ద్వంద్వ యుద్ధాలు!
ABN , Publish Date - Jul 16 , 2026 | 03:49 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ కయ్యానికి కాలుదువ్వడంతో చమురు తిరిగి భగ్గుమంటోంది. హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు, యుద్ధం తీవ్రరూపం దాల్చుతుందన్న ఆయన హెచ్చరికలతో ముడిచమురు...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ కయ్యానికి కాలుదువ్వడంతో చమురు తిరిగి భగ్గుమంటోంది. హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు, యుద్ధం తీవ్రరూపం దాల్చుతుందన్న ఆయన హెచ్చరికలతో ముడిచమురు సరఫరాలు తగ్గుతున్నాయి, ధర పెరుగుతోంది. ఇరాన్ దిగిరాకపోతే రాబోయేరోజుల్లో ఆ దేశ విద్యుత్ కేంద్రాలు, రవాణామార్గాలన్నింటినీ ధ్వంసం చేస్తానని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్ రవాణా నౌకలపై నిర్బంధం విధించిన ఆయన, ఆ జలసంధినుంచి వెళ్ళే సరుకు రవాణానౌకలపై 20శాతం పన్ను విధించాలని నిర్ణయించి, ఇరవైనాలుగుగంటల్లోనే ఆ ఆలోచనను విరమించుకొని, దీనిని తన దేశంలో అరబ్‌దేశాల పెట్టుబడులతో ముడిపెట్టారు. అమెరికా–ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం భగ్నం కావడం, హోర్ముజ్ మీద రెండుదేశాలూ పట్టుబిగిస్తున్న క్రమంలో అది మళ్ళీ యుద్ధకేంద్రంగా మారిపోవడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందంతో హెచ్చిన ముడిచమురు సరఫరాలకు తిరిగి అడ్డంకులు మొదలైనాయి.
హోర్ముజ్ నుంచి ముడిచమురు రాకడకు ముప్పు ఏర్పడుతున్న తరుణంలోనే, ట్రంప్ ప్రోద్బలంతో అమెరికా చట్టసభల్లోకి ఒక బిల్లు ప్రవేశించి, మనను శిక్షించడానికి సిద్ధపడుతోంది. ట్రంప్ సన్నిహితుడూ, ఇటీవల రక్తనాళం తెగి అనుమానస్పదస్థితిలో మరణించిన లిండ్సే గ్రాహమ్ ఈ బిల్లు సృష్టికర్త. రష్యానుంచి చమురు కొంటున్న ఐదుదేశాలమీద నూరుశాతం సుంకాలు విధించి, వాటిని నిలువరించాలన్నది గ్రాహమ్ ఆశయం. ప్రధానంగా భారత్, చైనాలు భారీగా రష్యన్ చమురు దిగుమతి చేసుకొని ఉక్రెయిన్‌పై యుద్ధానికి కావాల్సినంత సొమ్మును పుతిన్‌కు సమకూరుస్తున్నాయి కనుక, రష్యన్ క్రూడ్‌వైపు ఈ దేశాలు కన్నెత్తకుండా చేయడానికి ఈ సుంకాల శిక్ష ఉపకరిస్తుందని ఈ బిల్లు సమర్థకుల నమ్మకం. శాంక్షనింగ్ రష్యా యాక్ట్‌లో ప్రతిపాదిత సుంకాల గరిష్ఠపరిమితిని ఐదువందల నుంచి ఇప్పుడు వందశాతానికి తగ్గించడం మిత్రదేశాలమీద ట్రంప్‌కు ఉన్న ప్రేమే కారణమని కొందరు చెప్పుకుంటున్నారు. ఈ ఎకనమిక్ బంకర్ బస్టర్ దెబ్బకు రష్యన్ కులీనులు, ఆర్థికసంస్థలు, ఇంధన ప్రాజెక్టులు అన్నీ చతికిలబడి, రష్యన్ చమురు దిగుమతి చేసుకొనే దేశాలు ఉక్కిరిబిక్కిరవుతాయని బిల్లు సమర్థకుల నమ్మకం. రష్యానుంచి గ్యాస్ కొంటున్న యూరోపియన్ దేశాలకు, దిగుమతులు ఇంకా తగ్గించుకుంటామని హామీ ఇచ్చిన జపాన్ వంటి దేశాలకు ఈ బిల్లు చాలా మినహాయింపులు ఇచ్చింది.
నిన్నటివరకూ మిగతాదేశాలను లొంగదీయడానికి అధ్యక్షహోదాలో ప్రతీకార సుంకాలు విధించి న్యాయస్థానాలతో మొట్టికాయలు తిన్న ట్రంప్‌కు ఈ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తే ఎనలేని అధికారాలు దఖలుపడతాయి. అమెరికా ప్రయోజనాలు, సంక్షేమం దృష్ట్యా ఈ అదనపు సుంకాలనుంచి కొన్ని దేశాలకు మినహాయింపులు ఇచ్చే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది కనుక, ఈ దారిని కూడా ఆయన మిత్రదేశాలను వాణిజ్య ఒప్పందాలకు లొంగదీయడానికి ఉపయోగించవచ్చునని కొందరి అనుమానం. భారత్ ముడిచమురు దిగుమతుల్లో యాభైశాతం రష్యానుంచే జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ బిల్లు భారత్‌కు సమస్యాత్మకమే. జూన్‌లో రష్యా నుంచి 26లక్షల బ్యారెళ్ళ ముడిచమురు దిగుమతి అయిందనీ, ఈ నెలలో దానిని మించిపోతుందని ఓ లెక్క. ఇరాన్‌మీద యుద్ధం ఆరంభంకాగానే, అమెరికా అధ్యక్షుడే రష్యన్ చమురు దిగుమతుల మీద ఆంక్షలు సడలించి, మినహాయింపులు ఇవ్వడంతో ప్రపంచ చమురు మార్కెట్లు తిరిగి కాస్తంత నిలదొక్కుకున్నాయి. మార్కెట్ నుండి రోజూ లక్షలాది బ్యారెళ్ళు మాయమైపోతే ఏమి జరుగుతుందో ప్రపంచం గతంలో చూసింది. ముడిచమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం నెలకొన్న ప్రస్తుత కాలంలో, రష్యా చమురు ఎగుమతులను సైతం దెబ్బతీయాలనుకోవడం సరికాదు. భారత్–అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోబోతున్న తరుణంలో ఈ బిల్లు తెరమీదకు వచ్చింది. ఇది చట్టంగా మారుతుందా లేదా అన్నది అటుంచితే, సదరు బిల్లుకూ, కుదరబోయే ఒప్పందానికీ సంబంధం లేదన్న తరహాలో మన నాయకులు మాట్లాడటం సరికాదు. భారతదేశం తన ముడిచమురు దిగుమతుల్లో కోతలను భరించగలిగే స్థితిలో లేదు, రష్యన్ చమురుకు ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇంధనభద్రత విషయంలో రాజీపడే సమస్య అంతకన్నా లేదు.
ఈ వార్తలనూ చదవండి:
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్‌లు.. దేశంలో తొలిసారిగా..
విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్