Share News

స్టార్మర్‌ నిష్క్రమణ

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:14 AM

సమీపకాలంలో ప్రధానమంత్రులు ఇలా ప్రమాణస్వీకారం చేసి, అలా పదవినుంచి దిగిపోయే రోజులు చూడబోతున్నాం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోకుండా, ఆర్థిక చర్యలకు సంకల్పించకుండా వాయిదా వేయడమే క్షేమమని...

స్టార్మర్‌ నిష్క్రమణ

సమీపకాలంలో ప్రధానమంత్రులు ఇలా ప్రమాణస్వీకారం చేసి, అలా పదవినుంచి దిగిపోయే రోజులు చూడబోతున్నాం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోకుండా, ఆర్థిక చర్యలకు సంకల్పించకుండా వాయిదా వేయడమే క్షేమమని భావించే ఏలికలు రాబోతున్నారంటూ బ్రిటన్‌ రాజకీయాలమీద అక్కడి దినపత్రిక ఒకటి వ్యాఖ్యానించింది. దేశంలో రాజకీయాలు వాస్తవిక దృక్పథంతో, ఆచరణసాధ్యమైన విధానాలతో కాక వైరం, ప్రతీకారేచ్ఛతో సాగుతోందని అందుకే ఈ స్థితి ఏర్పడుతోందని దాని భావన. రెండేళ్ళక్రితం ఘనంగా గెలిచిన బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ ఎట్టకేలకు తన రాజీనామాను ప్రకటించారు. గత దశాబ్దకాలంలో బ్రిటన్‌ను ఏలిన ఆరుగురు ప్రధానమంత్రుల్లో స్టార్మర్‌ నిష్క్రమణ మాత్రం ఒకపట్టాన అర్థంకానిది. ఆయనేమీ యుద్ధాలు చేయలేదు, ఆర్థిక సంక్షోభాలు సృష్టించలేదు, కుంభకోణాల్లోనూ ఇరుక్కోలేదు. తన నిష్క్రమణ నిష్కారణం కాకున్నా, కారణం అంత బలమైనది కాదని ఆయనకు అనిపించినందువల్ల కాబోలు, రాజీనామా ప్రకటన సందర్భంలో ఆయన గొంతు వొణికింది, అక్కడక్కడ జీరబోయింది.

మూడేళ్ళ తరువాత జరగబోయే ఎన్నికల్లో పార్టీని విజయపథంవైపు నడిపించగల సమర్థత ఆయనకు లేదని పార్టీ తేల్చేసి, దింపేసింది. స్థానిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అంతగా ప్రభావం చూపలేకపోవడం, మేకర్‌ఫీల్డ్‌ పార్లమెంటరీ ఉపఎన్నికలో, ఇప్పుడు అంతా కాబోయే ప్రధానిగా భావిస్తున్న మాంచెస్టర్‌ మాజీ మేయర్‌, లేబర్‌ పార్టీలో స్టార్మర్‌ ప్రధాన ప్రత్యర్థి, ఆండీ బర్న్‌హామ్‌ ఘనవిజయం సాధించడం ఈ పరిణామాలకు ప్రధాన కారణాలు. ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన సన్నిహితుడు పీటర్‌ మాండెల్సన్‌ను అమెరికాలో బ్రిటన్‌ రాయబారిగా నియమించాలన్న నిర్ణయం కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది. సహచరమంత్రులు, సొంతపార్టీ ఎంపీలు వందమందికి పైగా ఎంత ఒత్తిడిచేసినా, రాజీనామాకు ససేమిరా అంటూ వచ్చిన స్టార్మర్‌ చివరకు దిగిరాక తప్పలేదు. ఈయన రాజీనామా చేయబోతున్నట్టుగా ఎంతో ముందుగా తన ట్రూత్‌ సోషల్‌లో అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి తెలియచెప్పడం ఆశ్చర్యం. ఇంధన విధానాల్లో వైఫల్యాలే ఇందుకు కారణమని ఆయన ఓ మాటన్నారు. ఇరాన్‌ యుద్ధం, హోర్ముజ్‌ విముక్తి ఇత్యాది విషయాల్లో తనతో అంతగా కలిసిరాని స్టార్మర్‌ స్థానంలోకి తన వీరవిధేయుడు రావాలని ట్రంప్‌ కోరుకోవడం సహజం.


ఆండీ బర్న్‌హామ్‌ పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడంతోనే పార్టీలో బలం చేకూర్చుకున్నారు, స్టార్మర్‌ కంటే వాగ్ధాటి, పోరాటశక్తి ఉన్న ఈయనతోనే 2029 ఎన్నికల్లో విజయం సాధ్యమని లేబర్‌ నాయకులూ నమ్ముతున్నారు. మాంచెస్టర్‌ మేయర్‌గా ఆయన బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంపై వీరోచిత పోరాటాలే చేశారు. ప్రజారవాణాను పెంచడం, ఇళ్ళధరలను దించడం, నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచడం ఇత్యాది చర్యలతో ఆయనకు మంచి పేరుంది, సోషల్‌ మీడియాలో చక్కని పాపులారిటీ కూడా ఉంది. పార్టీపగ్గాలకోసం గతంలో పలుమార్లు ప్రయత్నించి, ప్రధాని అయ్యే అదృష్టం లేదనుకొని పక్కకు తప్పుకొన్న పదేళ్ళకే ఆయనకు ఆ అదృష్టం పట్టబోతోంది. కన్సర్వేటివ్‌ల పాలనతో విసిగివేసారిన ఓటర్లు లేబర్‌పార్టీ పక్షాన మూడేళ్ళక్రితం మంచి తీర్పు ఇచ్చారు. ప్రధానంగా బ్రెగ్జిట్‌ అనంతర పరిస్థితులు, పరిణామాలతో టోరీలు సరిగా వ్యవహరించలేకపోవడం, వారి మధ్య అంతర్యుద్ధాలు ప్రజలను నిరాశపరిచింది. కోవిడ్‌ కష్టాలు మరింత దెబ్బతీశాయి. స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ తమను ఒడ్డునపడేస్తుందని వారు నమ్మారు. కానీ, ఆయన కొన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, మంచివాటిని పక్కనబెట్టడం వంటి చర్యలతో అప్రదిష్టపాలైనారు. లేబర్‌పార్టీ ప్రధాన ఓటర్లు

అనతికాలంలోనే ఆయనకూ, పార్టీకీ దూరమైనారని సర్వేలు తేల్చేశాయి. నిరంతరం మారుతున్న ప్రధానమంత్రులతో ప్రజలు విసిగిపోవడం మాట అటుంచితే, ఈ మార్పు వారి జీవితాలను మార్చలేకపోతోంది. కన్సర్వేటివ్‌ బాటలోనే లేబర్‌ పార్టీ కూడా నడుస్తోందన్న అప్రదిష్ఠ వచ్చింది. స్టార్మర్‌ నిష్క్రమణ ప్రకటనతో బ్రెగ్జిట్‌ పదవవార్షికోత్సవం సందర్భంలో బ్రిటన్‌ ఇప్పుడు మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. బ్రెగ్జిట్‌ ఓటు ఆ దేశాన్ని అస్థిరపరిస్తే, అనంతరకాలంలో వచ్చిన వరుస నాయకులు మళ్ళీ ఆ దేశాన్ని గాడినపెట్టలేకపోయారు. నాలుగేళ్ళలో ఐదవప్రధానమంత్రి కాబోతున్న ఆండీ బెర్న్‌హామ్‌కు స్టార్మర్‌కు లేని నైపుణ్యాలు, శక్తియుక్తులు అనేకం ఉన్నాయని పార్టీ నమ్ముతోంది.

ఇవి కూడా చదవండి..

‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో

ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 02:14 AM