Share News

రెండు యుద్ధాల్లోనూ...

ABN , Publish Date - May 09 , 2026 | 01:19 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అటు ఇరాన్‌వార్‌లోనూ, ఇటు ట్రేడ్‌వార్‌లోనూ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ప్రపంచదేశాలపై ఇటీవల అధ్యక్షుడు విధించిన పదిశాతం అదనపు సుంకం చట్టవిరుద్ధమని...

రెండు యుద్ధాల్లోనూ...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అటు ఇరాన్‌వార్‌లోనూ, ఇటు ట్రేడ్‌వార్‌లోనూ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ప్రపంచదేశాలపై ఇటీవల అధ్యక్షుడు విధించిన పదిశాతం అదనపు సుంకం చట్టవిరుద్ధమని అమెరికా వాణిజ్య న్యాయస్థానం ప్రకటించింది. ఇష్టారాజ్యంగా మిగతా ప్రపంచంమీద ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలను వెనువెంటనే వమ్ముచేయడంకోసం, 1974 వాణిజ్యచట్టంలోని 122వ సెక్షన్‌ను ప్రయోగించి ట్రంప్‌ ఈ పది శాతం ఆదేశాలను ఇచ్చుకున్నారు. వాణిజ్య లోటు, చెల్లింపుల సంక్షోభంతో వ్యవహరించడానికీ, డాలర్‌ పతనాన్ని నిరోధించడానికీ అధ్యక్షుడికి ఈ సెక్షన్‌ ప్రకారం ఐదునెలల పాటు టారిఫ్‌ విధించే హక్కు ఉందని ట్రంప్‌ వాదన. జులై 24తో ఈ తాత్కాలిక సుంకాల గడువు ముగిసిపోబోతున్న తరుణంలో పలు అమెరికా రాష్ట్రాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు దాఖలు చేసిన కేసులో ట్రేడ్‌ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ ఎకనామిక్‌ పవర్‌ యాక్ట్‌ (ఐఈఈపీఏ) కింద గత ఏడాది ఇష్టారాజ్యంగా విధించిన ప్రతీకార సుంకాలకు సుప్రీంకోర్టు అడ్డుపడటంతో, ఇలా మరో చట్టాన్ని దురుపయోగం చేసిన ఆయనకు ఇప్పుడు మళ్ళీ చుక్కెదురైంది. ఒక ఉత్తముడైన న్యాయమూర్తి తన పక్షాన నిలిస్తే, ఇద్దరు రాడికల్‌ లెఫ్ట్‌ న్యాయమూర్తులు ఈ దుర్మార్గపు తీర్పు నిచ్చారని ట్రంప్‌ ఎప్పటిలాగానే నోరుపారేసుకున్నారు. అమెరికా కోర్టులు తనకు అడ్డుపడుతున్నందుకు మిగతాదేశాలన్నీ సంతోషిస్తున్నాయని, అవి ఎన్ని తీర్పులు ఇచ్చినా, ఉన్న చట్టాలన్నీ వాడి తాను చేయదల్చుకున్నదే చేస్తానని ట్రంప్‌ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుత తీర్పుమీద కూడా ట్రంప్‌ ప్రభుత్వం పైకోర్టులో సవాలు చేయవచ్చు. కానీ, మిగతా దేశాలను తాను కోరుకున్నరీతిలో వాణిజ్యఒప్పందాలకు లొంగదీయడానికి టారిఫ్‌ వార్‌ సాగిస్తున్న ట్రంప్‌కు సొంతింట్లోనే చుక్కెదురవుతోంది. అమెరికా కంపెనీలు, కోర్టులు ఆయన దూకుడుకు ముకుతాడు వేస్తున్నాయి. జూలై నాలుగులోగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో భారీ సుంకాలతో బాధపడవలసి వస్తుందని యూరోపియన్‌ యూనియన్‌ను ట్రంప్‌ బెదిరిస్తున్న వేళ వాణిజ్య కోర్టు తీర్పు ఎదురుదెబ్బ. భారతదేశం కూడా ఒప్పందం కోసం హడావుడి పడనక్కరలేదని, కాలం కలిసొచ్చేవరకూ ఆగడం ఉత్తమమని ఆర్థికనిపుణులు కొందరు సలహా ఇస్తున్నారు కూడా.


డెబ్బయ్‌రోజుల ఇరాన్‌ వార్‌లో సైతం ట్రంప్‌ అనుకున్నది సాధించలేకపోతున్నారు. ముచ్చటగా మూడురోజుల్లోనే ఖమేనీలు పోయి, ఇరాన్‌ దాసోహపడుతుందన్న భ్రమలు తొలగి, రెండునెలల తరువాత కాలు వెనక్కుతీసుకోవడమే ఆయనకు కష్టమైపోతోంది. తన దాడుల దెబ్బకు ఇరాన్‌ దిగివచ్చిందనీ, దాడులు ఆపండి మహాప్రభో అని ప్రాధేయపడుతోందనీ, త్వరలోనే ఒప్పందం ఖాయమని ఆయన ఎప్పటినుంచో అంటున్నారు. కానీ, ఇప్పటికీ ఇరాన్‌ రవ్వంత రాజీపడలేదు, దాని ప్రతిఘటనలో తేడా రాలేదు. చివరకు, హోర్ముజ్‌ జలసంధిలో చిక్కుకున్న నౌకలను విముక్తం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ కూడా నిలిపివేయవలసి వచ్చింది. ఇరాన్‌తో చర్చల్లో అద్భుత పురోగతి సాధించినందున పాకిస్థాన్‌ అభ్యర్థనమేరకు ఈ ప్రాజెక్ట్‌ తాత్కాలికంగా ఆపేస్తున్నానని దానిని ప్రకటించిన కొద్దిగంటల్లోనే ట్రంప్‌ తేల్చేశారు. తన గగనతలాన్ని వినియోగించుకోవడానికి సౌదీ అరేబియా ససేమిరా అనడంతో ట్రంప్‌కు వేరేదారి లేకపోయింది. ఇరాన్‌ చేతిలో అత్యధికంగా దెబ్బతిన్న సౌదీ అరేబియా, కువైట్‌లు ట్రంప్‌ ఆలోచనలకు మద్దతు ఇవ్వడం లేదు. ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ ప్రకటించగానే సౌదీమీద ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో తీవ్రంగా విరుచుకుపడింది. ఫుజయిరా చమురు కేంద్రం నాశనమైంది. అమెరికా నౌకల మీద కూడా దాడులు చేసి బెదిరింపులకు లొంగేది లేదని ఇరాన్‌ స్పష్టంచేసింది. యుద్ధంలో తనదే పైచేయి అని ట్రంప్‌ చెప్పుకుంటున్నప్పటికీ హోర్ముజ్‌ పూర్తిగా ఇరాన్‌ గుప్పిట్లోనే ఉంది. ఈ యుద్ధంలో అమెరికా తన ప్రకటిత లక్ష్యాలలో దేనినీ సాధించలేకపోగా, జలసంధి మూసివేత సంక్షోభం నుంచి కూడా బయటపడలేకపోతోంది. ట్రేడ్‌వార్‌లోనూ, ఇరాన్‌ వార్‌లోనూ ట్రంప్‌ తప్పుటడుగులు ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించాయి.

ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 01:22 AM