Share News

ఓడిన ట్రంప్‌తో జాగ్రత్త

ABN , Publish Date - Nov 05 , 2026 | 03:41 AM

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా ఉండవని ఊహించిందే కానీ, ఎదురుదెబ్బ ఈ స్థాయిది కావడం ఆశ్చర్యం. ఊహలూ, అంచనాలను మించి డెమోక్రాట్లు...

ఓడిన ట్రంప్‌తో జాగ్రత్త

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా ఉండవని ఊహించిందే కానీ, ఎదురుదెబ్బ ఈ స్థాయిది కావడం ఆశ్చర్యం. ఊహలూ, అంచనాలను మించి డెమోక్రాట్లు వీరంగం వేశారు. ఆ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఈ స్థాయి విజయాన్ని ఇటీవలి కాలంలో చవిచూడలేదు. ఇది అమెరికన్లకు ఆ పార్టీమీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చి కట్టబెట్టిన విజయం కాదు. తమను అన్ని విషయాల్లోనూ మోసం చేసినందుకు, అన్ని రంగాల్లోనూ దేశాన్ని అధోగతి పట్టించినందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ మీద కమ్ముకొచ్చిన ఆగ్రహం, అవధుల్లేని కసి.

గాయపడిన ట్రంప్‌ మరింత ప్రమాదకారిగా మారతాడు జాగ్రత్త అంటున్నారు కొందరు. ఓటింగ్‌ జరుగుతున్నప్పుడే ఆయన మళ్ళీ ఇరాన్‌ యుద్ధానికి తెరదీశాడు కనుక, రేపటి రోజుల్లో చాలా విన్యాసాలు చూడాల్సి రావచ్చు. ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ తగిలితే తన అమ్ములపొదిలో ఉన్న ‘వీటో’ అస్త్రాన్ని ప్రయోగించి తాను అనుకున్నదే చేస్తానని అంటున్నాడు కూడా. ఈ మాటే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిందని, ఇలా ఓటమిని ఒక విధంగా ముందే అంగీకరించి మరింత చెడుచేసుకున్నాడని ఓ వాదన. మొదటి విడత ఏలుబడిలో ట్రంప్‌ చక్కగా ఉన్నాడని కాదు కానీ, మలివిడత రాకడ ఆయనలో చాలా మార్పు తెచ్చింది. ఉభయసభల్లోనూ ఆయన పార్టీకి జనం ఆధిపత్యం కట్టబెట్టడంతో తన మాటలూ చేష్టలూ చర్యలకు జేజేలు కొడుతున్నారని, అమెరికాను మళ్ళీ గ్రేట్‌ చేస్తానన్న పేరిట ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని, మాగాతో మాయ చేయవచ్చునని అనుకున్నాడు. తన జాతివ్యతిరేక, విభజనపూరిత, విద్వేషపు వ్యాఖ్యలకు జనం నీరాజనం పడుతున్నారని నమ్మాడు. ఇంటా, బయటా ఆయన వీరంగాలకు, అవమానకరమైన భాషకూ హద్దే లేకపోయింది. మిగతాదేశాల నాయకులను ఓవల్‌ ఆఫీసులో ఘోరంగా అవమానించడం నుంచి, ప్రశ్నించిన పాత్రికేయుల శరీరాకృతిని అవహేళన చేయడం వరకూ అహం హెచ్చింది. మిగతాదేశాలను వేధించడం, బెదిరించడం విదేశాంగ విధానంగా మార్చుకున్నాడు. కృత్రిమమేధకు సూపర్‌ ఇంటెలిజెన్స్‌ అని పేరుపెట్టిన ఈ మేధావి దానిసాయంతో అమెరికా చిత్రపటంలోకి పొరుగు దేశాలను చేర్చి, అవమానించి, పాదాక్రాంతం చేసుకోవాలనుకున్నాడు. ఈ పరిణామక్రమాన్ని జనం గుర్తించినందునే ఎన్నికలకు ఎంతోముందే ఆయన రేటింగ్‌ ఘోరంగా పడిపోవడం, ఇప్పుడు చట్టసభల్లోనూ కుప్పకూలడం సహజం.


తనముందు దేశాన్ని ఏలినవారు అమెరికా ప్రయోజనాలను పక్కనబెట్టి, ఎవరినో ఉద్ధరించేందుకు వ్యర్థయుద్ధాలు చేస్తున్నందువల్లే దేశం ఇలా తయారైందని ఎన్నికల ముందు ఆయన వాదించాడు. డెమోక్రాట్ల చేతగాని తనం వల్లే యుద్ధాలు మొదలైనాయంటూ తప్పుబట్టాడు కనుక, ఆయన వస్తే, యుద్ధవ్యయాలు తగ్గుతాయని అమెరికా సమాజం భ్రమపడింది. కానీ, ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో అర్థంపర్థంలేని విన్యాసాలు, రష్యా చమురు విషయంలో పూటకో పల్టీ ఆ భ్రమల్ని తుడిచిపెట్టేశాయి. ఇజ్రాయెల్‌ నెతన్యాహూ కోసం ఇరాన్‌తో యుద్ధాన్ని ఆరంభించి శాంతిదూత ముసుగును కూడా తీసిపారేశాడు. గాజా ఊచకోతలనూ, ఇరాన్‌ యుద్ధాన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని అనుకోనక్కరలేదు కానీ, ఇరాన్‌ ఎంతో తెలివిగా సృష్టించిన ఇంధన సంక్షోభం ట్రంప్‌ అధికారపీఠం కిందవరకూ పాకి మంటలు రేపింది. నిత్యావసరాల ధరలు భగ్గుమనడంతో ఆయన జాతకం మారిపోయింది.

అమెరికన్లు ఆయన విద్వేషపు విషానికి సైతం విరుగుడు మాత్ర వేశారు. ట్రంప్‌ ముద్ర ఉన్న ఎంతటి ఘనుడైనా, ఉత్తముడైనా ఓడిపోవడం మాట అటుంచితే, జాతి, మతం, జెండర్‌ చూడకుండా, నల్లజాతివారు, ముస్లింలు, లాటిన్‌ అమెరికన్లను అత్యున్నత స్థానాల్లో కూచోబెట్టి కక్షతీర్చుకున్నారు. కమ్యూనిస్టులనూ కౌగలించుకున్నారు. ప్రతీ బ్యాలెట్‌ పేపర్‌మీదా తన పేరు ఉన్నట్లుగా భావించి ఓటుచేయమన్న ట్రంప్‌ విజ్ఞప్తిని వారు సీరియస్‌గానే తీసుకున్నారు. ఇటీవలి దశాబ్దాల్లో ఏ అధ్యక్షుడినీ వారు ఇంతటి స్థాయిలో తిరస్కరించలేదు. ట్రంప్‌ తన శక్తియుక్తులతో రాజకీయ పునరేకీకరణ సాధించారని, శ్వేతజాతీయులు, జాత్యహంకారులు, మతమౌఢ్యులతో ఓటుబ్యాంకును పునాదిదిట్టం చేశారన్న రిపబ్లికన్ల భ్రమలు సైతం తొలగిపోయాయి. యాభైయేళ్లలో లేని ఘోరపరాజయం ఇది. అమెరికన్ల చేతిలో భంగపడిన అధ్యక్షుడు, ఈ ఎన్నికల మొహమాటం కూడా వదిలిపోయింది కనుక, ఇకపై మిగతా ప్రపంచంమీద మరింత కక్షపూరితంగా వ్యవహరించవచ్చు. దేశరక్షణ, విదేశాంగవిధానాల్లో చట్టసభలు పెద్దగా అడ్డుపడలేవు కనుక అన్ని దేశాలు అందుకు సిద్ధంగా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి.

Updated Date - Nov 05 , 2026 | 03:42 AM