మరో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:00 AM
విదేశీ వృత్తి నిపుణుల హెచ్‌౧బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన లక్షడాలర్ల ఫీజును అక్కడి ఫెడరల్ కోర్టు కొట్టివేయడం భారతీయులకు మంచి ఉపశమనం. అనేక కంపెనీలకు సైతం...
విదేశీ వృత్తి నిపుణుల హెచ్‌౧బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన లక్షడాలర్ల ఫీజును అక్కడి ఫెడరల్ కోర్టు కొట్టివేయడం భారతీయులకు మంచి ఉపశమనం. అనేక కంపెనీలకు సైతం ఈ తీర్పుతో ఊరట లభించింది. ప్రవాస భారతీయ సంఘాలు, డెమోక్రాట్లే కాదు, ట్రంప్ సొంతపార్టీ నేతలు సైతం దీనిపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న విదేశీయులను ఈ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాద్వారా ఉద్యోగాల్లో నియమించుకొంటున్న అమెరికాలోని కంపెనీలకు నామమాత్రపు ఫీజుతో మెచ్చినవారిని ఎంపిక చేసుకొనే అవకాశాన్ని ట్రంప్ తన చర్యతో అడ్డుకొట్టారు. ఫీజును భరించలేని స్థాయికి పెంచడం ద్వారా విదేశీ ఉద్యోగులను అడ్డుకొని, వారిస్థానంలో ఆయా కంపెనీలు అమెరికన్లను నియమించుకొనేట్టు చేయాలన్నది ట్రంప్ ఆలోచన. గత ఏడాది సెప్టెంబర్‌లో ట్రంప్ విధించిన ఈ లక్షడాలర్ల ఫీజును భరించలేక కంపెనీలు హెచ్1బీ నియామకాలను తగ్గించుకున్నాయి కూడా. అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్, పలు డెమోక్రాటిక్ రాష్ట్రాలు, ప్రసిద్ధ కంపెనీలు సవాలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి సాంకేతికమైనది. హెచ్1బీ విధానం మంచిచెడులు, న్యాయాన్యాయాల పరిధిలోకి పోకుండా, ఈ లక్షడాలర్ల ఫీజును పన్నుగా పరిగణిస్తూ, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా దీనిని విధించే హక్కు దేశాధ్యక్షుడికి లేదని కోర్టు తేల్చింది.
నీకు ఆ అధికారం లేదని కోర్టు అన్నంతమాత్రాన ట్రంప్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోరు కనుక, ఎప్పటిలాగానే, ట్రంప్ సర్కారు తనకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుమీద కూడా పై కోర్టులో సవాలు చేయడానికి సిద్ధపడుతోంది. తద్వారా, మరికొంతకాలం ఈ వివాదం ఉన్నతన్యాయస్థానాల్లో కొనసాగబోతోంది. అంతలోగా, ఈ తీర్పునుంచి దక్కిన ఉపశమనాన్ని నిపుణుల కొరతతో సతమతమవుతున్న కంపెనీలు సద్వినియోగం చేసుకొని, నియామకాలు పెంచుకొనే అవకాశం ఉన్నదని, భారతీయులే 70శాతానికి పైగా హెచ్1బీ వీసాలు పొందుతున్నందున వారికి ఈ పరిణామం లాభిస్తుందని కొందరి అంచనా. అయితే, ఓటమి సహించలేని ట్రంప్ కొన్ని విధానపరమైన చర్యలతో ఈ వీసాదారులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేయకపోరు.
ట్రంప్ టారిఫ్ వార్‌మీద సరిగ్గా నెలరోజుల క్రితం అమెరికా వాణిజ్య న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా ఇటువంటిదే. కాంగ్రెస్‌ను పక్కకునెట్టి, కేవలం కార్యనిర్వాహక ఆదేశాలతో అధ్యక్షుడు ఈ తరహా నిర్ణయాలు చేయకూడదన్నది ఈ తీర్పుల సారాంశం. మిగతా ప్రపంచంమీద ట్రంప్ ఇష్టారాజ్యంగా విధించిన ప్రతీకార సుంకాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలను వెంటనే వమ్ముచేయడంకోసం, 1974 వాణిజ్యచట్టంలోని 122వ సెక్షన్ ప్రయోగించి ట్రంప్ పదిశాతం అదనపు సుంకం ఆదేశాలను ఇచ్చుకున్నారు. దీనిపై అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ట్రేడ్ కోర్టును ఆశ్రయించాయి. చెల్లింపుల సంక్షోభంతో వ్యవహరించడానికి అధ్యక్షుడికి ఈ సెక్షన్ ద్వారా ఐదునెలల పాటు టారిఫ్ విధించే హక్కు ఉందన్న ట్రంప్ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ (ఐఈఈపిఎ) కింద గత ఏడాది విధించిన ప్రతీకార సుంకాలకు సుప్రీంకోర్టు అడ్డుపడటంతో, ఆయన ఇలా మరో చట్టాన్ని వాడి ఎదురుదెబ్బ తిన్నారు. తనకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన ప్రతీ సందర్భంలోనూ న్యాయమూర్తులను నిందించడం, వారికి దేశభక్తి లేదనడం, పక్షపాతాన్ని అంటగట్టడం ట్రంప్‌కు తెలిసిన విద్య. అమెరికా కోర్టులు తనకు అడ్డుపడుతూంటే మిగతాదేశాలు సంతోషిస్తాయని, అవి ఏ విధమైన తీర్పులు ఇచ్చినా, ఉన్న చట్టాలన్నీ తవ్వితీసి తాను చేయదల్చుకున్నదే చేస్తానని ట్రంప్ చెబుతూంటారు. ఇటీవల భారత్ సహా యాభైమూడు దేశాలకు పన్నెండున్నరశాతం సుంకాలను ప్రతిపాదించడం అందులో భాగమే. కొత్తదారుల్లో, కొత్త పేర్లతో టారిఫ్ వార్‌ను ఒక వాణిజ్య విధానంగా ఆయన అమలుచేయదల్చుకున్నారు. మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ట్రంప్‌కు అమెరికా ప్రయోజనాల పరిరక్షకుడిగా కనిపించడం మరీ అవసరం. అమెరికాని మళ్ళీ ఉన్నతంగా నిలబెట్టడం కోసం మిగతా ప్రపంచంతో పోరాడుతున్న తనకు, న్యాయస్థానాలు ద్రోహం చేస్తున్నాయని ఆయన ప్రచారం చేసుకోవచ్చు. ఇరాన్‌తో యుద్ధం తనను విజేతగా, హీరోగా నిలబెడుతుందన్న ఆశ నెరవేరకపోగా, రాజకీయంగా అప్రదిష్ఠ తీసుకువచ్చింది. ట్రేడ్‌వార్‌లోనూ, ఇరాన్‌వార్‌లోనూ ఎదురుదెబ్బలు తింటున్న ట్రంప్ ఎన్నికలు ముగిసేలోగా ఎన్ని ఎత్తులు వేస్తారో, ఎన్ని విన్యాసాలు చేస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
విజయ్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్
సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్