సౌదీకి సవాల్..!
ABN , Publish Date - May 02 , 2026 | 12:40 AM
పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్) నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్పుకోవడం అమెరికా అధ్యక్షుడికి నచ్చింది. ఇది ఎంతో మంచి నిర్ణయమనీ, ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ తెలివైనవారు...
పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్) నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్పుకోవడం అమెరికా అధ్యక్షుడికి నచ్చింది. ఇది ఎంతో మంచి నిర్ణయమనీ, ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ తెలివైనవారు కనుక, ఇలా స్వతంత్రంగా నడవాలని నిర్ణయించుకున్నారని, దీనితో చమురు, గ్యాస్ ధరలు దిగొస్తాయని ట్రంప్ అన్నారు. ఎమిరేట్స్ నిర్ణయం అమెరికాకు లాభిస్తుందన్న వాదనలను అటుంచితే, ఒపెక్ తన ఉత్పత్తిని నియంత్రిస్తూ చమురు ధరలు పెరిగేట్టు చేసి ప్రపంచ ఆర్థికవ్యవస్థను శాసిస్తున్నదంటూ గతంలో ఆయన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ కాలంలో ధరలు పడిపోయి అమెరికన్ కంపెనీలు తీవ్ర నష్టాలు చవిచూస్తున్న సందర్భంలో ఆయనే ఈ కూటమికి ఉత్పత్తి తగ్గించమంటూ విజ్ఞప్తులు, హెచ్చరికలు చేశారు. బంధనాలు తెంపేసుకున్న ఎమిరేట్స్ ఇక సర్వస్వతంత్రంగా నచ్చినంత చమురు ఉత్పత్తి చేయగలదు కనుక ప్రపంచ ఆయిల్ మార్కెట్ మీద దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతోందన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.
కూటమిలో ఉండగా కూడా ఎమిరేట్స్ తన వాటాలూ కోటాలను తరచూ ఉల్లంఘిస్తూనే ఉందని, అందువల్ల, ఇప్పుడు దాని నిష్క్రమణ పెద్ద ప్రభావం చూపకపోవచ్చునని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఒపెక్‌లో మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదేశమైన ఎమిరేట్స్ ఆరు దశాబ్దాల తరువాత తీసుకున్న ఈ నిర్ణయం వెనుక సౌదీతో దానికి ఉన్న భౌగోళిక ఆధిపత్య పోరు అసలు కారణం. ఉత్పత్తిని రోజుకు ఐదు మిలియన్ బారెల్స్‌కు పెంచాలని దాని లక్ష్యం. ఓపెక్‌కు బాస్‌గా వ్యవహరిస్తున్న సౌదీ అరేబియా ఆది నుంచీ ఎమిరేట్స్‌కు ఉత్పత్తి విషయంలో అడ్డుపడుతూనే ఉంది. ఇక సూడాన్, సొమాలియా, యెమెన్ వంటి దేశాల్లో వైరివర్గాలను ఇవి రెండూ ఇతోధికంగా ఎగదోస్తున్న చరిత్ర తెలిసిందే. అమెరికా ఇజ్రాయెల్‌తో ఇటీవలి కాలంలో ఎమిరేట్స్ మరింత సాన్నిహిత్యం పెంచుకోవడం కూడా ఈ గల్ఫ్ కూటమిలో విభేదాలకు కారణమైంది. ఇరాన్ దాడులకు ఎమిరేట్స్ అత్యధికంగా దెబ్బతిన్నది కూడా ఇందుకే. మిసైళ్ళు, డ్రోన్లతో ఎమిరేట్స్ చమురు ఉత్పత్తి కేంద్రాలు, ఇంధన నిల్వలు, నౌకలు, అక్కడి అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను ఇరాన్ పెద్ద ఎత్తున దెబ్బతీసింది. ఐదువందల బాలిస్టిక్ మిసైళ్ళు, పాతిక క్రూయిజ్ మిసైళ్ళు, వేలాది డ్రోన్లను ఎమిరేట్స్ మీద ఇరాన్ ప్రయోగించింది. అమెరికా–ఇరాన్ యుద్ధం చమురు సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో, ఇరాన్ మీద కక్షసాధింపు లక్ష్యంతో ఎమిరేట్స్ ఈ నిర్ణయం తీసుకుందని అంటారు.
సౌదీతో వైరం ప్రత్యక్షంగా మారిన తరువాత ముసుగులో గుద్దులాట ఎందుకని కూడా ఎమిరేట్స్ అనుకున్నట్టు ఉంది. ఓపెక్‌లో ఉండటం అంటే రియాద్ పెత్తనాన్ని ఆమోదించడమే. బయటకు వచ్చి తన స్వతంత్రతను నిలబెట్టుకోవడంతో పాటు, ఒపెక్‌ను బలహీనపరచాలన్న ట్రంప్ కోరికను కూడా తీర్చినట్టు అవుతుందని సౌదీ ఆలోచన. ఈ నిష్క్రమణతో చమురు మార్కెట్‌మీద ఒపెక్ పట్టు బలహీనపడుతుంది. రేపోమాపో మరిన్ని దేశాలు కూడా క్యూ కట్టవచ్చు. ఎమిరేట్స్‌కు ఇక కోటాలకు కట్టుబడాల్సిన బాధ ఉండదు కనుక అది తనకు నచ్చినంత, అమెరికా మెచ్చినంత చమురు తోడిపోయవచ్చు, ఇష్టమైన రేటుకు అమ్ముకోవచ్చు. దీనికితోడు, యుద్ధంలో ఇరాన్ చేకూర్చిన నష్టాన్ని కూడా త్వరితంగా పూడ్చుకోవచ్చు. ఎమిరేట్స్‌తో కలిసి ప్రపంచ చమురు మార్కెట్‌ను దశాబ్దాలుగా శాసించగలిగిన సౌదీ అరేబియా ఇకపై ఆ పెత్తనాన్ని చెలాయించలేదు. అమెరికా షేల్ ఆయిల్ కంపెనీల ఉత్పత్తినీ, వాటిలో పెట్టుబడులనూ దెబ్బతీయడం కోసం ప్రపంచ ఆయిల్ మార్కెట్‌ను అధిక ఉత్పత్తితో, తక్కువ ధరలతో ముంచెత్తిన ఒపెక్ ఇకపై అటువంటి విన్యాసాలకు కూడా పాల్పడలేదు. సామర్థ్యం ఉండి కూడా మూడోవంతు ఉత్పత్తిని బలవంతంగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఇక ఎమిరేట్స్‌కు ఉండదు కనుక, హార్ముజ్ నిర్బంధంతో ప్రపంచానికి ఏర్పడిన చమురు లోటును పూడ్చి, ఈ సంక్షోభ సమయాన్ని సొమ్ముచేసుకోవచ్చు. ఎమిరేట్స్ నిర్ణయం భారతదేశానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆ దేశంతో ఉన్న సత్సంబంధాల రీత్యా మనకు సరఫరాలు మరింత పెంచగలిగే అవకాశం ఇప్పుడు దానికి ఉంది. ప్రస్తుతానికి పదిశాతం లోపు ఉన్న దాని వాటా బాగా హెచ్చవచ్చు. డాలర్ బదులు రూపాయితో చమురు కొనుగోలు చేయగలిగితే మరీ మంచిది.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ