు. ఈ వాదనలను అటుంచితే, పూర్తి ఉచితంగా జనం ముందుకు వచ్చి, ఈ పదేళ్ళ కాలంలో ప్రజలు పూర్తిగా ఆ రుచిమరిగాక, ఇప్పుడు ఏదో ఒక రూపంలో చార్జీల వసూలకు గేట్లు తెరుచుకున్నమాట వాస్తవం. ప్రస్తుతానికి వాణిజ్యలావాదేవీలకు పరిమితమైన వసూళ్ళ కార్యక్రమం రాబోయే కాలంలో ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలకు విస్తరించే ప్రమాదం కాదనలేనిది.

దేశంలో డిజిటల్‌ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులు ఎప్పటిలాగానే సాధారణ ప్రజలకు పూర్తి ఉచితంగానే ఉంటాయంటూ, వాణిజ్య లావాదేవీల్లో సైతం అతిస్వల్ప పరిమాణానికి మాత్రమే ఈ కొత్తవిధానం వర్తించబోతోందని ప్రభుత్వం చెబుతోంది. ఎవరికి, ఎంతమేర, ఏ రకమైన చార్జీలు వసూలవుతాయో వివరణలు, ప్రకటనల ద్వారా తెలియచేస్తూ, సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. స్నేహితులు, బంధువులకు ఎంత మొత్తాన్ని పంపినా, మీ నుంచి పైసా కూడా వసూలు చేయబోమని, నెలకు లక్షరూపాయలవరకూ వ్యాపారం చేసే చిన్న దుకాణదారులు కూడా హాయిగా ఉండవచ్చునని, కొన్ని పెద్దవ్యాపార సంస్థలు, ఈకామర్స్‌ సంస్థలతో చేసే లావాదేవీల విలువ రెండువేల రూపాయలను మించితేనే ఎండీఆర్‌ వర్తిస్తుందని ప్రభుత్వం వివరించింది.

ఒక్కముక్కలో చెప్పుకోవాలంటే ఏ లావాదేవీమీద ఎంత చార్జీ వసూలు చేసినా, అది వినియోగదారుడి బ్యాంక్‌ ఎకౌంట్‌ నుంచి నేరుగా డెబిట్‌ కాదు కనుక, అతడికి తెరవెనుక వివరం తెలియదు, ప్రత్యక్ష సంబంధం కూడా ఉండదు. మరి, ఆ వ్యాపారి తాను అదనంగా కోల్పోతున్న ఈ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేయకుండా ఉంటాడా? అన్నది సామాన్యుడి అనుమానం. 96శాతం లావాదేవీలు రెండువేల రూపాయల లోపువే కావచ్చును కానీ, ఆ పరిధి దాటి వ్యాపారులకు చేరిన మొత్తం సొమ్ములో మిగతా నాలుగుశాతం వాటాయే అనేక లక్షలకోట్లు. మొత్తం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 66శాతం సొమ్ము వ్యాపారానికి సంబంధించినదే అయినందున, ప్రభుత్వానికి ఎండీఆర్‌ రూపంలో పాతికవేలకోట్ల వరకూ రావచ్చునని, జీఎస్టీని కలిపితే అది ముప్పైవేలకోట్లు కావచ్చునని ఓ లెక్క. యూపీఐ వ్యవస్థ సురక్షిత నిర్వహణకు ఏటా ఓ ఇరవైవేలకోట్ల వరకూ ఖర్చవుతున్నందున, వెంటనే కాకున్నా, సమీపకాలంలోనే ఆ మొత్తాన్ని ఈ ఎండీఆర్‌ విధానంలో భర్తీచేయవచ్చు.


పదేళ్ళుగా పైసా వసూలు చేయకుండానే అద్భుతవ్యవస్థను సృష్టించి, చక్కగా నడిపించిన మనకు ఇప్పుడు అదనంగా ఈ పైసావసూల్‌ అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న ఉండనే ఉంది. పైకి నిర్వహణ ఖర్చు గురించి మాట్లాడుతున్నప్పటికీ, అసలు సంగతి అమెరికా ఒత్తిడేనని విపక్షాలు అంటున్నాయి. ఉభయదేశాల మధ్యా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఆరంభమైనప్పటినుంచీ భారత్‌లోని ఈ ఫ్రీ డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థమీద అమెరికా గుర్రుగా ఉందన్న వార్తలు వింటున్నాం. యూపీఐ, రూపే లావాదేవీలు పూర్తి ఉచితంగా జరిగిపోతున్నందున, అధిక చార్జీలు వసూలు చేసే వీసా, మాస్టర్‌ కార్డ్‌వంటివి భారత్‌లో ఎదగలేకపోతున్నాయని, రూపేను ప్రభుత్వం పనిగట్టుకొని ప్రోత్సహించడంమీద కూడా అమెరికా గుర్రుగా ఉన్నదని విన్నాం. భారత్‌ అనుసరిస్తున్న డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని వాణిజ్యానికి ప్రధాన అడ్డంకిగా ఈ ఏడాది మార్చిలో యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యుఎస్‌టీఆర్‌) అభివర్ణించిన సంగతి తెలిసిందే. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో డిజిటల్‌ రంగానికి సంబంధించి ఇండియా పలు విధాలుగా రాజీపడిందని, టెక్‌ కంపెనీలకు, డేటా సెంటర్లకు అనేక రాయితీలు, పన్ను మినహాయింపులు ప్రకటిస్తున్న నేపథ్యంలోనే, ఈ ఎండీఆర్‌ కూడా తెరమీదకు వచ్చిందని అంటారు. నిజానిజాలు ఏమైనప్పటికీ మళ్ళీ నగదు లావాదేవీలవైపు జనం మళ్ళకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది.

Also Read:

9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్‌ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు

కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్

Updated Date - Sep 17 , 2026 | 02:07 AM