Share News

పచ్చి దోపిడీ..!

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:35 AM

వెనెజువెలాలో 65 బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు తమ అధీనంలోకి వచ్చే ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద...

పచ్చి దోపిడీ..!

వెనెజువెలాలో 65 బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు తమ అధీనంలోకి వచ్చే ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందంగా దీనిని అభివర్ణించారాయన. ఒక అర్థరాత్రివేళ అమెరికన్‌ సైనికబలగాలు విమానాల్లో దిగి, వందలాదిమంది వెనెజువెలా భద్రతాదళాలను కాల్చిచంపి, ఆ దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురోను అపహరించుకుపోయి అమెరికా జైళ్ళలో కుక్కిన ఎనిమిది నెలల్లోనే ట్రంప్‌ అసలు లక్ష్యం నెరవేరడం మొదలైందన్నమాట.

అరవై ఐదు బిలియన్‌ బ్యారెళ్ళ చమురు నిల్వలున్న ఈ క్షేత్రాల పరిమాణం వెనెజువెలా మొత్తం చమురు క్షేత్రాల్లో ఐదోవంతు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న ఈ దేశంలోని క్షేత్రాలు పూర్తిగా అమెరికా నియంత్రణలోకి పోవడం ఇక ఎంతో దూరంలో లేదని అర్థం. అమెరికా సన్నిహితుడైన వెనెజువెలా వ్యాపారవేత్త అలెజాండ్రో బెటన్‌కోర్ట్‌ ఈ పదిహేడు క్షేత్రాల నుంచి తైలం తవ్వితీయబోతున్నారని, ఈ దెబ్బతో ఆయన కంపెనీ ‘నార్త్‌ అమెరికన్‌ బ్లూ ఎనర్జీ పార్ట్‌నర్స్‌’ ఆ దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు చమురు కంపెనీగా అవతరిస్తుందని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక అంటోంది. ఈ భారీ చమురు ఒప్పందంలో పెంటగాన్‌కూ వాటా దక్కబోతున్నదని, దాని ‘ఆఫీస్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ క్యాపిటల్‌’ (ఓఎస్‌సీ) పెన్నీవారెంట్‌తో అంటే, దాదాపు సున్నా పెట్టుబడితో 35శాతం వాటాని, ఉత్పత్తికి వ్యయానికే ఐదోవంతు చమురునూ కొనుగోలు చేయగలిగే హక్కులను పొందబోతున్నట్టు ఆ పత్రిక విశ్లేషించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, డోనాల్డ్‌ ట్రంప్‌ తన 200వ కార్యనిర్వాహక ఆదేశంలో ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్‌’గా నామకరణం చేసిన అమెరికా రక్షణశాఖ, తాను ఎనిమిది నెలల క్రితం చొరబడిన దేశంలో అతిపెద్ద చమురు క్షేత్రాలకు యజమానిగా అవతరించబోతున్నదని అర్థం.

వెనెజువెలాలో అమెరికా వీరవిధేయ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగిజ్‌ ఈ ఒప్పదం గురించి ఏం చెబుతారో ఊహించడం కష్టం కాదు. వందబిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలతో దేశం కళకళలాడిపోతుందనీ, చమురు ఉత్పత్తి ద్విగుళం బహుళమై ఆర్థికవ్యవస్థ అద్భుతంగా తయారవుతుందన్నారు ఆమె. పూర్తి రహస్యంగా జరిగిన ఈ ఒప్పందం గురించి ట్రంప్‌ బయటకు చెప్పేవరకూ వెనెజువెలాలో ఎవరికీ తెలియదు. చమురు క్షేత్రాల కేటాయింపుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాయల్టీ కూడా, వందేళ్ళక్రితం అమెరికా అనుకూల నియంత గోమేజ్‌ అమెరికన్‌ కంపెనీలనుంచి వసూలు చేసినదానికంటే ఎంతో తక్కువట. ఈ ఏడాది ఆరంభంనుంచి అమెరికా తరలించుకుపోయిన చమురుకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా వెనెజువెలాకు ఇంకా ఇవ్వలేదట. మొన్న జూన్‌లో గత 125 ఏళ్ళలో ఎన్నడూ లేనంత భయంకరమైన భూకంపంతో వెనెజువెలా భారీగా నష్టపోయింది. వందలాదిమంది మరణించారు, నిరాశ్రయులైన వేలాది మంది ఇంకా టెంట్లలోనే జీవిస్తున్నారు. కేవలం రెండునెలల్లో కుదిరిన ఈ ఒప్పందం ఆ దేశాన్ని ఆదుకోవడం కాక, దోచుకోవడం మీద అమెరికాకు ఉన్న శ్రద్ధను తెలియచెబుతోంది. అమెరికా పెట్టిన ‘నార్కో టెర్రరిజం’ కేసులతో బ్రూక్లిన్‌ జైల్లో ఉన్న మదురో భూకంపం సమయంలో తన ప్రజలకు సంఘీభావంగా విడుదల చేసిన ఫోటో ఒకటి, ఈ చమురు ఒప్పందం కుదిరిన మర్నాడే వెలుగుచూడటం చక్కగా అతికినట్టు సరిపోయింది.


ఇరాన్‌ యుద్ధంలో చేయి కాల్చుకొని, రేటింగ్‌ కూడా బాగా పడిపోయిన ట్రంప్‌ నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, ఈ ఒప్పందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే వ్యూహాత్మక చమురునిల్వలు వేగంగా ఖాళీ అవుతూ, కేవలం ఈ ఎనిమిది నెలల కాలంలోనే మూడోవంతు ఖర్చయిన నేపథ్యంలో, వెనెజువెలా చమురు మన ఖాళీపీపాలను నింపుతుందని ట్రంప్‌ ప్రజలకు హామీ ఇస్తున్నారు. అమెరికన్‌ రిఫైనరీలకు కారుచవుక వెనెజువెలా చమురు వచ్చి చేరి, ఇంధన ధరలు విపరీతంగా తగ్గి జనానికి మేలు చేకూరుతుందని హామీ ఇస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్‌మీద పుతిన్‌ చేస్తున్న యుద్ధానికి ఇంధనం అందిస్తున్నారంటూ భారత్‌ సహా పలుదేశాల మీద ట్రంప్‌ వీరంగం వేస్తూ ఆంక్షలూ సుంకాలతో వాటికి ఆర్థికంగా ఊపిరాడకుండా చేస్తున్నారు. తానుమాత్రం వెనెజువెలా చమురుతో ఇరాన్‌, రష్యాల మీద యుద్ధానికి ఏ అడ్డంకులూ రాకుండా చూసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 01 , 2026 | 01:35 AM